ఎక్కడైనా ఇమడటం ఎలా?

చిన్నప్పటి నుండి ఇతరులతో, ముఖ్యంగా కొత్తవాళ్ళతో, కలవడం అలవాటైన వాళ్ళకి ఎక్కడైనా ఇమడటం పెద్ద కష్టం కాదు. కానీ అందరికీ అలా ఉండదుగా. నా మాట కొస్తే, 14 ఏళ్ళ వయస్సు వచ్చేవరకు జిల్లా సరిహద్దులు దాటలేదు. అప్పటి వరకు రైలు ప్రయాణం కూడా ఎరగను. చెప్పులు వేసుకోవడం అలవాటు కాకపోవడం వల్ల, ఎప్పుడు  పెద్దవాళ్ళు చెప్పులు కొన్నా, వారం తిరక్కుండా వాటిని ఎక్కడో పారేసుకుంటూ ఉండడం వల్ల, అటు చేసి ఇటు చేసి 14 ఏళ్ళ వయస్సు దాకా చెప్పులు లేకుండానే తిరిగాను. ఈ పరిస్థితిలో, మా గురువుగారు నేర్పిన క్రమశిక్షణ చాలా పద్ధతిగా ఉండేది. ఎవరన్నా, పెద్దవాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, పక్కనే నిలబడి తువ్వాలు అందిచ్చి, కూచోబెట్టి వాళ్ళకి తాగడానికి తినడానికి ఇచ్చి వాళ్ళు మా గురువు గారితో మాట్లాడుతున్నప్పుడు నిశ్శబ్దంగా వాళ్ల మాటలు వింటూ, చాలా వినయంగా ప్రవర్తించే వాళ్ళం. మా గురువు గారితో వేరే ఎవరి ఇంటికయినా వెళితే, అక్కడి పెద్దవాళ్ళు మా గురువు గారు కూర్చునే వరకు మనం కూర్చోకుండా ఉండటం కూడా క్రమశిక్షణలో భాగమే. ఇలా ఒక పల్లెటూరి వాతావరణంలో పెరిగిన నా లాంటి వాళ్ళకి ఒక కొత్త చోటికి, అది కూడా బస్తీకి వచ్చినప్పుడు, అక్కడ ఒక్కసారిగా కొత్తవాళ్ళు ఎదురైతే, అది కూడా మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు జరిగితే, కొంచెం కష్టంగాను బెరుకుగాను ఉంటుంది. బస్తీలో ఉండే జనాల వేషధారణ, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకునే తీరు (అది కూడా ఆంగ్లంలో), అక్కడి వాహనాల రద్దీ, రోడ్ల మీద జనాలు తిరగడం – ఇవన్నీ నా బోటి వాళ్ళ కంగారు ఇంకొంచెం పెంచుతాయి.

నేను మొదటి సారి ఢిల్లీ (Delhi) వెళ్ళినప్పుడు, అది శీతాకాలం. అందరూ, కోట్లు, సూట్లు ధరించి తిరుగుతూ కనబడ్డారు. ఎక్కడో సినిమాల్లో తప్ప నిజ జీవితంలో అంతకు ముందు జనాలను అలా చూచి ఉండకపోవడం వల్ల, నాకు ఒక రకమైన న్యూనతా భావం (inferiority complex) మనస్సులో కలిగింది. కానీ ఒక రోజున ఉదయం నేను పార్లమెంటు వీధిలో (Parliament street) చూచిన దృశ్యం నా అభిప్రాయాన్ని పూర్తిగా మార్చింది. అక్కడి ఒక పెద్ద చెట్టు కింద ఒక ఇత్తడి పళ్ళెంలో నూనె పోసి అందులో ఒక చిన్న నల్లని రాయి ఒకటి వేసి ఒకటి రెండు నాణేలు కూడా వేసి పెట్టి వెళ్ళారు ఎవరో. అటు పోతున్న ప్రతి వారు, బూట్లు విప్పి ఆ పళ్ళెం చుట్టూ ప్రదక్షిణ చేసి దణ్ణం పెట్టుకుని అందులో ఒక నాణెం వేసి వెళ్ళడం మొదలు పెట్టారు. వాళ్ళ దృష్టిలో అది శని దేవత. శని అంటే, ఎవరికైనా భయమే కదా. కాసేపట్లోనే పళ్ళెం సగం దాకా నాణాలతో నిండింది. మర్నాడు అదే చోట ఆ పళ్ళాన్ని ఒకటి రెండు నాణాలతో చూశాను. నిజం చెప్పాలంటే, ఇదంతా చూసిన తరువాత బస్తీ వాళ్ళ మీద ఆ క్షణంలో నాకు గౌరవం తగ్గింది. దానితో పాటు బెరుకు కూడా తగ్గింది.

సరే, ఆ విషయం పక్కన పెడితే, కొత్త చోట బెరుకు పోగొట్టుకొని ఇమడాలంటే ఏం చెయ్యాలో ఆలోచించి ఒక ఉపాయం కనిపెట్టి ఆచరణలో పెట్టాను. నా చిన్నప్పుడు మా ఊళ్ళో కొంత మంది ప్రత్యేకతలు ఉన్న వాళ్ళు ఉండే వాళ్ళు. ఉదాహరణకి, ఒకాయనని కుంటి అంజినీలు అని, ఇంకో ఆయనని లేత బొవికలాడు అని, ఒకతన్ని దేవుడు సుబ్బారావు అని (ఇంకా ఇలాంటి మారు పేర్లు చాలా ఉన్నాయి లెండి) పిలిచే వాళ్ళం. వాళ్ళ ప్రత్యేకతలు ఏమిటో విడిగా చెప్పక్కర్లేదు. మనం కొత్త చోటికి వెళితే, అక్కడ మన ఊరి వాళ్ళకి దగ్గర దగ్గరగా పోలి ఉండే వాళ్ళకి ఈ పేర్లు పెట్టి మనస్సులో అలా వాళ్ళని అనుకుంటూ, మన ఊళ్ళోనే ఉన్నానన్న భావనలో ఉండే వాడిని. అట్లా అనుకోవడమే, అక్కడి జనాలతో కలిసిపోవడం, ఇమడటం సులభతరం చేసింది.

అంటే, ఉన్నంతలో మన సంతోషం మనమే వెతుక్కోవడం, మనం ఉన్నచోటే మనక్కావలసిన వాళ్ళందరూ ఉన్నట్లుగా ఊహలకి తగ్గ కల్పనలు చేసుకోవడం అన్నవి కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ (Art of Living) లోని భాగమే. ఈ భావాన్ని ఒకటి రెండు సినిమాలలో బాగా చూపించారు. “స్టేషన్ మాష్టర్” అన్న సినిమాలో (1988) రావు గోపాలరావు స్టేషన్ మాష్టరుగా నటించారు. ఆయన భార్యగా అన్నపూర్ణ నటించారు. సినిమాలో ఆ దంపతులకు సంతానం లేదు. ఆ స్టేషనుకి వచ్చే రైళ్ళకి చిన్నబ్బాయి, పెద్దబ్బాయి అని పేర్లు పెట్టి పిలిచుకుంటూ ఉంటారు. ఇవాళ చిన్నబ్బాయి 20 నిమిషాలు లేటు, పెద్దబ్బాయి గంట లేటు అంటాడు రావు గోపాలరావు. ఆ విధంగా వాళ్ళు తృప్తి పడడానికి అలవాటు పడ్డారన్న మాట.

మిథునం (2012) సినిమాలో అప్పదాసు అనే విశ్రాంత ఉపాధ్యాయుడు తన భార్యతో కలిసి స్వగ్రామంలో నివసిస్తుంటాడు. పిల్ల లందరూ విదేశాలలో ఉండడం వల్ల, తమ ప్రాంగణంలోని చెట్లకి పశువులకీ తమ పిల్లల పేర్లు పెట్టి వాళ్ళు తమ ఎదురుగానే ఉన్నట్లుగా భావిస్తూ ఉంటారు. కిష్టప్ప ఆకు ఆకున పిందె తొడిగాడు అద్భుతః అని మామిడి చెట్టుని చూపించి, మాధవుడు మాత్రం మనని కనిపెట్టుకుని ఉండ లేదా బరువు బాధ్యతలని ఎలా భుజాన వేసుకున్నాడో చూడండి అని కొబ్బరి చెట్టుకు వ్రేళ్ళాడుతున్న కొబ్బరి కాయల గెలను చూపించి, గోవిందుడు మాత్రం పెద్ద ఘటాలని మర్చిపోలేదు వాడూ ఇద్దరినీ ఒక కాపు కాస్తానంటున్నాడు అని కాయలు వ్రేళ్ళాడుతున్న పనస చెట్టును చూపించి, పారిజాతం పూలు చూస్తే మీనాక్షి గుర్తు కొస్తోందని, ఆవును చూపించి మన సావిత్రి అని, ఇలా తమ పిల్లలతోనే ఉన్నట్లుగా కాలక్షేపం చేస్తూ ఉంటారు.

కాబట్టి, కొత్తా పాతా అన్నవి మన దృష్టి, ఊహలని బట్టి మనకి కావాల్సినట్లుగా మార్చుకోవచ్చు. దాన్ని బట్టే ఎక్కడైనా ఇమడటం అన్నది ఆధారపడి ఉంతుంది. ఎవరి ఉపాయాలు వాళ్ళవి.

4 thoughts on “ఎక్కడైనా ఇమడటం ఎలా?

  1. సూపర్ డియర్. ఎంత చక్కగా సినిమా సీన్స్ తో చక్కగా విశదీకరించావు. హాట్స్ ఆఫ్.

    Like

  2. మీ ఆలోచన అభిలషణీయం. జీవితంలో ప్రతి వ్యక్తి ఇమడటం చాలా ముఖ్యమైనది .దానిని మీరు చక్కగా వివరించారు. ముఖ్యంగా సినిమా సన్నివేశాలును వుదహరించి, ఆచరణలో పెట్టుట సులభతరం చేశారు. మీకు మనస్పూర్తి గా అభినందనలు.

    Like

  3. Ranganadham garu have brought out his real life experience very nicely duly dovetailing with appropriate examples. In fact, I too had similar experience when I arrived in Delhi during peak winter of December for joining job through UPSC. Although initially it was difficult getting adjusted in such a new place and environment, that too, with inappropriate/shared accommodation, I got adjusted there spending time during holidays in various libraries, observing people’s habits and as such the cultural diversity. Once again, hearty congratulations & best wishes to the author for his positive & open mind.

    Like

  4. ఇటువంటి అనుభవాలు ప్రస్తుత సామాజిక మాధ్యమాలు లేని సమయంలో గ్రామీణ ప్రాంతవాసులు వేరే ప్రాంతానికి /పట్టణాలకు వెళ్ళినపుడు ఇలా ఇమడలేని పరిస్థితులు చాలా ఎక్కువ .ఆ రోజుల్లో పెద్దల పట్ల గౌరవము ,మర్యాద ,భయ భక్తులు మెండుగా ఉండేవి అందువల్ల మొహమాటాలు ఒకింత బిడియము వెరసి- కలసిపోవటానికి చాలా సమయము ఇబ్బంది అయ్యేది . ఈ విషయాన్ని సానుభవము ,సినిమా ఇతివృత్తంతో చక్కగా వివరించారు,ఈ తరం వాళ్లకు గతం విశదీకరించడము అభినందనీయము ,ధన్యవాదములు.

    Like

Leave a comment