[వేదవ్యాస కృతియైన మహాభారతము లోని భీష్మ పర్వానికి కీ.శే. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు చేసిన యథామూలాంధ్రగద్యానువాదము (literal Telugu prose translation of the original text), ఇంకా ఇతర భగవద్గీత పుస్తకాలు చదివిన మీదట, మా గురువుగారు చేసిన బోధలు విన్న మీదట, నాకు అర్థమైన భగవద్గీత గురించి అధ్యాయాల వారీగా (chapter-wise) మీతో పంచుకుంటున్నాను.]
“అర్జున విషాద యోగము” అన్న భగవద్గీత లోని మొదటి అధ్యాయంలో కులనాశనం, వర్ణసంకరం, పిండాలు తర్పణాలు ఇవ్వ వలసిన వాళ్ళు కులంలో లేకపోతే పితృదేవతలు అథోలోకాలకు పోతారని అర్జునుడు చెప్పడం, అది కూడా యుద్ధప్రారంభంలో అనడం, వింతగా ఉంది. ఆ నాటి కుల వ్యవస్థ లేదా వర్ణ వ్యవస్థ ఇప్పటి లాగా కాకుండా వృత్తుల పరంగా ఉండేది. వివాహాలలో అనులోమ విలోమ పద్ధతులు కూడా అప్పటికే ఉండేవి. సూత కులం అలా వచ్చిందే. ఇవన్నీ తెలిసి కూడా, అప్పటికే అనేక యుద్ధాలు చేసి చాలా మందిని సంహరించి కూడా, అర్జునుడు కుల వ్యవస్థ గురించి ప్రస్తావించడం, తన భార్యలలో ఒకామె నాగజాతికి చెందినదన్న విషయం మరచిపోయి వర్ణసంకరం గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. శ్లోకాల లెక్క చూస్తే అర్జునుడివి 29 శ్లోకాలు ఎక్కువ వచ్చాయి అని ఇంతకు ముందు “భగవద్గీత గురించి – మంచి, చెడు” అన్న అధ్యాయంలో చెప్పుకున్నాము. అందుకని, నిజంగా ఇలాంటి ప్రశ్నలు అర్జునుడు అడిగి ఉంటాడా, లేక ఎవరన్నా తరువాత చేర్చినవా అన్న అనుమానం నా లాంటి వాళ్ళకి రాకుండా ఉండదు.
సాంఖ్య యోగము అన్నది భగవద్గీత లోని రెండవ అధ్యాయము. ఈ అధ్యాయంలో మొత్తం 72 శ్లోకాలు ఉన్నాయి. 18వ అధ్యాయం తరువాత ఇదే పెద్ద అధ్యాయం. ఈ అధ్యాయంలో అర్జునుడి అనుభూతులు, ప్రశ్నలు 6 శ్లోకాలలో ఉన్నాయి. ఐదు శ్లోకాలు మొదటి అధ్యాయంలో అడిగిన ప్రశ్నలకి కొనసాగింపుగా (continuation) అన్నవి. ఒక శ్లోకం మాత్రం కృష్ణుడు చెప్పినది విని సందేహం అడగడానికి చెప్పినది. సాంఖ్యయోగ మనగా సమ్యక్ (యావత్తు గురించి) జ్ఞానం, అంటే holistic knowledge కల్గించు యోగము. మొదటి అధ్యాయంలో చెప్పినట్లుగా స్వజనాన్ని చూసిన మోహంతో వ్యాకుల చిత్తుడై యుద్ధం మానుకుని దుఃఖిస్తున్న అర్జునుణ్ణి చూచి కృష్ణుడు ఇలా అంటున్నాడు: “ఉత్తమ పురుషులు ఎవరూ ఆచరించని విధంగా నీకీ సమయంలో మోహం ఎందుకు కలిగింది? దీని వల్ల నీకు స్వర్గము, కీర్తి లభించవు. ఈ కారణం చేత నపుంసకుడవై అశక్తుడవు కావద్దు. నీకిది ఉచితం కాదు. హృదయ దౌర్బల్యము వీడి యుద్ధానికి సిద్ధం అవ్వు”.
అప్పుడు, అర్జునుడు ఇలా అంటున్నాడు: “పూజ్యులైన భీష్ముడితోను, ద్రోణుడితోను ఎలా యుద్ధం చెయ్యను? వాళ్లని చంపి వారి రక్తంతో తడిసిన అర్థ-కామ రూపాలైన భోగాలని ఎలా అనుభవించ గలను. దాని కన్నా, ముష్టి ఎత్తుకుని బ్రతకడం మేలు”. ఇలా తన నిర్ణయం ప్రకటించి, ఇంకా మనస్సులో ఏదో సందేహం ఉండడం వల్ల అర్జునుడు మళ్ళీ ఇలా అంటున్నాడు: “మా కోసం మేము యుద్ధం చెయ్యాలా, వద్దా, ఏది మంచిది అన్నది మేము ఎరగము. వాళ్ళు మమ్మల్ని జయిస్తారా, వాళ్ళని మేము జయిస్తామా అన్నది కూడా మాకు తెలియదు. ఎవరిని చంపిన తరువాత మేము బ్రతకడానికి ఇష్టపడమో, ఆ ధార్తరాష్ట్రులు యుద్ధానికి నిలబడి ఉన్నారు. పిరికితనమనే దోషం చేత నా స్వభావము నశించింది. ఈ లోకంలో శత్రువులు లేని రాజ్యము, స్వర్గ సామ్రాజ్యము పొందినా కూడా నా ఇంద్రియాలని బలహీనపరిచే శోకము తగ్గించే ఉపాయము ఏదీ దానిలో నాకు కనపడదు. ఈ ఆవేదన వింటే షేక్స్పియర్ (Shakespeare) రచించిన మాక్బెత్ (Macbeth) నాటకంలోని “Will all great Neptune’s ocean wash this blood clean from my hand?”, “Here’s the smell of the blood still: all the perfumes of Arabia will not sweeten this little hand.” అన్నరెండు మాటలు గుర్తుకొస్తాయి. కర్తవ్యం ఏమిటో తెలియడం లేదు, కృష్ణా! నీ శిష్యుడుగా నీ శరణు వేడుతున్నాను. నేనిప్పుడు ఏమి చెయ్యాలో చెప్పు”. అలా చెప్పి, గుడాకేశుడైన అర్జునుడు నేను యుద్ధం చెయ్యనని స్పష్టంగా చెప్పి ఊరుకున్నాడు. గుడాకేశుడు (“గుడాక” అంటే నిద్ర. నిద్రకి ఈశుడు లేక అధిపతి అంటే నిద్రను జయించిన వాడు అని అర్థం.), అని అర్జునునికి విశేషంగా ఇక్కడ వ్యాసుడు వాడటం చాల వ్యంగ్యంగా ఉంది. ఎందుకంటే, తరువాతి భాగాలని బట్టి అర్జునుడు అజ్ఞానం అనే నిద్రలో ఉన్నట్లు (నా లాంటి వాళ్ళు కూడా) మనకు తెలుస్తుంది.
అప్పుడు, అర్జునుడికి పట్టిన శోకమోహాలని శాశ్వతంగా పోగొట్టడానికి, యుద్ధమే కర్తవ్యమని చెప్పడానికి, నవ్వుతూ కృష్ణుడు ఒక వకీలు (lawyer) లాగా ఐదు రకాల వాదనలను ఎలా వినిపించాడో చూద్దాము. ఆ వాదనలలో అర్జునుడి ప్రశ్నలకి సూటిగా సమాధానాలు చెప్పలేదు కానీ, లోతుగా ఆలోచిస్తే అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. ఆ superlative logic ఏమిటో చూద్దాం.
మొదటి వాదన: అర్జునా! నువ్వు పండితుడి లాగా మట్లాడుతున్నావు గానీ ప్రాణం పోయిన వారి గురించి గానీ ప్రాణంతో ఉన్న వారి గురించి గానీ పండితులు శోకించరు. శోకింప తగని మనుషుల కోసం నువ్వు శోకిస్తున్నావు. నేను గానీ నువ్వు గానీ ఈ రాజులు గానీ ఇంతకు ముందు లేము, ఇక భవిష్యత్తులో ఉండబోము అని అనడానికి లేదు. జీవాత్మకి సంబంధించిన ఈ శరీరానికి బాల్యం, యౌవనం, ముసలితనం అన్న దశలు వచ్చినట్లే జీవాత్మకి కూడా ఇతర శరీరప్రాప్తి కలుగుతుంది. ఈ వికారాలకి (మార్పులకి) ధీరపురుషులు, అంటే జ్ఞానులు మోహం చెందరు. శీతోష్ణాలు, సుఖదుఃఖాలు లాంటి ద్వంద్వాలు ఇంద్రియాల యొక్క, వాటిని ఆకర్షించే ప్రాపంచిక విషయాల యొక్క, సంయోగంతో (combination) ఏర్పడతాయి. అంటే, reactions అన్న మాట. ఆ సంయోగము పుడుతూ ఉంటుంది. నశిస్తూ ఉంటుంది. అది అనిత్యము. దాన్ని సహించాలి. ద్వంద్వాలని సమానంగా చూచే జ్ఞానిని ఈ విషయేంద్రియ సంయోగం కలత పరచలేదు. అలాంటి వారు మోక్షం పొందడానికి అర్హులౌతారు. ఏ వస్తువుకి మార్పు, నాశము ఉంటాయో ఆ అసత్య వస్తువుకి ఉనికి ఉండదు. ఏ వస్తువుకి మార్పు, నాశము ఎట్టి పరిస్థితుల్లోనూ కలగవో ఆ సత్య వస్తువుకి అభావము, అంటే, లేకపోవడ మనేది ఉండదు. ఈ తత్త్వాన్ని జ్ఞానులైన మనుష్యులు చూశారు. ఈ సమస్త ప్రపంచంలో మనకు కనిపించేది, అంతటా వ్యాపించియున్నది అయిన పరమాత్మ వస్తువు నాశరహితము (“ఏ ఈ కొంచెము జగత్తు కనబడుచున్నదో వినబడుచున్నదో దానిని అంతటిని లోపలను వెలుపలను కూడా వ్యాపించి నారాయణుడు ఉన్నాడు” అనే అర్థాన్ని ఇచ్చే మహానారాయణోపనిషత్తు లోని “యచ్చకించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేఽపి వా, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః” అన్న వాక్యాలలో కూడా ఇదే ఉంది.). నాశరహితము, అనంతము, నిత్యము అయిన జీవాత్మ యొక్క ఈ శరీరాలన్నీ నాశనమయ్యేవని తెలుసుకో. శరీరాలతో సంబంధం ఉన్న ఆత్మలు వేరు వేరుగా అనిపించినా, అవన్నీ ఒక్కటేయైన చేతన తత్త్వము అని ఆత్మ- పరమాత్మల ఐక్యత (unification) గురించి ఇక్కడ చెప్పబడింది. అది ఎట్లా అంటే, నిద్రలో కల సృష్టించేది ఒక్క మనిషే. ఆ కలలో కనిపించే అనేకత్వము నిద్ర వల్ల వచ్చింది. మేలుకొన్న తరువాత, మళ్ళీ ఒక్క మనిషే ఉంటాడు. అలాగే, ఆత్మల అనేకత్వము అజ్ఞానం వల్ల వచ్చింది. జ్ఞానోదయమైతే, ఆ అనేకత్వం లేదని తెలుస్తుంది. అర్జునా! ఈ ఆత్మని చంపుతాను అని అనుకునేవాడు, ఈ ఆత్మ చచ్చింది అని అనుకునేవాడు, ఇద్దరికీ ఏమీ తెలియదు. ఎందుచేత అంటే, నిజానికి ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరి చేతా చంపబడదు. ఆత్మకి జనన మరణాలు లేవు. అది నిత్యము, సనాతనము (అంటే, ఎప్పట్నుంచో ఉంది). శరీరం నశించినా కూడా అందులో ఉన్న ఆత్మ చంపబడదు. ఇది తెలిసిన మనిషి, ఎవరిని చంపిస్తాడు, ఎవరిని చంపుతాడు? (అర్జునుడు ధార్తరాష్ట్రులని చంపడం నాకు ఇష్టం లేదు, వాళ్ళు నన్ను చంపితే ఆ మరణము నాకు క్షేమమే అని అనుకుంటాను అని అన్నాడు. అది అజ్ఞానం అని కృష్ణుడు ఇక్కడ నిరూపించాడు.) మనిషి పాత వస్త్రాన్ని విడిచి క్రొత్త వస్త్రాన్ని వేసుకున్నట్లే జీవాత్మ పాత శరీరం విడిచి వేరే శరీరాన్ని పొందుతుంది. నిజానికి ఆత్మ క్రియారహితము కాబట్టి దానికి రాకపోకలు ఉండవు. కానీ, ఒక కుండను ఒక ఇంటి నుండి ఇంకో ఇంటికి తీసుకొని పోయేటప్పుడు దాని లోని ఖాళీ స్థలము [ఘటాకాశము] కూడా వెళ్ళినట్లు, సూక్ష్మ శరీరానికి ఉండే గమనము దానిలోని ఆత్మకి కూడా ఆపాదించబడింది. ఆత్మని శస్త్రం ఖండించ లేదు, అగ్ని కాల్చ లేదు, నీరు తడప లేదు, వాయువు శుష్కింప జేయ లేదు. ఎందుకంటే, ఆత్మ అచ్ఛేద్యము, అదాహ్యము, అక్లేద్యము, అశోష్యము, అచంచలము, నిత్యము, స్థిరము, సనాతనము, సర్వత్రా వ్యాపించినది, అవ్యక్తము (కనపడనిది), అచింత్యము (ఊహింప శక్యము కానిది). ఇంద్రియాలకి, మనస్సుకి ప్రకృతి జన్మస్థానమైనా కూడా అవి ప్రకృతి గురించి తెలుసుకోలేవు. అందుచేత, ప్రకృతి అవ్యక్తము, అచింత్యము. ప్రకృతి వికార (మార్పు) రహితము కాదు. కానీ, ఆత్మ వికార రహితము. ఆ విధంగా, అది ప్రకృతి కన్నా భిన్నమైనది. అర్జునా! ఇది తెలుసుకుంటే, నీకు శోకించడం ఉచితం కాదు.
రెండవ వాదన: అర్జునా! ఒక వేళ నువ్వు ఆత్మకి జనన మరణాలు ఉన్నాయని అంగీకరించినప్పటికీ (ఘటాకాశానికి ఘటం గమనంతో సంబంధం ఆపాదించినట్లు శరీరం యొక్క మరణాన్ని ఆత్మకి ఆపాదించడం), నీకు శోకం తగదు. ఎందుకంటే, జననాన్ని అనుసరించి మరణం, మరణించినవాడు మళ్ళీ పుట్టడం అన్నవి నిర్ణయింపబడిన విషయాలు (భాగవత కథలలో భగవంతుని వద్ద నుండి ఇంచుమించు మరణం లేకుండా వరాలు పొందిన రాక్షసులు చివరికి ఎలా మరణించారో మనం విన్నాము. కాబట్టి, పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు.). వాటిని తప్పించుకోవడం కుదరదు. తప్పించుకోవడానికి ఏ ఉపాయము లేని విషయం గురించి నువ్వు శోకించడం తగదు. అది వ్యర్థము. ప్రాణులు జనన మరణాల మధ్య కాలంలో వ్యక్తాలు (కనిపిస్తాయి). జనానికి ముందు, మృత్యువుకి తరువాత అవి అవ్యక్తాలు (కనబడవు). ఇలాంటి పరిస్థితిలో ఎందుకు శోకించాలి?
మూడవ వాదన: అర్జునా! ఒక మహాపురుషుడు మాత్రమే అత్మ దర్శనం చేయగలడు. అలాగే, ఒక మహాపురుషుడు మాత్రమే ఆత్మతత్త్వాన్ని వర్ణించగలడు. దాన్ని వినే అధికారమున్న వేరొకడు వినగలడు. కొంతమంది విని కూడా ఆ తత్త్వాన్ని అర్థం చేసుకోలేరు. ఈ ఆత్మ అందరి శరీరాలలో అవధ్యముగా ఉంటుంది (ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ద్వారా అద్భుతము, అలౌకికము అయిన ఆత్మ దర్శనము దుర్లభము. ఆత్మ తన్ను తానే చూచుకొన గలదు. ఆ చూచుటలో, చూసేది, చూడబడేది, చూడడం – ఈ మూడూ ఆత్మే. అందుకే అది ఆశ్చర్యకరము. ఆత్మలాంటి వస్తువు వేరొకటి లేదు. అందుచేత, ఉదాహరణల ద్వారా ఆత్మతత్త్వాన్ని వర్ణించడం వీలుకాదు. ఇలాంటి తర్కం మనం వాల్మీకి రామాయణంలోని ఒక అనన్వయ అలంకారం ద్వారా కూడా విన్నాము. ఆకాశం ఎలా ఉంది అంటే ఆకాశం లాగానే ఉంది, సముద్రం ఎలా ఉంది అంటే సముద్రం లాగానే ఉంది, రామరావణ యుద్ధం ఎలా ఉంది అంటే రామరావణ యుద్ధం లాగానే ఉంది, అన్న మాటల్లో.). కాబట్టి, జీవులందరి కోసం వాళ్ళు మరణించారని నీవు శోకించ వద్దు. అది తగని పని.
నాల్గవ వాదన: (ఇక్కడి దాకా, ఆత్మ శరీరాలు వేరుపడడం వల్ల శోకించకూడదు, శరీరానికి ఉన్న జననమరణములు ఆత్మకి ఆపాదించినా కూడా శోకించకూడదు, అందుచేత యుద్ధం చెయ్యి అని చెబుతూ, ఇప్పుడు క్షత్రియ ధర్మాన్ని అనుసరించి కూడా నీకు యుద్ధం అనివార్యమని చెబుతున్నాడు.) అర్జునా! నీ క్షత్రియ ధర్మము చూసైనా నీకు భయము ఉండకూడదు. ఎందుకంటే, క్షత్రియ ధర్మానికి ఉచితమైనది యుద్ధము. దాన్ని మించి వేరే మేలైన కర్తవ్యము క్షత్రియుడికి లేదు. అందుచేత, నువ్వు భయపడడానికి కుదరదు. తనంత తానుగా ప్రాప్తించిన స్వర్గద్వారము లాంటి యుద్ధము సుక్షత్రియులు మాత్రమే పొందుతారు. ఈ యుద్ధం నువ్వు చేయకపోతే, స్వధర్మాన్ని కీర్తిని పోగొట్టుకుని పాపం మూట కట్టుకుంటావు. చాలా కాలం అందరూ నీ అపకీర్తి గురించి చెప్పుకుంటారు. గౌరవము ఉన్న ఏ మనిషికైనా అపకీర్తి అన్నది చావు కన్నా ఎక్కువే కదా. ఎవరి దృష్టిలో నీకు మొదటి నుండి చాలా గౌరవం ఉందో వాళ్ళే నిన్ను అప్పుడు తేలికగా చూస్తారు. నువ్వు యుద్ధానికి భయపడి పారిపోయావని అంటారు. నీ శత్రువులు నీ శక్తిని నిందిస్తూ, నిన్ను అనరాని మాటలంటారు. అంతకన్నా నీకు అధిక దుఃఖము ఇచ్చేది ఏది ఉంటుంది. నువ్వు యుద్ధంలో చచ్చి స్వర్గానికైనా పోతావు, లేదా గెలిస్తే రాజ్యసుఖాలన్నా అనుభవిస్తావు. అందుకని యుద్ధం చెయ్యడానికి సిద్ధపడి నిలబడు. జయాపజయాలు, లాభాలాభాలు, సుఖదుఃఖాలు సమానమని తెలుసుకుని యుద్ధం చేస్తే నీకు ఏ పాపము అంటదు (అర్జునుడు, నాకు రాజ్య సుఖము, స్వర్గప్రాప్తి – రెండూ వద్దని ముందే చెప్పాడు. అందుకని, సమభావంతో యుద్ధం చెయ్యమని చెబుతున్నాడు.).
ఐదవ వాదన: (ఇంతవరకు, సాంఖ్యయోగ సిద్ధాంతము ద్వారా క్షాత్ర ధర్మం ద్వారా యుద్ధాన్ని ప్రతిపాదించి, ఇప్పుడు కర్మయోగ సిద్ధాంతము ద్వారా యుద్ధం తగిన కర్తవ్యమని కృష్ణుడు చెబుతున్నాడు.) ఇంతవరకు నీకు చెప్పినది జ్ఞానయోగ సంబంధమైనది. ఇక కర్మయోగ బుద్ధిని గురించి చెబుతాను. ఇది తెలిసిన తరువాత నీవు కర్మబంధనాన్ని పూర్తిగా విడిచిపెడతావు. ఈ కర్మయోగంలో ఆరంభానికి, అంటే బీజానికి నాశము, ఫలరూప దోషము లేవు. కర్మయోగ ధర్మాన్ని ఏ కొంచెం అనుష్టించినా, జననమరణ భయం నుండి కాపాడుతుంది. కర్మయోగంలో బుద్ధి నిశ్చయంగా ఉంటుంది. స్థిరచిత్తము లేని మూర్ఖులు, కోరికలతో మునిగిన మనుషుల బుద్ధులు అనేక రకాలుగా ఉంటాయి. అర్జునా! ఎవరు సుఖ భోగాలలో మునిగిపోయి ఉన్నారో, ఎవరు కర్మఫలాలని మెచ్చుకునే వేదవాక్యాలంటే ఇష్టంగా ఉన్నారో, ఎవరికి స్వర్గమే ముఖ్యంగా పొందదగినదో, ఎవరు స్వర్గం కన్నా మిన్నయైన దేదీ లేదని భావిస్తారో, అలాంటి అవివేకులు అలాంటి పైకి మాత్రమే బాగుండే మాటలు చెబుతూ ఉంటారు. ఆ మాటలు భోగైశ్వర్యాలు పొందడానికి అవసరమయ్యే రకరకాల క్రియలని వర్ణించేవిగా ఉంటాయి. ఆ మాటలకి పడిపోయే పురుషులకి పరమాత్మ యందు నిలకడయైన బుద్ధి ఉండదు. సత్త్వరజస్తమో గుణాలనే మూడు గుణాలకి కార్యరూపాలైన భోగాలని వాటి సాథనాలని వేదాలు ప్రతిపాదిస్తాయి. నువ్వు వాటి మీద ఆసక్తి వదిలిపెట్టి, సంతోషము, దుఃఖము లాంటి ద్వంద్వాలు లేకుండా, శాశ్వతమైన పరమాత్మ యందు స్థితుడవై, యోగక్షేమాలు కోరకుండా, అంతఃకరణాన్ని అదుపులో ఉంచుకొని ఉండాలి (దొరకని వస్తువు దొరికితే అది యోగము. దొరికిన దాన్ని రక్షించుకోవడం క్షేమము. సాంసారిక సంబంధమైన కోరికలు విడిచినా గానీ మనిషికి శరీరం ఉన్నంత కాలం యోగక్షేమాల వాసన ఉంటుంది. అది కూడా వదలాలని, కృష్ణుడు అర్జునుణ్ణి నిర్యోగక్షేముడవు కావాలి అని చెబుతున్నాడు.). పరిపూర్ణంగా నిండిన చెరువు దొరికిన తరువాత చిన్న చిన్న చెరువులతో ఎంత ఉపయోగం ఉంటుందో, పరబ్రహ్మ తత్త్వం తెలుసుకున్న బ్రాహ్మణుడికి (వృత్తి రీత్యా teachers and trainers అని నా అభిప్రాయం) వేదాలతో అంతటి ప్రయోజనమే ఉంటుంది. అర్జునా! నీకు కర్మ చేసే అధికారం మాత్రమే ఉంది (ఉదాహరణకి, ఆత్మరక్షణ గురించో ప్రజారక్షణ గురించో ఆయుధాలూ, వాటిని ప్రయోగించడానికి అధికారము, నియమాలు ఇస్తే, అవి పొందిన వారు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తేనో, ఆ నియమాలు ఉల్లంఘిస్తేనో, ప్రభుత్వము దండన విధించడంతో పాటు, అవి ప్రయోగించే అధికారం కూడా వెనక్కి తీసుకుంటుంది. అదే విధంగా, జీవుడికి జనన మరణ బంధనాల నుండి విముక్తి పొందడానికి మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్న ఆయుధాలతో శరీరాన్ని ఇచ్చి కొత్త కొత్త కర్మలు చెయ్యడానికి అధికారం ఇవ్వబడింది. అది సద్వినియోగం అయితే కర్మబంధనాల నుండి విముక్తి, మోక్షం వస్తాయట. లేకపోతే, దండన రూపంగా, ఆ అధికారం లాక్కొనబడి, మనిషిగా కాక వేరేగా మరుజన్మ ఎత్తే విధంగా చెయ్యబడుతుందట. కాకపోతే, భారత కథలో అలా దుర్వినియోగం చేసిన వాళ్ళు మనిషిగా కాక వేరే జన్మ ఎత్తినట్లుగా చెప్పబడలేదు.). దాని ఫలము మీద ఎప్పుడూ లేదు. అందుకని, కర్మఫలాలకి నువ్వు కారణం కావద్దు. అలా అని, కర్మ చెయ్యకుండా ఉండడంలో ఆసక్తి కలిగి ఉండొద్దు. కర్మఫలంపై ఆసక్తి వదిలి సిద్ధి (నెరవేరుతుంది), అసిద్ధి (నెరవేరదు) అన్న రెంటి మీద సమాన బుద్ధి కలిగి కర్తవ్యము అనిపించే కర్మలు (పనులు) చెయ్యి (కోరుకున్న కర్మఫలం లభించక పోవచ్చు). కర్మఫలం అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. కానీ, కర్మఫలం నుండి తప్పించుకోవడం మాత్రం కుదరదు. సమత్వంతో ఉండడమే యోగం. అంటే, సకామ కర్మ మిక్కిలి హీనమైనది. అందుకని, సమత్వ బుద్ధితోనే రక్షణకి అవసరమైన ఉపాయము వెదుక్కోవాలి. సమత్వ బుద్ధి ఉన్నవాడు పుణ్యం, పాపం – రెంటినీ వదిలి కర్మబంధనం నుండి విముక్తుడవుతాడు. అలాంటి జ్ఞానులు కర్మఫలత్యాగం చేసి జన్మబంధనాల నుండి విముక్తి పొంది నిర్వికారమైన పరమపదము పొంద గలరు. (జన్మ జన్మాంతరాల నుండి, ఈ జన్మలో చేయబడే పుణ్య, పాప కర్మలు సంస్కార రూపంలో అంతఃకరణంలో కూడబెట్టబడి ఉంటాయి. ఆ కర్మలన్నీ సమబుద్ధి ఉన్న కర్మయోగి ఈ లోకంలోనే విడిచి విముక్తుడవుతాడు. అవి అతనికి పునర్జన్మ రూపంలో ఫలం ఇవ్వవు.) ఎప్పుడైతే నీ బుద్ధి మోహమనే అజ్ఞానం పూర్తిగా దాటగలుగుతుందో, అప్పుడు నువ్వు విన్న నీకు వినిపింపబడిన ఇహపరలోకాలకి సంబంధించిన సుఖభోగాలని దాటి వైరాగ్యాన్ని (ఇహపరలోకాల్లో ఏ భోగైశ్వర్యాలు ఇప్పటిదాకా చూచి, విని, అనుభవింపబడతాయో వాటికి శ్రుతము అని పేరు. భవిష్యత్తులో అయితే, వాటికి శ్రోతవ్యములు అని పేరు. అవి అన్ని దుఃఖహేతువులు, అనిత్యములు అని తెలుసుకుని అనాసక్తి పెంచుకోవడమే వైరాగ్యము.) పొందగలుగుతావు. విన్నవాటి వల్ల చలించిన నీ బుద్ధి పరమాత్మ యందు నిలిచి ఎప్పుడు స్థిరంగా ఉంటుందో అప్పుడు నువ్వు యోగాన్ని, అంటే పరమాత్మతో నిత్య సంబంధము పొందగలుగుతావు.
అప్పుడు అర్జునుడు ఇలా ఒక అనుబంధ ప్రశ్న (Supplementary question) లేవనెత్తాడు: కేశవా! సమాధిలో పరమాత్మను పొందిన స్థిరబుద్ధి గల పురుషుడి లక్షణం ఏమిటి? అతను ఎట్లా మాట్లాడతాడు? ఎట్లా నడుచుకుంటాడు? దానికి సమాధానంగా కృష్ణుడు క్రింది విధంగా తన వాదన కొనసాగిస్తున్నాడు:
“అర్జునా! ఏ కాలంలో పురుషుడు మనస్సులో ఉన్న కోరికలు విడిచి ఆత్మ చేత ఆత్మలోనే సంతుష్టుడై ఉంటాడో ఆ కాలంలో అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడతాడు. దుఃఖాలు కలిగినప్పుడు ఎవరి మనస్సులో ఉద్వేగము (కలత చెందుట) కలుగదో, సుఖాలు కలిగినప్పుడు ఎవరైతే పూర్తిగా నిస్పృహగా (అంటే, పట్టించుకోకుండా) ఉంటారో, అటువంటి ముని స్థిరబుద్ధి కలవాడు అని అనిపించుకుంటాడు. ఏ పురుషుడు అన్ని వస్తువుల యందు స్నేహం (ప్రేమ) విడిచి, ఆయా వస్తువులు పొందినప్పుడు అనందించకుండా ద్వేషించకుండా ఉంటాడో అతని బుద్ధి స్థిరమని తెలుసుకో. తాబేలు తన అంగములను అన్నివైపుల నుండి ముడుచుకునే విధంగా, ఎప్పుడైతే పురుషుడు ఇంద్రియాలని ఆకర్షించే విషయాల నుండి ఇంద్రియాలని దూరంగా ఉంచుతాడో, అప్పుడు అతని బుద్ధి స్థిరమైనదని తెలుసుకో. ఇంద్రియాల చేత విషయాలు గ్రహించని వాడి నుండి కేవలము విషయాలు మాత్రమే నివృత్తములవుతాయి (మరలించబడతాయి). ఆ విషయాల మీద ఆసక్తి మాత్రం పోదు. ఈ స్థితప్రజ్ఞుడైన పురుషునికి పరమాత్మ సాక్షాత్కారం తరువాత ఆ ఆసక్తి కూడా ఉండదు. ఆసక్తి నశించినప్పుడల్లా, మనస్సును మథించే ఇంద్రియాలు యత్నించి బుద్ధిమంతుడి మనస్సుని బలవంతంగా హరిస్తాయి. అందుచేత, సాధకుడు ఇంద్రియాలని అదుపులో ఉంచుకుని శాంతంగా నాయందే ఆసక్తి చూపిస్తూ, నిష్ఠతో ధ్యానంలో కూర్చోవాలి (బహుశా, meditation అంటే ఇదేనేమో). ఎందుకంటే, ఇంద్రియాలని వశపరచుకుంటే, బుద్ధి స్థిరంగా ఉంటుంది.
ఎప్పుడూ విషయ చింతన చేసే పురుషుడికి వాటి మీదే ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి కోరికలు పుట్టిస్తుంది. ఆ కోరికలకి ఆటంకం కలిగితే క్రోధము వస్తుంది. దాని చేత మూఢత్వము కలుగుతుంది. దాని చేత స్మరణశక్తిలో భ్రమ కలుగుతుంది. దాని వల్ల జ్ఞానశక్తి నశిస్తుంది. అలా జరిగే బుద్ధి నాశము వల్ల మనిషి తన ఉనికిని కోల్పోతాడు. అంతఃకరణము వశంలో ఉంటే, తన అధీనంలో ఉన్న రాగద్వేషాలు లేని ఇంద్రియాల ద్వారా విషయాలలో సంచరిస్తూ అంతఃకరణము యొక్క ప్రసన్నత్వాన్ని పొందగలుగుతాడు. మనస్సును ఇంద్రియాలని జయించని మనిషికి బుద్ధి నిలకడగా ఉండదు. అలాంటి పనికిరాని వాడికి అంతఃకరణములో ఒక భావన అంటూ ఉండదు. భావన లేని మనిషికి శాంతి ఉండదు. శాంతి లేని మనిషికి సుఖం ఎట్లా దొరుకుతుంది? నీటిలో పోయే నావని గాలి ఏ విధంగా లాక్కొని పోతుందో, అదే విధంగా ఇంద్రియాలలో సంచరించే మనసు ఏ ఇంద్రియంతో ఉంటుందో ఆ ఇంద్రియమే ఆ పనికిరాని మనిషి బుద్ధిని హరించి తనవేపుకి తీసుకొని పోతుంది. అందుచేత, ఏ పురుషుని ఇంద్రియాలు ఇంద్రియాకర్షక విషయాల చేత అన్ని విధాలుగా నిగ్రహింపబడి ఉంటాయో, అతని బుద్ధే స్థిరమైనది.”
“అర్జునా! సమస్త జీవులకి రాత్రియైన సమయంలో స్థితప్రజ్ఞుడైన యోగి మేలుకొని ఉంటాడు. నశించే స్వభావమున్న సాంసారిక సుఖాల కోసం జీవులు మేలుకొని ఉన్న సమయము పరమాత్మ తత్త్వం తెలుకున్న మునికి అది రాత్రితో సమానము. ఏ విధంగా అనేక నదుల నీరు, నిండైన కదలిక లేని సముద్రంలో దాన్ని కదపకుండా చేరి పోతుందో అదే విధంగా సుఖభోగాలు స్థితప్రజ్ఞునిలో ఏ రకమైన వికారము (మార్పు) కలిగించకుండా కలిసి పోతాయి. అలాంటి వాడే పరమశాంతిని పొంద గలడు. సుఖభోగాలు కోరే వాడికి శాంతి ఉండదు. ఏ పురుషుడు, అన్ని కోరికలు విడిచి మమత్వము (నాది అనే భావము) లేకుండా అహంకారము లేకుండా నైరాశ్యముతో ఉంటాడో అతడే శాంతిని పొంద గలడు. అలా బ్రహ్మప్రాప్తి పొందిన స్థితిలో యోగియైన వాడు ఎప్పుడూ మోహము చెందడు. తిరిగి అంతకాలంలో కూడా ఆస్థితిలో బ్రహ్మానందం పొందగలుగుతాడు. అంటే, అలాంటి స్థితి చాలా ఉత్కృష్టమైన స్థితి.”
విన్నారుగా కృష్ణుని వాదనలు. మీ కేమనిపిస్తోంది. అంతా, abstractగా ఉందా? ఆత్మ అనేది మనిషి వస్త్రాలని మార్చినట్లు శరీరాలను మారుస్తుంది. ఆత్మ శాశ్వతం. శరీరాలు మారుతూ ఉంటాయి. మారినప్పుడల్లా పునర్జన్మ అనుకుంటాము. ఈ యుద్ధంలో పాల్గొనే వాళ్ళందరూ అంతకు ముందు ఎన్నో జన్మలు ఎత్తి ఉన్నారు. ఇక ముందు కూడా ఎన్నో జన్మలు ఎత్తుతారు. ఒక మనిషి పోయినప్పుడు, అతని ఆత్మకి చావు లేదు కాబట్టి దాని కోసం శోకించక్కర్లేదు. అతని శరీరం పాత వస్త్రం లాంటిది కాబట్టి దాని కోసం కూడా ఏడవక్కర్లేదు. సూటిగా జవాబు ఇవ్వకపోయినా, కృష్ణుడు చెప్పిన ఈ మాటలతో అర్జునుడి ప్రధాన ప్రశ్నలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. ఆ మాటలలో అంతరార్థం బహుశా ఇలా ఉంటుందనుకుంటున్నాను:
“యుద్ధరంగంలో నీకు కనిపించేవన్నీ అశాశ్వతమైన శరీరాలే కానీ శాశ్వతమైన ఆత్మ కాదు. వాళ్ళని నువ్వు చంపాలనుకోవడం, వాళ్ళు నిన్ను చంపుతారనుకోవడం కేవలం భ్రమ. ఆత్మకి చావు లేదు కాబట్టి పిండాలు తర్పణాలు పెట్టక్కర్లేదు. శరీరం పాతవస్త్రం లాంటిది కాబట్టి, దాని కోసం పిండాలు తర్పణాలు పెట్టడం అర్థరహితం. వీటి కోసం శోకించడం ఇంకా అర్థరహితం. జయాపజయాలు, లాభనష్టాలు, సుఖదుఃఖాల లాంటివి సమానంగా భావించి, నీ కర్తవ్యమేమిటో అది నిర్వర్తించు.”
ఆత్మ శరీరాల సంబంధము గురించి, పుట్టుకల అంతరార్థము గురించి, ఏకత్వము ఉన్న ఆత్మకు అనేకత్వము ఆపాదించడం గురించి విన్నాము కదా. మనం ఇదంతా నమ్మినా నమ్మక పోయినా, సమత్వం గురించి ఇంత కన్నా గొప్పగా వేరే విధంగా చెప్పడం కుదరదని నా అభిప్రాయం. ఉదాహరణకి, ఇప్పుడు ఒక మతానికో ఒక కులానికో చెందిన మనిషికి, మరు జన్మలో తాను ఏ జీవిగా పుడతాడో ఆ జీవి మనిషా, జంతువా, ఒక వేళ మనిషైతే ఏ కులం, ఏ మతం – ఈ వివరాలు తెలియవు కాబట్టి, కులమతాల మీద వ్యామోహం, అహంకారం ఈ జన్మలో ఉంటుందా? సమస్త జీవులలో ఉన్న ఆత్మ ఒకటే అయినప్పుడు కొన్నిటిని, కొందరిని తక్కువగా చూడటం సబబేనా? కృష్ణుడు చెప్పిన భావన మనస్సులో నిండితే సమస్త జీవుల పట్ల, సమస్త సృష్టిపైన సమభావం ఉన్నట్లేగా. ఇది ఒప్పుకోక, మనకి వేరే దారి ఉందా? ఆలోచించండి.