కు(సు)మతీ శతకము

నేను రచించిన “కు(సు)మతీ శతకము” అన్న పుస్తకం 17-06-2026న ఈ క్రింది లింకులో పెట్టబడినది. డౌన్ లోడ్ (download) చేసుకొని చదువగలరు. ఈ పుస్తకం మీద, మీరు సూచనలు/ వ్యాఖ్యలు ఇవ్వడానికి ఈ బ్లాగులో సదుపాయం ఉంది. ఉపయోగించుకోగలరు.

https://ia600807.us.archive.org/10/items/kusumati-shatakamu-free-e-book/Kusumati%20shatakamu%20free%20e-book.pdf

2 thoughts on “కు(సు)మతీ శతకము

  1. మీరు రచించిన ఈ శతకం చాలా శ్రమించి, అనుభవాలను రంగరించి,సమకాలీన సమాజంలో వున్న లోపాలను వివరిస్తూ, సూక్తి అందరికీ అవసరమని చాటి చెపుతూ, కంద పద్య కుసుమాలను దండగా మార్చి, వాత్సల్యం తో శిక్షణ ఇచ్చిన పిన్ని గారికి అంకితం ఇవ్వటం మహత్తర మైన విషయం. మీ కవిత మంచి ప్రేరణ, ఆలోచన కలుగచేస్తుంది అనుటలో అతిశయోక్తి లేదు..మీ నుండి సమాజానికి ఉపయోగపడే కవితలు, గల గల పారే సెలయేరు లా ప్రవహించాలని నా కోరిక మరియు విన్నపము.

    Like

  2. వాట్సాప్ ద్వారా అందిన శ్రీ చిరువోలు విజయ నరసింహారావు గారి అభినందన (20-07-2026):

    సుమతులు, కుమతు లెఱుంగఁగ

    సమ రీతిని బోధఁ జేయ శతకముఁ గూర్చెన్

    సుమ సౌరభములు వెలయగ

    విమల యశంబు నొసగు నిది వేద్యము కు(సు)మతీ      1

    క్రమముగ సద్విషయంబుల

    నమరగ వివరించి బోధ నరయగ కవి తా

    సమకూర్చె నీతి శతకము

    భ్రమరము మధువునుఁ గొను గతి భవ్యము కు(సు)మతీ     2

    రమణీయ కవిత లందున

    సమత, మమతను సమకూర్చి శ్రద్ధగ శతకం

    బు మనోహరముగఁ  గూర్చెన్

    కమనీయ సృజన శతకము ఘనముగ కు(సు)మతీ         3

    మధురము  కవితా రచనము 

    మధురము భావము, లనుపమ మధురిమ చిలుకున్

    మధురము పదముల ఎంపిక

    మధురమె కందము కవులకు మన్నన కు(సు)మతీ     4

    మరి కొన్ని భవ్య రచనలు

    మురిపించు గతిన్ మన కవి మోహన ఫణితిన్

    సరస పదంబుల నలరగ

    విరచించును గాక భావి వేడ్కన్ కు(సు)మతీ     5

    సుమతీ శతకము మన దేశమున సుప్రసిద్ధి గాంచిన నీతిబోధక శతకము. అది సరళ పదములతో సులభముగా నర్థమగు రీతిగా సమకూర్చుటచే ధర్మబోధకమై జగతికి గొప్ప మేలు చేకూర్చినది. అదే సరళిలో ప్రస్తుత కవి ఈ శతకమును రచించుట ముదావహము. వీరును పలు ముఖ్య విషయములను ఆదర్శ బోధకముగను, నీతి, న్యాయ, ధర్మ విషయ విజ్ఞానదాయకముగను రూపొందించినారు. కొన్ని పదములు నిత్యము వాడుక లోనివి గాక క్రొత్తగా సేకరించి వ్రాయుట ఇందలి ప్రత్యేకత. అర్థ తాత్పర్యములను కూర్చుటచే నిది పాఠకులకు సులభ గ్రాహ్యము కాగలదు.

    పాద నియమము నతిక్రమించి  కందమున ఆరు, ఎనిమిదిని చేర్చుట యనునది క్రొత్త ప్రక్రియ. భావమును పూర్తిగా ప్రకట పరచుటకు వీరు ఇట్టి ప్రయోగము ననుసరించిరి. కానీ, సంస్కృతమున ఇట్లు విషయ విస్తార వివరణకు రెండు శ్లోకములను (కులకము), మూడు శ్లోకములను వ్రాసెడివారు. అన్వయము ముందు శ్లోకమునందు చెప్పబడినదని వివరించిరి. దీని యందు అట్టి పద్ధతిని ప్రయోగించిన ఛందస్సు నతిక్రమించ వలసి రాక పోవచ్చునని నా అభిప్రాయము. ఒక నూతన ఛందస్సును వీరు ప్రయోగించి చూపించిరి .

    కొన్ని పద్యము లందు ప్రారంభ పాదములను వీరు సుమతీ శతకము నుండి గ్రహించుట వీరికి పూర్వ కవి యందు గల ఆదరాభిమానములకు తార్కాణము. ఉదాహరణకు:

    46. చీమలు పెట్టిన పుట్టలు —– చీమలు చెదలను పెట్టగ, 47. ఎప్పుడు సంపద గలిగిన — ఎక్కడ సంపద గలిగిన, 80. ఎప్పటి కెయ్యది ప్రస్తుతము —- ఎప్పటి కెయ్యది తగునో, 83. అడిగిన జీతం బియ్యని —- అడిగిన అన్నము పెట్టని, 84. అప్పిచ్చువాడు వైద్యుడు —- అప్పడుగు వాని నెయ్యము, 85. చేఱకుమీ కుజనులను  —- మీఱకుమీ నీ హద్దులు, 86. అపకారికి నుపకారము —– అపకారికి  యపకారము, 93. ఎప్పుడు సంపద గలిగిన —- ఎపుడు గడించిన  సంపద 

    113 వ పద్యము నగవను నగ గల మనుజుడు … చాలా బాగున్నది. ఇంకను, కవి తన స్వతంత్ర భావములు ప్రకటించిన ఉత్తమ పద్యములు కొన్ని ఉదాహరణకు:

    36. ఎనిమిదవ పుత్రుని వలన, 39. అంధుడు తన భర్తని, 49. మన కవసరమా యారాధన, 40. కను లిచ్చితివీ సభలో, 53. వెదకిన దొరకని దేమది,  56. ప్రచురత యుండని పూజయు, 61. తోచిన వేళల నెపుడో,  64. చవటకు విద్యా గంధము, 66. గాడిదకు వెనుక నిలుచుట, 71. ఎద్దు వలె పెంచి కుక్కను,  75. కన్యకు రూపం బిష్టము, 91. ఇప్పటి కప్రస్తుత మని, 92. ఎచ్చటనో నుదయించితి, 94. తొలుతను మంచిగ తోచిన,   104. అతి వినయం బతి ప్రేమయు, 106. చెప్పిన విధమున జేయక,  108. వృద్ధుల పని ఇదియేనా, 111.తన వారి మంచితనమును, 112. నవ్వుట నేర్చిన వచ్చునె, 115. నమ్మకు మెవ్వరి నైనను, 116. నిర్వహణ యందు నైపుణి వీరికి ఛందస్సు సుపరిచయము. అందు వీరికి కందమన్న మక్కువ ఎక్కువ. భావ విశిష్టత, ధార, వర్ణనా కౌశలము కలుగుటచే పద్య కావ్యము ప్రశస్తి  గాంచినది. సంఘ సంస్కరణము, సామాజిక స్పృహ వంటి భారతీయ సాంస్కృతిక విషయముల యందవగాహన మిక్కుటము. కనుక ఈ సత్కవిని సాటి కవులు తగు రీతిని ప్రశంసించ గలరని  నా ఆకాంక్ష. వీరు తన రచనను ఉత్తమ వ్యక్తిత్వము కలిగిన తన పినతల్లికి అంకిత మిచ్చుట సముచితము.  స్వస్తి !

    Like

Leave a comment