భగవద్గీత – కర్మ సన్న్యాస యోగము

భగవద్గీత లోని ఐదవ అధ్యాయము కర్మ సన్న్యాస యోగము. ఇందులో 29 శ్లోకాలు ఉన్నాయి. మొదటి శ్లోకం ప్రశ్న రూపంలో అర్జునుడు చెప్పినది. మిగిలిన 28 శ్లోకాలు కృష్ణుడి సమాధానం. మూడవ నాల్గవ అధ్యాయాలలో కృష్ణుడు కర్మయోగాన్ని ఎక్కువగా మెచ్చుకున్నట్లు అనిపిస్తుంది. నాల్గవ అధ్యాయంలో అక్కడక్కడా జ్ఞాన యోగం, అంటే కర్మ సన్న్యాస యోగం, గురించిన ప్రశంస కూడా ఉంది. ఈ రెంటిలో ఏది మంచిది (better) అన్న సందేహంతో ఈ అధ్యాయం మొదలవుతుంది. “కృష్ణా! నువ్వు కర్మసన్న్యాసాన్ని కర్మయోగాన్ని రెంటినీ మెచ్చుకుంటున్నావు. రెంటిలో నాకు ఏది నిశ్చయంగా శ్రేయస్సును చేకూర్చేదో చెప్పు” అని అర్జునుడు అడిగాడు. ఆ ప్రశ్నకు కృష్ణుడు చెప్పిన సమాధానం ఇప్పుడు చూద్దాం.

అర్జునా! కర్మసన్న్యాసము కర్మయోగము అన్నవి రెండూ మంచి చేసేవే కాని కర్మయోగము సాధనంలో (implementation) సులభము కాబట్టి అదే శ్రేష్ఠము. రాగద్వేషాది ద్వంద్వరహితుడైన (దేన్ని ద్వేషించకుండా, దేన్ని కోరకుండా ఉండేవాడు) కర్మయోగి ఎప్పుడూ సన్న్యాసిగానే ఉండి సంసారబంధం నుండి విముక్తుడౌతాడు. సన్న్యాసము కర్మయోగముల ఫలితాలు వేరు కాదు. ఏ ఒక్క దాన్లో స్థిరంగా ఉన్నా పరమాత్మను పొందవచ్చు. జ్ఞానయోగులు పొందే పరంధామాన్నే కర్మయోగులు కూడా పొందుతారు. భూమి ఇంచుమించు గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఒక చోటు నుండి మరో చోటుకి చేరడానికి వ్యతిరేక దిశలలో వెళ్ళ వచ్చు. ఆ రెంటిలో ఒక మార్గంలో గమ్యాన్ని తొందరగా చేరతాము. జ్ఞాన కర్మయోగాల గమ్యం ఒకటే అయినా చేరడంలో కష్టం సులభం అన్నవి ఇలాగే ఉంటాయి. అయితే, కర్మయోగాన్ని పాటించకుండా సన్న్యాసం కష్టసాధ్యము. అంటే, మనస్సు, ఇంద్రియాలు, శరీరం ద్వారా జరిగే కర్మలకు సంబంధించిన కర్తృత్వ (ownership) త్యాగం చెయ్యడం లేదా వదిలిపెట్టడం చాలా కఠినమైనది. భగవంతుని స్వరూపాన్ని ధ్యానిస్తూ కర్మయోగి పరమాత్మను తొందరగా పొందగలడు.

మనస్సు వశంలో ఉంచుకున్న వాడు, ఇంద్రియ నిగ్రహం గల వాడు, అంతఃకరణ శుద్ధి ఉన్న వాడు, అన్ని ప్రాణులకు ఆత్మ స్వరూపంగా ఉండే పరమాత్మయే తనలోని ఆత్మగా ఉన్న వాడు అయిన కర్మయోగికి కర్మలు ఆచరిస్తున్నా కూడా అవి వానిని అంటవు. తత్త్వాన్ని తెలుసుకునే సాంఖ్యయోగి అయితే, చూస్తూ, వింటూ, తాకుతూ, వాసన చూస్తూ, తింటూ, నడుస్తూ, నిద్రిస్తూ, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ, మాట్లాడుతూ, విడుస్తూ, గ్రహిస్తూ, కళ్ళు తెరుస్తూ, కళ్ళు మూస్తూ – ఉన్నా, ఆయా ఇంద్రియాలు తమ తమ ఐహిక విషయాలలో నిమగ్నమై ఉన్నాయి కానీ నేనేమీ చేయడం లేదు అని అనుకోవాలి. ఎవరైతే అన్ని కర్మలను పరమాత్మకు అర్పించి, ఆసక్తిని వదిలిపెట్టి, కర్మలు చేస్తూ ఉంటాడో, అతడికి తామరాకుకి నీటిబొట్టు అంటనట్లుగా, పాపం అంటదు.

కర్మయోగి మమత్వబుద్ధి, ఆసక్తులు లేకుండా కేవలం ఇంద్రియాలు, మనస్సు, శరీరాల ద్వారా అంతఃకరణ శుద్ధి కోసం కర్మలను ఆచరిస్తాడు. అంటే, లౌకిక స్వార్థం లేకుండా నిష్కామ భావంతో సమస్త కర్తవ్య కర్మలు చేస్తాడు. కర్మయోగి కర్మఫలత్యాగము చేసి భగవంతుని ప్రాప్తికి రూపంగా శాంతిని పొందుతాడు. సకామ పురుషుణ్ణి కోరికలు ప్రేరేపిస్తాయి కనుక అతడు ఫలితాల మీద ఆసక్తి కలవాడై కర్మబద్ధుడౌతాడు. అంటే, కర్మ ఫలాలకు అనుగుణంగా మాటిమాటికి పునర్జన్మ ఎత్తుతూ ఉంటాడు. అంతఃకరణము వశంలో ఉన్న సాంఖ్యయోగి తానేమి చేయకుండా ఏమీ చేయించకుండానే నవద్వారాలు కల శరీరమనే గృహంలో సమస్త కర్మలను మానసికంగా త్యజించి పరమాత్మ స్వరూపంలో స్థిరంగా నిలిచి మహదానందంతో ఉంటాడు.

మనుష్యుల కర్తృత్వం గాని, కర్మలను గాని, కర్మఫల సంయోగం గాని భగవంతుడు వారి కోసం ఏర్పాటు చేసినవి కావు. అంటే, అజ్ఞానులైన మనుష్యులు అహంకారంతో తామే వీటికి కర్తలని అనుకుంటున్నారు. నిజంగా భగవంతుడే కనక ఈ ఏర్పాట్లు చేసి ఉంటే వాటిని తప్పించుకోడానికి, అంటే కర్మ బంధాల నుండి విముక్తి పొందడానికి, వీలు కానేకాదు. వీటన్నిటిలో స్వభావము లేదా ప్రకృతియే ప్రవర్తిల్లుతూ ఉంటుంది. ఆత్మకి ఈ మూడింటితో ఏ మాత్రం సంబంధం లేదు. సమస్త విశ్వాన్ని తన సంకల్పంతో నడిపిస్తూ అంతటా తానే అయి ఉన్న భగవంతుడు జీవుల పాప పుణ్య కర్మలని గ్రహించడు. అంటే, ఆ కర్మలకి భగవంతుడు భోక్త కాడు. జ్ఞానం అజ్ఞానంతో కప్పబడి ఉంది కనుక అజ్ఞానులు మోహం చెందుతూ ఉన్నారు. ఆ అజ్ఞానం వల్లే “ఈ కర్మ నేను చేశాను, ఇది నా కర్మ, నాకు ఈ కర్మఫలము లభిస్తుంది” అన్న భావనలు మనుషులలో కలుగుతాయి. సూర్యోదయంతో చీకటి తొలగిపోయినట్లు అజ్ఞానం పరమాత్మ తత్త్వజ్ఞానంతో తొలగిపోయి, అలా పొందిన జ్ఞానం సూర్యుడి లాగా పరమాత్మను ప్రకాశింపజేస్తుంది. ఎవరి మనస్సు బుద్ధి పరమాత్మకు మరో రూపం అవుతాయో, ఎవరి స్థితి ఎప్పుడూ అచంచలంగా పరమాత్మలోనే స్థిరమై ఉంటుందో, అటువంటి వాళ్ళు పాపరహితులై పునర్జన్మ లేని మోక్షం పొందుతారు.

అటువంటి జ్ఞానులు, విద్య వినయములు ఉన్న బ్రాహ్మణుని గాని ఆవును గాని ఏనుగును గాని కుక్కను గాని చండాలుని గాని, సమానంగా చూస్తారు. సమానంగా చూడటం అంటే, పాండిత్యానికి చెయ్యాల్సిన సన్మానం చండాలుడికి చెయ్యడం, ఆవు పాలు బదులు కుక్క పాలు త్రాగడం, ఏనుగు మీద కాకుండా కుక్క మీద ఎక్కి ఊరేగడం లాంటివి చెయ్యడం కాదు, వైషమ్య భావం లేకుండా ఉండటం. శరీరంలో ఉన్న అన్ని అవయవాల మీద సమాన ఆదరము, శుభ్రత చూపక పోయినా, అవన్నీ మనవేనన్న భావం ఎప్పుడూ ఉంటుంది కదా. సమత్వ భావన అలాంటిదే. అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపం ఒక్కటే అన్న భావనే సమభావన. ఆ విధంగా సమభావం ఉన్నవారు జీవించి ఉండగానే ప్రపంచాన్ని జయించిన వాళ్ళవుతారు. అంటే, జనన మరణాల సంసారం నుండి విముక్తు లవుతారని అర్థం. పరమాత్మ దోషం లేని వాడు, సముడు. సమభావంతో ఉన్న జ్ఞానులు పరమాత్మలో స్థితులై సత్త్వరజస్తమో గుణాలకు అతీతులై జీవన్ముక్తులవుతారు. అంటే జీవించి యుండి కూడా జ్ఞానం సంపాదించడం వల్ల సమస్త బంధాలను త్రెంచుకుని ముక్తి పొందుతారు. మనస్సు, బుద్ధి, శరీరము, ఇంద్రియాలకు అనుకూలంగా ఉండే వస్తువును ఇష్టమైనదని ప్రియమైనదని, ప్రతికూలంగా ఉండే వస్తువును అయిష్టమైనదని అప్రియమైనదని అంటారు. ఏ మనుష్యులు ప్రియమైనది దక్కినప్పుడు సంతోషాన్ని అప్రియమైనది దక్కినప్పుడు దుఃఖాన్ని అనుభవించరో, అటువంటి స్థిరచిత్తులు సంశయరహితులు అయిన బ్రహ్మవేత్తలు పరమాత్మలో లీనమై ఎప్పుడూ నిలిచి ఉంటారు. ప్రాపంచిక విషయాలలో ఆసక్తి లేని అంతఃకరణం ఉన్న మోక్షసాధకుడు ఆత్మలో చేసే ధ్యానం వల్ల సాత్త్వికమైన ఆనందం పొందుతాడు. ఆ తరువాత పరమాత్మ యొక్క ధ్యానరూపమైన యోగంలో అభిన్న భావంతో స్థిరంగా నిలిచి అక్షయమైన ఆనందం పొందుతాడు. దాన్నే ఆత్మానందం అంటారు.

ఇంద్రియాలకు విషయాలతో ఉన్న సంబంధము వలన లభించే సుఖాలు భోగాలు, ఆ విషయాల మీద ఆసక్తి ఉన్నవారికి సుఖాలుగా అనిపించినప్పటికీ అవి దుఃఖకారణాలే అవుతాయి. అవి అనిత్యములు. మిడతలు ప్రకాశం దిశగా పోయి అందులో పడి దగ్ధం అయిపోయేటట్లు, సుఖాల ఆకర్షణలో పడి అజ్ఞానియైన మనుష్యుడు వాటిని అనుభవించే ప్రయత్నం చేసి దుఃఖాలు పొందుతాడు. అందుకే బుద్ధిమంతులు, వివేకులు విషయ సుఖాలలో అనుభవం పొందడానికి ఆసక్తి చూపరు. ఏ సాధకుడు బ్రతికి ఉండగానే (మరణకాలం సమీపించడానికి ముందే) కామక్రోధముల వల్ల కలిగే ఉద్వేగాన్ని సహించడానికి సమర్థుడో అతడే యోగి, సుఖి అని తెలుసుకో.

ఎవరైతే అంతరాత్మలో మాత్రమే సుఖం అనుభవించే వాడో (అంటే, బాహ్యప్రపంచం లోని విషయభోగాల రూపంలో ఉన్న సాంసారిక సుఖాలు అనిత్యాలు అని భావించి ఆనందస్వరూపుడైన పరమాత్మలోని సుఖమే నిజమైన సుఖమని అనుకుంటాడో), ఆత్మ యందే రమించేవాడో (అంటే, బాహ్యప్రపంచం లోని విషయభోగాలలో ఆసక్తిని విడిచి పరమాత్మ యొక్క చింతన ఎప్పుడూ అభిన్నభావంతో చేస్తాడో), ఆత్మజ్ఞానియైనవాడో (అంటే, ఎవరి దృష్టిలో పరమాత్మ తప్ప ఇతర బాహ్య వస్తువులకు అస్తిత్వము, ఉనికి లేదో), ఆ సాంఖ్యయోగి పరమాత్మలో ఐక్యం పొంది బ్రహ్మనిర్వాణం పొందుతాడు. ఎవరి పాపాలు నశించి జ్ఞానం చేత సంశయాలు తొలగి సమస్త జీవుల హితానికి అంకితమైన మనస్సు వశంలో ఉండి నిశ్చలంగా పరమాత్మ యందు స్థిరంగా నిలిచి ఉంటుందో, అలాంటి బ్రహ్మవేత్తలైన మనుష్యులు బ్రహ్మనిర్వాణాన్ని పొందుతారు. కామక్రోధాలు లేకుండా మనస్సును జయించి పరమాత్మ సాక్షాత్కారం పొందిన జ్ఞానులకు అన్ని వైపుల నిండిన శాంతుడు, పరమాత్ముడు, ఏకుడై అద్వితీయుడై ఉంటాడు. ఇతర పదార్థాలకు జ్ఞానుల అభిప్రాయంలో అస్తిత్వము, ఉనికి ఉండవు.

కర్మయోగ సాంఖ్య (జ్ఞాన) యోగ సాధకులు వైరాగ్యంతో మనస్సును ఇంద్రియాలను వశంలో ఉంచుకొని ధ్యానయోగం సాధించుకోవడం మంచిది. ఎలా అంటే, బాహ్య విషయభోగాలను పట్టించుకోకుండా వాటిని బయటే వదిలేసి, చూపును కనుబొమ్మల మధ్య ఉంచి (అన్ని వైపుల చూస్తూ ఉంటే మనస్సు ఇతర విషయాల మీద లగ్నమై ధ్యానానికి విఘ్నం కలుగుతుంది. కళ్ళు మూసుకుంటే సోమరితనానికి నిద్రకు వశులయ్యే ప్రమాదం ఉంది.), ముక్కులో ప్రాణాపానవాయువులను రెంటినీ సమం చేసి (అలా చేస్తే మనస్సుకు చంచలత్వము, అశాంతి నశిస్తాయంటారు), మనస్సును బుద్ధిని ఇంద్రియాలను జయించి, మోక్షాసక్తితో ఉండే ముని (ఎప్పుడూ పరమాత్మ మననం చేసే వాడు) కోరిక భయము క్రోధము అన్నవి లేకుండా ఎప్పుడూ ముక్తుడౌతాడు. అంటే, ప్రాపంచిక బంధనాల నుండి విముక్తుడై పరమాత్మను పొందుతాడు.

నా భక్తులు నన్ను అన్ని యజ్ఞములకు తపస్సులకు భోక్తనని (కర్తవ్యాలుగా భావించి చేసే అహింసాది ధర్మపాలనము, పరులకు, ముఖ్యంగా, తాడిత పీడిత జనానికి చేసే సేవ, సమాజానికి ఉపకారం చెయ్యడానికి చేసే రకరకాల సేవలు, దానాలు – ఇలాంటివి అన్నిటినీ కలిపి యజ్ఞాలు, తపస్సులు అంటారు. అలాంటి సేవలు, దానాలు, ఇతరములు గ్రహించేది, ఆ గ్రహించే వారి రూపంలో ఉన్న భగవంతుడే అన్న భావంతో భగవంతుణ్ణి భోక్త అన్నారు), ఈశ్వరు లందరికీ ఈశ్వరుడనని (విశ్వంలో వివిధమైన విధులు నిర్వహించే సూర్యచంద్రులు, దిక్పాలకుల వంటి ఈశ్వరుల కందరికీ ఈశ్వరుడు), సమస్త జీవరాశి పట్ల స్వార్థం లేకుండా దయ ప్రేమ చూపించే మిత్రుడనని (భగవంతుడు ఎవరికి ఏమి చేసినా అనుగ్రహంతోను దయతోను ప్రేమతోనే చేస్తాడు. భగవంతుడు ఎవరిని శిక్షించినా సంహరించినా, అది కూడా వారి మీద దయతోను ప్రేమతోనే అని తెలుసుకోవాలి. మనకి మంచి జరిగినా చెడు జరిగినా అది భగవంతుడు మన మంచికే చేశాడని అనుకునే వాళ్ళకి అచంచలమైన శాంతి లభిస్తుంది.) నా తత్త్వం తెలుసుకున్న వారు పరమశాంతిని పొందగలరు.

4 thoughts on “భగవద్గీత – కర్మ సన్న్యాస యోగము”

  1. This chapter can be considered as gist of Golden words for Sadhakas to adopt and practice to attain God Head. Keep meditating on the form of Lord to remain in HIM (Para2). A Karma yogi who controls the mind senses and think that one who is in all also present in Me is untouched by karmaphala (para 3). There is description of Sankhaya yogi for the first time in the sereis (para 3). Fourth para contrasts between Sankhya yogi and Karma yogi. The one who remains without waiver in Lord with Mind and Intellect attains moksha (para 5). Meditation in Atma and Paramatma and remain constant in HIS presence attain atma-ananada (para 6) . In 9th para some methods of meditation are described. Finally, while performing your duties, with feel of surrender to Lord and without attachment to the fruits of the karmas, AND strongly consider WHATEVER HAPPENS IS MY OWN GOOD will lead us to Bliss / supreme Ananda.

    Like

  2. ఈ అధ్యాయం లో కర్మ సన్యాసం, కర్మ యోగం లను గురించి బాగా తెలియజేశారు. కర్మలకు భగవంతుడు భోక్త కాడు. సమ భావం తో వున్న వారు, పరమాత్మ లో స్థితి లో వుందురు.కర్మ ఫలితాలు ను ఆశించ కుండా, మంచి జరిగినా లేక చెడు జరిగినా అంతా మన మంచి కే అని అనుకుంటే, పరమాత్మ త త్వం తెలిసి పరమ శాంతి ని పొంద గలరు. అందుకే అన్నారు జరిగే వన్ని మంచి కని అనుకోవడమే ఈ మనిషి పని అన్న గీతం గుర్తుకు వచ్చింది. జీవితాన్ని సార్ధకం చేసుకోవడానికి వుపయోగపడే విషయాలను చాల చక్కగా వివరించారు. మీకు మనస్పూర్తి గా అభినందనలు మరియు హృదయ పూర్వక కృతజ్ఞతలు.

    Like

  3. భగవద్గీత ఐదవ అధ్యాయం (కర్మ సన్న్యాస యోగము) ముఖ్య సందేశం సులభమైన మాటల్లో:

    1. స్వార్థం లేని పనే మిన్న

    సంసారాన్ని వదిలిపెట్టడం కంటే బాధ్యతలను సేవగా చేయడం సులువు.ఫలాలను ఆశించకుండా పని చేయడమే మోక్షానికి దగ్గరి దారి.

    2. తామరాకు లాంటి జీవితం

    నీటిలో ఉన్నా తామరాకుకి నీరు అంటదు.అలాగే లోకంలో ఉంటూ పాపాలు అంటకుండా బ్రతకాలి.

    3. అందరినీ సమానంగా చూడడం

    అన్ని జీవులలో ఉన్న ఆత్మ ఒక్కటే.కాబట్టి ఎవరి పైనా వివక్ష చూపకుండా ఉండడమే నిజమైన జ్ఞానం.

    4. అంతరంగ ఆనందం

    సుఖాలకు పొంగిపోకూడదు.దుఃఖాలకు కృంగిపోకూడదు.మనసులోనే నిజమైన ఆనందాన్ని వెతుక్కోవాలి.

    Like

Leave a Reply