“మాలిక” అంటే మాల, వరుస, దొంతర, పరంపర, సరణి – ఇత్యాది అర్థాలు ఉన్నాయి. సంగీతంలో రాగమాలిక అన్న ప్రక్రియ ఉంది. వివిధ రాగాలను వరుసగా మార్చుకుంటూ ఒకే పాట లేదా కృతి లోని చరణాలను పాడటం దీని లోని ప్రత్యేకత. ఒక రాగంలో పాడుతూనే, పాట లోని వివిధ భాగాలకు వేర్వేరు తాళాలను మార్చి పాడే పద్ధతిని తాళమాలిక అంటారు.
“పద్యమాలిక” అంటే పద్యాల వరుస అని సామాన్యమైన అర్థము. తెలుగు ఛందస్సులో “పద్యమాలిక” అంటూ వేరే పద్యరూపం ఏదీ లేదు. ఇది నిర్దేశించిన ఛందస్సులోని (ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, కందం, మొదలైనవి) పద్యాలను నాలుగు పాదాలకు పరిమితం చేయకుండా, మాలిక లాగా ఎక్కువ పద్యపాదాలతో అల్లుకుంటూ పోతే వచ్చే దాన్ని సూచిస్తుంది. మార్పులతో కొనసాగించడం సంగీతం లోని మాలికల లక్షణమైతే, మార్పులు లేకుండా ఒకే పంథాలో కొనసాగించడం పద్యమాలికల లక్షణం.
ఆశువుగా సంస్కృతాంధ్రములలో సమానంగా కవిత్వం చెప్పగల వారిని గండపెండేరంతో సత్కరిస్తానని నిండు సభలో సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు విసిరిన సవాలుకు జవాబుగా ధీశాలియైన వారి ఆస్థానకవి అష్టదిగ్గజములలో ముఖ్యుడు అయిన అల్లసాని పెద్దనగారు ముప్పది పాదాల ఉత్పల మాలిక “త” ప్రాసతో ఆశువుగా చెప్పి అందరినీ మెప్పించి రాయల వారి చేతుల మీదుగా గండపెండేరం తన కాలికి తొడిగించుకున్నారు. ఈ మాలికలో కవిత్వానికి నిర్వచనం (నాలు) చెప్పారు పెద్దన.
ఆధునిక కాలంలో పులుగుర్త వేంకటరామారావు గారు (1902-1964) అనే శతావధాని 44 పాదాలతో ఉత్పల మాలిక “న” ప్రాసతో జానుతెనుంగు కైత గురించి రచించారు. వీరే మరో సందర్భంలో జయపూర్ రాజా విక్రమదేవవర్మపై 116 పాదాల మాలిక చెప్పారని కూడా చదివాను. “అమ్మను నమ్ముకొంటి …” అన్న పద్యమాలిక మహాసహస్రావధాని డా. మాడుగుల నాగఫణిశర్మ గారు చెప్పినది “మ్మ” ప్రాసలో విన్నాను. ఇంకా ఇతరులు రచించిన మాలికలు చిన్నా చితకా పెక్కులు ఉన్నాయి.
ఒకే ఛందస్సులో ఒకే ప్రాసాక్షరంతో ఉన్న పద్యాలను (వేరు వేరు కవులు వ్రాసినవి) ఒక చోట చేర్చి చదివి ధారణ చేస్తే అవి అవధానులకు చాలా సహాయకారిగా ఉంటాయని అవధాన విద్యావికాసంపై ఈ మధ్య చేసిన ప్రసంగంలో బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణిశర్మ గారు సూచించారు. అంటే, మాలికలుగా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్రాయబడకపోయినా, ప్రతి నాలుగు పాదాలకి విషయం మారుతున్నా కూడా, అవి మాలికల లాగానే ధ్వనిస్తాయి. ఈ సూచన నాకు బాగా నచ్చింది.
పైన చెప్పినవన్నీ గ్రహించగా నాకు కూడా ఒక పద్యమాలిక వ్రాయాలని అనిపించింది. నేను ప్రయత్నించి వ్రాసిన 56 పాదాల ఉత్పల పద్యమాలిక “త” ప్రాసతోనే పెద్దనగారి మాలిక లాగా ప్రౌఢంగా కాక చాలా సరళంగా ఉంటుంది. ఇది పేరెటో సిద్ధాంతము (Pareto Principle), దాని ఉదాహరణల గురించి వ్రాసినది.
పేరెటో సూత్రం (దీనినే 80/20 నియమం అని కూడా అంటారు) ప్రకారం, దాదాపు 80% ఫలితాలు కేవలం 20% కారణాల నుండే వస్తాయి. For many outcomes, roughly 80% of consequences come from 20% of causes. ఫలితాల్లో అధిక భాగానికి కారణమయ్యే “అత్యంత కీలకమైన అంశాలను” గుర్తించడంలో ఇది ఒక ఆలోచనా విధానంగా (mental model) ఉపయోగపడుతుంది. తద్వారా వ్యాపారం, సాఫ్ట్‌వేర్ (software), వ్యక్తిగత ఉత్పాదకత వంటి రంగాలలో పనిచేసే వారు పనులకు సమర్థవంతంగా ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇవ్వ గలుగుతారు. సమస్యలలో కూడా ముఖ్యమైనవి ఎక్కడైనా ఎప్పుడైనా అతి కొద్దిగా ఉంటాయి. అవే 80-90 % ప్రభావం కలిగిస్తాయి. అటువంటి సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించడమో నియంత్రించడమో చేస్తే, మనం చాలా వరకు విజయం సాధించినట్లే. ఇలా తక్కువలు ఎక్కువ ప్రభావం చూపించడం, తక్కవలని పట్టించుకుంటే దాదాపు అన్నీ పట్టించుకున్నట్లుగా అనిపించడం, ఎక్కువలకి తక్కువలే ఎక్కువగా మూలం అన్న భావనలని దృష్టిలో ఉంచుకొని వ్రాసిన 56 పాదాల మాలిక లఘుటీకావ్యాఖ్యాన సహితంగా క్రింద ఇవ్వబడింది. చూడండి.
ఏ తరహా గుణాదులకు యెక్కువ తక్కువ లెంచు చుందుమో
ఖాతరు చేసిఁ జూడ నవి కైళముగా ననిపించు నెట్లనన్
శాతము హెచ్చు వ్యుష్టులకు సాకుల కయ్యది తక్కువుండుటే
నీతి యటంచు నీమముగ నెక్కొను నంచు నిదర్శనంబుగా
జాతి చరిత్ర నుండి పలు సామ్యములన్ యెదుటన్ వెలార్చగన్
కోతుల సైన్యమం చలతి కోపము లోకువఁ జూపు రావణున్
నీతికి నిల్చు సీత పరిణేత జయించుట కావ్యవస్తువై
నాతిని బందిఁజేయుట యనాగరికమ్మనిఁ దెల్ప నేమయెన్
నాతుక కష్టముల్ యెడపి నమ్మక మేర్పడఁ జేయు చుంటిమా?
రాతిగ నున్న స్త్రీకి రఘురాముడు చేతన మిచ్చిఁ బ్రోవగా
చేతన మున్న యంగనలఁ జేర్చుట న్యాయమె వంటయింటికిన్?
జ్ఞాతుల కంటఁగట్టెదరు స్పర్ధ లసూయలు యన్యు లుండరే?
వాతెఱ దాటు మాటలకు బానిస లయ్యెడి వార లెందరో
పాతక మంచెరింగియు నపాండవ మెట్లనిపించె ద్రౌణికిన్?
శాతము యెక్కువే తెలిసి సల్పెడి తప్పుల కెల్ల వేళలన్
కోతికి నారికేళ మొనఁగూడిన యట్లొక పార్టిఁ జేరి మో
చేతి జలమ్ము త్రాగు పలు చేటుల చేష్టలు చిత్రమాఁ గనన్
తాతలు నాకి నట్టివి ఘృతమ్ములు వాసనఁ జూడు డిప్పుడే
మూతులు మావి యంచు కనుమోడ్చెడి మందులు పెక్కులుండరే?
చేతము నందు దాగిన విశేషము లన్నియు యుగ్గడించ సం
గాతి యొకండెయైన దొరకన్ యతి కష్ట మటంచెరుంగమే?
ద్యోతక మౌను యిట్టివి వియోగముఁ గల్గిన వేళ లందునన్
రాత లెటున్న గాని యవిరామముగా యతనమ్ముఁ జేసినన్
నీతిగ, జీవనమ్మున యనేక శుభమ్ములు సంక్రమించులే
జాతికి మార్గదర్శకులు జ్ఞానము పంచు మహాత్ము లిద్ధరన్
పోతన వంటి కావ్యు లెట పుట్టిన నుందురు వ్రేళ్ళ లెక్కకే
యే తర మందు నైన, పరు లెందరొ కైతలుఁ జెప్పుచుండినన్
కైతలుఁ జెప్పు వారు పలు కబ్బములన్ రచియించినన్ ధరన్
ఖ్యాతి గడించి నట్టి వధికమ్ముగ నుండవు సాహితీ వనిన్
చేతికి రాని దెక్కువను చింతనె యూహల నిండు నెప్పుడున్
దాతల దల్ప సంఖ్య బహుధా పుడిగల్ గొను వారి చెంగటన్
గోతులు తీయు వారి కడ గొప్పలుఁ జెప్పెడి వారు యెక్కువే
స్ఫీతముఁ గాదె యౌననెడి చేటులు పాలకు మెప్పు పొందగన్
నూతన మేది యైనను వినోదమె కేవల మందు రెందరో
భూతి యశీతి శాత మిలఁ బొందెద రిర్వది శాత మెప్పుడున్
శాతము యిర్వదున్న జన జాల మశీతి ధరిత్రి నొందరే
యాతన లొచ్చుచుండు పలు హంగుల నల్ప సమస్యలన్ సదా
శ్రోతలు పల్వు రున్న సభఁ జూడగ వక్తలు తక్కు వుండరే
యేతరు లల్ప సంఖ్య యయి యెక్కుడు చిక్కుల హేతు వవ్వరే
పాతిక శాతమేఁ గల సపక్షులు నేతకు ముఖ్యు లవ్వరే
స్ఫీతముగా సపర్య లిడు సేవకు లెక్కువ మంది యుందురే
మేతరి మెచ్చు భోజ్యములు మెండుగ నుండ వటం చెరుంగమే
జీతము కొంచె మున్న శ్రమజీవుల శాతము యెక్కుడేఁ గదా
ఖ్యాతిని పొందు వారిలను కావరు లందు నఖర్వమందురే
పూతన వేసినట్టి గతిఁ బోవరె పెక్కులు కల్తిఁ జేయుచున్
శాత మనల్ప మంగడుల సాగెడి యమ్మక మల్ప సంఖ్యచే
పాతక మంచెరింగియును ప్రాప్తినిఁ బొందగ కొట్టు లందు వి
క్రేతలు చేయు మోసములు లేశమె ధర్మము ధిక్కరించుచున్
స్నాతకులైన పాఠితులు సంఘము నందున కొద్ది శాతమే
జాతక మందు నున్న శని జాస్తిగఁ గూర్చడె కష్ట నష్టముల్
ఊతము నిచ్చు యుత్తముల యూసునుఁ దెచ్చెడి వారు తక్కువే
జ్యోతి వెలుంగ స్వాంతమునఁ జొప్పడు తత్వము మేలుకాంచులే
భూతల మందు యెక్కుడుగ భూమముఁ గాక జలమ్మె యుండగా
లాఁతుగ నందు క్షార సలిలమ్మె లభింపగ పేరెటో (Pareto) యిటన్
నూతన సూత్రమంచు నొక న్యూనతఁ దెల్పగ నేమి యున్నదో
పాత రసమ్మె నింపి యొక పాత్రను క్రొత్తగఁ జూపి నట్లెగా
(తరహా = విధము, గుణము = స్వభావము, ఎంచు = అనుకొను, ఖాతరు = నిర్ధారణ, కైళము = వినోదము, శాతము = వందలో ఒక భాగము, హెచ్చు = అధికము, వ్యుష్టి = ప్రయోజనము, సాకు = కారణము, నీతి = న్యాయము, నీమము = నియమము, నెక్కొను = పాదుకొను, నిదర్శనము = ఉదాహరణము, పలు = అనేకము, సామ్యము = పోలిక, వెలార్చు = బైటపెట్టు, అలతి = స్వల్పము, లోకువ = చులకన, పరిణేత = భర్త, కావ్యవస్తువు = కావ్యములోని కథాంశము, నాతి = స్త్రీ, బంది = నిర్బంధము, నాతుక = స్త్రీ, ఎడపు = తొలగించు, చేతనము = చైతన్యము, ప్రోచు = రక్షించు, అంగన = స్త్రీ, జ్ఞాతి = దాయాదుడు, అంటగట్టు = ఆరోపించు, స్పర్ధ = పరస్పరము మించ వలెననే కోరిక, అసూయ = అసూయ = ఓర్వలేమి, అన్యులు = ఇతరులు, వాతెఱ = పెదవి, పాతకము = మహాపాపము, అనిపించు = భావించునట్లు చేయు, ద్రౌణి = అశ్వత్థామ, సల్పు = చేయు, ఎల్ల = సమస్తము, వేళ = సమయము, నారికేళము = కొబ్బరికాయ, ఒనఁగూడు = లభించు, చేటుడు = అనుచరుడు, చేష్ట = ప్రవర్తనము, చిత్రము = ఆశ్చర్యము, కను = చూచు, ఘృతము = నెయ్యి, కనుమోడ్చు = నిద్రపోవు, మందుడు = సోమరి, పెక్కు = అనేకము, చేతము = మనస్సు, ఉగ్గడించు = తెలుపు, సంగాతి = స్నేహితుడు, ద్యోతకము = స్ఫురింపఁజేయునది, వియోగము = ఎడఁబాటు, రాత = తలరాత, అవిరామము = ఎడతెగనిది, యతనము = ప్రయత్నము, సంక్రమించు = ప్రాప్తించు, ధర = భూమి, కావ్యుడు = కవి, తరము = పురుషాంతరము, పరులు = ఇతరులు, కైత = కవిత్వము, కబ్బము = కావ్యము, ఖ్యాతి = కీర్తి, వని = అడవి, చింతన = ఆలోచన, బహుధా = అనేక విధముల, పుడిగ = దానము, చెంగట = సమీపము, గోతులు తీయు = ద్రోహముచేయు, స్ఫీతము = అధికమైనది, చేటుడు = సేవకుడు, పాలకుడు = అధినేత, మెప్పు = శ్లాఘన, నూతనము = క్రొత్తది, వినోదము = వేడుక, కేవలము = మాత్రం, భూతి = సంపద, అశీతి = ఎనుబది, ఇల = భూమి, ఇర్వది = ఇరువది, ధరిత్రి = నేల, యాతన = బాధ, పలు = అనేక, హంగు = పద్ధతి, సదా = ఎల్లప్పుడు, శ్రోత = వినేవాడు, పల్వురు = అనేకులు, వక్త = మాట్లాడువాడు, ఏతరి = తుంటరి, ఎక్కుడు = ఎక్కువ, హేతువు = కారణం, సపక్షుడు = అనుచరుడు, సపర్య = సేవ, ఇడు = ఇచ్చు, మేతరి = తిండిపోతు, భోజ్యము = భుజింపఁదగినది, మెండు = అధికము, ఖ్యాతి = కీర్తి, కావరుడు = గర్వి, అఖర్వము = అధికము, గతి = బాట, కల్తి = స్వచ్ఛముకానిది, అంగడి = దుకాణము, ప్రాప్తి = లాభము, విక్రేత = విక్రయించు వాడు, లేశము = కొంచెము, ధిక్కరించు = ఉద్దేశపూర్వకంగా అతిక్రమించు, స్నాతకుడు = పట్టభద్రుడు, పాఠితుడు = విద్యార్థి, జాస్తి = అధికము, కూర్చు = సంతరించు, ఊతము = ఆశ్రయము, ఊసు = ప్రస్తావన, జ్యోతి = ప్రకాశము, స్వాంతము = మనస్సు, చొప్పడు = సహాయపడు, తత్వము = స్వభావము, మేలుకాంచు = మేలుకొను, భూతలము = భూప్రదేశము, భూమము = నేల, లాఁతు = అధికము, క్షార = ఉప్పు, సలిలము = నీరు, ఇట = ఇక్కడ, నూతన = క్రొత్త, న్యూనత = లోపము)
ఏ విధమైన గుణాదులకు ఎక్కువని తక్కువని ఎంచుతామో, నిర్ధారణ చేసి చూస్తే అవి వినోదంగా అనిపిస్తాయి. ఎట్లా అంటే, ప్రయోజనాల శాతం ఎక్కువ వాటి కారణాలు తక్కువ ఉండటమే నీతి అన్న నియమం పాతుకుపోయిందంటూ, ఉదాహరణంగా జాతి చరిత్ర నుండి అనేకమైన పోలికలు బైటపెట్టడం వల్ల. వానర సైన్యం అని కొంత కోపం, చులకన చూపే రావణుణ్ణి నీతికి నిలిచే సీత భర్తయైన శ్రీరాముడు జయించడం అన్నది కావ్యము లోని కథాంశంగా స్త్రీని బందీ చేయడం అనాగరికమని తెలియజేయగా ఏమయ్యింది, స్త్రీ కష్టాలు పోగొట్టి నమ్మకం కలిగిస్తున్నామా? రాయిగా పడివున్న స్త్రీకి శ్రీరాముడు చైతన్యం ఇచ్చి రక్షించగా, చైతన్యం ఉన్న స్త్రీలను వంట యింటికి పరిమితం చెయ్యడం న్యాయమా? స్పర్ధలు అసూయలు దాయాదులకు అంటగడతారు, ఇతరులు ఉండరా? పెదవి దాటిన మాటలకి (ఇచ్చిన మాటలకి) బానిస లయ్యే వాళ్ళు ఎందరో. మహాపాపమని తెలిసినా కూడా అపాండవం ఎట్లా తోచింది అశ్వత్థామకి? (ఆవేశపూరితమైన వాతావరణంలో దుర్యోధనుడికి ఇచ్చిన మాటకు బానిస అవ్వడం వల్లనే కదా, అశ్వత్థామ నిద్ర పోతున్న వాళ్ళని హత్య చేసి, ఆ తరువాత తను చంప వలసిన వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారని తెలిసి అపాండవం అవ్వాలని సంకల్పించి బ్రహ్మశిరోనామకాస్త్రం వేశాడు.) అన్ని వేళల్లోను తెలిసి చేసే తప్పుల శాతం ఎక్కువే. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు (విలువైన వస్తువు గానీ అవకాశం గానీ దక్కితే, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక వృథా చేసుకోవడం) ఒక పార్టీలో (రాజకీయ) చేరి మోచేతి నీళ్ళు త్రాగే (ఆధారపడి బ్రతికే) అనేక మంది అనుచరుల ప్రవర్తన చూడడం ఆశ్చర్యమా. మా తాతలు నేతులు నాకారు, మా మూతులు వాసన చూడండి ఇప్పుడే అంటూ నిద్రపోయే (పనీపాటా లేకుండా) సోమరులు అనేకులు ఉండరా? మనస్సులో దాగిన విశేషాలు అన్నీ చెప్పుకోడానికి స్నేహితుడు ఒక్కడైనా దొరకడం ఎంత కష్టమో ఎరుగమా? ఇలాంటివి ఎడఁబాటు కలిగిన సమయాల్లో స్ఫురిస్తాయి. తలరాత ఎట్లా ఉన్నా నీతిగా అవిరామంగా ప్రయత్నం చేస్తే జీవితంలో అనేక శుభాలు ప్రాప్తిస్తాయి. జాతికి మార్గదర్శకులు జ్ఞానం పంచేవారు అయిన మహాత్ములు ఈ లోకంలో పోతన వంటి కవులు ఎక్కడ పుట్టినా వేళ్ళ లెక్కకి సరిపడే అంత మందే ఉంటారు. ఈ లోకంలో ఏ తరంలోనైనా ఇతరులు ఎంతో మంది కవిత్వం చెబుతున్నా, కవిత్వం చెప్పేవాళ్ళు అనేకమైన కావ్యాలు వ్రాస్తున్నా, సాహిత్యమనే అడవిలో కీర్తి గడించినవి ఎక్కువగా ఉండవు. ఊహల్లో ఎప్పుడూ చేతికి అందనిదే ఎక్కువ అనే ఆలోచనే నిండుతుంది. అనేక విధాలుగా దానం పుచ్చుకునే వాళ్ళ చెంత, దానం ఇచ్చే వాళ్ళ సంఖ్య తక్కువే. ద్రోహం చేసే వాళ్ళ దగ్గర గొప్పలు చెప్పే కోతల రాయుళ్ళు ఎక్కువ మంది ఉంటారు. యజమాని మెప్పు పొందడానికి ఔననే సేవకులు ఎక్కువ కాదా. క్రొత్తది ఏదైనా వేడుక మాత్రమే అనే వాళ్ళు ఎందరో. లోకంలో ఎప్పుడూ 80 %, సంపదలో 20 % మాత్రమే పొందుతారు. 20 % జనాళి 80 % నేల పొందుతారు. ఎప్పుడూ అనేక రీతులలో చిన్న సమస్యల వల్లే బాధలు కలుగుతూ ఉంటాయి. వినేవాళ్ళు అనేకులు ఉన్న సభని చూస్తే మాట్లాడే వాళ్ళు తక్కువ ఉండరా. తుంటరులు తక్కువ సంఖ్యలో ఉండి ఎక్కువ చిక్కులకి కారణం అవ్వరా. 25% ఉన్న అనుచరులు నేతకి ముఖ్యమైన వాళ్ళు అవ్వరా. అధికంగా సేవలు చేసే సేవకులు ఎక్కువ మంది ఉంటారా. తిండిపోతు మెచ్చుకునే ఆహార పదార్థాలు ఎక్కువగా ఉండవని ఎరుగమా. కొద్ది జీతం ఉన్న శ్రమజీవుల శాతం ఎక్కువ కదా. గర్వం ఉన్న వాళ్ళలో కీర్తి గడించే వాళ్ళు ఈ లోకంలో అధికం అంటారే. అనేకులు కల్తీ చేస్తూ పూతన వేసిన బాటలో పోవటల్లేదా. తక్కువ సంఖ్యలో ఉన్న దుకాణాలలో సాగే అమ్మకాల శాతము ఎక్కువ. మహాపాపం అని తెలిసి లాభం పొందడానికి దుకాణాలలో అమ్మేవారు ధర్మాన్ని ఉద్దేశపూర్వకంగా అతిక్రమిస్తూ చేసే మోసాలు తక్కువా. పట్టభద్రులైన విద్యార్థులు సంఘంలో కొద్ది శాతమే. జాతకంలో ఉన్న శని ఎక్కువగా కష్టనష్టాలే తెస్తాడు. ఆశ్రయం ఇచ్చిన ఉత్తముల ప్రస్తావన తెచ్చేవారు తక్కువే. మనస్సులో ప్రకాశం (అంటే జ్ఞానం అనే జ్యోతి) వెలిగితే సహాయపడే తత్వము మేల్కొంటుందిలే. భూమి మీద ఎక్కువగా నేల కాకుండా నీరే (71 %) ఉండగా, అందులో అధికంగా ఉప్పునీరు (97.5 %) లభించగా పేరెటో అన్న పండితుడు ఇక్కడ క్రొత్త సిద్ధాంతం అంటూ ఒక లోపాన్ని చెప్పడానికి ఏముంది, పాతరసమే నింపి ఒక పాత్రను కొత్తగా చూపించినట్లేగా.
Padya maalika chaala bagundi. I don’t know, am jealous as I didn’t take Sweet Telugu in my choice of options. Though opted it wouldn’t have been every body Cup of tea. Congratulations Ranganatham Garu
LikeLike