అట్నుంచి నరుక్కొద్దామా!

మొగుడు పెళ్ళాలకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది అని చెప్పుకునే కథ ఒకటి, మనకి పురాణాలలో “చండిక ఉద్దాలకుల కథ” అని ఉంది. ఉద్దాలకుడు అనే మునికి అతడు ఏమి చెప్పినా దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉండే చండిక అనే భార్య ఉండేదట. ఉద్దాలకుడు విసిగిపోయి తన గురువుగారికి తన గోడు విన్నవించుకుని ఈ బాధ లేకుండా ఉండడానికి ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పమని ఆయన్ని సలహా అడిగాడట. గురువుగారు అంతా విని, “ఏముందయ్యా. చాలా సులభంగా నీ బాధ తప్పించవచ్చు. ఒక పని చెయ్యి. నువ్వు ఏం చెయ్యదలుచుకుంటావో, దానికి వ్యతిరేకమైనది ఆవిడకి చెబుతూ ఉండు. ఆవిడ నువ్వు చెప్పిన దానికి వ్యతిరేకమైనది చేస్తుంది. అప్పుడు, నీకు కావలసినది అవుతుంది కదా. అలా చెయ్యి.” అని సలగా ఇచ్చారు. ఇదేదో బాగుందని ఉద్దాలకుడు ఆ విధంగా భార్యతో మెలుగుతూ ఉండడం వల్ల, అది వరకటి గొడవలు లేకుండా కాలం సాఫీగా సాగిందట.

అలా కొంత కాలం అయిన తరువాత, ఉద్దాలకుడికి తన తండ్రి ఆబ్దికం పెట్టాల్సిన రోజు వస్తుంది. అప్పటికే బాగా అలవాటవ్వడం వల్ల, భార్యతో “నేను రేపు మా తండ్రిగారి ఆబ్దికం చేయబోవడం లేదు” అని అన్నాడట. అనుకున్న విధంగా ఆవిడ, “అట్లా ఎట్లా కుదురుతుంది. అబ్దికం పెట్టాల్సిందే” అని పట్టుపట్టిందట. అడుగడుగునా ఉద్దాలకుడు అడ్డంగా మాట్లాడటం, చండిక దానికి వ్యతిరేకంగా (అతనికి కావలసిన విధంగా) మార్చి పట్టుబట్టి చేయించడం జరిగిందట. ఉదాహరణకి, ఉద్దాలకుడు సరుకులు తీసుకురాను అంటే తేవాల్సిందేనని చండిక, బ్రాహ్మలని భోక్తలని పిలవను అని ఉద్దాలకుడు అంటే పిలవాల్సిందే అని చండిక, ఈ విధంగా దాదాపుగా చివరి వరకు అంతా ఉద్దాలకుడు కోరుకున్నట్లుగా సవ్యంగానే జరిగిందట. క్రితం ఏడాది అదే రోజు తండ్రి ఆబ్దికంలో జరిగిన రభస గుర్తుకొచ్చి, ఉద్దాలకుడు గురువుగారు చెప్పిన ఉపాయం బాగా పనిచేస్తున్నందుకు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడట. ఆ ఆనందం మత్తులో, ఉద్దాలకుడు భార్యతో పిండాలను నదిలో కలపాలని అన్నాడట. అంతే, ఇక. మొత్తం చేసిందంతా పోయింది. చండిక తన మామూలు ధోరణిలో, “పిండాలను నదిలో ఎలా కలుపుతారు?” అంటూ పెంట కుప్ప మీద పారవేసిందట.

ఆ మధ్య, జంధ్యాల గారు తీసిన “మొగుడు పెళ్ళాలు” అన్న సినిమాలో సుత్తి వీరభద్రారావు పాత్రకి  (హనుమంతరావు) అతని భార్య పాత్రకి (పంకజాక్షి) మధ్య పెట్టిన సంభాషణలు హాస్యాన్నే కాకుండా ఇలాంటి నిరసన ధోరణిని కూడా చూపిస్తాయి. ఉదాహరణకి, హనుమంతరావు పెళ్ళాన్ని దెప్పుతూ అనే మాటలు ఎలా ఉంటాయో చూడండి: “పెళ్ళిచూపు లప్పుడు మంచి నీళ్ళలో మందు కలిపి ఇచ్చారు. అప్పలమ్మను చూసి అప్సరస అనుకుని మోసపోయాను. ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాను. … మల్లె పూల కోసం వేప చెట్టెక్కే ముఖం అదీను. … మొజైక్ నేల మీద ఆవాలు పోసి కొత్తిమీర మొలవలేదని ఏడిచే మొహం అదీను. …”. ఈ సంభాషణలు కూడా చండిక ఉద్దాలకుల సంభాషణల మాదిరే. కాకపోతే, వీరభద్రరావు మగ చండిక అన్న మాట. భార్య ఏం చెబితే దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇది గమనించిన వాళ్ళ అబ్బాయి, తనకి కావలసిన దానికి వాళ్ళ అమ్మ ముందుగా కాదనేటట్లుగా పాచిక వేసి, అది విన్న తన తండ్రి తనకి కావలసిన విధంగా చేయడం వల్ల లాభపడుతూ ఉంటాడు.

ఇట్లా ఎడ్డెం అంటే తెడ్డెం అనే అలవాటును ఇంతకన్నా ఘోరంగా మనకి అలవాటు చేసిన వాళ్ళు వేరే ఎవరూ కనపడరు. ఈ అలవాటు ఎంతగా మన సమాజంలో ప్రబలి పోయిందంటే, మన రాజకీయ పార్టీలు ఏవీ జనాల్లో గనక ఈ అలవాటు లేకపోతే బ్రతికి బట్టకట్టవేమో అన్నంత. ఎందుచేత అంటే, అవతలి వాడు చెప్పేదానిలో నిజమున్నా, సరియైన అర్థమున్నా మాకు అనవసరం, మేము అనుకునేదే లేదా మా నాయకుడు అనుకునేదే లేదా మా పార్టీ అనుకునేదే సరియైనది అనే ఆత్మస్థైర్యం గుడ్డిగా బలంగా ఉన్న అనుచరులు (లేదా ప్రలోభాలకి దొరికే జనాలు) ఉంటేనే కదా రాజకీయ పార్టీల మనుగడ.

గుడ్డిగా అవతలి వాళ్ళు చెప్పేది కాదనడం ఎంత తప్పో, ఔననడం కూడా అంతే తప్పు. అసలు విషయం ఏమిటో అర్థం కాకపోయినా కూడా, తెలియకపోయినా కూడా, ఒక వాదాన్నో ఒక పార్టీనో సమర్థించడానికి జనాలు పోగవ్వడం మనం ఎలక్షన్లలోను, ఇతర రాజకీయ సభలలోను చూసే ఉంటాము. అట్లా జనాలను పోగెయ్యడానికి తగిన ఏర్పాట్లు వేరే ఉన్నాయనుకోండి. అయితే, ఇలాంటిదే ఒక సందర్భము నేను పార్లమెంటు విషయంలో విన్నాను. అది ఎంత వరకు నిజమో తెలియదు. ఏమిటంటే, పార్లమెంటులో అధికారిక కార్యకలాపాలను చట్టబద్ధంగా నిర్వహించడానికి తగినంత మంది సభ్యులు హాజరు కానప్పుడు, గైర్హాజరైన సభ్యులను తిరిగి సభకు పిలవడానికి మోగించే ఒక ప్రత్యేక అలారం లేదా గంటనే కోరం బెల్ అంటారు. నేను విన్నది ఏమిటంటే, కోరం బెల్ కొట్టగానే సభ్యులు బిలబిలా సభలోకి వచ్చేటట్లుగా మనుషులతో కబురు పంపి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తగిన ఏర్పాట్లు చేస్తారట. సభ్యులు సభ లోకి వస్తూ “అధ్యక్షజీ! హం సహమత్ హై (అంటే, అధ్యక్షా! మాకు అంగీకారమే అని)” అని అంటూ ప్రవేశించాలట, లోపల దేని గురించి చర్చ / ఓటింగు జరుగుతోందో వాళ్ళకి తెలియక పోయినా సరే. అందుకనే, ఎప్పుడూ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే మోషన్స్ (motions) తమకి అనుకూలంగా ఉండేవే ఉంటాయట. నెగిటివ్ మోషన్స్ (negative motions) ప్రభుత్వం ఎప్పుడూ ప్రవేశ పెట్టదట. నెగిటివ్ మోషన్ గనక ప్రవేశపెడితే, దాని మీద సభ్యులు “అధ్యక్షజీ! హం సహమత్ హై” అంటే, కొంప లంటుకుంటాయి కనుక.

అవతలి వాడు మనవాడైతే (కులం, మతం, ప్రాంతం ఆధారంగానో మరే ఇతర కారణం వల్లో), వాడు చెప్పేది ఎంత పనికిరాని, అర్థంలేని మాటైనా, నీ అభిప్రాయమే నా అభిప్రాయం అనే వెర్రిమొర్రి మమత్వము ఉండాలి. కొంత మంది డబ్బు కోసమో, ఒక బిర్యానీ పాకెట్టు, ఒక సారా పాకెట్టు లేదా ఇంకేదైనా – వాటి కోసం చేస్తున్నారా, లేదా సహజంగా ఉండే వేలం వెర్రి చేత చేస్తున్నారా అన్నది అంత ముఖ్యం కాదు. ఎందుకంటే, ఇంచుమించుగా రోజూ ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాము. గుంపుల్లో ఉన్నప్పుడు మాత్రమే మనుషుల్లో ఇలాంటి ప్రవర్తన (mob behaviour) కనిపిస్తుందని అనుకుంటాము. కొంత మంది ఇలాంటి వారు విడిగా కూడా మనకి జీవితంలో తారసపడతారు. వాళ్ళకి తమకి ఇష్టమైన వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో ప్రవర్తించిన తీరు చాలా నచ్చినా కూడా అదే పరిస్థితుల్లో వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు అదే విధంగా ప్రవర్తిస్తే మాత్రం నచ్చదు. అలా ఎందుకు ఉంటారు అంటే ఏం చెబుతాం. చండిక అలా ఉండటానికి ఏమన్నా కారణం ఉందా? ఒక తప్పు మన వాడు అన్న వాడు చేస్తే ఒక రకంగాను, అదే తప్పు వేరే వాడు చేస్తే ఇంకో రకంగాను స్పందించే వాళ్ళను మన బంధువర్గంలోనే మనం చూస్తూ ఉంటాము.

అది వరకు, నేను ఢిల్లీలో పని చేసే రోజుల్లో, పై స్థాయి ఉద్యోగులలో “కాన్ కె కచ్చే” అంటే “చెప్పుడు మాటలు వినేవారు” అనే ఒక వర్గం ఉండేవారు. వాళ్ళు ఎవరేమి చెప్పినా తేలికగా నమ్మేవారు. ఆ వర్గం లోని ఒకాయన గురించి వింతగా చెప్పుకునే వాళ్ళు, అందరూ. అయనకా, “జల్దీ కోయీ బాత్ భేజే మే ఘుస్తా నహీ, జబ్ ఘుస్తా హై నికల్తా భీ నహీ” అని. అంటే, “ఒక పట్టాన ఆయనికి ఏదీ అర్థమయి చావదు, అర్థమయితే మాత్రం అది తప్పైనా కాకపోయినా దాన్ని పట్టుకునే ఉంటాడు” అని. మాకు చిన్నప్పుడు ఒక సహాధ్యాయి ఉండేవాడు, మా గురువుగారి దగ్గర. వాడి మనసుకి ఎలా పట్టేసిందో, తీపిని కారంగాను కారాన్ని తీపిగాను అర్థం చేసుకున్నాడు. చాలా రకాలుగా మా గురువు గారు వాడికి అర్థం అయ్యేటట్లు చెయ్యడానికి ప్రయత్నించారు. లాభం లేకపోయింది. ఇక ఆయనకి విసుగు వచ్చేసి, వీడికి బలవంతంగా మెరపకాయ తినిపించండిరా, అని మాకు చెప్పారు. సరే, మాకు తప్పలేదు. అలాగే చేశాం. వాడు మెరపకాయ నమిలి, “అబ్ ……బా ….! గురూ …. గారూ ….! ఎంథ …. తియ్య్య్య్య్య్య్య …గా ఉందో …” అన్నాడు. ఇక నా వల్ల కాదు అని మా గురువు గారు చేతులెత్తేశారు.

అవతలి వాళ్ళ విపరీత ప్రవర్తన చూసి ఉద్దాలకుడి గురువుగారి లాగా ఉపాయాలు అవకాశాలు కల్పించడాన్నే “అట్నుంచి నరుక్కు రావడం” అంటారు. అంటే, ముక్కు సూటిగా పోకుండా, అవతలి వాళ్ళని మన దారిలోకి తెచ్చుకునే మార్గం వెతకడం అన్న మాట. ఈ మాట, బహుశా మొదటి సారిగా గురజాడ అప్పారావు గారు “కన్యాశుల్కం” అన్న నాటకంలో ప్రయోగించారనుకుంటాను. ఆ నాటకం లోని ప్రథమాంకములో గిరీశం స్వగతంలో ఈ వాక్యాన్ని మనం చూస్తాము. ఆ స్వగతం లోని సంబంధిత భాగం (relevant portion) క్రింద ఇవ్వబడింది:

“గిరీశం: …. యీ వూళ్లో మరి మన పప్పు వుడకదు. ఎటు చూసినా అందరికీ బాకీలే. వెంకుపంతులు గారి కోడలికి లవ్‌ లెటర్‌ రాసినందుకు యెప్పుడో ఒహప్పుడు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేస్తారు. ….. శీఘ్రంగా యిక్కణ్ణించి బిచాణా యెత్తి వెయ్యడమే బుద్ధికి లక్షణం; గాని మధురవాణిని వదలడవఁంటే యేమీ మనస్కరించకుండా వున్నది. …. నేను యెమో ఉద్యోగాలూ ఊళ్లూ యేలి తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకంతోవుంది, పూర్‌క్రీచర్‌! ఎవరావస్తున్నది? నా ప్రియశిష్యుడు వెంకటేశ్వర్లులా వున్నాడు. యీవాళ కిస్‌మిస్‌ శలవులు యిచ్చివుంటారు. వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫెయిలైనట్టు కనపడుతుంది. వీణ్ణి కొంచం వోదార్చి వీడికి శలవుల్లో చదువు చెప్పే మిష మీద వీడితో వీడి వూరికి వుడాయిస్తే చాలా చిక్కులు వొదుల్తాయి; అట్నుంచి నరుక్కురమ్మన్నాడు.”

గిరీశం పాత్ర లోని ఈ ధోరణి “కన్యాశుల్కం” నాటకం లోని తరువాతి భాగాలలో కూడా అక్కడక్కడా కనబడుతుంది. ఉదాహరణకి, నాటకం లోని రెండు ఘట్టాలలో గిరీశం తన శిష్యుడైన వెంకటేశంతో అన్న మాటలు ఏమిటో క్రింద చూడండి:

“గిరీశం (వెంకటేశంతో): మైడియర్‌ షేక్స్పియర్‌! నీ తండ్రి అగ్గిరావుఁడోయి. మీ యింట్లో యవళ్లకీ అతణ్ణి లొంగదీశే యలోక్వెన్సు (eloquence) లేదు. నా దెబ్బ చూడు, యివాళేం జేస్తానో. వీరేశలింగం పంతులుగారు కన్యాశుల్కం విషయవైఁరాసిన ఉపన్యాసం పైకి తీయ్‌. మావఁగారికి లెక్చరివ్వడాని క్కత్తీ కఠారీ నూరాలి.”

“గిరీశం: ఒక పొలిటికల్‌ (political) మహాస్త్రం ప్రయోగించి కలిపేశాను.

వెంకటేశం: ఏమిటండా అస్త్రం?

గిరీశం: ఒకడు చెప్పిందల్లా మహాబాగుందనడమే. సమ్మోహనాస్త్రం అంటే అదే కదా?

వెంకటేశం: లెక్చరిచ్చి మా తండ్రిని వొప్పించడానికి బదులుగా ఆయన చెప్పిందానికి మీరే వొప్పుకున్నారూ?

గిరీశం: కుంచం నిలువుగా కొలవడానికి వీల్లేనప్పుడు, తిరిగేశైనా కొలిస్తే నాలుగ్గింజలు నిలుస్తాయి. బాగా ఆలోచిస్తే ఇన్ఫెంటు మారియేజి (infant marriage) కూడుననే తోస్తూంది.”

అవతలి వాళ్ళు వ్యవహరించే తీరు ఖచ్చితంగా తెలిస్తే, దాన్ని మనకి అనుకూలంగా మలచుకోవచ్చు అని చండిక ఉద్దాలకుల కథ, పైన చెప్పిన జంధ్యాల గారి సినిమాలోని కథ, కన్యాశుల్కం నాటకం, ఇంకా మన జీవితానుభవాలు నిరూపించాయి. వాటిలోని వింత ప్రవర్తన (వింత అని ఏదో కొత్తగా చూస్తున్నట్లు గొప్పకి చెప్పడమే గాని, అది మనం రోజూ చూసేదే) లాంటిదే, వెధవలకి (దుష్టులకి) వత్తాసు పలకడం కూడా. అది పెద్ద బలహీనతేమో. వాడు మనవాడు అయితే చాలు అని అనిపిస్తుందేమో. ఇది చాలా మందిలో పెద్ద జాడ్యం. యుక్తులు పన్నడంలో దిట్ట, మంచి మానేజరు ఐన శ్రీకృష్ణుడు అవతలి వాడిలో ఉన్న ఈ జాడ్యాన్ని (బలహీనతను) తన బలంగా, ప్రజాసంక్షేమానికి కుటుంబ శ్రేయస్సుకు ఉపయోగించుకోవడం మనం భాగవత కథల్లో విన్నాం. జరాసంధుడు అనే వాడు తన మద్దతుదారులతో పెద్ద సైన్యాన్ని తీసుకొచ్చి మాటి మాటికి మధురపై దండయాత్ర చేస్తూ ఉంటాడు. ప్రతిసారి వాణ్ణి చిత్తుగా ఓడించి వాడి సైన్యాన్ని అందరినీ తుదముట్టించి, వాణ్ణి ఒక్కణ్ణి మాత్రం బలరామకృష్ణులు వదిలిపెడుతూ ఉంటారు. దానికి కారణం, కృష్ణుడు బలరాముడితో చెప్పిందేమిటంటే, ” వినాశాయచ దుష్కృతాం (“పాపాత్ములను / దుర్మార్గులను సంహరించడం కొరకు” అని అర్థం)” కదా మన ప్రణాళిక, మనం అన్ని చోట్ల తిరిగి వెతికి వెతికి దుష్టులను పట్టుకుని శిక్షించడం అయ్యే పని కాదు, వీడిని ఒక్కణ్ణి వదిలితే అలాంటి వాళ్ళందర్నీ కూడేసుకుని మళ్ళీ మనమీదకి యుద్ధానికి వస్తాడు. అప్పుడు, మళ్ళీ సైన్యాన్ని చంపి వీణ్ణి ఒక్కణ్ణి వదులుతూ ఉందాం. ఆ విధంగా మనం మన లక్ష్యాన్ని తొందరగా చేరుకోవచ్చు”.

అకారణంగా ఒక అన్యాయాన్ని గాని, ఒక సిద్ధాంతాన్ని గాని, ఒక నాయకుణ్ణి గాని, ఒక మనిషిని గాని సమర్థించే వాళ్ళు నా ఉద్దేశ్యంలో అసలు వాళ్ళకన్నా దుర్మార్గులు. అటువంటి వాళ్ళు తారస పడితే, వాళ్ళతో పోట్లాడి లాభం లేదు. కృష్ణుడి లాగా ఏదో తగిన ఉపాయం వెతికి, అంటే, అట్నుంచి నరుక్కొచ్చి, సంఘానికి కుటుంబానికి నష్టం జరగకుండా చూడాలి.

3 thoughts on “అట్నుంచి నరుక్కొద్దామా!”

  1. చండిక కధ, జంధ్యా ల గారి సినిమా సన్నివేశాలు, కన్యాశుల్కం, మరియు అనుభవాలు విపులంగా వివరించారు. స్వా ర్థం తో అన్యాయంను సమర్థించుట సమాజం చెడిపోవుటకు కారణం. తల్లి, తండ్రి, గురువు లు నైతిక విలువలును పూర్తిగా నేర్ప వలసిన అవసరం ఉంది. అప్పుడే సమాజంలో చాలా వరకు చెడు తగ్గుతుంది . మీరు చాలా విషయా లను బాగా వివరించారు. అభినందనలు మరియు ధన్యవాదాలు.

    Like

  2. ఈ దురలవాటు చాలా ముందు నుండే వేరే వేరే రూపాల్లో ఉన్నట్లుంది.ఈ దరిద్రపు ప్రాపకం ఉన్నవాళ్లు వర్తమానములో ఇంకా ఎక్కువైనారు.కేవలము తమ స్వల్పకాలిక లాభం కొరకు విజ్ఞత మరిచి భజన చేయడము తన వ్యక్తిత్వాన్ని ,గుర్తింపును వదిలేయడమే. చండాలిక ,ఉద్దాలిక ల మరియు ప్రఖ్యాత ‘ కన్యాశుల్కము’ తో అన్వయించి చక్కగా సమాజములో జరుగుతున్న దాన్నివివరించారు. ఇటువంటి వ్యాసాలు ప్రస్తుత యువతకు దిక్సూచి.

    Like

Leave a Reply