భగవద్గీత లోని ఆరవ అధ్యాయము ఆత్మసంయమ యోగము. దీనినే ధ్యాన (meditation) యోగమని కూడా అంటారు. ఇందులో మొత్తం 47 శ్లోకాలు (5 శ్లోకాలు అర్జునుడు అడిగిన ప్రశ్నలకు సంబంధించినవి, 42 శ్లోకాలు కృష్ణుడు చెప్పిన సమాధానాలకు సంబంధించినవి) ఉన్నాయి. ఆత్మ సంయమము అంటే తనను తాను నిగ్రహించుకొనుట లేక నియంత్రించుకొనుట (self-control or self-restraint). ఐదవ అధ్యాయంలో కర్మసన్న్యాస కర్మ యోగముల ఫలములు ఒకటే అయినా సులభం కాబట్టి కర్మయోగం శ్రేష్ఠమని చెప్పి, ఆ రెండు సాధనముల గురించి వివరించి, ఆ రెంటికీ ఉపయోగపడేది పరమాత్మ ప్రాప్తికి దారి చూపేది అయిన ధ్యానయోగాన్ని కొంతవరకు వర్ణించాడు కృష్ణుడు. ఈ అధ్యాయంలో కర్మయోగాన్ని మెచ్చుకుంటూ, ధ్యానయోగం వివరాలు ఇంకా చెప్పదలుచుకున్నాడు. ఆ ఉద్దేశ్యంతో కృష్ణుడు చెప్పడం కొనసాగించాడు.
అర్జునా! ఎవరైతే కర్మఫలాల మీద ఆధారపడకుండా (సామాన్య మానవుడు ఏ కర్మ చేసినా ఏదో ఒక ఫలం ఆశించే చేయడం వలన జనన మరణ చక్రంలో పడతాడు. అలా కాకుండా, అన్ని కర్మల లోను మమకారం, ఆసక్తి, ఫలేచ్ఛ వదిలిపెట్టడాన్నే ‘కర్మఫలాల మీద ఆధారపడక పోవడం’ అంటారు.) చెయ్యవలసిన కర్మలు చేస్తాడో (వర్ణాన్ని బట్టి చేయవలసిన విధులను, శాస్త్ర విహితమైన యజ్ఞాలు దానాలు లాంటి వాటిని, దేహ నిర్వహణకు ప్రజాసేవకు చేయవలసిన కర్మలను, కర్తవ్యాలుగా భావించి చేయడాన్నే ‘చెయ్యవలసిన కర్మలు చెయ్యడం’ అంటారు.), అతడిని సన్న్యాసి లేక యోగి (అన్ని సంకల్పాలను విడిచిపెట్టి, సాంఖ్య కర్మ యోగాలకు అంతిమ ఫలమైన నిజమైన జ్ఞానం పొందిన పురుషుడు, సన్న్యాసిత్వము యోగిత్వము అనే రెండు లక్షణాలు కలిగిన వాడుగా చెప్పుకోబడతాడు.) అంటారు. కేవలం అగ్నిని మాత్రమే వదిలిపెట్టేవాడు సన్న్యాసి (సనాతన ధర్మం ప్రకారం, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు నిత్యం చేసే యజ్ఞ యాగాదులకు, హోమాలకు, వంట వండడానికి ఉపయోగించే అగ్నిని, సన్న్యాసం పుచ్చుకునేటప్పుడు పూర్తిగా వదిలివేయాలి. సన్న్యాసి స్వయంగా వంట వండుకోకూడదు. భగవంతుడికి నివేదించిన భిక్ష మాత్రమే స్వీకరించాలి. సమస్త కర్మల కర్తృత్వము, మమకారము, ఆసక్తి, దేహాభిమానం వదిలిపెట్టకుండా, కేవలం అగ్నిని మాత్రమే వదిలిపెడితే సన్న్యాసి కాడు.) కాడు. కేవలం కర్మలను మాత్రమే విడిచిపెట్టేవాడు యోగి (కర్మలను వదిలిపెట్టి ధ్యానంలో కూర్చున్న మనుష్యునికి అంతఃకరణంలో అహంకారం, మమకారం, రాగద్వేషాలు, కోరికలు లాంటి దోషాలు గూడుకట్టుకుని ఉంటే అతడు నిజానికి యోగి కాడు.) కాడు. సంకల్పాలను వదలకుండా యోగి అయ్యే అవకాశం లేదు కనుక ఫలప్రాప్తి ఎలాగూ ఒకటే కనుక, సన్న్యాసం అన్నా యోగం అన్నా ఒకటే. యోగసాధనలో గమ్యం చేరాలనుకుని ధ్యానశీలుడైన మనుష్యుని యోగప్రాప్తికి నిష్కామకర్మే కారణం అంటారు. అలాంటి వాడికి సర్వసంకల్ప రాహిత్యమే (మనస్సు వశంలో ఉంచుకుని శాంతంగా ఉంటే సంకల్పం లేకుండా పోతుంది.) మంచి జరగడానికి కారణం అంటారు.
ఎప్పుడైతే ఇంద్రియభోగాలలోను కర్మలలోను ఆసక్తి లేకుండా ఉంటుందో అప్పుడు అన్ని సంకల్పాలను (మమకారం, ఆసక్తి, ద్వేషములకు సంబందించిన ప్రాపంచిక విషయాల గురించి ఆలోచించడాన్ని సంకల్పం అంటారు.) కూడా వదిలితే ఆ మనుష్యుణ్ణి యోగసాధనలో గమ్యం చేరాడంటారు. ప్రతి మనిషి తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు. అందుకని, తానే తనను భవసాగరం నుండి ఉద్ధరించుకోవాలి (మానవ జన్మ దుర్లభం కాబట్టి యోగాలలో ఏదో ఒక దానిని సాధించడమే తనను తాను ఉద్ధరించుకోవడం అంటే.). అంతే గానీ తనను తాను అధోగతిలో పడవేసుకోకూడదు. దుష్కర్మలు చేయడం వల్ల భగవత్ప్రాప్తి దక్కక పోగా పునర్జన్మలో ఏ జంతువో అవడాన్నే అధోగతి పాలవడం అంటారు. మనిషి ఉన్నతి, పతనం అన్నవి అతని చేతిలోనే ఉన్నాయి. కర్మలలోను స్వభావంలోను సంస్కారంతో వ్యవహరిస్తే, ఉన్నతి కలుగుతుంది. లేకపోతే అధోగతి దక్కుతుంది. శరీరము, ఇంద్రియాలు, మనస్సు సాధనాలుగా పరమాత్మ ప్రాప్తికి పూనుకొని వాటిని దోవ తప్పకుండా తన వశంలో ఉంచుకున్న జీవాత్మునికి ఆత్మయే మిత్రము. అలా వశంలో ఉంచుకోకపోతే, అతనికి ఆ ఆత్మయే శత్రువౌతుంది.
శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, మానావమానాలు లాంటి ద్వంద్వాలలో అంతఃకరణ వృత్తులు పూర్తిగా శాంతించి ఉండి ఆత్మ తన అధీనంలో ఉన్న మనుష్యుని జ్ఞానంలో పరమాత్మ స్థిరంగా నిలిచి ఉండడం వల్ల వేరేది ఏదీ ఉండదు. భగవంతుని ప్రాప్తించుకున్న యుక్తుడు లేక యోగి యొక్క అంతఃకరణము జ్ఞానవిజ్ఞానాలతో నిండి ఉంటుంది. అతడు కూటస్థుడు. అనగా వికార రహితుడు. కంసాలులు ఉపయోగించే లోహపు దిమ్మెకు (డాకలి లేక దాకలి) కూటము అని పేరు. దాని మీద చేయబడే నగలతో దానికి సంబంధము లేనట్లుగానే, ప్రపంచం జనించడానికి బ్రహ్మ కారణమైనా ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటాడు కనుక అతడిని కూటస్థుడంటారు. అతడికి మట్టిబెడ్డ, రాయి, బంగారము సమానమే. సుహృత్తుల (ఏ రకమైన పరిచయం లేకున్నా కారణం లేకున్నా స్వభావ రీత్యా ప్రేమ కురిపిస్తూ ఇతరులకు హితం చేసేవారు) యందును, మిత్రుల (పరస్పరం ప్రేమను చూపుతూ పరస్పరం హితం చేసుకునే వారు) యందును, ద్వేష్యుల (స్వభావ రీత్యా ఏ కారణం లేకుండా ఇతరులకు కీడు చేయు వారు) యందును, శత్రువుల యందును, మధ్యస్థుల (పరస్పరము కలహించు వారిని వారి హితము కోరి పక్షపాతము లేకుండా కలుప యత్నించు వారు) యందును, ఉదాసీనుల (పరస్పరము కలహించు వారితో సంబంధము లేకుండా ఊరకుండేవారు) యందును, బంధువుల యందును, ధర్మాత్ముల యందును, పాపుల యందును సమాన భావము కలవాడు మిక్కిలి శ్రేష్ఠుడనబడును. అంటే, వారి ప్రభావం తమ మీద పడకుండా ఉండి, ఏ కారణం చేతనైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా బుద్ధి యందు రాగ ద్వేషాలకు సంబంధించిన భేదభావము కలుగదో, అట్టి వానిని సమబుద్ధి కలవాడందురు.
శరీరం, మనస్సు, ఇంద్రియాలను వశంలో ఉంచుకొని ఆశ లేనివాడై జీవనానికి కావలసిన వస్తుసామగ్రిని కూర్చుకొనని వాడైన యోగి తానొక్కడు ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఆత్మను పరమాత్మలో నిరతము నిమగ్నము చెయ్యాలి. పరిశుద్ధమైన భూమి పైన (ధ్యానయోగ సాధనమునకు అనుకూలమైన) క్రమంగా దర్భలు, దాని పైన జింక చర్మము, దాని పైన వస్త్రము పరచబడి యుండి మరీ ఎత్తుగా కాకుండా మరీ పొట్టిగా కాకుండా స్థిరంగా కదలకుండా ఉండే ఆసనం ఏర్పరచుకొని, దాని మీద కూర్చుని ఇంద్రియాలను, మనస్సును, కర్మలను వశంలో ఉంచుకుంటూ ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ పరిశుద్ధి కోసం యోగాన్ని అభ్యసించాలి. శరీరము, తల, మెడ నిటారుగా ఉంచి, అంటే వెన్నెముకను మెడను వంచకుండా, తల అటూ ఇటూ తిప్పకుండా, స్థిరంగా కూర్చుని దిక్కులు చూడకుండా, చూపును ముక్కు చివర నిలిపి ఉంచాలి. అలా చేస్తే, బాహ్యములైన దృష్టి విక్షేపాల (external disturbances) వల్ల గానీ, సుఖదుఃఖాది ద్వంద్వాల వల్ల గానీ ధ్యానానికి ఆటంకములు కలిగే అవకాశం తక్కువని పెద్దలు అంటారు. బ్రహ్మచర్య వ్రతంలో ఉండి, నిర్భయంగానూ (నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా ఉంటే భయం వెయ్యటం సహజము. సాయుధుడైన వ్యక్తి [gunman] సంరక్షణలో ఉన్న ప్రముఖుడి [celebrity] లాగా పరమాత్మ రక్షణలో ఉన్నానని భావిస్తే భయం వెయ్యదు. ధ్యానం చేస్తూ మరణించిన వారి గురించి కూడా విని యున్నాము. అది భయంతో అయి ఉండదు కానీ ప్రారబ్ధవశాన అలా జరిగి ఉండవచ్చు.) ఉండి, ప్రశాంత మనస్కుడై (ప్రాపంచిక విషయాల మీదకు ధ్యాసను పోనీయకుండా) ఉండి, సావధానంగానూ (అంటే నిద్ర, సోమరితనం, ఏమరుపాటు లాంటి విఘ్నాలు కలుగకుండా జాగ్రత్తగా ఉండటం) ఉండి, యోగి మనస్సును నిగ్రహించుకొని నా యందు చిత్తాన్ని నిలిపి నా యందే ఆసక్తి కలవాడై స్థిరంగా ఉండాలి.
మనస్సును వశంలో ఉంచుకున్న (“అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్యా, నిన్నే గాని మదిని ఎన్నజాల నొరుల …” అని త్యాగరాజ కీర్తనలో చెప్పినట్లు మనస్సులో అన్నిటికీ భగవంతుని పరమాశ్రయునిగా భావించడం) యోగి ఈ విధంగా ఆత్మను పరమేశ్వరుడనైన నా స్వరూపంలో లగ్నము చేసి (భగవంతుని యందు అచంచలమైన భావంతో తన్మయుడై ఉండటం) నాలో మాత్రమే ఉన్న పరమానందం యొక్క అంతిమదశ (పరాకాష్ట) రూపమైన శాంతిని పొందగలడు. ఈ ధ్యానయోగము ఎక్కువగా ఆహారం తీసుకునే వారికి, ఏ మాత్రం భుజింపని వారికి (అంటే, కటిక ఉపవాసం ఉండే వారికి), ఎక్కువగా నిద్రించే స్వభావం ఉన్న వారికి (సరిపడా నిద్ర ఉంటే శరీరంలో అలసట పోయి నూతన శక్తి, ఉత్సాహం వస్తాయి. నిద్ర ఎక్కువైతే అవ్వేవీ రాక పోగా బద్ధకం పెరుగుతుంది. సమయం కూడా నష్ట మవుతుంది.), ఏ మాత్రం నిద్ర పోకుండా ఎప్పుడూ మేల్కొని ఉండే వారికి, సిద్ధించదు. ఆహారవిహారాదుల విషయంలో తగిన మోతాదులో మాత్రమే గ్రహించే వారికి, కర్మాచరణములలో తగినంత ప్రయత్నము చేసే వారికి, అవసరమైనంత నిద్రించి అవసరమైనంత మాత్రమే మేల్కొనే వారికి, దుఃఖనాశమగు ధ్యానయోగము సిద్ధిస్తుంది.
సాంతము వశంలో ఉన్న చిత్తము పరమాత్మ యందు పూర్తిగా నిలిచి ఉండి, సుఖభోగా లన్నిటి యందు ఆశ లేని పురుషుణ్ణి యోగయుక్తుడు అంటారు. గాలి వీచని చోట (గాలి లేని చోటు అని కాదు) దీపం స్థిరంగా ఉన్నట్లే ధ్యాన నిమగ్నుడైన యోగి వశంలో ఉన్న అతని చిత్తము కదలకుండా ఉంటుంది. ధ్యానయోగ సాధన వల్ల నిగ్రహించబడిన చిత్తము (అప్పుడు ప్రపంచంతో సంబంధము లేకుండా ఉంటుంది) ఏ పరిస్థితిలో ఉపరమము అంటే ఊరట (విషయవైరాగ్యము) పొందునో, ఏ అవస్థలో పరమాత్మ ధ్యానం చేత పవిత్రమైన సూక్ష్మబుద్ధితో పరమాత్మ సాక్షాత్కారం పొందుతూ (పరమాత్మ కాకుండా వేరే వాటికి అస్తిత్వము లేని అవస్థలో అంతా బ్రహ్మానందమయంగా ఉండటం) పరమాత్మ యందే సంతుష్టుడై ఉండునో, ఇంద్రియాలకు అతీతంగా (అంటే, వాటి ప్రభావం పడకుండా), బుద్ధిచే గ్రహించదగిన అనంతమైన బ్రహ్మానందమును ఎట్టి పరిస్థితుల్లో అనుభవించునో, ఏ అవస్థలో ఉన్న ధ్యాన యోగి పరమాత్మ స్వరూపం చేత కూడా చలించడో, పరమాత్మ ప్రాప్తిని సూచించే ఏ లాభం పొంది దాన్ని మించినది లేదని అనుకుంటాడో, పరమాత్మ ప్రాప్తిని సూచించే ఏ పరిస్థితిలో ఉన్న ధ్యానయోగి మహా దుఃఖానికి కూడా చలించకుండా (శరీరానికి కలిగే బాధలు, రుగ్మతలు మనస్సుకు కలిగే మానావమానాలు పరబ్రహ్మానందానుభవ స్థితిలో ఉన్నప్పుడు, ఆ స్థితి నుండి చలింపజేయ జాలకుండుట) ఉంటాడో, అటువంటి స్థితిని దుఃఖమయ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండే ధ్యానయోగం అని తెలుసుకోవాలి. ఆ యోగాన్ని ధైర్యము పూనిక గల మనస్సుతో (సాధన యొక్క ఫలితం ఎదురుగా కనపడదు. మొదలు పెట్టిన తరువాత నా వల్ల అవుతుందో కాదో ఎప్పటికి పూర్తి అవుతుంది అన్న ఆలోచనలు దూరంగా పెట్టాలి.) పూర్తి శ్రద్ధ విశ్వాసములతో చెయ్యాలి.
సంకల్పంతో పుట్టే కోరికలను పూర్తిగా వదిలిపెట్టి (అంటే, నేతి గిన్నెకు నేతి జిడ్డు వాసన, కర్పూరం గంధం ఇంగువ లాంటివి ఉంచిన బుడ్లకు వాటి వాసన ఉన్నట్లుగా కాకుండా కోరికల వాసన ఏ మాత్రం ఉండకూడదు.), మనస్సుతో ఇంద్రియాలను పూర్తిగా వశం చేసుకుని (ఇంద్రియాలను అంతర్ముఖం చేస్తే ఇది సాధ్యము), క్రమక్రమంగా అభ్యాసం చేస్తూ ఊరటను (satisfaction) పొందాలి. ఈ విధంగా ధైర్యంతో కూడుకున్న బుద్ధితో మనస్సును పరమాత్మ యందు నిశ్చలంగా నిలిపి, పరమాత్మను తప్ప ఇతరముల గురించి చింతించకుండా ఉండాలి. సాధకుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అతని అభ్యాసము అంత ధృఢంగా ఉండి ప్రతిరోజు చేసే ధ్యానంలో వృద్ధి కనబడుతుంది. ఆ సమయంలో మనస్సులోకి వచ్చే వస్తువులు, ఆలోచనలు కేవలం కల్పన అని తోసిపారేయడం మనస్సుకు అలవాటు చేస్తే మెల్ల మెల్లగా పరమాత్మ మీద మనస్సు నిలుస్తుంది. స్థిరంగా ఉండకుండా చంచలంగా ఉండే మనస్సు ఏఏ శబ్దస్పర్శాదుల కారణంగా విచ్చలవిడిగా పరిభ్రమిస్తూ ఉంటుందో, ఆ విషయాల నుండి మనస్సును మళ్ళించి ఎప్పటికప్పుడు పరమాత్మ యందే నిలిపి ఉంచాలి (ఇలా చెయ్యడం అలవాటు చేసుకోవాలి). ఎందుకంటే, ఎవరి మనస్సు పూర్తిగా శాంతంగా (వివేక వైరాగ్యాల ప్రభావంతో విషయ చింతన వదిలిపెడితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.) ఉందో, ఎవడు పాపరహితుడో, ఎవని రజోగుణము శాంతించిపోవునో (రజోగుణము వృద్ధి చేసేటటువంటి ఆసక్తి, తృష్ణ, కోరిక, లోభము, సకామకర్మ వంటి గుణాలు లేకుండా చేసుకుంటే ఇది సంభవము.), పరబ్రహ్మతో ఐక్యం పొందిన (అభిన్న భావంతో బ్రహ్మం నందు ఉండుట) అటువంటి ధ్యానయోగికి బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది. ఈ విధంగా పాపరహితుడైన యోగి ఆత్మను పరమాత్మలో లగ్నము చేస్తూ పరమాత్మ ప్రాప్తి రూపమైన అనంతమైన బ్రహ్మానందాన్ని సుఖంగా అనుభవించగలడు.
అంతటా వ్యాపించియున్న అనంతమైన చైతన్యంలో ఐక్యం అవడం చేత యోగముతో కూడుకొనిన మనస్సు కలవాడై అన్నిటిని సమభావంతో చూచే యోగి, సమస్త భూతము లందు ఆత్మ ఉన్నట్లుగా, సమస్త భూతములు ఆత్మ యందు ఉన్నట్లుగా ఊహించుకొని అంతా ఆత్మమయముగా భావిస్తాడు. అందరికి ఆత్మస్వరూపుడనైన ఈ వాసుదేవుని ఎవరైతే అన్ని భూతములలో వ్యాపించిన వానిగా చూస్తాడో, సమస్త భూతములను నాలో చూస్తాడో (అంటే, మేఘంలో ఆకాశం, ఆకాశంలో మేఘం ఉన్నట్లుగా), అతడికి నేను కనపడకుండా ఉండను. ఈ అనుభూతి మనం సినిమాలలో చూసి ఉంటాము. వేంకటేశ్వర స్వామి విగ్రహం లోనుండి ఒక వ్యక్తి బయటికి రావడం, ఆ వ్యక్తి తరువాత విగ్రహం లోకి వెళ్ళిపోవడం లాంటిదన్న మాట. భగవంతునిలో ఐక్యభావంతో నిలిచియున్న పురుషుడు సమస్త భూతము లందు ఆత్మరూపంలో ఉన్న నన్ను (ఆవిరి, మేఘము, పొగమంచు, చినుకు, మంచు లాంటి వాటిలో నీరే ఉన్నట్లు ఆత్మరూపంలో అన్నిటిలోను భగవంతుడే ఉన్నాడు.) భజిస్తాడు. అటువంటి యోగి అన్ని విధముల ప్రాణులతో వ్యవహరిస్తూ కూడా నా యందే ఉంటాడు. ఏ యోగి సమస్త భూతములను తనతో సమానంగా చూస్తాడో, సుఖదుఃఖాలను కూడా అన్నిటి యందు (తన లోను ఇతరుల లోను) సమానంగా చూస్తాడో, ఆ యోగి పరమశ్రేష్ఠుడు.
అంతా విని అర్జునుడు ఈ విధంగా స్పందించాడు: నువ్వు సమభావం చేత యోగం (కర్మ జ్ఞాన ధ్యానాది యోగాలలో చరమ దశ యొక్క స్వరూపము సమత్వమే కనుక దానినే యోగంగా భావించవచ్చు.) గురించి నాకు చెప్పావు సరే. నేను చంచల మనస్కుడను (రాగద్వేషాల వల్ల చంచలత్వము కలుగుతుంది) కనుక ఆ యోగము యొక్క స్థితిని కూడా చూడ లేకుండా ఉన్నాను. ఎందుకంటే, ఈ మనస్సు చంచలమైనది, మనుష్యుని మథించు స్వభావము (పెరుగును కవ్వము చిలికినట్లు మనస్సు శరీరేంద్రియాలను మథిస్తూ క్షోభ పెడుతుంది.) కలది, కఠినమైనది (ఏ పిచ్చలో పడిపోతే అందులోనే పడి కొట్టుకుంటుంది.), చాలా బలమైనది. దాన్ని వశపరచు కోవడమంటే, వాయువును ఆపటం లాగా చాలా కష్టమని (బలమైన ఏనుగుపై అంకుశం పోటు ప్రభావం చూపనట్లు) నేను అనుకుంటున్నాను.
అర్జునుని భావనలు విని కృష్ణుడు ఈ విధంగా సందేహ నివృత్తి చేశాడు: మనస్సు చంచలమైన దనడంలో సందేహం లేదు. దాన్ని వశం చేసుకోవడం కఠినమైన పనే గానీ, అది అభ్యాసం (practice) వైరాగ్యాల చేత వశమవుతుంది. అయితే వైరాగ్యం అలవడటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. లోకంలో ఉన్న వస్తువులలో అందము, సుఖము లేవని విడవడం; అవి దోష పూరితములు, అనిత్యములు, భయహేతువు లని తెలుసుకోవడం; భగవంతుని తత్త్వం గురించిన గ్రంథాలు అధ్యయనం చేయడం; విరాగుల సాంగత్యంలో ఉంటూ వాళ్ళ చరిత్రలు, అనుభవాలు తెలుసుకోవడం; పాడుబడ్డ భవంతులు, కోటలు, నిర్జన ప్రాంతాలు చూసి ప్రపంచం అశాశ్వతం, పరబ్రహ్మ కాక మిగిలిన వాటికి ఉనికి లేదని అనుకోవడం; భగవత్తత్త్వము గురించిన ప్రవచనాలు వినడం; లాంటివి చేస్తే వైరాగ్యం అలవడుతుంది. మనస్సు వశపరచుకోకపోతే యోగసిద్ధి కలగదు. ప్రయత్నం చేసే లక్షణం ఉన్న వాళ్ళు సాధన చేస్తే యోగసిద్ధి కలగవచ్చు.
ఈ సారి అర్జునుడు సూటి ప్రశ్న ఒకటి వేశాడు. అదేమిటో చూద్దాం: యోగంలో శ్రద్ధ ఉండి ఇంద్రియ నిగ్రహం (సంయమము) లేకపోవడం వల్ల మనస్సు అవసాన దశలో ఆ యోగం నుండి చలిస్తే, ఆ యోగభ్రష్టుడైన సాధకుడు భగవత్సాక్షాత్కారం పొందకుండా చివరకు ఏ గతి పాలవుతాడు? భగవత్ప్రాప్తి పొందే మార్గంలో మోహం చెంది, ఆశ్రయరహితుడైన ఆ యోగభ్రష్టుడు ఉభయత్రా భ్రష్టుడై ఛిన్నాభిన్నమయిన మేఘం లాగా నశించడు కదా. కృష్ణా! ఈ సందేహము తీర్చడానికి నువ్వే యోగ్యుడవు. ఇతరు లెవరూ దాన్ని తీర్చలేరు.
అర్జునుడు వెలిబుచ్చిన సందేహాలకు, కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు: యోగభ్రష్ట పురుషునికి ఇహపరాలలో ఎక్కడా నాశనం ఉండదు. ఎందుకంటే భగవత్ప్రాప్తి కొరకు కర్మ చేసే ఏ పురుషుడు కూడా దుర్గతి (జంతు పక్షి జన్మలు ఎత్తడం, నరకంలో పడటం లాంటివి) పాలు కాడు. యోగభ్రష్ట (మనస్సు సాధన నుండి ఇతర విషయాల మీదకు మళ్ళడం) పురుషుడు పుణ్యాత్ములు చేరే లోకాలకు, అంటే స్వర్గాది ఉత్తమ లోకాలకు చేరగలడు. అక్కడ అనేక సంవత్సరాలు ఉన్న తరువాత పవిత్రమైన ఆచారాలున్న సంపన్నుల ఇంటిలో జన్మించగలడు. అట్లు కాకుంటే (అంటే, ఉత్తమ లోకాలకు చేరకుండా, సంపన్నుల ఇంటిలో జన్మించకుండా ఉంటే), నేరుగా జ్ఞానవంతులైన యోగుల కుటుంబంలో జన్మిస్తాడు. కానీ అటువంటి జన్మ పొందడం అత్యంత దుర్లభము. దానికి సందేహం అక్కర్లేదు. స్వర్గాది ఉత్తమ లోకాలలోను సంపన్నుల ఇళ్ళలోను ఉండని యోగసాధనకు అనుకూలమైన వాతావరణం యోగుల కుటుంబంలో జన్మ ఎత్తితే సహజంగా లభిస్తుంది. ఆ కారణం చేత, అలాంటి చోట అజ్ఞాని అయ్యే అవకాశం లేకుండా, మనుష్యుడు పుట్టిన దాదిగా యోగసాధనలో నిమగ్నుడై ఉంటాడు. అంతే కాక, జ్ఞానులైన యోగుల ఇంటిలోనైతే అతడు పూర్వజన్మలో సంపాదించిన యోగాభ్యాస సంస్కారాలను అనాయాసంగా పొంది, ఆ ప్రభావంతో పరమాత్మప్రాప్తి కోసం ముందు జన్మలో కన్నా అధికంగా ప్రయత్నించగలడు. సంపన్నుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు ఇతరుల మీద ఆధారపడి యున్నా కూడా, పూర్వజన్మలో చేసిన అభ్యాసం వల్ల భగవంతుని వైపు ఆకర్షితుడై సమబుద్ధిరూప యోగాన్ని తెలుసుకొన గోరి వేదాలలో చెప్పబడిన సకామకర్మముల ఫలమును కూడా అతిక్రమించును. కానీ ప్రయత్నపూర్వకంగా యోగాభ్యాసం చేసే యోగి, అనేకమైన పూర్వజన్మల సంస్కారం యొక్క ప్రభావంతో ప్రస్తుత జన్మలోనే సిద్ధిని పొంది సమస్త పాపముల నుండి విముక్తిని కూడా పొంది, వెంటనే పరమగతిని (మోక్షాన్ని) పొందగలడు. తాపసుల కంటె, శాస్త్రజ్ఞానము ఉన్నవారి కంటే, సకామకర్మలు చేసే వారి కంటె, యోగి శ్రేష్ఠుడని అంగీకరింపబడ్డాడు. అందుచేత నువ్వు యోగివి కావాలి. యోగు లందరిలోను శ్రద్ధతో అంతరాత్మను నా యందు నిలిపి ఏ యోగి నన్ను సతతము భజించునో అతడే నా దృష్టిలో పరమశ్రేష్ఠుడు.