భగవద్గీత – కర్మ యోగము

ఇది భగవద్గీతలో “కర్మయోగము” అనబడే మూడవ అధ్యాయము. దీనిలో మొత్తం 43 శ్లోకాలు ఉన్నాయి. వాటిల్లో 40 శ్లోకాలు కృష్ణుడు చెప్పినవి కాగా, అర్జునుడు ప్రశ్నల రూపంలో చెప్పినవి 3 శ్లోకాలు. ఆ మూడింటిలో రెండు మొదట్లోనే అడిగాడు. ఒకటి మాత్రం ఈ అధ్యాయం మధ్యలో వస్తుంది. మూడూ కూడా అనుబంధ ప్రశ్నల (supplementary questions) లాంటివే. అవి ఏమిటో, వాటికి కృష్ణుడు చెప్పిన సమాధానాల లోని లోతుపాతులు ఏమిటో చూద్దాం.

రెండవ అధ్యాయంలో, శ్రీకృష్ణుడు ఆత్మతత్త్వాన్ని నిరూపిస్తూ సాంఖ్య యోగాన్ని ప్రతిపాదించి, సమబుద్ధి రూపమైన కర్మ యోగాన్ని దాని ద్వారా పరమ పదం అందుకున్న స్థితప్రజ్ఞుడి లక్షణాల గురించి చెప్పి, సకామ కర్మము కన్నా సమబుద్ధి రూప కర్మ యోగము మంచిదని వివరించి అందులో ప్రవేశించమని అర్జునుడికి చెప్పాడు. “బుద్ధి” అంటే జ్ఞానమని అర్థము కాబట్టి, అర్జునుడికి కర్మ కన్నా జ్ఞానము ప్రశస్తమైనదని అనిపించడం వల్ల కొంత గందరగోళం (confusion) తలయెత్తింది. అందుకని, అతడు కృష్ణుణ్ణి ఇలా అడిగాడు: “జ్ఞానయోగం, కర్మయోగం అనే రెండు యోగాల్లో జ్ఞాన యోగం శ్రేష్ఠమని నువ్వు అనుకుంటే నన్ను భయంకరమైన కర్మయోగం లోకి ఎందుకు ప్రోత్సహిస్తున్నావు. సందేహం కలిగించే మాటలు చెప్పి నా బుద్ధిని మోహం లోకి ఎందుకు పడవేస్తున్నావు? నాకు ఏది మంచో స్పష్టంగా చెప్పు.”. జ్ఞానయోగం పట్టుకుంటే, కర్మయోగంతో పనేమి ఉంది. అంటే, మొదటి మార్గం ఎన్నుకుంటే పని ఎగ్గొట్టి కూచోవచ్చేమో (ఈ సందర్భంలో యుద్ధం మానెయ్యచ్చేమో) అని అర్జునుడు తనకు కావలసిన సమాధానం రాబట్టడానికా అన్నట్లుగా వేసిన ప్రశ్న (leading question) ఇది. కృష్ణుడు ఆ వలలో (trap) చిక్కుకోకుండా ఏం చెప్పాడో చూద్దాం.

అప్పుడు, కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “రెండు రకాల యోగాలు ఉన్నాయి. అందులో సందేహం లేదు. బ్రహ్మముతో తాను అభిన్నుడనని తెలుసుకొని పరమాత్మతో ఉండడం జ్ఞాననిష్ఠ. వర్ణం (వృత్తుల పరంగా విభజించబడిన నాలుగు వర్ణాలలో ఏదైనా), ఆశ్రమం (బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అనే నాలుగిటిలో ఏదైనా), స్వభావం, పరిస్థితులను బట్టి శాస్త్రంలో విధించబడిన కర్మలు అవశ్యకర్తవ్యములు (బాధ్యతలు), స్వాభావికములు అని తలచి అవి చెయ్యడం, వాటి ఫలము లందు మమకారం, ఆసక్తి, కామన విడిచి, ప్రతి కర్మ యొక్క సిద్ధి, అసిద్ధి యందు ఫలము లందు సర్వదా నమ్రుడై ఉండడం కర్మయోగనిష్ఠ. మనస్సు, ఇంద్రియాలు, శరీరం – వీటి చేత చేయబడే కార్యములలో కర్తృత్వము (ownership) ఉన్నదనే అభిమానం ఉండకూడదు. కార్యంలో గాని, దాని ఫలంలో గాని అహంకారం, మమకారం, ఆసక్తి, కామన ఉండకూడదు. కర్తవ్యకర్మ చేస్తే మనిషి అంతఃకరణము పరిశుద్దమోతుంది. అవి విడిస్తే పాపం అంటుకుంటుంది. నిద్ర, సోమరితనం, ఏమరుపాటులలో మనిషి చిక్కుకుంటాడు. కర్మయోగ ఫలములను భగవంతునికి సమర్పిస్తే భక్తిప్రదానమైన కర్మయోగ నిష్ఠ అవుతుంది. కర్మయోగి విహితకర్మలు చేయకుండా ఉండటం యోగనిష్ఠకు బాధకము. కానీ, సాంఖ్యయోగనిష్ఠ ప్రాప్తికి బాధకం కాదు. సమబుద్ధి రూప కర్మయోగము కంటే సకామ కర్మము యొక్క స్థానము నీచమైనది. మనిషి కర్మలు చేయకుండా (పని మానేసి) కర్మరాహిత్యాన్ని, అంటే యోగనిష్ఠను పొందలేడు. కర్మను వదిలిపెట్టినంత మాత్రాన సిద్ధి, అంటే సాంఖ్యనిష్ఠ దక్కదు. అసలు మనిషన్న వాడు కర్మ (పని) చేయకుండా ఉండలేడు. ప్రకృతే ఆ గుణాలు మనిషిలో ప్రేరేపించి బాధ్యులుగా చేస్తుంది.

మూఢుడైన మనిషి ఇంద్రియా లన్నిటిని బలవంతంగా అదుపు చేసి మనస్సులో మాత్రం ఇంద్రియాలను ఆకర్షించే వాటి గురించి ఆలోచిస్తే, అటువంటి వాడు మిథ్యాచారి. (దీన్నే పైన పటారం లోన లొటారం అంటారు. దొంగ స్వాముల వ్యవహారం ఇలాగే ఉంటుందేమో. ఇలాంటి గొప్ప మానసిక విశ్లేషణ మనకి వాల్మీకి రామాయణంలో కూడా కనిపిస్తుంది. ఇంద్రియాలను అదుపు చేసి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మ నుండి వరాలు పొంది కూడా చివరికి సీతావ్యామోహంలో పడి ఆమెను ఎత్తుకొచ్చి శ్రీరాముని చేతిలో మరణించిన రావణుడి శవం దగ్గర అతని భార్యయైన మండోదరి విలపిస్తూ చెప్పిన మాటలకి వాల్మీకి వ్రాసిన ఒక శ్లోకం ఇలా ఉంది: “ఇంద్రియాణి పురా జిత్వా జితం త్రిభువనం త్వయా, స్మరద్భిరివ తద్వైరం ఇంద్రియైరేవ నిర్జితః”. అంటే, పూర్వం నీవు ఇంద్రియాలను జయించి గొప్ప తపస్సు చేసి మూడు లోకాలను గెలిచావు. ఆ వైరాన్ని స్మరిస్తున్నాయా అన్నట్లు, ఇప్పుడు ఆ యింద్రియాలే నిన్ను గెలిచాయి, అని. అనగా, పైకి ఇంద్రియాలని కళ్ళెం వేసి ఆపినా, మనస్సు దాని దోవన అది అదుపు తప్పింది. దీన్నే వేమన అద్భుతంగా, చాలా సరళంగా “తలలు బోడులైన, తలపులు బోడులా” అని చెప్పాడు.). అందుచేత, ఏ మనిషి మనస్సుతో ఇంద్రియాలని వశపరచుకుని, దేని మీదా ఆసక్తి లేకుండా అన్ని ఇంద్రియములతో కర్మయోగాన్ని ఆచరిస్తాడో అతడే శ్రేష్టుడు. పైపైన కర్మలు విడిచే మిథ్యాచారులు  నిందించదగిన వారు. అలా కాకుండా కర్మయోగి లాగా ఉండు. శరీరం ఉన్నంత కాలం మనిషి గుణాతీతుడు కాడు. కాబట్టి, కర్మలు చేస్తూ ఉండాలి. అందుకని అర్జునా! నువ్వు శాస్త్రవిహితమైన కర్తవ్యకర్మ (విధించబడిన బాధ్యత) చెయ్యి. అంటే, ఏదైతే నీ కర్తవ్యమో ఆ పని చెయ్యి. కర్మ చెయ్యకుండా ఉండటం కన్నా చెయ్యడమే మంచిది. అసలు, కర్మ చెయ్యకుండా ఉంటే నీ ఒంటికి జరుగుబాటు ఎట్లా లభిస్తుంది. యజ్ఞాదుల కారణంగా చేయబడే కర్మలు తప్ప ఇతర కర్మల యందు శ్రద్ధ చూపెట్టేవారు మాత్రమే కర్మబంధనాలలో చిక్కుకుంటారు. నువ్వు ఆసక్తిరహితుడవై యజ్ఞాదుల కోసం కర్తవ్య కర్మలు చెయ్యి.

వర్ణ, ఆశ్రమ, స్వభావ, పరిస్థితుల బేధాలను బట్టి మనుషులకు వేర్వేరు విధాలుగా దానము, అధ్యయనము, అధ్యాపనము, ప్రజాపాలనము, యుద్ధము, వ్యవసాయము, వాణిజ్యము, సేవ – మొదలైన కర్తవ్య కర్మల చేత లభించే స్వధర్మాలు ఉంటాయి. వాటినే యజ్ఞాలు అంటారు. బ్రహ్మదేవుడు కల్పాది యందు యజ్ఞాలతో పాటు ప్రజలను సృష్టించి, “మీరు ఈ యజ్ఞాలతో అభివృద్ధి చెందండి, అవి మీకు కావలసిన భోగాలన్నీ ఇస్తాయి” అని చెప్పాడు. యజ్ఞముల ద్వారా మీరు దేవతలను ఉన్నతికి తెస్తే, ఆ దేవతలు మిమ్మల్ని ఉన్నతికి తెస్తారు. ఈ విధంగా, మీరు పరస్పరము నిస్వార్థభావంతో ఉన్నతులను చేసుకుంటూ పరమశ్రేయస్సును పొందగలుగుతారు. యజ్ఞము చేత పెంపు పొందిన దేవతలు మీరు అడగకుండానే మీకు కోరిన కోరికలు తీరుస్తారు. అట్లా, దేవతల చేత ఇవ్వబడ్డ సుఖభోగాలను ఏ మనిషి వారికి ఇవ్వకుండా అనుభవిస్తాడో అతడు దొంగ సుమా. యజ్ఞము నుండి మిగిలిన అన్నము తినే శ్రేష్ఠ పురుషులు అన్ని పాపాల నుండి విముక్తులవుతారు. ఏ పాపిష్ఠులు తమ శరీరపోషణ కోసమే అన్నం వండుతారో వారు పాపాన్నే భుజిస్తారు.

ప్రతీకాత్మకంగా కృష్ణుడు చెప్పిన ఈ మాటల గూఢార్థము నా అభిప్రాయంలో ఏమిటంటే: ‘యజ్ఞం’ అంటే కేవలం హోమ గుండంలో నెయ్యి పోస్తూ మంత్రాలతో చేసే తంతు మాత్రమే అనుకుంటే తప్పే. కర్తవ్యకర్మలు, అంటే బాధ్యతలు, ఐదు తరగతులతో ఉంటాయట. అవే, దేవతలు, ఋషులు, పితరులు, ఇతర మనుష్యులు, ఇతర ప్రాణులు. కృష్ణుడు తాను గోవర్ధనగిరి ఎత్తిన సమయంలో చెప్పినట్లుగా దేవతలు అంటే, మనకు వర్షాన్నిచ్చే మేఘాలు, మనకు క్షీరం ఇచ్చే ఆవులు, వాటికి మేతనిచ్చే గోవర్ధన పర్వతం లాంటివి. అనగా ప్రకృతి (Nature Gods). ఋషులు అంటే జ్ఞానాన్ని పంచేవారు (Scientists, Teachers and Trainers). పితరులు (older generations) అంటే సంతానాన్ని పోషించేవారు. పశుపక్షాదులు, వృక్షాదులు (animals, birds, trees etc.) ఇతరప్రాణులు. కర్మల ద్వారా అందరికీ సుఖసాధనాలుగా మనుషులు తమను తాము అర్పించుకుంటారు. ఆ సేవలే పంచ మహా యజ్ఞాలు, శాస్త్రీయ సత్కర్మలు. ఈ ఐదిటి పట్ల తన ధర్మం నిర్వర్తించి, వాళ్ళకి పెట్టాల్సినవి పెట్టి, మనిషన్నవాడు తాను తినాలి.

సమస్త ప్రాణులు అన్నం నుండి పుడతాయి. అన్నం వర్షం నుండి పుడుతుంది. వర్షం యజ్ఞం వల్ల కురుస్తుంది. యజ్ఞం శాస్త్రోక్త కర్మల చేత ఉత్పన్నమవుతుంది. కర్మలు వేదం నుండి, వేదాలు అవినాశియైన పరమాత్మ నుండి ఉత్పన్నమయ్యాయి. అందుచేత, పరమాత్మ ఎప్పుడూ యజ్ఞము నందే ప్రతిష్ఠితుడై ఉన్నాడని తెలుస్తోంది. ఏ మనిషి, ఈ విధంగా పరంపరగా వస్తున్న సృష్టి చక్రానికి అనుకూలంగా వ్యవహరించడో, అంటే తన కర్తవ్యాన్ని నెరవేర్చడో అతడు ఇంద్రియముల చేత సుఖభోగాలని అనుభవించే పాపియై వ్యర్థంగా జీవిస్తాడు. ఈ మాటలు, ధర్మరాజు యక్షప్రశ్నలకి ఇచ్చిన సమాధానాలతో కలిపి చదివితే ఇంకా బాగా అర్థమవుతాయని నా అభిప్రాయం.

మహాభారతం లోని యక్షప్రశ్నల ఘట్టంలో “శ్వాస పీలుస్తున్నా కూడా మరణించిన వాడు ఎవడు?” అన్న యక్షుని ప్రశ్నకు ధర్మరాజు చెప్పిన సమాధానం: “దేవతలకు, అతిథులకు, సేవకులకు, పితృదేవతలకు, తనకు (అంటే ఎవరినైతే పోషించాలో వారికి) – ఈ ఐదుగురికీ ఎవడైతే ఇవ్వాల్సింది ఇవ్వడో వాడు శ్వాస పీలుస్తున్నా మరణించినట్లే. అంటే, ఇతరులకు పెట్టకుండా తినేవాడు జీవచ్ఛవం లాంటి వాడు”. “తపస్సుకున్న లక్షణము ఏమిటి?” అన్న మరో ప్రశ్నకు ధర్మరాజు చెప్పిన సమాధానం: “స్వధర్మము, అనగా, తన కర్తవ్యము తాను అనుసరించుటయే తపస్సని చెప్పబడును”. “మోహమంటే ఏమిటి?” అన్న ఇంకో ప్రశ్నకు ధర్మరాజు చెప్పిన సమాధానం: “ధర్మము అనగా కర్తవ్య మందు తెలివి లేకుండుట మోహము”. మన చుట్టూ ఉన్న ప్రకృతి, జీవులు అన్నీ దేవతాస్వరూపాలు కాబట్టి పర్యావరణ సమతుల్యత, పరోపకారం, స్వార్థం లేకుండా బాధ్యతలు నిర్వహించడం లాంటివి యజ్ఞంలో భాగమే. ఈ లోకంలో పుట్టి, బ్రహ్మ ఏర్పరచిన ఈ యజ్ఞ చక్రాన్ని అనుసరించకుండా, కేవలం తన స్వార్థం కోసం, ఇంద్రియ సుఖాల కోసం బతికేవాడి జీవితం వ్యర్థం. సృష్టి చక్రానికి అనుకూలంగా వ్యవహరించకపోతే పాపం.

కాని, ఏ మనిషి ఆత్మ యందే రమిస్తూ, ఆత్మ యందే తృప్తి పొందుతూ, ఆత్మ యందే సంతుష్ఠుడవుతూ ఉంటాడో అతడు చేయ వలసిన కర్తవ్యము అంటూ ఏమీ ఉండదు. ఎందుచేత అంటే, అదే పరాకాష్ఠ కాబట్టి అలాంటి మనిషికి లోకంలో కర్మలు చెయ్యడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అతడు కర్మలు చెయ్యకుండా ఉన్నా కూడా ఏమీ ప్రయోజనం / నష్టం ఉండదు. ఏ ప్రాణితో కూడా అతనికి స్వార్థ సంబంధము ఉండదు. అంటే, వాళ్ళకి చెయ్యాల్సినదేమీ మిగిలి ఉండదు. అనగా, అతనికి కర్తవ్య సమాప్తి స్థితి కలిగిందన్న మాట. అందుచేత అర్జునా! నువ్వు ఎప్పుడూ ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మను నిష్ఠతో చెయ్యి. అప్పుడే, పరమాత్మను పొందగలుగుతావు. జనక మహారాజు లాంటి జ్ఞానులు ఆసక్తి రహిత కర్మ వల్లే పరమ సిద్ధిని పొందారు. (ఆసక్తి రహిత కర్మకు జనకుడు, ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు ఉదాహరణ. ముఖ్యంగా జనకుడు నిర్దుష్టంగా వర్ణాశ్రమధర్మాలు పాంటింపబడేటట్లుగా పాలన సాగించడం గురించి అరణ్యపర్వంలోని ధర్మవ్యాథోపాఖ్యానంలో మనం విన్నాం. నిష్కామ కర్మయోగులకు ధర్మవ్యాథుడు కూడా మంచి ఉదాహరణ.) లోకం పోకడ చూసినా కూడా నువ్వు కర్మ చెయ్యడానికే తగిన వాడవు.

శ్రేష్ఠుడైన వాడు ఏ ఏ విధంగా కర్మలు ఆచరిస్తాడో, ఇతరులు కూడా ఆ విధంగానే ఆచరిస్తారు. అతడు దేనిని ప్రమాణం అనుకుంటాడో, అందరూ దానిని అనుసరించే నడుచుకుంటారు. (ఇది మానవ సమాజంలో మనం అందరం చూస్తున్నదే. చిన్న వాళ్ళు వాళ్ళకి నచ్చినవి, అంటే, వాళ్ళ దృష్టిలో శ్రేష్టమైనవి అనుకొన్నవి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి, చుట్టుపక్కల తిరిగే వాళ్ళ దగ్గర నుంచి, తమకు అడుగడుగునా ఎదురయ్యే పరిస్థితుల నుంచి నేర్చుకుని అనుసరిస్తారు.) నాకు, ఈ మూడు లోకాలలో కర్తవ్యమంటూ ఏమీ లేదు. నేను పొందదగిన వస్తువు గానీ పొందినది గానీ ఏమీ లేవు. అయినా కూడా, నేను కర్మ చేస్తూనే ఉన్నాను, చూడు. ఎందుచేతంటే, నేను జాగ్రత్తగా కర్మలు చెయ్యకపోతే, మనుషులు నన్ను అనుసరిస్తే గనక పెద్ద హాని కలుగుతుంది. నేను కర్మ చెయ్యకపోతే, మనుషులు కర్మ భ్రష్టులౌతారు. నేను సాంకర్యము చేసిన వాడనవుతాను. అందరినీ చెడగొట్టిన వాడనవుతాను (గాంధారి పని ఎగ్గొట్టి కూచుని సంతానాన్ని గాలికి వదిలి చేసింది ఇదే.).

కర్మ యందు ఆసక్తి ఉన్న అజ్ఞాని ఎలా కర్మ చేస్తాడో ఆసక్తి లేని జ్ఞాని కూడా లోక సంగ్రహము చేయడం కోసం అదే విధంగా కర్మ చెయ్యాలి. పరమాత్మ స్వరూపంలో స్థిరంగా ఉన్న జ్ఞానులు, శాస్త్రం విధించిన కర్మలలో ఆసక్తి ఉన్న అజ్ఞానుల బుద్ధిలో భ్రాంతిని గానీ అశ్రద్ధను గానీ కలిగించ కూడదు. అందుచేత, తాను కూడా శాస్త్రవిహిత కర్మలు శ్రద్ధగా చేస్తూ, వాళ్ళ చేత చేయిస్తూ ఉండాలి. తాను కర్తవ్యకర్మలు ఆచరిస్తూ తన ఆచరణ ద్వారా ఇతరులను దుర్గుణ దురాచారాల నుండి తొలగించి స్వధర్మము నందే ఉంచడాన్ని “లోకసంగ్రహం” అంటారట. ప్రతి మనిషి తాను ఇతరులకు ఒక మంచి ఉదాహరణగా (role model) మసలుకోవాలి. లేకపోతే మనుషులు కర్తవ్యభ్రష్టులవుతారు (దుర్యోధనాదుల లాగా). అహంకార, మమకార, ఆసక్తి, కామనలు లేకపోయినా, జ్ఞానులు కేవలం లోకసంగ్రహం కోసం కర్మాసక్తులైన మనుషుల్లాగా శాస్త్ర విహిత కర్మలు శ్రద్ధగా చెయ్యాలి. ఫలేచ్ఛ లేనప్పుడు కర్మ అనవసరం అనే భావన అజ్ఞానులలో కలిగించకూడదు (బహుశా ఇప్పుడు అదే జరుగుతోందేమో. ఫలానా వాళ్ళకి పూజ, వ్రతం లాంటివి చేస్తే చాలు, అన్నీ దక్కుతాయి, అని కొందరు ప్రబోధిస్తున్నారు).

అర్జునా! నిజానికి సమస్త కర్మలు అన్ని విధాలుగా ప్రకృతి గుణాలతో చేయబడ్డాయి. నదులు సముద్రం వేపు పోవడాన్ని అడ్డుకోవడం ఎలా అసాధ్యమో, ప్రాణులు ప్రకృతికి అధీనులై ఉండడాన్ని ఆపడం కూడా అయ్యే పని కాదు. అయినా, అహంకారం చేత మోహంలో ఉన్న అజ్ఞాని తానే చేస్తున్నాను అని అనుకుంటాడు. కాని, గుణవిభాగ కర్మవిభాగముల తత్త్వము తెలిసిన జ్ఞాన యోగి, అన్నీ గుణాలలోనే ఉన్నాయని అనుకుని వాటి మీద ఆసక్తి లేకుండా ఉంటాడు. ప్రకృతి యొక్క గుణముల చేత అధికంగా మోహంలో ఉన్న మనిషి, గుణము లందు కర్మలందు ఆసక్తి కలవాడై ఉంటాడు. సమగ్రముగా తెలియని ఆ అజ్ఞానులను అన్ని తెలిసిన జ్ఞాని చలింపజేయ కూడదు.

అర్జునా! అంతర్యామి, పరమాత్మ ఐన నా యందు లగ్నమైన మనస్సుతో సమస్తకర్మలను నా యందు అర్పించి, ఏ ఆశలు లేకుండా, మమకారం సంతాపం లేకుండా, యుద్ధం చెయ్యి. ఏ మనుషులు దోషదృష్టి లేకుండా శ్రద్ధ కలిగి ఎప్పుడూ నా ఈ మతము అనుసరిస్తారో వాళ్ళు కూడా సమస్త కర్మ బంధాలనుండి విముక్తు లవుతారు. కాని, ఎవరైతే నాపై దోషారోపణము చేస్తూ (శిశుపాలుడి లాగా), ఈ మతము అనుసరించి నడవరో, అలాంటి మూర్ఖులు సమస్త అజ్ఞాన మోహితులు, నష్టులు ఐనారని నువ్వు తెలుసుకో. ప్రాణులన్నీ ప్రకృతిలో కలిసిపోయేవే. మనుషులు తమ స్వభావాన్ని అనుసరించి కర్మలు చేస్తారు. జ్ఞాని కూడా అదే విధంగా కర్మలు చేస్తాడు. కనుక, ఇక నిగ్రహం ఏమి చేస్తుంది. ప్రతి ఇంద్రియము యొక్క అర్థము (శబ్దాది విషయములు) నందు రాగద్వేషములు ఏర్పడి ఉన్నాయి (in-built). ఎందుకంటే, ఆ రెండే అతనికి మంచి చేసే మార్గానికి అవరోధాలు కలుగజేసే శత్రువులు అనుకో.”

ఇది విని, “యుద్ధం ఒక క్రూర కర్మ, భిక్షాటనం చేస్తూ శాంతిమయ జీవనం సాగిస్తే రాగద్వేషాల నుండి విముక్తి సహజంగానే కలుగుతుంది” అని అర్జునుడు అనుకునే అవకాశం ఉంది. అందుకని ముందరి కాళ్ళకు బంధం వేసినట్లు ఇలా అంటున్నాడు కృష్ణుడు.

“చక్కగా ఆచరించబడిన ఇతరుల ధర్మం (others’ duty or agenda) కన్నా గుణహీనమైనా కూడా స్వధర్మమే (own duty or agenda) మేలు. స్వధర్మాచరణంలో మరణం కూడా శ్రేయస్కరమే. పరధర్మము భయదాయకము”. (మన పెద్ద వాళ్ళు మామూలుగా అనే మాట ‘నీ పని నువ్వు చూసుకో’ అని. చిన్నయ సూరి గారి పంచతంత్రం కథలలో కుక్క పని గాడిద చేసి దెబ్బలు తినడం మనకి తెలిసినదే. వాల్మీకి రామాయణం ఉత్తరకాండములో శంబూక వధకి కారణం అతడు పరధర్మము ఆచరించడమే అని నా అభిప్రాయం. పూర్వం వర్ణాలు వృత్తుల పరంగా ఏర్పడ్డాయి. అంటే, ఒక్కో వర్ణానికి ఒక్కో రకం వృత్తి కేటాయించబడేది. అలా కేటాయించబడినది కాదని వేరే వృత్తి చెయ్యడం నిషిద్ధం. అంటే, క్షత్రియులు భిక్షాటనం చెయ్యడం, అప్పుడెప్పుడో ఆపద్ధర్మంగా పాండవులు ఏకచక్రపురంలో భిక్షాటనం చేసినా కూడా, సరియైనది కాదు అని చెప్పకుండా చెబుతున్నాడు కృష్ణుడు. ఇప్పటి సందర్భంలో చెప్పాలంటే, యుద్ధాలకు సంబంధించిన శిక్షణ లేకుండా యుద్ధంలో పాల్గొనాలి అనుకోవడం, వైద్యశిక్షణ లేకుండా డాక్టరు అవ్వాలనుకోవడం, ఇంజనీరింగు ప్రావీణ్యం గడించకుండా బ్రిడ్జి కట్టాలనుకోవడం, లాంటివి సంఘం అనుమతించాలా. ఇటువంటి ఉల్లంఘనలకు రామాయణ కాలంలో అయితే బహుశా శిరఃఖండనే శిక్షేమో. కృష్ణుడు కూడా ఈ ఉల్లంఘనలు కూడవనే చెబుతున్నాడు).

ఇక్కడ, అర్జునుడు ఒక అమాయకమైన అనుబంధ ప్రశ్న వేశాడు. ఏమని అంటే: “కృష్ణా! అలా అయితే మనిషన్నవాడికి పాపం చెయ్యాలని లేనప్పటికీ, దేనిచే అతడు బలవంతంగా ప్రేరేపించబడుతున్నాడు” అని. బహుశా అర్జునుని మనస్సులో భీష్ముడు, ద్రోణుడు లాంటి కొంతమందికి పాపం చెయ్యాలని లేకపోయినా బలవంతంగా ప్రేరేపించబడుతున్నారని ఉందేమో. దానికి కృష్ణుడు క్రింది విధంగా జవాబు ఇచ్చాడు.

“రజోగుణం వల్ల ప్రేరేపించబడిన కామమే క్రోధం. ఎన్ని సుఖాలు అనుభవించినా అది తృప్తి చెందదు. అదే మహా పాపి, శత్రువు అని తెలుసుకో. ఆ కామము అనేది మనుషులను రేపెట్టి పాపం లోకి పడద్రోస్తుంది. ఏ విధంగానైతే పొగ చేత అగ్ని, దుమ్ము చేత అద్దము, మావి చేత గర్భము కప్పబడి ఉంటాయో, అదే విధంగా కామం చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది. అగ్ని లాగా ఎన్ని అనుభవించినా తృప్తి చెందకుండా ఉండే కామమే జ్ఞానులకు నిత్య శత్రువు. ఆ కామం చేతనే మనుషులకు కూడా జ్ఞానం కప్పబడి ఉంటుంది. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అన్నవి కామానికి నివాసస్థానాలు. అవి జ్ఞానాన్ని ఆచ్ఛాదించి జీవాత్ముని మోహంలో పడవేస్తున్నాయి. అందుచేత అర్జునా! నీవు మొదట ఇంద్రియాలను వశంలో పెట్టుకుని జ్ఞానాన్ని నశింపజేసే కామాన్ని బలాత్కారంగా చంపేసెయ్యి. స్థూలశరీరం కంటె ఇంద్రియాలు శ్రేష్ఠము, వాటి కన్నా మనస్సు, మనస్సు కన్నా బుద్ధి, బుద్ధి కన్నా ఆత్మ శ్రేష్ఠము అని తెలుసుకో. ఈ విధంగా, బుద్ధి కంటే ఆత్మ పరము (శ్రేష్ఠము) అని గ్రహించి, బుద్ధి చేత మనస్సును నిరోధించి, కామము అనే కష్టసాధ్యమైన శత్రువును నశింపజేయుము.

తన కోసం కాకుండా ధర్మం కోసం బ్రతికినవాడు, జీవన గమనంలో ధర్మం కోసం బంధువు లన్న పక్షపాతం లేకుండా (మేనత్త కుమారులైన శిశుపాల దంతవక్తృలను, ఏకలవ్యుని చంపడం, వియ్యంకుడైన దుర్యోధనుని ఓటమికి మరణానికి సాయం చెయ్యడం, జరాసంధుని వంటి ఇతర బంధువుల మరణానికి తగిన ప్రణాళికలు వెయ్యడం) వ్యవహరించినవాడు, జీవితంలో తన కోసం ఏమీ మిగుల్చుకోనివాడు, తన వారెవరూ చివరకు మిగలకపోయినా కూడా చలించనివాడు, అయిన శ్రీకృష్ణుడు జీవితాంతం తాను ఆచరించిన ధర్మాలను అర్జునుడికి బోధించిన తీరు ఈ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

2 thoughts on “భగవద్గీత – కర్మ యోగము”

  1. ఈ రచన వలన నాకు తెలియని విషయాలు తెలుసుకోగలిగాను . ప్రారంభము లో ఈ వ్యాస సందర్భము భగవత్గీత మూడవ అధ్యాయము అని పేర్కొన్నారు ,దాన్ని క్రిందనే రెండవ అధ్యాయము అని పేర్కొన్నారు ,ఇది గమనించగలరు.

    Like

  2. ఈ అధ్యాయం లో చాలా విషయాల ను చక్కగా వివరించారు. మిధ్యాచారిలాంటి వాళ్ల ను నేటి సమాజంలో చూస్తున్నాము. శ్రేష్ఠుడు, స్వధర్మం లను గురించి బాగా తెలియ చేశారు. కామం చేత జ్ఞానము కప్పబడినది. కాళిదాసు రచించిన మేఘ సందేశం లో ని శ్లోకం లో ‘ kamarthahi prakruthi krupana schethana chethaneshu ‘ అన్న పాదం గుర్తు వచ్చినది. శ్రీకృష్ణుడు, ధర్మం కోసం బోధించిన తీరు మీరు బాగా వివరించారు. మీకు అభినందనలు మరియు ధన్యవాదాలు.

    Like

Leave a Reply