భగవద్గీత – అర్జున విషాద యోగము

యుద్ధం చెయ్యాలనుకొని ఒక చోట చేరిన మా వాళ్ళున్నూ పాండవులున్నూ ఏం చేశారు అని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగిన ప్రశ్నతో భగవద్గీత లోని మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగము మొదలవుతుంది. ఆ తరువాత దుర్యోధనుడు ద్రోణాచార్యునికి కొన్ని జాగ్రత్తలు చెప్పటం, వీరులందరూ తమ తమ శంఖాలు ఊదడం, అప్పుడు అర్జునుడు కోరగా సారథియైన కృష్ణుడు రథాన్ని రెండు సేనల మధ్య నిలపడం, అర్జునుడు అందరినీ చూసి, స్వజనాన్ని చంపాలా ఇప్పుడు నేను, అని దుఃఖించడం, తన మనసులో కమ్మిన విషాదాన్ని కృష్ణునితో పంచుకోవడం ఈ అధ్యాయం లోని వృత్తాంతము. ఇది భగవద్గీతకి నాందీప్రస్తావన లాంటిది. ఇందులో పవిత్రంగా తోచడానికి గానీ, పారాయణ చేస్తే పుణ్యం వస్తుందని అనుకోవడానికి గానీ నాకు అర్థమైనంత వరకు ఏమీ లేదు. నిజానికి, ఆదిశంకరులు భగవద్గీతకు తాము వ్రాసిన భాష్యంలో అర్జునుని దుఃఖం గురించిన అధ్యాయమే కాబట్టిఅర్జున విషాద యోగంఅని పిలువబడే మొదటి అధ్యాయం మొత్తానికి వ్యాఖ్యానం వ్రాయలేదట. ఈ అర్జునుని విలాపం రెండవ అధ్యాయంలో 10 శ్లోకాల వరకు కొనసాగుతుంది కాబట్టి, వాటికి కూడా అందులో వ్యాఖ్యానం వ్రాయలేదట. సరే, వివరాలు కొంచెం చూద్దాం.

విషాదము అంటే ఉపాయము తోచక మనసులో కలిగే ఖేదము (Depression). కురుక్షేత్ర రణరంగంలో యుద్ధానికి సిద్ధంగా 11 అక్షోహిణీల కౌరవ సైన్యము, 7 అక్షోహిణీల పాండవ సైన్యం ఉన్న తరుణంలో విషాదం ఏమిటి? అంతకు కొంచెం ముందే (భీష్మ పర్వం 21వ అధ్యాయంలో), తన అన్నయైన యుధిష్టిరుడు అపారమైన కౌరవ సేననుఁ గాంచి విషాదం (Depression) చెందటం చూచి, అర్జునుడు “ధర్మము మన పక్షాన ఉంది, కృష్ణుడు ఎప్పుడూ ధర్మం ఉన్న వేపే ఉంటాడు, మన సేన చిన్నదైనా కూడా కృష్ణుడు ఎక్కడ ఉంటాడో విజయం కూడా అక్కడే ఉంటుంది” అని చెప్పి శాంత పరిచాడు. ఆ తరువాత, అర్జునుడు దుర్గాస్తుతి చెయ్యడం, మాత ప్రత్యక్షమై నీకు విజయం తథ్యమని వరమివ్వడం భీష్మ పర్వం 23వ అధ్యాయం ఆరంభంలో చెప్పబడింది. ఆ పరిస్థితుల్లో భగవద్గీత మొదటి అధ్యాయం లోని వృత్తాంతము మొదలవుతుంది. అంటే, దుర్గామాత ద్వారా విశ్వాసము పెంపొందించబడిన (confidence building) తరువాత కూడా అర్జునునికి విషాదం వచ్చింది. దీనికిఁ గల కారణాల గురించే ఈ అధ్యాయములో చెప్పబడింది.

సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పినట్లుగా ఉన్న భగవద్గీత ధృతరాష్ట్రుడు వేసే ప్రశ్నతో (ఒకే శ్లోకం) మొదలవుతుంది. ఈ ప్రశ్నకి సంబంధించిన శ్లోకం “ధర్మ” అన్న పదంతో మొదలవుతుంది. భగవద్గీత ఆఖరి శ్లోకం (18వ అధ్యాయంలోని 78వ శ్లోకం) “మమ” అన్న పదంతో అంతవుతుంది. అంటే, భగవద్గీత “మమ ధర్మ” అంటే “స్వధర్మము” గురించి చెప్పినది అని వాచ్యంగా చెప్పడం అని కొందరి అభిప్రాయం. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడగటంలో “మామకాః పాండవాశ్చైవ” అన్న పదాలు వాడాడు. “మామకాః” అంటే నావాళ్ళు అని అర్థం. అంటే, పాండవులను వేరు చేసి మాట్లాడాడు అని ధృతరాష్ట్రుణ్ణి కొందరు ఆడిపోసుకున్నారు. విషయం యుద్ధం దాకా వచ్చినప్పుడు ఇక వేరు చేసేదేముంది, కావలించుకునేది ఏది ఉంది. బుద్ధి తెలిసి పోయిందిగా.

ఇక, దుర్యోధనుడు అభద్రతా భావంతో (insecurity feeling) ఏమి చేశాడో సంజయుడు చెప్పాడు. సేనానాయకుడు భీష్ముడైనా కూడా దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళాడు. దానికి కారణాలు రెండు. ఒకటి, కర్ణుణ్ణి యుద్ధం చెయ్యడానికి భీష్ముడు అనుమతించలేదు (లేకపోతే కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఉండేవాడు). రెండవ కారణం, అంతకు ముందు (భీష్మ పర్వం 15వ అధ్యాయంలో) దుర్యోధనుడు దుశ్వాసనునికి చెప్పిన మాటలను బట్టి అర్థమవుతుంది. భీష్ముడికి శిఖండితో ప్రమాదం ఉంది, శిఖండిని అర్జునుడు రక్షిస్తున్నాడు, భీష్ముణ్ణి గనక మనం రక్షిస్తే ఆయన శత్రువులని ఊచకోత కోస్తాడు, అందుకని, “భీష్మో రక్షతి రక్షితః” అన్నట్లుగా దుర్యోధనుడు చెప్పాడు. ఆ ప్రయోజనం సిద్ధిం జేసుకోవడానికి దుర్యోధనుడు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళాల్సి వచ్చింది.

అతని చేతిలో నీకు మరణం ఉన్నదని తెలిసి కూడా ధృష్టద్యుమ్నుణ్ణి శిష్యుడుగా చేసుకుని నీ వృత్తి ధర్మం పాటించావు కదా! ఆచార్యా! ఆ నీ శిష్యుని చేత వ్యుహాకారంగా అమర్చబడిన విశాల పాండవ సేనని చూడు, భీష్ముని చేత రక్షించబడిన మన సేన చాలినంతగా లేదు, భీమునిచే రక్షింబడిన పాండవ సేన చాలినంత ఉంది, అందుకని, మీరందరు అన్నివిధాల భీష్ముణ్ణి రక్షంచాలి అని దుర్యోధనుడు ద్రోణుడికి చెప్పాడు.

అర్జునుడు రెండు సేనలకి మధ్యలో రథం నిలబెట్టించుకొని కౌరవ సేనలో తాను చంపవలసిన గురు, బాంధవ, మిత్రులను చూశాడు. వెంటనే, అతనికి వారిపై ఎక్కడలేని దయ ఒక్కసారి కలిగి దుఃఖము వచ్చింది. కృష్ణా! రణరంగంలో నిలిచిన ఈ స్వజనాన్ని (ధృతరాష్ట్రుడు తన పుత్రులను మాత్రమే ‘మామకాః’ అన్నాడు. ఇక్కడ అర్జునుడు, శత్రుపక్షంలో ఉన్న వాళ్ళందరినీ ‘స్వజనం’ అంటున్నాడు) చూస్తే నా అవయవాలు శిథిలము అవుతున్నాయి. నోరు ఎండిపోతోంది. శరీరం వణుకుతోంది. గాండీవం చేజారిపోతోంది. మనస్సు గిరగిరా తిరుగుతోంది. ఈ స్వజనాన్ని చంపితే నాకు వచ్చే లాభ మేమిటో అర్థం కావడం లేదు. నాకు యుద్ధంలో విజయం గాని రాజ్యం గాని సుఖాలు గాని అక్కరలేదు అని చెబుతూ అర్జునుడు దానికి ఐదు కారణాలు ఇలా చెబుతున్నాడు:

(1) ఎవరికోసం మనం రాజ్యము, సుఖభోగాలు కోరతామో వాళ్ళంతా వాటి మీద ఆశ వీడి యుద్ధరంగంలో నిలిచి ఉన్నారు.

(2) వాళ్ళు నన్ను చంపటం కోసం వచ్చారని తెలిసినా, ముల్లోకరాజ్యం ప్రాప్తిస్తుందన్నా కూడా వాళ్ళని చంపాలని నేను కోరుకోను. ఇక, ఈ భూలోక రాజ్యం గురించి వేరే చెప్పాలా.

(3) దుర్యోధనాదులను చంపితే నాకేమి సంతోషము కలుగుతుంది. పైపెచ్చు, ఆ ఆతతాయులను చంపితే పాపమే కలుగుతుంది. (ఆరు లక్షణాల్లో ఏ ఒక్క లక్షణమున్నా ఆతతాయి అంటారు. ఆ ఆరు ఏమిటంటే, నిప్పు అంటించడం, విషం పెట్టడం, చేతిలో శస్త్రం ఉన్నా చంపడానికి పూనుకొనక పోవడం, ధనాన్ని అపహరించడం, భూమిని అపహరించడం, భార్యని అపహరించడం. ఈ ఆరు పాపాలు కౌరవులు పాండవుల పట్ల చేసి ఉన్నారు.) మన కుటుంబం లోని వాళ్ళని చంపి మనం సుఖంగా ఎట్లా ఉంటాము?

(4) కులనాశనం వల్ల కలిగే దోషం, మిత్రులతో విరోధం చేస్తే వచ్చే పాపం గురించి దుర్యోధనాదులు లోభంతో పట్టించుకోకపోయినా, వాటి గురించి తెలిసిన మనం వాళ్ళ స్థాయికి ఎట్లా దిగజారుతాము?

(5) కులం నశిస్తే, సనాతనములైన కులధర్మాలు నశిస్తాయి. అవి పోతే, కులంలో అంతా పాపమే వ్యాపిస్తుంది. పాపం పెరిగితే, కులస్త్రీలు దూషింపబడి వర్ణసంకరం కలుగుతుంది. అలా వర్ణసంకరం జరిగితే, దానికి కారణమైన వాళ్ళు నరకానికి పోతారు. ఎవరైనా పోయినప్పుడు, పిండాలు ఇచ్చే వాళ్ళు, తర్పణాలు వదిలే వాళ్ళు కులంలో లేనందువల్ల పితృదేవతలు అథోలోకాలకు పోతారు. ఈ విధంగా కులధర్మాలు, జాతి ధర్మాలు నశిస్తాయి. (ఇక్కడ అర్జునుడు కులము, వంశపారంపర్యంగా దాన్ని తీసుకురావడంలో బాధ్యత, బ్రతికున్న వాళ్ళ సంగతి వదిలి పెట్టి, పోయిన తరువాత ఎవరికి ఏమవుతుంది అన్న విషయాల ప్రసక్తి తీసుకుని వచ్చాడు.)

పై కారణాల చేత, అర్జునుడు ధనుస్సు, బాణాలు విడిచిపెట్టి రథం వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు. ఇంతవరకు, భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడింది. అర్జునుడు భగవద్గీత మొత్తంలో పలికిన 86 శ్లోకాలలో అతని అనుభూతులకు సంబంధించినవి కొన్ని (59), అతడు లేవదీసిన ప్రశ్నలు / సందేహాలకి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. పైన చెప్పిన 5 ప్రశ్నలు కలుపుకుని మొత్తం 27 ప్రశ్నలు / సందేహాలు 27 శ్లోకాలలో అర్జునుడు పలికాడు. అర్జునుడు చెప్పిన కారణాలు ఎంత సబబో విశ్లేషించి, వాటికి కారణమైన అతని భయాందోళనలను, అతని మనసులో కొన్ని విషయాల మీద ఉన్న అపరిపక్వ జ్ఞానాన్ని సవరించి, అతనికి సరియైన ఆలోచనా దృక్పథాన్ని బోధించడం కృష్ణుడు తరువాతి అధ్యాయాల్లో చేసిన పని.

Leave a comment