తెలుగు భాష వ్యాకరణాల ప్రాముఖ్యతమనకి తెలుగులో గసడదవాదేశ సంధి, సరళాదేశ సంధి (అంటే, గజడదబాదేశ సంధి) అన్న రెండు హల్ సంధులున్నాయి. రెండవ పదంలో ఉన్న కచటతపలకి ఈ రెంటిలో ఏవి ఆదేశాలవుతాయో చూడంగానే అర్థమవుతుంది. గసడదవాదేశ సంధిలో మొదటి పదం ప్రథమా విభక్తి (డు, ము, వు, లు) అయి ఉంటే, సరళాదేశ సంధిలో మొదటి పదం ద్రుత ప్రకృతికం (చివర ‘న్’ లేదా ‘న’ ఉండేది) అయి ఉంటుంది. ఈ వ్యాకరణం పరమానందయ్య లాంటి గురువుగారి బడిలో ఎలా ఉంటుందో చూద్దాం.
“పరమానందయ్య శిష్యుల కథ” అన్న ఒక పాత తెలుగు సినిమాలో పరమానంద గురువర్యుల శిష్యులలో ఒక వ్యాకరణం చదివే శిష్యుడు ఉంటాడు. ఒక రోజు గురువుగారు శిష్యులు ఏం నేర్చుకున్నారో పరీక్షిస్తూ, ఇతడిని నేర్చుకున్నది చెప్పమంటారు. అతడు ఒక వ్రాకరణ సూత్రం ఇలా చెబుతాడు: “అనుస్వారానికి పరమైనపుడు కచటతపలు పచ్చడి బద్దలగును”. వెంటనే, “వెధవ, నీకు ఎప్పుడూ తిండి ధ్యాసేరా” అని గురువుగారు తిడతారు. ఈ శిష్యు డంత కాకపోయినా, మనం కూడా అప్పుడప్పుడు తెలుగు భాషని వ్యాకరణాన్ని సీరియసుగా (serious) తీసుకోము. మనకున్న తమిళ (అరవ) సాంగత్యం వల్ల కూడా ఈ కన్ఫ్యూజన్ (confusion) ఒక్కోసారి ఎక్కువవుతుంది. దానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం.
నాకు తెలిసిన ఒక తెలుగు మాట్లాడే (వ్రాయడం, చదవడం రాదు) అమ్మాయి ఢిల్లీలో నేను పనిఁజేసే రోజుల్లో ఒక తమిళ ఉపాధ్యాయిని దగ్గర సంగీతం నేర్చుకునేది. ఆ టీచర్ త్యాగరాజ కీర్తన ఒకటి ఇలా చెప్పింది: “చక్కని రాజ మార్గము లుండక ….”. ఆ అమ్మాయి తెలుగు మాటలు ఇంగ్లీషులో వ్రాసుకుని కీర్తన నేర్చుకునేది. పెద్ద తేడా ఏం లేదు, “లుండగ” బదులు “లుండక” అంది. అంతే కదా అనుకోడానికి లేదు. రెంటికీ పెద్ద తేడా ఉంది. ఈ ఒక్క అక్షరం మార్చడం వల్ల మొత్తం అర్థమే మారిపోయింది.
మరో ఉదాహరణ చెప్పాలంటే, మనందరికి బాగా నచ్చిన కీర్తన ఒకటి తీసుకుందాము. “శంకరాభరణం” అన్న సినిమాలో ఉన్న “బ్రోచే వారెవరురా” అన్న కీర్తన మనకి చాలా ఇష్టం కదా. అసలు “బ్రోచు” అన్న పదం తెలుగు భాషలో లేదు. అది “ప్రోచు” అని ఉండాలి. అంటే, రక్షించడం అని అర్థం. “ప్రోచే వారెవరురా నిను విన రఘువరా, నను బ్రోచే వా రెవరురా నిను విన రఘువరా” అని పాడాలి. అంటే, ప్రారంభంలో “ప్రోచే” అని అనాలి, మధ్యలో “ననున్ ప్రోచే” కాబట్టి అది సంధి జరిగి “నను బ్రోచే” అవుతుంది. అంతే గానీ, ప్రారంభంలో కూడా “బ్రోచే” అని పాడితే దానికి అర్థం ఉండదు.
మరో ఉదాహరణ చూద్దాం. “పక్కల నిలబడి” అన్న కీర్తనలోని చరణంలో “చుక్కల రాయని గేరు మోముగల సుదతి సీతమ్మ సౌమిత్రి రాముని కిరుపక్కల నిలబడి” అని వస్తుంది. సంగీతపరంగా అలాగే పాడాలో ఏమో నాకు సంగీతం రాదు కాబట్టి తెలియదు కానీ, కొంత మంది పాడేటప్పుడు “గేరుమోము” అని ఒకే పదంగా చాలా దగ్గరగా ఉచ్చరిస్తారు. “గేరు” అంటే తెలుగులో “కోతి” అని అర్థం. అలా పాడితే, “చంద్రుని వంటి కోతిముఖం కల స్త్రీయైన సీతమ్మ” అన్న అర్థం వస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఆ పదం “గేరు” కాదు, “కేరు”. “కేరు” అంటే “పరిహసించు” అని అర్థం. సీతమ్మ వారి ముఖంతో పోలిస్తే చంద్రబింబం ఎందుకూ పనికిరాదు అన్న అర్థంలో చంద్రుణ్ణి పరిహసించే ముఖం ఉన్న సీతమ్మ అని అర్థం వచ్చేటట్లు వ్రాసిన కీర్తన పాదం అది. “రాయని + కేరు” అన్నది “రాయని గేరు” అయ్యింది, అక్కడ.
ఇవన్నీ ఒక గురువు గారు (పేరెందుకు లెండి) నాకు ఎప్పుడో చెప్పారు. అప్పుడు, నాకు ఈ తేడాలు అంతగా మనసుకి ఎక్కలేదు. ఏవో, ఒకటీ అరా, ఇలాంటి ఉదాహరణలు ఉండొచ్చు కానీ, తెలుగు నాట ఇవన్నీ మరిచిపోయాము కదా అని నాకు అనిపించింది. కొన్ని పదాలకి అర్థం ఒక విధంగాను, కొన్ని సమాసాలు వాడుకలోను, తప్పైనా కూడా తెలుగు నాట రూఢి (ప్రసిద్ధి) అయ్యాయి అని వారే నాకు చెప్పారు. ఉదాహరణకి నన్నయ కాలంలో “కంపు” అన్న పదానికి మంచి అర్థం ఉండేదని, దాన్ని తరువాతి కాలంలో మనం కంపు చేశామని వారే చెప్పారు. “శుద్ధతప్పు” దుష్టసమాసం కాబట్టి (ఒక సంస్కృత పదానికి ఒక తెలుగు పదానికి సమాసం కుదరదు) శుద్ధతప్పు అని కూడా వారే చెప్పేవారు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత, N.T. రామారావు గారు “మహానాడు” అన్న కార్యక్రమం జరిపించడం మొదలుపెట్టారు. “మహానాడు” అన్న పదం కూడా దుష్టసమాసమే. అంటే, రామారావు గారికి తెలుగు రాదు అని కాదు. ఆయనకి తెలుగు భాష మీద మంచి పట్టు ఉండేదని అందరికీ తెలుసు. దానికి కారణం, ఆయనకి న్యూమరాలజీయో (numerology) మరోటో, ఏవో వేరే లెక్కలు ఉండి ఉండాలి. ఏది ఏమైనా, “మహానాడు” అన్న పదం రామారావు గారి పుణ్యమా అని తెలుగు నాట రూఢి అయ్యింది.
ఇలా ఎన్నో విషయాలు కాకతాళీయంగా మా గురువుగారు అప్పుడప్పుడు చెప్పేవారు. “ఆ మాటకొస్తే నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్” అన్న గురజాడ వారి గిరీశం పాత్ర చెప్పింది మా గురువు గారి విషయంలో అక్షరాలా కరెక్ట్. అయినా కూడా ఈ నేపథ్యంలో, మా గురువుగారు చెప్పిన వాటిల్లో కొన్ని భాషా వ్యాకరణ విషయాలు వెంటనే అంతగా నా మనసుకు ఎక్కలేదు. పైగా పెద్దాయనకి ఈ మధ్య చాదస్తం ఎక్కువైంది అని అనుకున్నాను, అప్పుడు. ఆ తరువాత ఎప్పుడో ఒకసారి విజయవాడ రైల్వే స్టేషనులో నేను ఢిల్లీ వెళ్ళడానికి తమిళనాడు ఎక్స్ప్రెస్ (Tamil Nadu Express) ఎక్కినప్పుడు ఒక వింత అనుభవం జరిగింది. అది మధ్యాహ్న భోజనాల (lunch) వేళ. ప్రయాణీకులు ఇచ్చిన ఆర్డర్ల (orders) ప్రకారం, కాటరింగ్ స్టాఫ్ (catering staff) లోని ఒక కుర్రాడు భోజనం పళ్ళాలు పుచ్చుకొని “లంజ్”, “లంజ్”, .. అని అరుచుకుంటూ, నిద్రపోయే వాళ్ళని, పేకాడుకునే వాళ్ళని ఇతరులను ఎలర్ట్ (alert) చేస్తున్నాడు. ఆ మాట అతడు చాలా వేగంగా అనడం వల్ల, అది “లంజ, లంజ, ..” గా వినబడుతోంది. బోగిలో ఉన్న తెలుగు తెలిసిన వాళ్ళు ముఖ్యంగా స్త్రీలు కంగారుగా వాడి వంక చూస్తున్నారు. వాడు మాత్రం అమాయకంగా అరుచుకుంటూ (‘అరవం‘ అంటూనే అరవ వాళ్ళు అరుస్తారు) పోతున్నాడు. అప్పుడు, నాకు మా గురువుగారు చెప్పిన మాటలు పూర్తిగా అర్థం అయి జ్ఞానోదయం అయ్యింది.
ఇలాంటిదే… ముద్దుగారే యశోదా కీర్తన ! గొప్ప గొప్ప గాయకులూకూడా ముద్దుకారేయశోదా అని కలిపిపాడతారు. ముద్దుగారేది యశోదముంగిట ముత్యం కదా ! మీ ఉదాహరణలు బాగున్నాయి. 💐💐
LikeLike
Kudos to the author, who has succinctly brought out with relevant and witty examples the importance of proper usage of grammar in Telugu language. For that matter, mastering tricky grammar and syntax is vital for writing in any language in order to avoid any confusion in words and sentences.
LikeLike
Examples of importance telugu grammar are very interesting.
LikeLike
వ్యాకరణ ప్రాముఖ్యతను చక్కగా వివరించారు. భాషకు స్పష్టత చేకూరుతుంది. మరియు భాష యొక్క గొప్పతనంను కాపాడుతు తుంది. మీకు అభినందనలు మరియు ధన్యవాదాలు.
LikeLike
అద్భుతమైన వ్యాసం. తెలుగు వ్యాకరణం, సంధుల ప్రాముఖ్యతను సరదా ఉదాహరణలతో చాలా చక్కగా వివరించారు. చిన్న అక్షర మార్పు కూడా అర్థాన్ని ఎంతగా మార్చగలదో త్యాగరాజ కీర్తనల ఉదాహరణల ద్వారా బాగా చూపించారు. భాషా శుద్ధి, వాడుకలో వచ్చిన మార్పులు, ఉచ్చారణ ప్రభావం వంటి అంశాలపై ఆలోచింపజేసే మంచి రచన. 👏🙏
LikeLike