01 – 09 – 2025న ప్రచురించిన “సమస్యాపూరణాల సమాహారం” అన్న నా పుస్తకంలో(Free E-Book), 456 సమస్యలకి నేను చేసిన 620 పూరణలు ఇవ్వబడ్డాయి. ఆ తరువాత పూరించిన సమస్యలు పుస్తక రూపంలో ఒక్కసారిగా ప్రచురించే ముందు ఇలా ఎప్పటికప్పుడు ఈ బ్లాగులో మీ ముందు ఉంచాలని అనుకున్నాను. ఈ భాగంలో 10 సమస్యలకి పూరణలు ఇవ్వబడ్డాయి.
1. సమస్య: బలరాముడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్
కం. చెలు లన యతడే దారిని
శిల నతివగఁ జేయువాడు, చెన్నుఁడు, యతడే
యలవరచె వనిని “బల” “యతి
బల”, రాముడు, సీతఁ జూచి ఫక్కున నవ్వెన్
(చెలి = స్నేహితురాలు, శిల = ఱాయి, అతివ = స్త్రీ, చెన్నుఁడు = అందకాఁడు, అలవరచు = నేర్చు, వని = అడవి)
“బలరాముడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్” అనేది తెనాలి రామకృష్ణుడు పూరించిన ఒక ప్రసిద్ధ సమస్యా పూరణ పద్యం లోని పాదం. “ఆదిత్య 369″ అన్న తెలుగు సినిమా లోని ఒక సన్నివేశంలో రామకృష్ణుని సమస్యా పూరణం చూపించబడింది. ఆ పూరణ ఏమిటో చూద్దాం.
“కం. లలనలు పాయస మానిన
కలుగుదురే కొడుకు లనుచు క్ష్మాసుత పలుకన్
పొలమున దొరికెదరని ధీ
బల రాముడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్.”
స్త్రీ పాయసం తాగితే కొడుకులు పుడతారా అని సీతాదేవి అంటే, అబ్బే! పొలంలో (భూమిని దున్నినప్పుడు) దొరుకుతారు అని కొంటెగా జవాబిచ్చాడు, రాముడు. ఇక నా పూరణకి అర్థం ఏమిటో చూద్దాం.
అతడే దారిలో ఱాయిని స్త్రీగా చేసిన వాడు, అందకాఁడు, అతడే అడవిలో “బల” “యతి బల” అన్న విద్యలు నేర్చాడు, రాముడు, అని స్నేహితురాళ్ళు అనగా, సీత చూసి ఫక్కున నవ్వింది.
2. సమస్య: కులకాంతకు సాటి రారు గువ్వల చెన్నా!
కం. సలహా లివ్వగ యిష్ట స
ఖులు, పొరుగునఁ నున్న వారు, కులపెద్దలు, పు
ష్కలముగ నుందురు, యైనను
కులకాంతకు సాటి రారు గువ్వల చెన్నా!
(ఇష్టసఖుడు = స్నేహితుడు, పొరుగు = సమీపము, కులపెద్ద = వంశమునకు పెద్ద, పుష్కలము = అధికము, కులకాంత = ఇల్లాలు, సాటి = సమానము, గువ్వల చెన్నా = ఆ మకుటంతో శతకాన్ని రచించిన గువ్వల చెన్నడు అన్న కవి)
“కులకాంతకు సాటి రారు గువ్వల చెన్నా” అనేది గువ్వలచెన్న శతకం లోని ఒక ప్రసిద్ధ పద్య పాదం. ఆ పద్యం క్రింద ఇవ్వబడింది.
కం. వెలకాంత లెంద రైననుఁ
గులకాంతకు సాటి రారు కువలయ మందున్
బలు విద్య లెన్ని నేర్చిన
గుల విద్యకు సాటి రావు గువ్వలచెన్నా!
వేశ్య లెంత మంది ఉన్నా, తన భార్యతో సమానం కారు, ఎన్ని విద్యలు నేర్చినా కుల విద్యకు సాటిరావు అన్నది దీని భావం. ఇక నా పూరణకి అర్థం ఏమిటో చూద్దాం.
గువ్వల చెన్నా! సలహాలు ఇవ్వడానికి స్నేహితులు, పొరుగు వారు, కులపెద్దలు పుష్కలంగా ఉంటారు. అయినా కూడా ఇల్లాలికి సాటి రారు.
3. సమస్య: ఏమి చేయ వచ్చు నీశ్వరాజ్ఞ
ఆ.వె. కఱవు చేత కొంద రిఱకాటమున నుండ
వరద కొందరికి యవస్థ యయ్యె
యేది యెప్పు డొచ్చు నెవ్వ రెరుగుదురు?
యేమి చేయ వచ్చు నీశ్వరాజ్ఞ?
(కఱవు = అనావృష్టి, ఇఱకాటము = క్లిష్ట పరిస్థితి, వరద = వెల్లువ, అవస్థ = సంకటము, ఈశ్వరుడు = శివుఁడు)
వేటూరి ప్రభాకర శాస్త్రి గారు రచించిన చాటుపద్యమణిమంజరిలో “ఏమి చేయవచ్చు నీశ్వరాజ్ఞ!” అన్న పాదంతో ఐదు ఆటవెలది పద్యాలు ఉన్నాయి. పాండవులు నలుగురితో (సహదేవుడు తప్ప) పాటు ద్రౌపది అజ్ఞాత వాసం కోసం వేసిన మారు వేషాలు, చేపట్టిన వృత్తుల గురించినవి ఈ ఐదు పద్యాలు. ఇక నా పూరణకి అర్థం ఏమిటో చూద్దాం.
అనావృష్టి చేత కొందరు క్లిష్ట పరిస్థితిలో ఉండగా, వరద కొందరికి సంకటం అయ్యింది. ఏది ఎప్పుడు వస్తుందో ఎవరికి ఎరుక. శివునాజ్ఞను ఏమి చేయగలం?
4. సమస్య: చెలువుగ రామలక్ష్మణులు సీతకుఁ దమ్ములు శంభుఁ డన్నయున్
చం. పిలువగ గాధిజుం డతని వెంబడిఁ గానకు నెవ్వ రేగిరో?
కొలనున కొచ్చి రాము డట కోసిన వేమవి యేరి కివ్వగన్?
చలిమలపట్టి ఱేడెవరు? చక్రికు డామెకు యేమిఁ గావలెన్?
చెలువుగ రామలక్ష్మణులు, సీతకుఁ దమ్ములు, శంభుఁ, డన్నయున్.
(గాధిజుఁడు = విశ్వామిత్రుఁడు, కాన = అడవి, ఏగు = వెళ్ళు, కొలను = సరస్సు, ఏరు = ఎవరు, చలిమలపట్టి = పార్వతి, ఱేడు = మగఁడు, చక్రికుడు = విష్ణువు, చెలువుగ = యుక్తముగా, తమ్మి = పద్మము, శంభుడు = శివుడు)
ఇది క్రమాలంకారంలో పూరించబడిన సమస్య. అంటే, పద్యము లోని మొదటి మూడు పాదాల లోని ప్రశ్నలకు నాల్గవ పాదములో వరుసగ సమాధాన పదములు కూర్చబడినవి. పిలవంగానే విశ్వామిత్రుడి వెంట అడవికి ఎవరు వెళ్ళారు? సరస్సుకి వచ్చి రాముడు కోసిన వేమిటి? ఎవరికి ఇవ్వడానికి? పార్వతి మగఁడు ఎవరు? విష్ణువు ఆమెకు ఏమవుతాడు? ఈ ప్రశ్నలకి సమాధానాలు వరుసగా, యుక్తముగా రామలక్ష్మణులు, సీతకు పద్మములు, శివుడు, మరియు అన్న.
5. సమస్య: భల్లూకము కడుపు లోన భానుఁడుఁ గ్రుంకెన్
కం. తల్లీ! యాఁకొన్నతనము
హల్లీసక మాడె, యెలుక యనుకొనకమ్మా!
మల్లడిగొని పర్వు లిడెను
భల్లూకము కడుపు లోన, భానుఁడుఁ గ్రుంకెన్.
(తల్లి = అమ్మ, ఆఁకొన్నతనము = ఆఁకలి, హల్లీసకము = తాండవము, మల్లడిగొను = విజృంభించు, పర్వు = పరుగు, భల్లూకము = ఎలుగుబంటి, భానుఁడు = సూర్యుఁడు, క్రుంకు = అస్తమించు)
“కడుపులో ఎలుకలు పరుగిడుతున్నాయి” అనేది తీవ్రమైన ఆకలిని సూచించే ఒక తెలుగు జాతీయం. ఆ ఆకలి తీవ్రతని ఇంకొంచెం పెంచి ఎలుకలు కాదు ఎలుగుబంట్లు పరుగిడుతున్నాయి అని అంటే బాగుంటుందేమో అని సూచించే అర్థంతో ఈ పద్యం వ్రాయబడింది. ఇక ఆ పూరణకి అర్థం ఏమిటో చూద్దాం.
అమ్మా! ఆకలి తాండవం చేసింది, ఎలుక అనుకోకమ్మా! కడుపులో ఎలుగుబంటి విజృంభించి పరుగులు పెట్టింది. సూర్యుఁడు అస్తమించాడు.
6. సమస్య: రంకులు తేఁబోయి యేడు రాత్రిళ్లాయెన్
కం. కింకను పోగొట్టునె? యి
ఱ్ఱంకులు, తేఁబోయి యేడు రాత్రిళ్లాయెన్
వంకలు వెదకి కుజ యునికి,
శంకను విడు మగ్రజ! యని సౌమిత్రి యనెన్.
(కింక = బాధ, ఇఱ్ఱంకులు = ఉపవాసము, తేఁబోవు = తెచ్చుటకు వెళ్ళు, వంక = దిక్కు, కుజ = సీత, ఉనికి = ఆచూకి, శంక = సందేహము, విడు = విడిచిపెట్టు, అగ్రజుడు = అన్న, సౌమిత్రి = లక్ష్మణుడు)
ఉపవాసం బాధను పోగొడుతుందా? దిక్కులు వెదకి సీత ఆచూకి తేవడానికి ఏడు రాత్రులు అయ్యాయి. అన్నా! సందేహం విడిచిపెట్టు అని లక్ష్మణుడు అన్నాడు.
7. సమస్య: గుత్తపు తాపితా రవిక కుట్టు ఫటుక్కున వీడె నింతికిన్
ఉ. బిత్తరవోవు నట్లు జరిపించగ జంటకు షష్టిపూరితిన్,
యొత్తిడి చేసి కట్ట నిడి రొల్లియ లా సతి పెళ్ళి నాటివే,
యెత్తరి స్థూలకాయమున యెట్టుల పట్టును నాటి వస్త్రముల్,
గుత్తపు తాపితా రవిక కుట్టు ఫటుక్కున వీడె నింతికిన్.
(బిత్తరవోవు = దిగ్భ్రమ చెందు, జంట = స్త్రీపురుషుల జత, షష్టిపూరితి = అఱువదియేండ్ల వయస్సు నిండుట, ఒత్తిడి = బలవంతము, కట్టు = ధరించు, ఇడు = ఇచ్చు, ఒల్లియ = వస్త్రము, సతి = భార్య, ఎత్తరి = పొడగరి, స్థూలకాయము = లావు శరీరము, పట్టు = సరిగా శరీరమునకు కుదురుకొను, గుత్తము = బిగువు, తాపితా = పట్టువస్త్రము, వీడు = వదలు, ఇంతి = స్త్రీ)
దిగ్భ్రమ చెందే విధంగా దంపతులకు షష్టిపూర్తి జరిపించడం కోసం బలవంతము చేసి కట్టుకోవడానికి ఆ భార్య పెళ్ళినాటి వస్త్రాలే ఇచ్చారు. పొడగరి లావు శరీరానికి అప్పటి బట్టలు ఎట్లా సరిపోతాయి. ఆవిడకి బిగుతుగా ఉన్న పట్టు రవిక కుట్టు ఫటుక్కున వీడింది.
8. సమస్య: తొలి నియోగులు సిసలైన తెలుగు కవులు
తే.గీ. వైదిక నియోగిశాఖలు – ఆది కవికి
వంద యేండ్ల వెనుక వేఱుపడెనుఁ గాన
యాత డెరుగడు, వాని తర్వాత వెలసె
తొలి నియోగులు, సిసలైన తెలుగు కవులు
కుల మతంబుల బంధించ నలవి కారు,
నన్నయకు వారసుఁలుఁ గాన యన్ని పసల.
(వెనుక = పిమ్మట, వేఱుపడు = విడిపోవు, వెలయు = ప్రసిద్ధికెక్కు, తొలి = మొదటి, సిసలు = మేలైన, అలవి = శక్యము, పస = విధము)
కొప్పరపు సోదర కవుల కుమారులైన సీతారామప్రసాదరావు, మల్లికార్జునరావు గార్లు కూడా జంట కవులే. 1943వ సంవత్సరంలో సంక్రాంతి నాడు విజయవాడలో వారి అష్టావధానం శ్రీ చెళ్ళపిళ్ల వేంకటశాస్త్రి గారి అధ్యక్షతన జరిగింది. ఆ సభలో ఈ జంట కవులు చెళ్ళపిళ్ల వారి ప్రశంసలతో పాటు, అదే సభలో పృచ్ఛకులలో ఒకరైన కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ఆశీస్సులు కూడా అందుకున్నారు. విశ్వనాథ వారు ఆశీఃపూర్వకంగా నాడు చెప్పిన మూడు పద్యాలలో క్రింది పద్యం ఒకటి:
తే.గీ. తొలి నియోగులు సిసలైన తెలుగు కవులు
తెలియ పలనాడు చక్కని తెలుగు గడ్డ
ఆశుకవనంబు మీ యింటి ఆడుబిడ్డ
నేను దీవన లిత్తు నెన్నేని మీకు.
“తొలి నియోగులు సిసలైన తెలుగు కవులు” అన్న పద్యపాదం వివాదాలకు దారి తీసింది అని అంటారు. ఇది నమ్మ శక్యమే. ఎందుకంటే, సిసలైన తెలుగు కవులు తొలి నియోగులు తప్ప వేరెవరూ కాదా?, తొలి నియోగులు సిసలైన తెలుగు కవులయితే, తరువాతి నియోగులు కారా? లాంటి ప్రశ్నలు తలెత్తుతాయి. విశ్వనాథ వారు ఇవేవీ కాదని, “తొలి నియోగులు” అంటే “తొలి నుంచి నియోగులు” అని అర్థం చెప్పి, తిక్కన కాలం నుండి నియోగులు సిసలైన తెలుగు కవులు అన్నట్లుగా సూచించారు.
కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వివాదాస్పద పద్య పాదం, అదే – “తొలి నియోగులు సిసలైన తెలుగు కవులు” అన్నదాన్ని ఒక సమస్య అనుకొని పద్యం పూరిస్తే ఎలా ఉంటుంది అన్న ఒక ఆలోచన వచ్చి చిన్న ప్రయత్నం చేశాను. దాని ఫలితమే ఇది. నన్నయకు సుమారు వంద ఏండ్ల తరువాత వృత్తిపరంగా వేరైన శాఖే నియోగి శాఖ అన్నది చారిత్రక సత్యం. ఆ విషయమే నేను వ్రాసిన పద్యానికి వెన్నెముక. ఇక పద్యానికి అర్థం ఏమిటో చూద్దాం.
వైదికులు నియోగులు అన్న శాఖలు, ఆది కవియైన నన్నయకు వంద సంవత్సరాల వెనుక విడిపోయాయి కనుక ఆతడు ఎరుగడు. ఆయన తరువాత, మొదటి నియోగులు వెలిశారు. మేలైన తెలుగు కవులు అన్ని విధాలా నన్నయకు వారసులు కనుక కులమతాలలో బంధించడానికి వీలు పడరు.
మామూలుగా సమస్యాపూరణంలో సమస్యగా ఇచ్చిన పాదం కాక మూడు పాదాలే వ్రాయాలి. అలా అనుకుని, పై పద్యం లోని చివరి రెండు పాదాలు వదిలేస్తే, తొలి నియోగులే కాదు సిసలైన తెలుగు కవులు కూడా నన్నయ తరువాతే ప్రసిద్ధికెక్కారని అర్థం వస్తుంది. అది కూడా నిజమే. చివరి రెండు పాదాలు కూడా తీసుకుంటే, తొలి నియోగులు నన్నయ తరువాత ప్రసిద్ధికెక్కారని, సిసలైన తెలుగు కవులు అన్ని విధాల నన్నయకు వారసులు కనుక కులమతాలలో బంధించడానికి వీలు పడరని, (జాషువా గారు చెప్పినట్లు) అర్థం వస్తుంది.
9. సమస్య: పద్యము గద్య మట్లు బహుపాటవ మొప్ప పఠించు మేటికిన్
ఉ. చోద్యముగా జనాళి కొక సూత్రముఁ జెప్పగ రాజమండ్రిలో
హృద్యము యాంగ్లపాలకుల నెన్నుట దోపిడికాళ్ళుగన్ సభన్
పద్యము గద్య మట్లు బహుపాటవ మొప్ప పఠించు మేటికిన్
యుద్యమ స్ఫూర్తి నేర్పు నొక యొజ్జకు నంజలి చిల్కమర్తికిన్.
(చోద్యము = ఆశ్చర్యము, జనాళి = ప్రజాసమూహము, సూత్రము = కొన్నిధర్మములను చెప్పు ప్రవచనము, హృద్యము = మనస్సున కింపైనది, ఎన్ను = ఆక్షేపించు, దోపిడికాడు = బందిపోటు, పాటవము = నైపుణ్యము, ఒప్పు = తగు, మేటి = శ్రేష్ఠుడు, స్ఫూర్తి = పోరాటపటిమ, ఒజ్జ = గురువు, అంజలి = నమస్కారము)
వందేమాతర ఉద్యమ ప్రచారం కోసం 1907 ఏప్రిల్ నెలలో రాజమండ్రిలో బిపిన్ చంద్ర పాల్ గారు సభ జరిపినప్పుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఈ క్రింది పద్యాన్ని సభలో చదివారట.
తే.గీ. భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చు చుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియ బట్టి.
ఈ పద్యం వ్రాసింది చిలకమర్తి వారా, వేరొకరా అన్న వాదం పక్కన పెడితే, తెలుగులో భారత జాతీయోద్యమ సంబంధమైన తొలి రచనగా ఈ పద్యం ప్రాచుర్యం పొందడం చిలకమర్తి వారి చలవే అన్నది నిర్వివాదాంశము. ఈ నేపథ్యం దృష్టిలో పెట్టుకుని నేను వ్రాసిన పద్యానికి అర్థం ఏమిటో చూద్దాం.
ఆశ్చర్యకరంగా ప్రజాబాహుళ్యానికి ఒక సూత్రం చెప్పాలనే ఉద్దేశ్యంతో రాజమండ్రిలో సభలో ఆంగ్ల పాలకులను బందిపోట్లుగా ఆక్షేపించడం మనస్సున కింపైనది. పద్యాన్ని వచనం లాగా చాలా నైపుణ్య మొప్పగా చదివిన శ్రేష్ఠునికి, ఉద్యమ స్ఫూర్తి నేర్పిన ఒక గురువుకు చిలకమర్తి వారికి నమస్కారము.
10. సమస్య: కాదని చెప్పుటే మనకు కాదగు మేలు నవీన కాలమున్
ఉ. కాదను టేల? వస్తువుగ కావ్యము లందు యనర్హ మేదియున్
కాదని చెప్పుటే మనకు కాదగు మేలు, నవీన కాలమున్
నాదనిఁ జెప్ప లేదె? యొక నవ్యపథమ్మునుఁ జూపినట్టి శ్రీ
శ్రీ దిశ మార్చి కైతలకు రీతి రివాజుల సాహితీ క్షితిన్.
(అనర్హము = తగనిది, నవ్య = క్రొత్తది, పథము = మార్గము, దిశ = దిక్కు, కైత = కవిత్వము, రీతి రివాజులు = సాంప్రదాయాలు పద్ధతులు, క్షితి = విశ్వము)
“కాదేదీ కవిత కనర్హం” అనేది మహాకవి శ్రీశ్రీ రాసిన “మహాప్రస్థానం” లోని “ఋక్కులు” అన్న గేయం లోని అత్యంత ప్రసిద్ధమైన వాక్యం. “కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా – హీనంగా చూడకు దేన్నీ! కవితామయమేనోయ్ అన్నీ!” అంటూ సాగి, “కాదేదీ కవిత కనర్హం! ఔనౌను శిల్పమనర్ఘం! ఉండాలోయ్ కవితావేశం! కానీవోయ్ రస నిర్దేశం! దొరకదటోయ్ శోభాలేశం!” అని ప్రపంచంలో ప్రతిదీ కవితాత్మకమేనని సూత్రీకరిస్తూ, “ప్రపంచమొక పద్మవ్యూహం! కవిత్వమొక తీరని దాహం!” అని ముగుస్తుంది ఈ గేయం. తన “మహాప్రస్థానం” అన్న కవితా సంకలనంతో ఆధునిక తెలుగు కవిత్వంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) గారు “ఈ యుగం నాది” అంటూ అభ్యుదయ కవితా యుగానికి తానే సారథినని ప్రకటించుకున్నారు. ఈ భావాన్ని దృష్టిలో పెట్టుకుని నేను వ్రాసిన పద్యం అర్థం ఏమిటో చూద్దాం.
ఎందుకు కాదనడం? సాంప్రదాయాల పద్ధతుల సాహిత్య ప్రపంచంలో కవితలకు దిశ మార్చి ఒక నూతన మార్గాన్ని చూపినట్టి శ్రీశ్రీ కావ్యాలలో వస్తువుగా ఏదీ అనర్హము కాదు అని చెప్పడమే మనకు కాదగిన మేలు, ఆధునిక కాలము నాది అని చెప్ప లేదా?
Superb sir with great understanding
With warmest regards
Dr V V S Murty
LikeLike
I have gone through the Article ‘ samasya puranam’ . With your knowledge and medhassu , in Telugu literature, this could become a compendium, companion of wisdom to anyone who cares to read it. My congratulations – D Tirupathi Sastry
LikeLike