భగవద్గీత 3వ అధ్యాయములో అనేక శాస్త్ర విహిత కర్మలు ఆచరించే ఆవశ్యకత, భక్తి ప్రధానమైన కర్మయోగ విధి చేత మమకార-ఆసక్తి-కామనలను పూర్తిగా వదిలిపెట్టి భగవదర్పణ బుద్ధితో కర్మలు చేయడం, రాగద్వేషముల వలలో చిక్కుకొనకుండా స్వధర్మపాలన చేయడం, కామము సర్వానర్థాలకు మూలకారణం కాబట్టి బుద్ధి చేత ఇంద్రియములను, మనస్సును వశంలో ఉంచుకుని కామమును నశింపజేయడం, లాంటి అనేక విషయాల గురించి కృష్ణుడు చెప్పాడు. కర్మయోగ తత్త్వము మిక్కిలి లోతైనది కాబట్టి మళ్ళీ దాన్ని గురించి ఇంకా చెప్పే ఉద్దేశ్యంతో నాల్గవ అధ్యాయమైన జ్ఞానకర్మ సన్న్యాస యోగము చెప్పడం మొదలుపెట్టాడు. ఈ అధ్యాయంలో 42 శ్లోకాలు ఉన్నాయి. 41 శ్లోకాలు కృష్ణుడు చెప్పినవి, ఒక శ్లోకం అర్జునుడు అడిగిన అనుబంధ ప్రశ్నకు సంబంధించినది.
ప్రారంభంలో కర్మయోగం యొక్క పరంపర (విడవకుండా సాగినది) గురించి చెప్పి అది అనాది అని నిరూపిస్తూ దాన్ని ప్రశంసించాడు కృష్ణుడు. ఇంకా ఇలా చెప్పాడు: “అర్జునా! వినాశరహితమైన ఈ యోగమును నేను సూర్యునికి చెప్పాను. అతడు తన పుత్రుడైన వైవస్వత మనువుకు, ఆ మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకు మహారాజుకు చెప్పెను. ఈ విధంగా ఈ యోగం మహర్షులకు చేరింది. తరువాత చాలా కాలంగా ఈ యోగము భూమండలంలో లోపించినట్లయ్యిందని ఇప్పుడు నీకు చెబుతున్నాను. ఎందుకంటే, ఇది మహోత్తమ రహస్యము. ఇది గుప్తమైనా కూడా నువ్వు భక్తుడవు, ప్రియసఖుడవు కాబట్టి నీకు చెబుతున్నాను (ఇలా బహుశా, కృష్ణుడు చెప్పి ఉండడు. ఒక పక్క రహస్యం అంటూనే చెప్పడం, రెండవ పక్క ప్రియసఖుడు కాబట్టి చెప్పడం, అది కూడా ఇష్టులు అయిష్టులు అంటూ ఎవరూ నాకు లేరని చెప్పుకునే కృష్ణుడు అలా చెప్పడం నా లాంటి వాళ్ళకి నమ్మ బుద్ధి కాదు).”
అప్పుడు అర్జునుడు ఈ విధంగా అడుగుతున్నాడు: “కృష్ణా! నీ పుట్టుక ఇప్పటిది. సూర్యుడు కల్పాదిలో పుట్టాడు. మీరు సమకాలికులు కారు గదా. మరి, నువ్వు సూర్యుడికి ఈ యోగం ఎట్లా చెప్పావు?”
అప్పుడు కృష్ణుడు ఇలా చెబుతున్నాడు: “పరంతపా! నాకు నీకు అనేక జన్మలు గడిచినాయి (ఇక్కడ వ్యాసుడు పదప్రయోగంలో ఒక చమత్కారం చేశాడు. “పరంతప” అంటే “శత్రువులను తపింపజేయు వాడు” అని, “సూర్యుడు” అని రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిది మామూలు మాటే. అది అర్జునుడికి నప్పేదే. రెండవది, సూర్యుని వంటి తేజస్సు కలవాడా! నువ్వు ఇప్పుడు ఎలా అయితే నా దగ్గర నేర్చుకుంటున్నావో కల్పాది యందు సూర్యుడు కూడా అలాగే నేర్చుకున్నాడు అని పరోక్షంగా చెప్పడం.). ఆ జన్మలన్నిటినీ నీవెరుగవు. కానీ, నేనెరుగుదును. నేను జన్మరహితుడనైనను, వినాశరహిత స్వరూపుడనైనను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడనైనను నా ప్రకృతిని అదుపులో ఉంచుకుని నా మాయ చేత ప్రకటితమవుతూ ఉంటాను. ధర్మానికి హాని అధర్మానికి వృద్ధి కలిగినపుడల్లా నేను నా రూపాన్ని రచించుకుంటాను. అంటే, సాకారరూపంలో లోకుల ఎదుట ప్రకటితమవుతూ ఉంటాను. సాధుపురుషులను ఉద్ధరించడానికి పాపకర్మలు చేసేవారిని నాశనం చెయ్యడానికి ధర్మాన్ని బాగా స్థాపించడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తూ ఉంటాను. (అంటే, అధర్మం అనేది ఎప్పుడూ ఉండేదే కాబట్టి ప్రతి యుంగంలో అవతిరిస్తుంటాను అని చెప్పినట్లు.) అర్జునా! నా జన్మ, కర్మ, రెండూ దివ్యములే. అవి నిర్మలములు, అలౌకికములు అని ఏ మనిషైతే తెలుసుకుంటాడో అతడు శరీరత్యాగము చేసిన తరువాత పునర్జన్మ పొందడు. నన్నే చేరుకుంటాడు. మొదట ఎవరి రాగ, భయ, క్రోధాలు పూర్తిగా నష్టమై పోయాయో, ఎవరు నా యందు అనన్య భావంతో స్థిరంగా ఉన్నారో, అటువంటి నా ఆశ్రితులు చాలమంది భక్తులు పైన చెప్పిన జ్ఞానతపస్సు చేత పవిత్రులై నన్ను చేరారు. అర్జునా! భక్తులు ఏ విధంగా నన్ను భజిస్తారో, నేను కూడా అట్లే వారిని భజిస్తాను. ఎందుకంటే, మనుషులంతా, అన్ని విధాల నా మార్గాన్నే అనుసరిస్తారు. ఈ మనుష్య లోకంలో కర్మఫలాలు కోరేవారు దేవతలను పూజిస్తారు. ఎందుకంటే, వారికి కర్మల నుండి కలిగే సిద్ధి శీఘ్రంగా లభిస్తుంది (“ఆకాశాత్ పతితం తోయం, యథా గచ్ఛతి సాగరం, సర్వదేవ నమస్కారః, కేశవం ప్రతిగచ్ఛతి” అనే శ్లోకానికి అర్థం ఇదేనేమో. అంటే, ఆకాశం నుండి కురిసిన వర్షపు నీరు ఎలాగైతే చివరికి సముద్రాన్ని చేరుతుందో, అలాగే ఏ రూపంలో ఏ దేవతకు చేసిన నమస్కారం/పూజ అయినా ఆ సర్వేశ్వరుడైన పరమాత్మకే చెందుతుంది.).
అర్జునా! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు జాతుల వారిని గుణ కర్మల విభాగ పూర్వకంగా నేనే సృష్టించాను (కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ విభాగము మనకు ప్రతి రంగంలోను, ప్రతి వ్యవస్థలోను కనిపిస్తుంది. మనం తరువాతి కాలంలో, కులాలు ఉపకులాలు అంటూ ఇంకా ఎన్నో సృష్టించినా కూడా, వాటన్నిటికీ మూల రూపం చాతుర్వర్ణ్య వ్యవస్థే.). ఈ విధంగా ఆ సృష్టి – రచనలకు నేనే కర్తయైనప్పటికీ, వినాశరహితుడు పరమేశ్వరుడు ఐన నన్ను అకర్తగానే తెలుసుకొనుము (శాస్త్ర విహిత కర్తవ్య కర్మలకి కర్తృత్వం తీసుకోవద్దు అని మనకి కూడా బోధించాడు. తాను కూడా అదే చేస్తున్నాడు.). కర్మఫలములలో నాకు స్పృహ లేదు. కాబట్టి, నన్ను కర్మలు అంటవు. ఈ విధంగా నన్ను సరిగ్గా తెలుసుకున్నవాడు కూడా కర్మబంధంలో చిక్కుకొనడు. పూర్వకాలంలో ముముక్షువులు కూడా ఇట్లా తెలుసుకునే కర్మలు చేశారు. కాబట్టి నీవు కూడా పూర్వులు సర్వదా చేసిన కర్మలే చెయ్యి.
నువ్వు కర్మ (చేయదగిన కార్యము), అకర్మ (చేయదగని కార్యము), వికర్మల (అన్యాయమగు కర్మ) స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఏ మనిషి కర్మలో అకర్మను అకర్మలో కర్మను చూస్తాడో అతడే బుద్ధిమంతుడు. ఆ యోగి అన్ని కర్మలు చేసేవాడు. ఎవరి శాస్త్ర సమ్మతమైన కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా ఉంటాయో, ఎవరి కర్మలు జ్ఞానమనే అగ్నితో దహించబడ్డాయో, వారిని జ్ఞానులు కూడా పండితులు అని పిలుస్తారు. ఎవరైతే కర్మలలో పూర్తిగా వ్యవహరిస్తున్నా కూడా, కర్మల యందు కర్మఫలముల యందు ఆసక్తిని విడిచి ప్రపంచం పట్టకుండా పరమాత్మలో ఎప్పుడూ తృప్తుడై ఉంటాడో, అతడు నిజానికి ఏమీ చేయడు (ఈ స్థితి కొంత సమయ జాప్యంతో [time lag] కొద్ది సేపు అప్పుడప్పుడు మనక్కుడా వస్తూ ఉంటుందనుకుంటాను). ఎటువంటి ఆశలు లేని పురుషుడు, అంతఃకరణమును శరీరేంద్రియములను జయించినవాడు, సమస్త భోగాలను మమత్వమును త్యజించిన వాడు, శరీరం నిలబెట్టుకోడానికి మాత్రమే కర్మలు చేస్తే అతడికి ఏ పాపమూ అంటదు. కోరకుండా ప్రాప్తించే వాటితో ఎప్పుడూ సంతృప్తి చెందేవాడు, అసూయ లేనివాడు, సుఖదుఃఖాల లాంటి ద్వంద్వాలకు అతీతుడు, సిద్ధి అసిద్ధి – రెంటి యందు సమబుద్ధి ఉన్న వాడు, కర్మలు చేస్తున్నా కూడా కర్మబంధాలలో చిక్కుకోడు. ఎవరికి దేహాభిమానం మమకారం లేకుండా ఉండి ఆసక్తి నష్టమై పోయి మనస్సు పరమాత్మ జ్ఞానం మీద స్థిరంగా నిలిచి ఉంటుందో, అతడు కేవలం యజ్ఞం కోసమే కర్మలు చేస్తే అటువంటి వాడి సర్వకర్మలు పూర్తిగా విలీనాలయిపోతాయి. అంటే, పునర్జన్మ నిచ్చే కర్మఫలాలుగా మిగిలి యుండవు.
స్రుక్ (హోమపాత్రము), స్రువములు (హోమసాధనమైన కొయ్యగరిటె) రెండూ బ్రహ్మమే. హోమ ద్రవ్యము లేక హవిస్సు (నేయి మొదలైనవి) కూడా బ్రహ్మమే. యజ్ఞమును ఆచరించేవాడు బ్రహ్మము. అగ్ని కూడా బ్రహ్మమే. ఆహుతి ఇవ్వడం కూడా బ్రహ్మమే. ఇలాంటి బ్రహ్మకర్మలో స్థితుడై ఉండే యోగి పొందదగిన యజ్ఞఫలం కూడా బ్రహ్మమే. కొందరు యోగిజనులు దేవతాపూజ రూపమైన యజ్ఞాన్ని విశేషంగా చేస్తారు. మరి కొందరు యోగులు పరమాత్మ పరబ్రహ్మ రూపాగ్ని యందు అభేద రూపమైన జ్ఞానయజ్ఞాన్ని చేస్తారు. కొంత మంది యోగులు శ్రోత్రాది (చెవి, కన్ను, ముక్కు, నాలుక, చర్మము మొదలైన) సర్వేంద్రియములను సంయమ (అణచుట లేక నిగ్రహించుట) రూపమైన అగ్ను లందు హోమం చేస్తారు. మరి కొందరు యోగులు, శబ్దాది సమస్త విషయములను ఇంద్రియాలనే అగ్నిలో హోమం చేస్తారు. చుట్టూ జరుగుతున్న విషయాకర్షణల నుండి ఇంద్రియాలను తాబేలు మాదిరిగా వెనక్కి తీసుకొని శాంతంగా ఉండటమే సంయమ రూపాగ్నిలో హోమం చెయ్యడం. ఆ విషయాలను ఇంద్రియాలలో లయం చెయ్యడాన్నే ఇంద్రియాలనే అగ్నిలో వేల్చడం అంటారు. అంటే, వినబడేవి – కనబడేవి, రుచించేవి – రుచించనివి, బాగుండేవి – బాగుండనివి, తిట్లు – పొగడ్తలు, ఇలాంటి వాటి మీద అనాసక్తితో ఉంటూ అవి కలిగించే వికారాలు కలగనీయకుండా ఉండటం. అప్పుడప్పుడు, మనస్సు బాగా లేనప్పుడు కొన్ని ఇలాంటి అనుభూతులు మనలో కొంతమందికి కలిగే ఉంటాయి. ఇతర యోగిజనులు ఇంద్రియముల కర్మలను, ప్రాణుల క్రియలను జ్ఞానంతో వెలిగే ఆత్మసంయమ రూపమైన అగ్నిలో ఆహుతి చేస్తారు. అంటే, బుద్ధిలో పరమాత్మ మాత్రమే ఉంటే ప్రాణ ఇంద్రియ క్రియల ప్రభావం ఏమీ ఉండదు.
చాలా మంది ద్రవ్యసంబంధమైన యజ్ఞమును చేసే వాళ్ళుంటారు. అంటే, తమకు న్యాయంగా లభించిన వస్తువులను మమకారం, ఆసక్తి, ఫలితం మీద శ్రద్ధ లేకుండా అర్హతను అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజసేవకు అర్పించడాన్నే ద్రవ్యయజ్ఞం అంటారు. ఈ విధంగా సమాజసేవ చేసే వాళ్ళను మనం చూస్తూనే ఉంటాము. ఇలా కాకుండా, అన్యాయంగా అర్జించిన ధనం వస్తువులు ఇతరులకు దానం చేసే వాళ్ళను, గుళ్ళల్లో హుండీలలో వేసే వాళ్ళను కూడా చూస్తూ ఉంటాము. దాన్ని ద్రవ్యయజ్ఞం అనరు. తపస్సు రూపంలో యజ్ఞం చేసే వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. పరమాత్మను పొందే ఉద్దేశ్యంతో త్యాగమయమైన జీవితాన్ని గడిపే వారు, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి అయినా ధర్మాన్ని నిలపడానికి ప్రయత్నించేవారు, చేసే దాన్ని తపోయజ్ఞం అంటారు. యోగమనే యజ్ఞం (యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధులు అనబడే ఎనిమిది అంగములు) చేసే వాళ్ళు కొంత మంది ఉన్నారు. కొంత మంది అహింస లాంటి కఠోర వ్రతనియమాలతో ప్రయత్నశీలురై స్వాధ్యాయము అనే జ్ఞాన యజ్ఞం (అర్థం తెలుసుకుని, మమకారం ఆసక్తి ఫలితాల మీద ఇచ్ఛ లేకుండా, భగవంతుని తత్త్వము వర్ణించే శాస్త్రాలు వేద వేదాంగాలు అధ్యయనం చెయ్యడాన్ని స్వాధ్యాయ జ్ఞానయజ్ఞం అంటారు.) చేస్తారు. భగవద్గీత అర్థం చేసుకుని చదవడం కూడా జ్ఞానయజ్ఞమే. కొంత మంది ఇతర యోగులు అపాన వాయువులో ప్రాణవాయువును ప్రాణవాయువులో అపాన వాయువును హోమం చేస్తారు. నియమితాహారం తినే కొందరు ప్రాణాయామం అంటే ఉన్న ఆసక్తితో ప్రాణ అపాన వాయువుల గమనాన్ని అరికట్టి ప్రాణవాయువులను ప్రాణవాయువులలోనే వేల్చెదరు. యజ్ఞాల గురించి ఎరిగిన ఈ సాధకులు యజ్ఞాల ద్వారా పాపం నశింపజేసే వాళ్ళుగా ఉంటారు. యజ్ఞంలో మిగిలిన అమృతమును (అంటే, యజ్ఞానికి సంబంధించిన సాధనములు ఆచరిస్తే కలిగే మానసిక పరిశుద్ధత) అనుభవించే యోగులు సనాతన పరబ్రహ్మయైన పరమాత్మను పొందుతారు. యజ్ఞం చెయ్యని వాళ్ళు ఈ లోకంలో సుఖం పొందరు. ఇక పై (పర) లోకం మాట చెప్పక్కర్లేదు.
ఈ విధంగా ఎన్నో రకాల యజ్ఞాలు ఎన్నో విధాలుగా వేదాలలో విపులంగా చెప్పబడ్డాయి. అవన్నీ మనస్సు, ఇంద్రియములు, శరీరము – ఈ మూడింటిలో ఏదో ఒక దానితో సంబంధం లేకుండా లేవు. అట్లా సంబంధము లేని యజ్ఞ మంటూ ఏదీ లేదు. ఈ విధంగా తత్త్వంతో సహా తెలుసుకుని వాటిని ఆచరిస్తే నువ్వు కర్మబంధాల నుండి విముక్తుడవవుతావు. పరంతపా! ద్రవ్యమయ యజ్ఞం కన్నా జ్ఞాన యజ్ఞం మిక్కిలి శ్రేష్ఠము. ఎన్ని యజ్ఞాలున్నా అవి జ్ఞానయజ్ఞంలో సమాప్తి అవుతాయి. తత్త్వదర్శనులైన జ్ఞానులను కపటం లేకుండా సేవించి శ్రద్ధగా పరమాత్మ తత్త్వాన్ని వారి వద్ద నుండి నేర్చుకో. అట్లా నేర్చుకున్న తరువాత ఈ రకమైన మోహం మళ్ళీ కలగదు. ఆ జ్ఞానం వల్ల ఈ సమస్త ప్రపంచాన్ని మొదట నీలోను తరువాత పరమాత్ముడనైన నాలోను నిశ్శేషముగా చూడగలుగుతావు. ఒక వేళ నువ్వు మహాపాపివి అయినా కుడా జ్ఞాననౌక నిన్ను పాపసముద్రం నుండి నిస్సందేహంగా గట్టెక్కిస్తుంది.
ఏ విధంగా ప్రజ్వలిస్తున్న అగ్ని ఇంధనాలను భస్మం చేస్తుందో, జ్ఞానాగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది. ఈ లోకంలో జ్ఞానంతో సమానంగా పవిత్రము చేయగలది మరొకటి లేదు. చాలా కాలం కర్మయోగం ఆచరిస్తే మనస్సులో రాగద్వేషాలు నశించి, మమకారం ఆసక్తి ఫలితం మీద ఇచ్ఛ లేకుండా కర్మలు చేయడం అలవాటైన మనుష్యుడు, తనకు తానుగా జ్ఞానాన్ని ఆత్మలో పొందగలుగుతాడు. జితేంద్రియుడు, సాధన చేయడంలో ఆసక్తి ఉన్నవాడు, శ్రద్ధాళువు అయిన వాడు జ్ఞానాన్ని పొందగలడు. జ్ఞానం పొందిన తరువాత, ఏ మాత్రం ఆలస్యం లేకుండా, అతడు పరమ (పరమాత్మ తత్త్వరూపమైన) శాంతిని పొందగలడు. జ్ఞానం శ్రద్ధ లేని వాడు, సంశయాత్మకుడు అయిన మనుష్యుడు పరమార్థము నుండి భ్రష్టుడవడం ఖాయం. అట్లా అనుమాన పడేవాడికి ఇహపరాలు ఉండవు, సుఖమూ ఉండదు. ఎవరైతే కర్మయోగం విధించిన విధంగా సమస్త కర్మలను కర్మఫలాలను పరమాత్మకు అర్పించాడో, ఎవరు జ్ఞానంతో సమస్త సంశయాలను లేకుండా చేసుకున్నాడో, అతడికి అంతఃకరణము అదుపులో ఉండడం వల్ల కర్మ బంధాలు ఉండవు. కాబట్టి అర్జునా! నీ హృదయంలో ఉన్న అజ్ఞాన జనితమైన అనుమానాన్ని జ్ఞానమనే కత్తితో ఖండించి సత్యమనే కర్మయోగం ద్వారా స్థిరంగా ఉండి యుద్ధం చెయ్యడం కోసం లేచి నిలబడి సిద్ధమవ్వు.
In para 2 of the article Emphasis by Lord Krishna is that Arjuna is the right candidate who is having desired qualities to receive Bhagavat Geetha.In para 3, Arjuna is comparable not exactly at par with Sun God but both were suitable. Two tips provided by the Lord are:i) kind of Jnana such as HIS (lord) birth karma (during HIS incarnation) both are verily divine and the individual who understand this do not take birth when one leaves one’s body.ii) The kind of Sadhana advised was if a person’s feelings of attachment, fear and anger are totally nullified then he becomes Ashrita to Lord then become sanctified by Jnana and attain HIS lotus feet.Among the humans, whose target is results of karma (against tyaga) get those results of karma from devethas and not moksha.In para 5/6, Here some definitions I gather and add here on Karma, Vikarma and Akarma.Karma – Activities of limbs, senses, intelligence, emotions and mind etc are KarmasVikarma – All karma that are done to earn Atma jnana or with an intent. Sometimes it is merged with Karma.Akarma – means action done in Atma sthiti, the attribute of Atma (desire less actionalso called Nishkriyatmaka karma. In fact it is not non performance of any activity as no person can avoid karma.It is said ” Win Karma in Akarma and Akarma through Karma”A good every day example of travelling in a train and looking out side at Trees and Poles through window glass. We do have a feeling intially that Trees are moving. The experience that Atma is Akarma is real Akarma. The moment of Train imposes the quality of Trees and Poles.
Thanks to the Authors for series of articles – this too long and I could go through and write on few paras.
LikeLike
ఈ అధ్యాయం లో విషయాలను చక్కగా వివరించారు. కృష్ణుడు తన రూపాన్ని రచించు కోవటం , యే దేవతకు పూజ చేసినా అది పరమాత్మ కు చెందుతుందని, భగవద్గీత ను అర్థం చేసుకొని చదవడం జ్ఞాన యజ్ఞము అని చక్కగా వివరించారు. జ్ఞానము వలన కర్మ లను, కర్మఫలాలును భగవంతుని కి అర్పించుట, పూర్తిగా అవగాహన వుండుట వలన పరమాత్మ తత్వరూపం అర్థం అవుతుందని బాగా తెలియజేశారు. ఇది పరమ సత్యం. భగవద్గీత ను అర్థం చేసుకొన్న వారి జీవితం సత్వ గుణాలు కలిగి, మంచి మార్గా న్ని కలుగచేస్తుంది అనుటలో యే మాత్రం సందేహం కలగదు. మంచి విషయాలును చక్కగా వివరించి అర్థం చేసుకోవటానికి అవకాశం కల్పించారు. మీకు అభినందనలు మరియు ధన్యవాదాలు.
LikeLike