కథలలో లిష్టులు

కథలలో లిష్టులు (lists) ఏమిటి, ట్విష్టులు (twists) కదా ఉండాల్సింది అని అనుకుంటున్నారా. అదే గమ్మత్తు. అయితే ఈ గమ్మత్తు చేసింది ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది. అసలు లిష్టులు అంటే వాటిల్లో ఏముండాలి? మనం చెప్పే కథకి వాటికి లింకు (link) ఏమిటి? ఈ ప్రశ్న లన్నిటికీ మన సాహిత్యంలో దొరికే కొన్ని సమాధానాలు చూద్దాం.

అసలు మన ఆదికావ్యమైన వాల్మీకి రామాయణం ఒక లిష్టుతోనే మొదలవుతుంది. వాల్మీకి మహర్షి నారదుడికి 16 గుణాల లిష్టు చెప్పి ఆ గుణాలు ఉన్నవాడు ఉన్నాడా అని అడగడంతో రామాయణం ప్రారంభమవుతుంది. ఆ గుణాలున్న మహాపురుషుడు శ్రీరాముడని నారదుడు చెబుతాడు. శ్రీరాముడిలో ఆ గుణాలున్నాయని నిరూపించే వివిధ సందర్భాలను చూపించేదే రామకథ. ఈ పంథా తరువాతి కాలంలో కావ్యాలలోను, నాటకాలలోను అనుసరించారు.

అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రలోని ప్రథమాశ్వాసములో తీర్థయాత్ర లంటే ఇష్ట మున్న ప్రవరుడు మీరు ఏమేమి చూశారు అని సిద్ధుడిని అడుగుతాడు. దానికి సమాధానంగా సిద్ధుడు చెప్పినది ఈ క్రింది పద్యంలో చూడవచ్చు.

కేదారేశు భజించితిన్ శిరమునన్ గీలించితిన్ హింగుళా

పాదాంభోరుహముల్ ప్రయాగనిలయున్ బద్మాక్షు సేవించితిన్

యాదోనాథసుతాకళత్రు బదరీనారాయణున్ గంటి నీ

యాదేశం బన నేల? చూచితి సమస్తాశావకాశంబులన్

నేను కేదారేశ్వరుని సేవించాను. హింగుళా దేవి పాదపద్మాలను శిరస్సున ధరించాను. ప్రయాగలో వసించు పద్మాక్షుడైన విష్ణుమూర్తిని భజించాను. సముద్రుని కుమార్తె భార్యగా కలవాడైన బదరీనారాయణుని దర్శించాను. నాలుగు పేర్ల లిష్టు చెప్పి, ఈ దేశం ఆ దేశం అని చెప్పడమెందుకు, ప్రపంచ మంతా చూశానని సిద్ధుడు సూక్ష్మంగా తేల్చాడు, పై పద్యంలో. అయితే, సిద్ధుడు చెప్పిన లిష్టులో ఒక ఆశ్చర్యకరమైనది ఉంది. అదే హిందూ మత విశ్వాసానికి సంబంధించిన 51 ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటైన హింగుళా దేవి (హింగ్లాజ్ మాత) ఆలయం. అది పాకిస్థాన్‌ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో, హింగోల్ నది ఒడ్డున ఒక పర్వత గుహలో ఉంది. కేదారనాథ్, బదరీనాథ్, ప్రయాగలతో పాటు హింగుళాదేవి ఆలయాన్ని ఒక దక్షిణభారత కవి ప్రస్తావించడం ఆశ్చర్యమే. ఇక అసలు విషయానికి వద్దాం.

బమ్మెర పోతన రచించిన శ్రీమద్భాగవతంలో మనందరికీ తెలిసిన పద్యం ఒకటి గుర్తు తెచ్చుకుందాము.

శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా

హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం

దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా

కారత నొప్పు నిన్ను మదిఁ గానగ నెన్నడుఁ గల్గు భారతీ.

పైన చెప్పిన పద్యంలో తెల్లని ఆకారంతో ప్రకాశించే సరస్వతీ దేవిలోని తెల్లదనాన్ని పోల్చడానికి ఒక లిష్టు ఇవ్వబడింది. ఆ లిష్టులో 16 ఉన్నాయి. అవి ఏమిటంటే – శరత్కాల మేఘము, చంద్రుడు, కర్పూరం, మంచిగంధం, హంస, మల్లెపూల దండ, మంచు, నీటి నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, అడవిమల్లెలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగ అన్నవి. పై పద్యం కథలో అంతర్భాగం కాదు గానీ భాగవతం ప్రథమ స్కంధములోని ఉపోద్ఘాతములో ఇష్టదేవతా ప్రార్థన పద్యాలలో ఒకటి.

అయితే, పోతన భాగవతంలోని ప్రహ్లాదోపాఖ్యానములో హిరణ్యకశిపుని వరాల గురించిన పద్యంలో ఒక నెగిటీవ్ లిష్టును (negative list) చూడవచ్చు. వేటి నుండి తనకు మృత్యువు రాకూడదో వరంగా ఇమ్మని బ్రహ్మను ప్రార్థిస్తాడు హిరణ్యకశిపుడు. ఆ పద్యం క్రింద ఇవ్వబడింది.

గాలిం, గుంభిని, నగ్ని, నంబువుల, నాకాశస్థలిన్, దిక్కులన్,

రేలన్, ఘస్రములం, దమఃప్రభల, భూరిగ్రాహ, రక్షో, మృగ

వ్యా ళాదిత్య, నరాది జంతు కలహవ్యాప్తిన్, సమస్తాస్త్ర శ

స్త్రాళిన్, మృత్యువు లేని జీవనము లోకాధీశ! యిప్పింపవే.”

పై పద్యంలో 18 వరాల లిష్టును ఒక వరంగా కూర్చి – గాలిలో కానీ, నేల మీద కానీ, నిప్పుతో కానీ, నీటిలో కానీ, ఆకాశంలో కానీ, దిక్కులలో కానీ, రాత్రి కానీ, పగలు కానీ, చీకట్లో కానీ, వెలుగులో కానీ, జంతువులచే కానీ, జలజంతువులచే కానీ, పాములచే కానీ, రాక్షసులు దేవతలు మానవులు మున్నగు వారితో యుద్ధంలో కానీ, సమస్త అస్త్రాల వలన కానీ, శస్త్రాల వలన కానీ, మరణం లేని వరం ప్రసాదించు అని కోరాడు హిరణ్యకశిపుడు బ్రహ్మని. ఇలాంటి ఉదాహరణలు పద్యాలలోనే కాకుండా చంపూ కావ్యాలలో (అంటే పద్యాలు గద్యాలు రెండూ ఉన్న కావ్యాలు) గద్యాలలో కూడా మనకి కనిపిస్తాయి, జాగ్రత్తగా వెతికితే.

ఇక నాటకాలలోని ఉదాహరణ చెప్పాలంటే, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రచించిన “సత్యహరిశ్చంద్రీయము” అన్న నాటకం చూడవచ్చు. అందులో ప్రథమాంకంలోనే దేవేంద్రుడు వేసిన ప్రశ్న నాటకానికి ఆధారమవుతుంది. “తన సామ్రాజ్యము పోవనీ, స్వకుల కాంతారత్నమున్ బాయనీ, ధన మానంబు లడంగనీ, ప్రబల బాధల్ తన్ను బాధింపనీ, తనయుం డీల్గిన నీల్గనీ, ..” – ఇన్ని కష్టాల లిష్టు ఉన్నా సత్యస్థైర్యమున్ బాయకుండిన పుణ్యుండు ఒక్కడైనా ఉన్నాడా, చెప్పండి అని దేవేంద్రుడు అడిగినదానికి అటువంటి వాడు హరిశ్చంద్రుడు అని నిరూపించడమే నాటకం లోని వృత్తాంతము.

ఇక నవలా సాహిత్యంలోకి వస్తే, బహుముఖ ప్రజ్ఞాశాలియైన అడవి బాపిరాజు గారి నవలలు వివిధ విషయాలలో ఆయన కున్న పరిజ్ఞానాన్ని తెలుపుతాయి. సాధారణ జ్ఞానం, అంటే జనరల్ నాలెడ్జ్ (general knowledge) తెలుసుకోడానికి అవి మంచి ఆధారాలు (sources).  ఉదాహరణకి, నారాయణరావు నవలలో శోభనం గదిలో ఏమున్నాయో చెప్పారు చూడండి.

ఒకచో రంగుదుప్పట్లు పరచిన బల్లపై, చెన్నపురిలో ఆంధ్రదేశములో దొరుకు చక్రకేళులు, బత్తాయిలు, సాతుకుడులు, అనాసలు, అంజూరలు, దానిమ్మలు, కాబూలిద్రాక్షలు, కిసిమిసులు, నాగపూరు సంత్రాలు, కర్బూజలు, మామిడిపళ్లు, పచ్చవాలప్పణి, సేంద్రజాలప్పణి, మలైవాలప్పణీ మొదలగు నరటులు, సీమరేగులు ఇంకను వివిధఫలములు; వేరొక బల్లపై మినపసున్ని, అరిసెలు, లడ్డు, బర్ఫీ, దూద్‌పేడా, పాదుషా, జాంగ్రి, మైసూరుపాకు, రసగుల్లా, సందేష్, పకోడీ, కారపుపూస, జీడిపప్పు, బూంది మొదలగు పెక్కు తినుబండారములు నున్నవి.”

ఒక చిత్రకళా ప్రదర్శనానికి ఆహ్వానితు లెవరో అదే నవలలో ఈ క్రింది విధంగా చెప్పబడింది.

చిత్రకళా ప్రదర్శనమునకు దేశదేశ చిత్రకారుల కాహ్వానము లంపినారు. శాంతినికేతనమునుండి నందలాలుగారు, కలకత్తా నుండి అవనీంద్రనాథఠాకూరుగారు, లక్నో నుండి అసితకుమార హవల్దారుగారు, పంజాబ్ నుండి అబ్దుల్ రహమాన్ చౌకుతాయిగారు, బరోడానుండి ప్రమోదకుమార చటోపాధ్యాయులు, మైసూరునుండి వెంకటప్పగారు, బొంబాయినుండి సాలొమానుగారు, అహమ్మదాబాదునుండి కనూదేశాయిగారు, మణిభూషణగుప్తగారు, ముజుందారు, సుధాంశుచౌదరి, దేవీప్రసాదరాయి చౌదరిగారలు మొదలగువారును; ఆంధ్రదేశములో రాణ్మహేంద్రవరమునుండి వరదా వెంకటరత్నంగారు, శ్రీమతి దిగుమర్తి బుచ్చికృష్ణమ్మగారు, చామకూర భాష్యకార్లుగారు, భీమవరమునుండి అంకాల సుబ్బారావుగారు, గ్రంధి శేషారావుగారు, తంగెళ్లమూడి వేంకటసుబ్బారావుగారు, గుంటూరునుండి గుఱ్ఱం మల్లయ్యగారు, అనిశెట్టి సుబ్బారావుగారు, చెన్నపురిలోని కవుతా రామమోహనశాస్త్రిగారు, కేశవరావుగార్లు, గుజరాతునుండి కవుతా ఆనందమోహనశాస్త్రిగారు, విశాఖపట్టణమునుండి తలిశెట్టి రామారావుగారు, కాకినాడ నుండి చామకూర సత్యనారాయణగారు, నరసాపురముమండి వెన్నా శేషగిరిరావుగారు, ఏలూరునుండి చండ్రుపట్ల బాపిరాజు, రామారావుగారలు, పెనుగొండ నుండి వెంకట్రావుగారు యింకను బాలచిత్రకారులు తమ తమ చిత్రములను ప్రదర్శనమునకు బంపిరి.”

బహుశా, ఈ నేపథ్యమే సినీ దర్శకులు జంధ్యాల గారిని ప్రేరేపించి ఇలాంటి లిష్టులున్న హాస్య సన్నివేశాలను తన సినిమాలో (లలో) పెట్టేటట్లు చేశాయేమో. ఆయన తీసిన వివాహ భోజనంబు” అన్న సినిమాలో బ్రహ్మానందం వీరభద్రరావుల జంట చేసే కామెడీలో, కవియైన బ్రహ్మానందం చెప్పే సినిమా కథలు నచ్చక అతని ఇంటి ఓనరైన వీరభద్రరావు తానే కథలు చెప్పడం మొదలుపెడతాడు. ఒక సీనులో వినకుండా పారిపోయే అవకాశం లేకుండా బ్రహ్మానందాన్ని మెడలోతు ఇసకలో పాతిపెట్టి కథ వినిపిస్తూ ఉంటాడు. ఇంతకీ కథ ఏమిటంటే – ఒక పిల్లవాడు తిరనాళ్ళలో తప్పిపోతే వాళ్ళ నాన్న వాడి కోసం చాలా ఊళ్ళు వెతుకుతాడు. ఏ ఏ ఊళ్ళంటే, హైదరాబాదు, అదిలాబాదు, సికందరాబాదు, అహమ్మదాబాదు, ఫకీరాబాదు, అలహాబాదు, ఫరీదాబాదు, ఔరంగాబాదు, ధనబాదు, సింధుబాదు, ముస్తాబాదు, ఫైసలాబాదు, గజియాబాదు, అబ్దుల్లాబాదు, జపారాబాదు, ఉస్సేనుబాదు – అని వీరభద్రరావు చెప్తుండగా, విని విని విసిగిపోయిన బ్రహ్మానందం నా బొందబాదు, నా శ్రాద్ధంబాదు, నా పిండాకూడుబాదు అని గొంతు కలుపుతాడు. వెంటనే, వీరభద్రరావు అవన్నీ కలిపి 21 బాదులు వెతికిన తరువాత, ఎవరో ఆ గుంటడు బెజవాడలో ఉన్నాడు అని చెప్తే అక్కడ వెతకడం మొదలు పెట్టాడు అని కథ కొనసాగిస్తాడు. బెజవాడలో గవర్నరు పేట, లబ్బీపేట, పున్నమ్మతోట, భాస్కరరావు పేట, సింగునగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్యా నగరం, ముత్యాలంపాడు, గుణదల, గాంధీ నగరం, చిట్టి నగరం, మాచవరం, రోకళ్ళపాలెం, మారుతీ నగరం, మొగల్రాజపురం, భవానీ పురం, సత్యనారాయణ పురం, సీతారామ పురం – అని వీరభద్రరావు చెప్తుండగా వినలేక గిలగిలలాడుతున్న బ్రహ్మానందం వద్దు బాబోయ్, చాలు మహాప్రభూ, చాలు, బెజవాడంతా వెతికేశాడు అని వేసుకుందాం, సరిపోతుంది ఒక్క మాటలో, సరిపోతుంది మహాప్రభూ అంటాడు. తిత్తి తీస్తా అని కథ కొనసాగిస్తూ, వీరభద్రరావు అన్ని పేటలు వెతికినా ఆ గుంటడు దొరకలేదయ్యా, అప్పుడు వాడు రోడ్ల మీద పడ్డాడు, అని అంటాడు. ఏ ఏ రోడ్లు తిరిగాడో తెలుసా అని, బీసెంటు రోడ్డు, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టిక్కల రోడ్డు, కారల్ మార్క్సు రోడ్డు, మొగల్రాజపురం రోడ్డు, గాంధీ రోడ్డు, వన్ టౌను మైను రోడ్డు, అద్దంకివారి వీధి, తాడంకివారి వీధి, దాసరివారి వీధి, మల్లెలవారి వీధి, పుల్లెలవారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోదా టాకీసు వీధి, అచ్చమాంబ ఆసుపత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి – అని చెబుతూ ఉండగా, బ్రహ్మానందం మళ్ళీ అడ్డం పడి మహా ప్రభూ, ఇది సినిమా కథా, ఈ లెక్కన పోష్టుమాన్ అత్యద్భుతమైన కథలు వ్రాయగలడు అని అంటాడు.  

ఇంకో సీనులో ఇద్దరూ ఒంటికి బంకమట్టి పులుముకొని కూచుని ఉంటారు. బ్రహ్మానందం చెప్పిన సినిమా కథ మళ్ళీ నచ్చక వీరభద్రరావు తానే ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు. హీరో ఒక కాఫీ హోటలుకి వెళతాడు. సర్వరుని ఏమున్నాయి అని అడుగుతాడు. అప్పుడు సర్వరు – ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారె, మషాలా గారె, ఉప్మా, కిచిడి, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మషాలా అట్టు, బాతు, టమాటా బాతు, బోండా, బజ్జి, మైసూరు బజ్జి, మిరపకాయ బజ్జి, అరిటికాయ బజ్జి, తమలపాకు బజ్జి, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిఠాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా, హల్వా, మైసూరుపాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా ఉన్నాయి అంటాడు. అప్పుడు హీరో అట్టుతే అన్నాడు. అప్పుడు సర్వరు ఏ అట్టు – పెసరట్టా, మినపట్టా, రవ్వట్టా, మసాలా అట్టా, 70 ఎం ఎం అట్టా, ఎం ఎల్ ఏ అట్టా, నూనె వేసి కాల్చాలా, నెయ్యి వేసి కాల్చాలా, నీళ్ళు పోసి కాల్చాలా, పెట్రోలు పోసి కాల్చాలా, కిరసనాలు పోసి కాల్చాలా, డీజిలు వేసి కాల్చాలా, అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు. సరే హీరో అంతా విని నేతి పెసరట్టుతో కాఫీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు ఏ కాఫీ మామూలు కాఫీయా, స్పెషలు కాఫీయా, బుర్రూ కాఫీయా, నెస్కేఫా, బ్లాక్ కాఫీయా, వైట్ కాఫీయా, హార్డ్ కాఫీయా, కోల్డ్ కాఫీయా, నురుగు కావాలా వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు. విని హీరో మాములు కాఫీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు నీలగిరి కాఫీయా, హిమగిరి కాఫీయా, షిమలా కాఫీయా అంటూ మళ్ళీ పాట అందుకుంటాడు. ఇక ఆపండి మహాప్రభూ, తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేక పోయాను, ఈ కథతోనే సినిమా తీసుకోండి అని బ్రహ్మానందం అంటాడు.

మరో సీనులో బ్రహ్మానందాన్ని చెట్టుకు కట్టేసి మరీ కథ వినిపిస్తాడు వీరభద్రరావు. గుణాచారి 116 దొంగల వెనకాల పడ్డాడు. వాళ్ళు ఏ ఏ దేశాలు తిరిగారో తెలుసా, రాజస్థాను, పాకిస్తాను, బెలూచిస్తాను, ఆఫ్ఘనిస్తాను, నైజీరియా, బల్గేరియా, సైబీరియా, టాంజానియా, సోమాలియా, మంగోలియా, ఇథియోపియా, నైబీరియా, ఉగాండా, జింబాబ్వే, జమైకా, ఈజిప్టు, కాంగో, బోట్సువానా, జెనీవా, ఖతారు, టూనీ, ఘనా, బెహరైను, కువైటు, లావోసు, ఫిలిప్పిన్సు, ఫిన్లాండు, అయిరులాండు, న్యూజిలాండు, సూడాను, మారిషస్సు, భూటాను, నేపాలు – అని చెబుతూ గబుక్కున బ్రహ్మానందం వేపుకి చూసే సరికి అతడు ముసలాడైపోయి కనిపిస్తాడు. ఏమిటయా ఇలా అయిపోయావు అని వీరభద్రరావు అంటే, తమరు ప్రపంచ పర్యటనలో ఉన్నారు కదా ఇండియా ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ ఇలా అయిపోయాను అని బ్రహ్మానందం సమాధానం చెబుతాడు.

మాములుగా అయితే ఇలా లిష్టులు చెప్పడం కథాగమనానికి అవరోధం అనిపిస్తాయి కానీ వీరభద్రరావు చెప్పే తీరు, దానికి బ్రహ్మానందం చూపించిన హావభావాలు సినిమా హాళ్ళల్లో నవ్వులు కురిపించాయి. జంధ్యాల గారి బాణీ నాకు ఇంకో విధంగా ఉపయోగపడింది. మా అబ్బాయి చిన్నప్పుడు (3-5 సంవత్సరాల వయస్సులో) అందరు పిల్లల్లాగానే కథ చెబితే గానీ నిద్దర పోయే వాడు కాదు. తీరా కథ చెప్పడం మొదలుపెడితే, దానిలో తార్కికమైన ప్రశ్నలు వేసే వాడు. ఎలా అంటే, అనగనగా ఒక రాజు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు అనంగానే రాజు ఒకడే ఎందుకుండాలి, వాడికి ఏడుగురే కొడుకులు ఎందుకుండాలి అని అడిగే వాడు. ఇలా లాభం లేదని, అప్పుడు జంధ్యాల గారి బాణీ అందుకునే వాణ్ణి. రాజు గారు అడవికి వేటకి వెళ్ళి, ఆ అడవిలో  ఏ ఏ జంతువులని చూశాడు అని లిష్టు చెప్పడం మొదలు పెట్టేవాడిని. ఆ చెప్పడం కలిగించే ఏకవిసుగుకి (monotony) వాడు సొమ్మసిల్లి నిద్రపోయేవాడు. అందుకని, కథల్లో లిష్టులు ఎవరికి ఎలా ఉపయోగపడతాయో వాళ్ళే నిర్ణయించుకోవాలి.

4 thoughts on “కథలలో లిష్టులు

  1. వాల్మీకి నుంచి జంధ్యాల గారి వరకూ సంకలనం చేసిన మీకు ధన్యవాదాలు. కధలు ఇతిహాసాలు యాంత్రికంగా చదివాము కానీ ఈ లిస్టుల విషయం పరిశీలనగా చూడలేదు. సాహిత్యంపై మీ మక్కువ అందులో నిక్షిప్తమై ఉన్న విషయాలు అందరికీ విశదీకరించి చెప్పడం ముదావహం. ఎలా సమయం గడపాలి అని ఆలోచించే నాలాంటి వారికి మీ వ్యాసంగాలు చూస్తే మీకు సమయం సరిపోవటం లేదనడం ఏమీ అతిశయోక్తి కాదేమో. అన్నిటికీ మించి తెలుగు భాషపై మీ పట్టు చాలా అభినందనీయం. ఆయుష్మాన్భవ.

    Like

    1. Excellent. Narration is superb while taking the ‘Lists’ as a basic concept – how it was used right from Ramayana to poetic / textual narrations in the modern era is fantastic. Even the same was seen in the cinema as an inspiring humour is fascinating. Great writing and my best complements to you 💐💐💐

      Like

  2. మీరు తెలుగు కథలలో వున్న లిస్ట్ లను నాటి సనాతన కవుల నుండి నేటి జంధ్యాల గారి వరకు చక్కగా వివరించారు. దీనిని ఎలా వుపయోగిం చాలో కవి యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. వీటి వలన ఆసక్తి కలుగుతుంది. కానీ సహజత్వం ,అసలు కథ కు సమయం పడుతుంది.. మీరు తెలుగు భాష అభివృద్ధికి చేస్తున్న కృషి అభిలషణీయం మరియు ఆనందదాయకం.

    Like

Leave a comment