కం. అడుగిడెను వామ నుండుగ,
గొడు గొక కేల్బట్టి హోమగుండముఁ గడకున్,
యడిగెను మూడడుగుల యిల,
యడఁచగ బలి దుడుకు విష్ణు వతడని తెలిసెన్. … 1
(అడుగిడు = పాదముపెట్టు, కేలు = చేయి, హోమము = యజ్ఞము, గుండము = నిప్పులగుంట, కడ = సమీపము, ఇల = నేల, అడఁచు = అణచు, దుడుకు = గర్వము)
యజ్ఞగుండము సమీపంలో గొడుగు ఒక చేత్తో పుచ్చుకొని వామనుడిగా పాదం పెట్టాడు. మూడు అడుగుల నేల అడిగాడు. బలి గర్వము అణచగానే అతడు విష్ణువు అని తెలిసింది.
కం. తొలిసారి గొడుగు వాడక
మిలలో పరిచయముఁ జేసి, యిలకున్ నభమే
పొలుపగు గొడుగని తుదకున్
నిలిపిన వామనుని చరిత నెలకొనె రుజువై. … 2
(తొలిసారి = మొదటి సారి, వాడకము = ఉపయోగము, ఇల = భూమి, నభము = ఆకాశము, పొలుపు = స్థిరము, తుద = చివర, నిలుపు = ప్రతిష్ఠించు, చరిత = చరిత్ర, నెలకొను = కుదురుకొను, రుజువు = సాక్ష్యము)
మొదటి సారి గొడుగు వాడకం భూమి మీద పరిచయం చేసి భూమికి ఆకాశమే స్థిరమైన గొడుగు అని చివరకు నిలిపిన వామనుని చరిత్ర సాక్ష్యముగా కుదురుకుంది. మొదట్లో మూడు అడుగుల నేల అడిగిన వామనుడు క్రమక్రమంగా శరీరాన్ని పెంచి ఆకాశ మంత ఎత్తు పెరిగిపోగా ఆకాశమే అతనికి గొడు గయ్యింది. “ధర సింహాసనమై నభంబు గొడుగై …..” అన్న పద్యం పాడుతూ దసరాలకు చిన్నప్పుడు గురువు గారితో ఊరేగింపు వెళ్ళేవాళ్ళము.
తే.గీ. ఎండ తీవ్రత యెక్కుడై మండిపడగ
తపసి జమదగ్ని, వణఁకుచు తపనుఁ డొచ్చి
యిచ్చె నొక్క గొడుగు శాప మిచ్చు ననుచు,
యెండ వానల యందదే యండ యనుచు. … 3
(ఎక్కుడు = అధికము, మండిపడు = కోపించు, తపసి = ముని, వణఁకు = కంపించు, తపనుఁడు = సూర్యుఁడు, అండ = ఆధారం)
ఎండ తీవ్రత అధికమై జమదగ్ని మహాముని కోపించగా, శాపము ఇస్తాడేమోనని వణుకుతూ సూర్యుఁడు వచ్చి ఎండ వానలలో ఇదే అండ అని ఒక గొడుగు ఇచ్చాడు.
కం. గోవర్ధన గిరి నెత్తగ,
గోవుల గోపులను యేలుకోటినిఁ గావన్,
దేవకి సుతునా భంగిని
దేవేంద్రుడుఁ గాంచి, గొడుగిదే నని తలచెన్. … 4
(గిరి = పర్వతము, గోవు = ఆవు, గోపుడు = గొల్లవాడు, ఏలుకోటి = ఏలుబడికి లోబడిన ప్రజలు, కాచు = రక్షించు, సుతుడు = కుమారుడు, భంగి = విధము, కాంచు = చూచు, తలచు = అనుకొను)
గోవులను, గోపాలురను, ప్రజలను రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తగా, దేవకి కుమారుడైన శ్రీకృష్ణుని ఆ విధంగా ఇంద్రుడు చూసి గొడుగు ఇదే అని అనుకున్నాడు.
కం. ద్వాపర యుగమున గిరియే
ప్రాపని తెలియంగ నాతపత్రము లట్లే
రూపొందించుట మొదలై
తాపమ్మునుఁ దీర్చి సమ్మదముఁ జేకూర్చెన్. … 5
(గిరి = పర్వతము, ప్రాపు = ఆశ్రయము, ఆతపత్రము = గొడుగు, రూపొందించు = తయారుచేయు, తాపము = బాధ, తీర్చు = ఉపశమింపఁ జేయు, సమ్మదము = సంతోషము, చేకూర్చు = సిద్ధింపఁజేయు)
ద్వాపర యుగంలో పర్వతమే ఆశ్రయ మని తెలియడం వల్ల, గొడుగులను ఆ విధంగా తయారు చేయడం మొదలయ్యి బాధను ఉపశమింపఁ జేసి సంతోషాన్ని చేకూర్చింది.
తే.గీ. బ్రహ్మచారులు గొడుగులుఁ బట్టి యుండ
నాటి వామను వేషము పాటి యయ్యె,
వారిఁ గని గేస్తు లభినవ వామనులని
భక్తితో భిక్ష వేయుట వాడు కయ్యె. … 6
(పాటి = ప్రమాణము, బ్రహ్మచారి = బ్రహ్మచర్య వత్రమును అనుష్ఠించు వాడు, కను = చూచు, గేస్తుఁడూ = గృహస్థుఁడు, అభినవ = క్రొత్త, వాడుక = పరిపాటి)
ఆ నాటి వామనుని వేషము బ్రహ్మచారులు గొడుగులు పట్టి ఉండడానికి ప్రమాణం అయ్యింది. వారిని చూసి గృహస్థులు క్రొత్త వామనులు అని భక్తితో భిక్ష వెయ్యడం పరిపాటి అయ్యింది.
తే.గీ. రక్షణకు మారుపేరు ఛత్రం బను నటు
సర్వ జనులకు రక్ష నొసంగుఁ గాన
రాజె ఛత్రపతి యటంచు రాణ కెక్కె
సంఘ మిడ రక్ష శిష్యులు ఛాత్రులైరి
గొడుగు యూరేఁగు నపుడు ఠక్కురుల గుఱుతు
గొడుగు హోదాకు చిహ్నమై కుదిరె ప్రజను. … 7
(మారుపేరు = అసలు పేరుఁ గాక మరొక పేరు, ఛత్రము = గొడుగు, అటు = అట్లు, ఒసంగు = ఇచ్చు, కాన = కనుక, రాణ కెక్కు = ప్రసిద్ధి పొందు, సంఘము = సమాజము, ఇడు = ఇచ్చు, రక్ష = రక్షణము, ఊరేఁగు = ఉత్సవముతో ఊరిలో పల్లకి మున్నగు వానిపై తిరిగి వచ్చు, ఠక్కురుడు = వేలుపు, గుఱుతు = లాంఛనము, హోదా = సమాజంలో ఉన్న గౌరవస్థానం, చిహ్నము = గుర్తు, కుదురు = స్థిరమగు)
రక్షణకు గొడుగు లేక ఛత్రము మారు పేరు అనేటట్లుగా, సర్వప్రజానీకానికి రక్షణ ఇస్తాడు కాబట్టి రాజే ఛత్రపతి అని ప్రసిద్ధి కెక్కాడు, సమాజము రక్షణ ఇవ్వగా, అంటే సమాజం నుండి రక్షణ తీసుకుంటారు కాబట్టి, శిష్యులు ఛాత్రు లయ్యారు. రక్షణ ఇవ్వడమో తీసుకోవడమో చేస్తారు కాబట్టి, “ఛత్రము” వచ్చేటట్లుగా పిలవబడుతున్నారు. ఊరేగేటప్పుడు దేవతలకి గొడుగు లాంఛనము. ప్రజలలో హోదాకి గుర్తుగా గొడుగు స్థిరమయ్యింది.
సీ. ఒక్కరి పాలనన్ పెక్కు రాజ్యము లున్న
యొక్క గొడుగు క్రింద యుండు టనరె,
యవకాశవాదులై వ్యవహరించు టన యే
యెండ కా గొడు గంచు యెల్ల రనరె,
స్వప్రయోజనమును సాధించ వత్తాసు
పలుక నది గొడుగు పట్టు టనరె
సమర మందున వైరి ఛత్రములనుఁ గూల్చు
టవమాన పరచుటే యనుచు ననరె,
గుడుల ఛత్రముఁ బట్ట గొడుగులవారని
గొడుగుమాన్యంబుల నిడుటఁ గనమె,
కర్ణుని వోలె వక్ర గతుల నడుపు స
ఖులను బంధువులను గొడుగు లనమె,
వరునికి గొడు గిచ్చి వారణాశికిఁ బంపు
వేడుకఁ జూడమే పెండ్లి యందు,
ఋణదాతలకు బడలించ కుండ తమను
ముఖము దాచ సహాయము గొడుగె కద,
తే.గీ. యిట్లు కలికాల మందు ప్రత్యేక నీతు
లు నవినీతులు గొడుగు నల్లుకొనగ తెలు
గు జగతి నది శాసించు తగుల మటన్న
నుడుగు వ్యాపించి కీర్తిని గొడుగు కిచ్చె. … 8
(అవకాశవాది = సమయమును గుర్తించి స్వలాభాపేక్షతో పరిస్థితుల కనుగుణముగా ప్రవర్తించు వాఁడు, వ్యవహరించు = ప్రవర్తించు, ఎల్లరు = అందఱు, సాధించు = నెరవేర్చు, వత్తాసు = ఇతరుల మాటలకు ప్రవర్తనకు ఇచ్చే మద్దతు, సమరము = యుద్ధము, వైరి = శత్రువు, ఛత్రము = గొడుగు, కూల్చు = పడగొట్టు, గొడుగుమాన్యం = గొడుగు పట్టేవాడి కిచ్చేది, ఇడు = ఇచ్చు, కను = చూచు, వోలె = వలె, వక్ర = వంకర, గతి = మార్గము, నడుపు = ప్రవర్తింపఁ జేయు, సఖుఁడు = స్నేహితుఁడు, బడలించు = బాధించు, ప్రత్యేకము = వేఱువేఱు, అల్లుకొను = చుట్టుకొను, జగతి = ప్రపంచము, శాసించు = ఆజ్ఞాపించు, తగులము = జంఝాటము, నుడుగు = మాట)
ఒక్కరి పాలనలో అనేక రాజ్యాలుంటే ఒక్క గొడుగు క్రింద ఉండడం అనరా, అవకాశవాదులుగా వ్యవహరించుట అంటే ఏ ఎండ కా గొడుగు అని అందరు అనరా, స్వలాభం పొందడానికి ఇతరులకు మద్ధతు పలకడాన్ని గొడుగు పట్టడం అనరా, యుద్ధంలో శత్రువుల గొడుగును పడగొట్టడం అవమాన పరచడమే అని అనరా, దేవాలయాల్లో గొడుగు పట్టేవారిని గొడుగుల వారని గొడుగు మాన్యాలు ఇవ్వడం చూడమా, కర్ణుని లాగా వక్ర మార్గంలో ప్రవర్తింపఁ జేసే బంధుమిత్రులను గొడుగు లనమా, పెళ్ళిలో వరునికి గొడు గిచ్చి కాశీకి పంపే వేడుక చూడమా, తమను బాధించకుండా ఋణదాతలకు ముఖం చాటుచేయడానికి సాయము గొడుగే కదా. ఈ విధంగా కలికాలంలో వేరు వేరు నీతులు అవినీతులు గొడుగును చుట్టుకొనగా, తెలుగు నాట అది శాసించే జంఝాటము అన్న మాట వ్యాపించి గొడుగుకి కీర్తిని ఇచ్చింది.
భావ వ్యక్తీకరణ చాలా అద్భుతంగా ఉంది. గొడుగు పదాన్ని ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు అని ఇది చదివాక తెలిసింది.
LikeLike
గొడుగు మీద భలే చమత్కారంగా రాసారండీ ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా .😊వామనుడే ఇల కు గొడుగు ను పరిచయం చేసాడనటం , ఏ ఎండకాగొడుగు నానుడి , ఏకఛత్రాధిపత్యము వగైరా వగైరా ..నవ్వుకుంటూ చదివాను . భావవ్యక్తీకరణ అద్భుతం ! అభినందనలు 💐
LikeLike
గొడుగు పద్యాలు చాలా బాగున్నాయి. మీకు శుభాభినందనలు 👏👏👏
LikeLike
గొడుగు యొక్క అవసరాన్ని, దాన్ని మొదట శ్రీ వామనుడు వాడినట్లుగా తెలుపుతూ, అన్ని యుగాలను కల్పుతూ మీరు వ్రాసిన పద్యాలు మరియు వాటి వివరణ చాలా బాగుంది. మీ భావుకత గొప్పగా ఉంది. ఈ కాలం లో గొడుగు మీద /తో ఉన్న వివిధ నానుడులను తెలియచేస్తూ /గుర్తుచేస్తూ వ్రాసారు. బాగుంది.👏👏🌹🌹🙏
LikeLike
గొడుగు గురించి అనాది నుండి వర్తమాన కాలం వరకు పద్య రూపములో మరియు వాటి సాధారణ తెలుగులో చక్కగా వర్ణించారు.
LikeLike