భగవద్గీత గురించి – మంచి, చెడునా చిన్నప్పుడు మా గురువుగారు (తాతగారు) భగవద్గీత శ్లోకాలు పారాయణ చేస్తుంటే, అవి వినీ వినీ కొన్ని నాకు కూడా కంఠతా వచ్చేశాయి. అది గ్రహించి వారు ఆ తరువాత నాకు క్రమ పద్ధతిలో భగవద్గీత భట్టీయం వేయించారు. అది భట్టీయమే. ఎందుకంటే, అప్పుడూ ఇప్పుడూ కూడా నాకు సంస్కృతం రాదు. అలా భగవద్గీతతో మొదలైన నా అనుబంధం, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
పెద్దయిన తరువాత భగవద్గీతపై వ్యాఖ్యానాలు, టీకా తాత్పర్యాలు, విమర్శలు, భాష్యాలు వంటి వాటి గురించి విన్నాను, వాటిలో కొన్ని చదివాను. వాటి నుండి నా కర్థమైనవి ఏమిటంటే, కొందరికి భగవద్గీత మతగ్రంథము, కొందరికి పవిత్ర గ్రంథము, కొందరికి అభూత కల్పన, కొందరికి అందులోని శ్లోకాలు చాలా వరకు ప్రక్షిప్తము (అంటే, మొదటి నుండి లేవు, తరువాత చేర్చబడినవి అని). అసలు మహాభారత యుద్ధమే జరగలేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అందులోని అంతర్భాగమైన భగవద్గీత గురించి వేరే చెప్పక్కర్లేదు అని అన్నట్లే. ఇలా రకరకాల భావనలకి కేంద్ర బిందువైన భగవద్గీతపై నా ఆసక్తి నాతో పాటు పెరుగుతూ వచ్చింది. నాకేమనిపిస్తుందంటే, ఎవరి భావనలనీ తప్పని కానీ సరియైనవని కానీ మనం వర్గీకరించాల్సిన పని లేదని. ఎందుకంటే, ఆ భావనలు నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయి. కశ్చితంగా, నేను పోయిన తరువాత కూడా ఉంటాయి. అందుకని, వాటి జోలికి పోకుండా, ఎవరికి వాళ్ళు భగవద్గీతలో పనికొస్తాయి అనుకున్నవి తీసుకొని, మిగిలినవి వదిలెయ్యడం మంచిదని నా అభిప్రాయం.
పవిత్ర గ్రంథము అన్న మాట వినగానే నాకు గుర్తొచ్చేది వినాయక చవితి పండుగ. చిన్నప్పుడు ఇంట్లో ఉన్న గ్రంథాలకు (భగవద్గీత లాంటి పవిత్ర గ్రంథాలు, మా క్లాసు పుస్తకాలు) వినాయక చవితి ముందు రోజు చక్కగా పసుపు కుంకుమ అద్ది ఒక పీట మీద వినాయకుడి మట్టి విగ్రహానికి ఎదురుగా పెట్టి, మర్నాటి పూజకి కావలసిన విధంగా అలంకరించే వాళ్ళం. ఆ విధంగా, పుస్తకాలు వినాయకుడి దగ్గర పెట్టడం వల్ల అటుచేసి ఇటుచేసి వరుసగా మూడు రోజులు చదువు ఎగ్గొట్టేవాళ్ళం. పండుగ మాట పక్కన పెడితే, పవిత్ర గ్రంథం అంటే పూజ చేస్తే చాలు, చదవక్కరలేదు, దానిలో ఉన్నది పాటించక్కర లేదు అని అనుకునే వాళ్ళని చాలా మందిని చూశాను (అన్ని మతాల్లోను).
కొంత మంది భగవద్గీతను హిందూమత గ్రంథమని, బైబిలును క్రైస్తవమత గ్రంథమని, ఖురానును మహమ్మదీయమత గ్రంథమని చెబుతూ ఉంటారు. ఈ మాటలు వింటూ ఉంటే మనవడు తాతగారిని నా పేరెందుకు పెట్టుకున్నావు అని అడిగినట్లుగా అనిపిస్తుంది నాకు. రాముడు కృష్ణుడు లాంటి పురాణపురుషు లెవరూ హిందువులు కారు. గౌతమ బుద్ధుడిది బౌద్ధ మతం కాదు. జీసస్ క్రైస్టుది క్రైస్తవమతం కాదు. ప్రాఫెట్ మహమ్మదుది ఇస్లాం మతం కాదు. వారి తరువాత, మనం మతాలు అనే జైళ్ళను సృష్టించి వాటిల్లో వాళ్ళను బందీ చేశాము. అందరూ చదివి జ్ఞానం పొందాల్సిన గ్రంథాలకు ఏదో ఒక మతం ముద్ర వేసి ఇతర మతాల వాళ్ళను దూరం పెట్టామేమో.
ఇక భగవద్గీత విషయాని కొస్తే, దానిపై భాష్యం రచించిన వాళ్ళకే కాక వివిధ కాలాలకు చెందిన అనేక మంది మహామహులకు బాగా నచ్చిన గ్రంథం అది. బంకించంద్ర ఛటర్జీ, వివేకానంద, బిపిన్ చంద్రపాల్, లజపతిరాయ్, అరవింద ఘోష్, బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్, గాంధీ వంటి జాతీయ నాయకులకు ఉత్తేజాన్ని కలిగించడమే కాక గాంధీని హత్య చేసిన నాధూరాం గాడ్సేకు సైతం అది స్ఫూర్తి నిచ్చింది. మహా భారతంలో భాగమైనా కూడా, భగవద్గీత విడిగా అనేక సార్లు ప్రచురించబడి ఒక స్వతంత్ర గ్రంథంగా నిలిచింది. సామాన్య ప్రజానీకంలో నిత్యము ఏదో ఒకటి పారాయణం చేసే అలవాటు ఉన్నవారు, తమ పారాయణ గ్రంథాలలో భగవద్గీతను కలిగి ఉంటారు, ఇప్పటికీ.
అయితే, కొంత మంది భగవద్గీతలో ఉన్న మంచిని వీలయినంత వరకు ఆచరణలో పెట్టాలన్న విషయం పక్కన పెట్టి, దానిలో ఏదో మహత్తు ఉందని, అందులోని ప్రతి అక్షరం చాలా పవిత్రమైనదని, చాలా మంది గొప్ప వాళ్ళకి నచ్చింది కాబట్టి మనక్కూడా నచ్చిందని చెప్పుకోకపోతే ఎలాగని, ఏవేవో కథలు, ఊహాగానాలు సృష్టించి జనబాహుళ్యం లోకి వదలడం కొంత చీకాకు పెడుతుంది. అటువంటివి విన్నప్పుడు, చిన్నప్పుడు విన్న ఒక కథ గుర్తొస్తుంది నాకు.
అనగా అనగా ఒక రాజు గారు ఉండేవారట. ఆయనకి ఎప్పుడూ తనకు నచ్చిన కొత్త బట్టలు కట్టుకోవడం ఇష్టమట. తనకు నచ్చే విధంగా కొత్త బట్టలు కుట్టిచ్చిన దర్జీలకు సన్మానాలు బహుమానాలూను, నచ్చనివి కుట్టి ఇచ్చిన దర్జీలకు కఠిన శిక్షలు అమలుపరచేవాడట. ఇది ఇలా సాగుతుండగా, ఒక దర్జీ రాజుకు బుద్ధి చెప్పాలని, ఆయన దగ్గరకి వచ్చి, రాజా! నేనొక బ్రహ్మాండమయిన డ్రస్సు తయారు చేశాను, అది మూర్ఖులకి కనపడదు అని చెప్పి అది మీలాంటి గొప్పవారే ధరించాలి అని ఊరించాడట. సరే! పట్రా! అని రాజు అనడం, అతడు తెచ్చినట్లు నటించి, నేనే మీకు తొడుగుతాను అని రాజుకు ఉన్న బట్టలు తొలగించి తాను తెచ్చినది తొడిగినట్లుగా నటించడం చేశాడు. ఒంటి మీద బట్టలు లేవని తెలుస్తున్నా తనని మూర్ఖుడి కింద జమ కడతాడని రాజుగారు, రాజు మొండిమొలతో ఉన్నాడని చెబితే తన్నిస్తాడేమోనని ప్రజలు, రాజోద్యోగులు ఎవరికి వాళ్ళు మనకెందుకు అని మిన్నకున్నారు. పైపెచ్చు “ఆహా! ఆహా! భలే బాగుంది” అని కితాబు ఇచ్చారు, చూసిన వాళ్ళందరూ డ్రస్సు గురించి. ఇంకేముంది రాజు ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. నగర వీధుల్లో ఊరేగింపుకి బయలు దేరాడు. దారి పొడుగునా ఆయన్ని చూసిన ప్రజలు కూడా ఎందుకొచ్చిన గొడవ అని జేజేలు కొట్టారు. అలా వెళుతూ ఉండగా, ఒక చోట ఒక గోచీ పెట్టుకున్న చిన్న పిల్లవాడు రాజును చూసి “ఏక్కిలాయిలే, జిల్లాయిలే” అని వెక్కిరించాడు. అప్పటికి కానీ రాజుకు తాను చేసిన తప్పేమిటో తెలిసిరాలేదు. అందరూ మెచ్చుకునేది ఏదైనా సరే, నచ్చలేదని చెప్పడానికి ఆ పిల్లవాడికి మల్లే అందరికీ ధైర్యం ఉండదు. అలా అనే వాళ్ళు తక్కువ మంది గనక అయితే, మిగిలిన వాళ్ళు మీదపడి పీకేస్తారేమోనన్న భయం కూడా ఉంటుంది.
భగవద్గీతైనా ఇంకేదైనా కొంత మంది చెప్పే గాలి కబుర్లకు ప్రభావితం కాకుండా, “సంతః పరీక్ష్యాన్యతరద్భజన్తే (అంటే, వివేకవంతులు ఏది మంచిదో దానిని స్వయంగా పరీక్షించి ఆలోచించి స్వీకరిస్తారు అని)” అన్న కాళిదాసు నిర్దేశించిన ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని మసలుకోవాలని నా ఆకాంక్ష. నలుగురూ ఆహా అంటున్నారు, మనం కూడా అనకపోతే బాగుండదు అని రాజు గారి కథలో లాగా చేస్తే లాభం లేదు.
వ్యాసమహాభారతము లోని భీష్మ పర్వము నందుఁ గల 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు ఉన్న18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క “యోగము” అని చెబుతారు. వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి “కర్మషట్కము” అని, 7 నుండి 12 వరకు అధ్యాయాలను “భక్తి షట్కము” అని, 13 నుండి 18 వరకు”జ్ఞాన షట్కము” అని అంటారట.
భగవద్గీత గురించి ఉన్న పేచీలలో ఒకటి, అందులోని శ్లోకాల సంఖ్య గురించి. భీష్మ పర్వం లోని 43వ అధ్యాయంలో 4వ శ్లోకం (భగవద్గీత కొన్ని ప్రతులలోనే ఈ శ్లోకం ఉంది) దీనికి వివరణ ఇవ్వడమే కాదు, సమస్యను ఇంకా జటిలం చేసింది కూడా. అదేమిటో చూద్దాం.
“షట్శతాని సవింశాని శ్లోకానాం ప్రాహ కేశవః
అర్జునః సప్తపంచాశత్ సప్తషష్టిం చ సంజయః
ధృతరాష్ట్రః శ్లోకమేకం గీతాయా మానముచ్యతే”
అంటే, కృష్ణుడు 620 శ్లోకాలు, అర్జునుడు 57 శ్లోకాలు, సంజయుడు 67 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారట. అనగా మొత్తం 745 శ్లోకాలు ఉన్నాయన్న మాట, భగవద్గీతలో. కానీ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న భగవద్గీత పుస్తకాలలో 700 గానీ 701 గానీ శ్లోకాలు ఉన్నాయి. అదనంగా కొన్ని పుస్తకాలలో ఉన్న ఆ ఒక్క శ్లోకం 13వ అధ్యాయం మొదట్లో అర్జునుడు అడిగినట్లుగా చెప్పబడుతున్న “ప్రకృతిం పురుషం చైవ …” అన్న ప్రశ్నార్థక శ్లోకం. దీన్ని బట్టే, 44 అమూల్యమైన శ్లోకాలు అందుబాటులో లేకుండా పోయాయని తెలుస్తోందన్నారు. 701 శ్లోకాలలో ఎవరు మాట్లాడినవి ఎన్ని శ్లోకాలో ప్రతి అధ్యాయానికి సంబంధించి క్రింది పట్టికలో ఇవ్వబడింది.
| అధ్యాయము పేరు | కృష్ణుడు | అర్జునుడు | సంజయుడు | ధృతరాష్ట్రుడు | మొత్తం |
| 1. అర్జున విషాద యోగము | 0 | 22 | 24 | 1 | 47 |
| 2. సాఙ్ఖ్య యోగము | 63 | 6 | 3 | 72 | |
| 3. కర్మ యోగము | 40 | 3 | 43 | ||
| 4. జ్ఞాన యోగము | 41 | 1 | 42 | ||
| 5. కర్మ సన్న్యాస యోగము | 28 | 1 | 29 | ||
| 6. ఆత్మసంయమ యోగము | 42 | 5 | 47 | ||
| 7. విజ్ఞాన యోగము | 30 | 30 | |||
| 8. అక్షరపరబ్రహ్మ యోగము | 26 | 2 | 28 | ||
| 9. రాజవిద్యారాజగుహ్య యోగము | 34 | 34 | |||
| 10. విభూతి యోగము | 35 | 7 | 42 | ||
| 11. విశ్వరూప సందర్శన యోగము | 14 | 33 | 8 | 55 | |
| 12. భక్తి యోగము | 19 | 1 | 20 | ||
| 13. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము | 34 | 1 | 35 | ||
| 14. గుణత్రయ విభాగ యోగము | 26 | 1 | 27 | ||
| 15. పురుషోత్తమప్రాప్తి యోగము | 20 | 20 | |||
| 16. దైవాసురసంపద్విభాగ యోగము | 24 | 24 | |||
| 17. శ్రద్ధాత్రయ విభాగ యోగము | 27 | 1 | 28 | ||
| 18. మోక్ష సన్న్యాస యోగము | 71 | 2 | 5 | 78 | |
| మొత్తం | 574 | 86 | 40 | 1 | 701 |
మొత్తం మీద 745 శ్లోకాలతో పోలిస్తే 44 శ్లోకాలు అందుబాటులో లేవన్నది పైకి కనబడుతున్నా, ఇవి ఎవరు మాట్లాడినవి అన్న వివరాల లోకి వెళ్తే, ధృతరాష్ట్రుడిది ఒకే శ్లోకం వచ్చేసింది, కృష్ణుడివి 46 శ్లోకాలు తగ్గాయి, సంజయుడివి 27 శ్లోకాలు తగ్గాయి, కానీ అర్జునుడివి 29 శ్లోకాలు ఎక్కువ వచ్చాయి, అంటే 73 శ్లోకాలు తగ్గి 29 శ్లోకాలు ఎక్కువ వచ్చాయి అని తెలుస్తుంది. సంజయుడి శ్లోకాలు పోయినందుకు చింత లేకపోవచ్చు కాని, పోయిన శ్లోకాలలో కృష్ణుడివే ఎక్కువ (46) ఉన్నాయి. వాటిల్లో ఏమి చెప్పి ఉంటాడు, లేనివి ప్రక్షిప్తాలుగా చేర్చే అలవాటు ఉన్న మనవాళ్ళు ఈ లోటును భర్తీ చేయకుండా ఎందుకు వదిలేశారు అన్న ప్రశ్నలు బయలుదేరతాయి. ఏది ఏమయినా, ఇది తేలే వ్యవహారం లాగా కనబడటల్లేదు.
భగవద్గీతలో శ్లోకాలన్నీ ఒకే ఛందస్సులో లేవనీ, ఐదు రకాల ఛందస్సులలో ఉన్నాయనీ, ఎక్కువ భాగం (సుమారు 92%) అనుష్టుప్పు ఛందస్సులో ఉన్నాయనీ చదివాను. అనుష్టుప్పు ఛందస్సు అంటే “శుక్లాంబర ధరం విష్ణుం …..” అన్న శ్లోకంలో లాగా పాదానికి 8 అక్షరాల చొప్పున నాలుగు పాదాలకి 32 అక్షరాలు ఉన్న ఛందస్సు. తరువాత అధిక శాతంలో ఉన్నది ప్రతి పాదంలో 11 అక్షరాల చొప్పున మొత్తం 44 అక్షరాలతో ఉండే త్రిష్టుభ ఛందస్సు. ఆ తరువాతి స్థానంలో ప్రతి పాదంలో 12 అక్షరాల చొప్పున మొత్తం 48 అక్షరాలు ఉండే జగతి ఛందస్సు వాడబడింది. ఇవి కాక, ఇంద్రవజ్ర ఛందస్సు (త, త, జ, గ, గ – గణాలతో ప్రతిపాదంలో 11 అక్షరాలు), ఉపేంద్రవజ్ర ఛందస్సు (జ, త, జ, గ, గ – గణాలతో ప్రతిపాదంలో 11 అక్షరాలు), ఈ రెండు ఛందస్సుల మిశ్రమంతో కూడిన ఉపజాతి ఛందస్సు కూడా భగవద్గీతలో వాడబడ్డాయి అని చదివాను.
శ్రీశ్రీ గారు చెప్పిన “వ్యాకరణాల సంకెళ్ళు విడిచి”, “ఛందస్సుల సర్పపరిష్వంగం వదలి” అన్న మాటలకి తగ్గ ప్రయోగాలు ఆ నాడే కృష్ణుడు (వ్యాసమహర్షి ద్వారా) భగవద్గీతలో చేశాడని తెలుస్తోంది. భగవద్గీతలో కొన్ని వ్యాకరణోల్లంఘనలు ఉన్నాయని చదివాను. మొదటిది, పాణిని వ్యాకరణం అంగీకరించని పద ప్రయోగాలు ఉండడం అట. దీన్ని తేలికగా కొట్టేశారు, ఎందుకంటే కాలనిర్ణయం (chronology) ప్రకారం పాణిని చాలా తరువాత వచ్చిన వాడు కనుక. ఇక ఛందస్సుకు సంబంధించిన ఉల్లంఘనలు కొన్ని ఉన్నాయన్నది. ఇటువంటివి, నా బోటి వాళ్ళకి కూడా చాలా సులభంగా అర్థమవుతాయి. అవి ఏమిటంటే, 15వ అధ్యాయం 3వ శ్లోకంలోని మొదటి పంక్తిలో 12 అక్షరాలు మిగిలిన మూడు పంక్తులలో 11 అక్షరాలు ఉన్నాయనీ, అలాగే 2వ అధ్యాయం 29వ శ్లోకంలో 2వ పాదం 12 అక్షరాలతోను మిగిలిన మూడు పాదాలు 11 అక్షరాలతోను ఉన్నాయనీ అన్నారు. అబ్బ! ఉంటే ఉన్నాయి లెండి, మనం భగవద్గీత చదవడానికి అవేమీ అడ్డుకాదుగా, అని అనుకొని ముందుకు పోవాలి.
ఇకపోతే, కొన్ని శ్లోకాలు వివాదాస్పదం అన్న అభిప్రాయాలు కూడా చదివాను. ఉదాహరణకి, క్రింద ఇవ్వబడిన 9వ అధ్యాయమైన రాజవిద్యా రాజగుహ్యయోగం లోని 32 వ శ్లోకం.
“మాం హి పార్థ వ్యపాశ్రిత్య వ్యపాయే౽పి స్యుః పాపయోనయః
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తే౽పి యాంతి పరాంగతిం!”
అంటే, నన్ను శరణు జొచ్చు వారు అథమజన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు అని శ్రీకృష్ణుడు చెప్పాడట. పాపులను, స్త్రీలను, వైశ్య శూద్రులను ఒకే గాటన కట్టడం వివాదాస్పద మయ్యిందనుకుంటా.
భగవద్గీతను కృష్ణార్జున సంవాదం అని మనం అనడం కాదు. ఆ విషయం అందులోనే చెప్పబడింది. కానీ కొందరు విమర్శకులు, అది మాట్లాడుకున్నదీ కాదు, ఆలాపించిందీ కాదు, వ్రాయడం చదవడం మొదలైన తరువాత రాసిందే అని అంటున్నారు. వారి వాదనకు భగవద్గీత 18వ అధ్యాయంలోని 70వ శ్లోకం (క్రింద ఇవ్వబడింది) కొంత బలాన్నిస్తోంది:
“అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః ।
జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టః స్యామితి మే మతిః”
అంటే, ఎవరు మన ఇద్దరి మధ్య జరిగిన ఈ ధర్మయుక్తమైన సంభాషణను (గీతాశాస్త్రాన్ని) అధ్యయనం చేస్తారో (అనగా పఠిస్తారో), వారు తమ జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించినట్లే అవుతుంది, ఇది నా దృఢమైన అభిప్రాయం అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడట. ఈ శ్లోకంలో పఠించడం గురించి అన్నాడుగా, వ్రాస్తేనే కదా పఠించేది అని అక్కడ పట్టుకున్నారు విమర్శకులు. అర్జునుడు గాండీవం జార్చడం అతడిని నీరసం క్రమ్మడం వంటి అనూహ్యపరిణామాలపై అప్పటికప్పుడు జరిగిన సంభాషణను వ్రాసియుండక పోతే ఎవరూ చదవలేరు అన్నది వారి వాదం లోని సారాంశము. ఇది కాక, ఇంకో అడుగు ముందుకు వేసి భగవద్గీతను ఒక వ్యక్తి కాదు, వేరు వేరు సమయాలలో విభిన్న వ్యక్తులు వ్రాశారు అని కూడా అన్నారు. కాల నిర్ణయాన్ని బట్టి కృష్ణుడు గీతాప్రవచనకర్త మాట అటుంచి గీతారచయిత కూడా కాదని తేల్చారు.
మహాత్మ గాంధీ తన అహింసా సిద్ధాంతానికి భగవద్గీత నుండే స్ఫూర్తిని పొందారు అని కొంత మంది అంటారు. కానీ, భగవద్గీత మతపరమైన తీవ్రవాదాన్ని (religious extremism) ప్రబోధిస్తోందని ఆ మధ్య (2011లో) రష్యాలో నిషేధించే ప్రయత్నాలు జరుగగా న్యాయస్థానం జోక్యంతో అవి సద్దుమణిగాయి. ఈ వాదనల దృష్ట్యా, కృష్ణార్జునులను, వ్యాసుణ్ణి, ఇంకా ఇతరులను బోనులో నిలబెట్టి నిజం నిగ్గు తేల్చడం కుదరదు. అందుకని, తెలివయిన పని ఏమిటంటే, ఆమోదయోగ్యమైనవి, ఆచరణయోగ్యమైనవి అంగీకరించి ముందుకు సాగడం. ఆ ప్రయత్నాన్ని ప్రోత్సహించడమే, ఈ రచన యొక్క ఉద్దేశ్యం.
మహాభారతాన్ని ఆంధ్రీకరించిన వారిలో ఒకడైన తిక్కన భీష్మపర్వంలో (ప్రథమాశ్వాసం) భగవద్గీతా వృత్తాంతాన్ని కేవలం 60 గద్యపద్యాలతో (క్రమ సంఖ్యలు 171 నుండి 230 వరకు) సరిపెట్టాడు. వాటిల్లో 19 గద్యపద్యాలు (క్రమసంఖ్యలు 171 నుండి 189 వరకు) అర్జున విషాదం గురించే. అంటే, అసలైన భగవద్గీతను 41 గద్యపద్యాలలో తిక్కన సంక్షేపించాడని తెలుస్తోంది. తిక్కన భగవద్గీతను ప్రత్యేకంగా తెనిగించక పోవడానికి కారణాలు నేను చదివి తెలుసుకున్న దానిని బట్టి మూడు. కథాగమనానికి అడ్డువస్తుందని, అంత అవసరం లేక పోవచ్చని సనత్సుజాతీయాన్ని తెనిగించకుండా వదిలేసిన తిక్కన, భగవద్గీతను సాంతం వదిలేయడం కుదరదు కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకే తీసుకుని ఉండవచ్చు. తన కాలం నాటికే భగవద్గీత సంస్కృతంలో అత్యంత ప్రాచుర్యం పొందింది కనుక, ప్రజలు అలవాటు పడ్డ దానిని తెనిగించడం ఎందుకు అని తిక్కన అనుకుని ఉండవచ్చు. కొంత మంది విమర్శకుల అభిప్రాయం ప్రకారం, తిక్కన భగవద్గీతను భీష్మ పర్వం ప్రథమాశ్వాసంలోనే ఒక్క చోటనే కాకుండా, దాని సారాన్ని సందర్భోచితంగా వేరు వేరు చోట్ల పరోక్షంగా స్పృశించాడట.
లిపి, వ్రాయడం లేని కాలంలో ఒకళ్ళకి ఒకళ్ళు చెప్పుకోవడం ద్వారానే వేద పురాణాది వాఙ్మయం వ్యాప్తి చెందింది. అయితే, ఒకళ్ళు చెప్పింది విని, దాన్ని ఇంకొకళ్ళకు చెప్పే క్రమంలో అనుకోకుండా కూడా కొన్ని వక్రీకరణలు జరిగే అవకాశముంది. ఒక్కోసారి ఎవరన్నా చెప్పింది వాళ్ళు ఒక ఉద్దేశ్యంతో ఒక అర్థంతో చెబితే, వినేవాడికి అది వేరే విధంగా అనిపించవచ్చు. ఆ విధంగా ఒకళ్ళ నుండి ఇంకొకళ్ళకి పాకుతూ, గ్రంథస్థం చేసే నాటికి దాదాపుగా స్థిరమైంది ఆ వాఙ్మయం. అలా గ్రంథస్థం అవడం గనక వేరు వేరు ప్రదేశాల్లో జరిగి ఉంటే, ఒకే గ్రంథం అక్కడక్కడా భిన్నంగా ఉండడం కూడా కద్దు.
జనమేజయుడికి వైశంపాయనుడు సర్పయాగం సందర్భముగా వ్యాస నిర్మితమైన మహాభారతాన్ని చెప్తుండగా విని సూతుడు, మునియైన ఉగ్రశ్రవుడు నైమిశారణ్యానికి వచ్చి దాన్ని శౌనకాది మహామునులకు మళ్ళీ చెప్పాడు. అంటే, వ్యాసుని నుండి వైశంపాయనుడికి, వైశంపాయనుని నుండి ఉగ్రశ్రవునికి, ఆ సూతుని నుండి శౌనకాది మహామునులకు చేరింది, ప్రారంభంలో మహాభారతం. భగవద్గీత విషయానికి వస్తే, ఇంకో రెండు అదనపు మాధ్యమాలు (mediums) కూడా ఉన్నాయి. కృష్ణుడు అర్జునుడికి చెబుతున్న దాన్ని సంజయుడు విని ధృతరాష్ట్రుడికి చెప్పగా దాన్ని వ్యాసుడు గ్రంథస్థము చేశాడు. అంటే, ఇక్కడే ఐదు మాధ్యమాలు అయినాయి. తరువాత చాలా కాలానికి ముందుగా తాళపత్రాలు ఆ తరువాత ముద్రణా యంత్రాలు వచ్చి స్థిరమైన రూపం దాల్చే నాటికి ఇంకా ఎన్ని మాధ్యమాలు ఉండి ఉంటాయో, దాని వల్ల మహాభారతంలో ఎన్ని వక్రీకరణలకి ఆస్కారం కలిగిందో చెప్పడం కష్టం.
ఉపనిషత్తుల సారంగా కీర్తించబడిన భగవద్గీతలో పరస్పర విరుద్ధమైన భావనలు కొన్ని ఉన్నాయని కొంత మంది విమర్శకుల అభిప్రాయము. గీత అహింసను చెప్పలేదని, ఒక్క చోట మాత్రమే అహింస ప్రస్తావన ఉన్నదని, అహింస, సమానత్వం అన్నవి గీత ప్రయోజనానికే విరుద్ధమని, అంచలవారీ అసమానత్వాలకు దారి తీసిన కులవిధానంలో సమానత్వం కుదరదని, ఎవరో కావాలని అహింస, సమానత్వపదాలను ఒక చోట గీతలో చేర్చారని, బుద్ధిజం (Buddhism) వ్యాప్తిని అరికట్టడానికి గీతను అల్లారని రకరకాల భావనలు వ్యాప్తిలో ఉన్నట్లు చదివాను. వివరాలు ఒక్కొక్క అధ్యాయం గురించి మాట్లాడుకునేటప్పుడు వీలయినంతవరకు పరిశీలిద్దాం.
Most writeup dedicated to technicalities, statistics on slokas distribution and commentators views. Perhaps the author plans to provide his chapter wise views and essential teachings of Bhagavat Geeta in subsequent writeups. This is a good initiative. I expect summary of essential teachings according to author only not what other commented upon. Thank you.
LikeLike