వన్ అప్ ఎఫిషియన్సీ

వన్ అప్ ఎఫిషియన్సీ (one-up efficiency) అంటే ఎప్పటి కప్పుడు ఇతరుల కన్నా తాను కాస్త మెరుగు అని అనిపించుకోవడం, పనికొచ్చే పనిలోయైనా సరే పనికిరాని పనిలోయైనా సరే. మా చిన్నప్పుడు మా నాన్నగారు మమ్మల్ని నవ్వించడానికి చెప్పిన ఒక కథ దీన్ని చాలా బాగా వివరిస్తుంది అని నాకు పెద్దయిన తరువాత తెలిసింది.

శ్రీరామచంద్రుడు రావణ సంహారం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చి అందరి సమక్షంలో పట్టాభిషిక్తుడవుతాడు. అందరి సమక్షంలో అంటే, తన అన్నదమ్ములు, తన తల్లి, సవతి తల్లులు, ఇతర అయోధ్యావాసులు, సామంత రాజులు, సుగ్రీవాది కపి సేన, విభీషణాది రాక్షస సేన, వశిష్ఠాది మునిజనము – ఇలా అందరూ ఉన్నారు, అని అర్థం. రావణాది రాక్షస సంహారం లోనూ, సీతను చెర నుండి విడిపించడం లోను, తనకు సాయం చేసిన వారి నందరినీ పేరు పేరునా సముచితంగా సన్మానించి వారి గౌరవార్థం బ్రహ్మాండమయిన విందు ఇచ్చాడు, రాముడు.

విందులో పంచభక్ష్య పరమాన్నాలతో పాటు చింతకాయ పచ్చడి వడ్డించారట. ఆశ్చర్య పడకండి. మేము కథ వ్రాసేటప్పుడు, శ్రీరాముడైనా, ఇంకెంత వారైనా, విందు వాళ్ళదే అయినా, కథ మాది కాబట్టి అందులో మా వంటకాలు ఉండాల్సిందే. ఇది కూడా మన పెద్దలు మనకు సంప్రదాయంగా చేసేశారు. ఎలా అంటే, ఆదికవి నన్నయగారు, అర్జునుడు తీర్థయాత్రల కని తిరుగుతూ రాజమహేంద్రవరంలో (రాజమండ్రి) కోటిలింగాల రేవులో స్నానం చేశాడని వ్రాశారు. తిక్కన గారు ఏమన్నా తక్కువ తిన్నాడా. ఉత్తరాభిమన్యుల వివాహంలో మన తెలుగు వాళ్ళ వేడుకలు అన్నీ పెట్టారు. వివాహ మంటపం మామిడి తోరణాలతో ముత్యాల ముగ్గులతో అలంకరించడం, వధూవరుల మధ్య ముహూర్తానికి ముందు తెర పట్టించడం, ముహూర్త సమయాన వధూవరుల చూపులు కలవడం, వివాహ వేడుకల్లో వధూవరులు తలంబ్రాలు పోసుకోవడం – ఇలాంటివి పాండవులకి, విరాటరాజుకి, వ్యాసుడికి తెలియవు కాబట్టి నేను చేయిస్తాను అన్నట్లుగా తిక్కనగారు జరిపించారు. ఎఱ్ఱన గారు ఏమన్నా తీసిపోయారా? బాలకృష్ణుడికీ అతని స్నేహితులకీ పొద్దున్నే చద్ది అన్నం, మాగాయ, పెరుగు తినిపించారు. అందాకా ఎందుకు? నేను గనక రామాయణం వ్రాస్తే, సీతారామ వనవాసంలో, సీతా రామ లక్ష్మణులు మా ఊరి (అప్పు డది అడవి లాగా ఉండేది లెండి) కాలువలో స్నానం చేసినట్లు, అక్కడ జపం చేసుకున్నట్లు, ఆ కాలువ గట్టు మీద తడి బట్టలు ఆరేసుకున్నట్లు వ్రాసి ఉండేవాడిని. ఇంకెందుకు మనకి సందేహం. రాముల వారి విందులో చింతకాయ పచ్చడి వడ్డించి తీరాల్సిందే.

సరే, విందులో చింతకాయ పచ్చడి వడ్డించారండి. అంతమందికి అతి తక్కువ సమయంలో చింతకాయ పచ్చడి చెయ్యాలంటే సామాన్యమైన విషయమా. రోళ్ళు, రోకళ్ళు, మిక్సీలు (ఆ కాలంలో లేవు అనుకోండి) ఎన్ని ఉన్నా సరిపోవు. మరి ఎలా చేసి ఉంటారు. ఇక్కడ, మీకు తెలియని విషయం ఒకటి చెబుతాను, నా చిన్నతనంలో నేను విన్నది. మన జమీందారుల సంస్థానాలలో అదివరకు సంతర్పణలు చేసేవారట. వాటిల్లో, ఆంధ్రశాకం శాకంబరీదేవీ ప్రసాదం, అంటే గోంగూర పచ్చడి తప్పకుండా వడ్డించేవారట. అందుకే ఆ విషయం, “మాయాబజార్” సినిమాలో కూడా చెప్పారు, పింగళి నాగేంద్రరావు గారు. రాముల వారి విందులో చింతకాయ పచ్చడి చెయ్యడానికి ఏమి కష్టాలు ఉండేవో, మన జమీందారుల సంతర్పణలలో గోంగూర పచ్చడి చెయ్యడానికి కూడా అలాంటి కష్టాలే ఉండేవి. మంది ఎక్కువ, సమయం తక్కువ, చెయ్యడానికి సాధనాలు ఏమీ లేవు. మరి ఎలా చేసేవారు అన్నది చెబితే చాలా ఆశ్చర్యపోతారు మీరు.

ఒక గచ్చు ఉన్న హాలును బాగా శుభ్రం చేయించి, పచ్చడికి కావలసిన ఆకు / తొక్కు, ఇతర దినుసులు, వేగించిన ఎండు మిరపకాయలతో సహా, నేల మీద పోయించేవారు. కొంత మంది మనుషులను కాళ్ళు కడుక్కొని చక్కగా తుడుచుకొని వచ్చి గోడలను పట్టుకొని తొక్క మనేవారు. నలిగీ నలగకుండా ఉన్నా అలా చేసిన పచ్చడి బాగా రుచిగా ఉండేదట. అలా, చింతకాయ పచ్చడి చేయించి రాముల వారి విందులో వడ్డించారు.

సరే, అందరూ చక్కగా భోంచేస్తున్నారు. ఆ బంతిలో మన కిష్కింధాపుర అగ్రహారీకులు, అంటే కపి సేన, అందరూ ఒక్క మాటుగా భోజనానికి కూచున్నారు. భోజనాల బంతుల్లో ఎదురెదురు వరుసల్లో కూచుంటారు కదా. ఒక కపి (కోతి) చింతకాయ పచ్చడి గట్టిగా అన్నంలో కలుపుకునేటప్పుడు, అందులోని ఒక చింతగింజ నలగకుండా ఉండిపోయి, చేయి జారి పైకి ఎగిరిందట. వెంటనే, ఆ కలుపుకుంటున్న కోతికి కోపం వచ్చిందట. నా ముందే ఎగురుతావా, చూడు నీకన్నా ఎత్తు ఎగురుతాను అని తానూ ఎగిరిందట (ఎగిరాడట). ఆ కోతి ఎగరడం చూసి దాని (వాడి) పక్క నున్న కోతికి కోపం వచ్చి చూడు నీకన్నా ఎత్తు ఎగురుతాను అని తను కూడా ఎగిరిందట (ఎగిరాడట). అలా, ఒకళ్ళని చూసి ఒకళ్ళు నా ముందే నీ కుప్పి గంతులా అని కోపంతో ఎగురుతూ ఉండడం వల్ల, కపి సేన విందు ప్రాంగణం అంతా చిందరవందర చేసిందట.

చింతగింజ ఎగిరి నంత మాత్రాన మనం కూడా ఎగరాలా అన్న అలోచన కోతులకు ఎందుకు రాలేదు అన్న విషయం ఉండనే ఉంది. అది కాక, చింతగింజ ఎగిరిన వరుసలో కాకుండా, దానికి ముందున్న దాని వెనక ఉన్న వరుసల్లో ఉన్న కోతులకి అసలు ఇదంతా ఎక్కడ, ఎందుకు మొదలయ్యిందో తెలియక పోయినా వాళ్ళు కూడా ఏదో సంఘీభావానికి అన్నట్లు ఆపకుండా ఎగరడం అన్నది అందరినీ ఆకట్టుకోవాల్సిన అంశం. ఎగరడంలో చింతగింజ కన్నా నేను మెరుగు అని ఒక కోతి, అదే పనిలో ఆ కోతి కన్నా నేను మెరుగు ఇంకో కోతి, అది నా కన్నా మెరుగా అని ఇంకోటి, ఇలా అందరూ పోటీ పడి ఒళ్ళు తెలియకుండా గంతులు వేయడం, ఒక్కోసారి సాధించాల్సిన లక్ష్యంలో స్పష్టత లేకుండా అలా చేయడం, ఒక్కోసారి ఎందుకు చేస్తున్నామో కూడా తెలియకుండా చేయడం, రంగం చెడగొట్టడం, కథలో కోతులకి ఆపాదించాము కానీ మనం కూడా చాలా సార్లు అలా ప్రవర్తించి ఉంటాము లేక అలా ప్రవర్తించే వాళ్ళని చూసి ఉంటాము, వన్ అప్ ఎఫిషియన్సీ కోసం.

ఒక్కోసారి ఏదో జరుగుతుందని ఊహించి దాన్ని నిరోధించడానికి పోరాటం చెయ్యడం మనం వినే ఉంటాము. ఇటువంటి పాత్రను సెర్వాంటెస్ (Cervantes) అన్న స్పానిష్ (Spanish) రచయిత ప్రపంచం లోని తొలితరం (17వ శతాబ్దము ప్రథమ భాగంలో) నవలల్లో ఒకటయిన “The Ingenious Gentleman Don Quixote of La Mancha”లో (in short, Don Quixote) సృష్టించాడు. ఉచ్చారణలో Don Quixoteను డాన్ క్వియోటే అనాలో డాన్ క్విక్సాట్ అనాలో అన్న విషయం పక్కన పెడితే, మనకి తెలుగులో మారీచుడి పేరు మీద “మారీచము” అంటే “మోసము” అన్న పదం చేరినట్లుగా, ఇంగ్లీషులో “క్విక్సాటిక్” అన్న పదం వచ్చి చేరింది. మూర్ఖంగా ఏదైనా ఆచరణ సాధ్యం కాని అవాస్తవమైన దాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాన్ని ఆంగ్లంలో “క్విక్సాటిక్” ప్రయత్నం అంటారు. ఆ నవలలోని విశేషం ఏమిటంటే, నాయకుడు నేను మామూలు జనాల లాంటి వాడిని కాదు, వాళ్ళ కన్నా మెరుగైన వాడిని, ఒక వీరుణ్ణి అనుకుని, తన ఊహాల్లో ఎవరో అమ్మాయిలు ఏవో ఇబ్బందుల్లో ఉన్నారని ఊహించుకుని, తాను వీరత్వం ప్రదర్శించి వాళ్ళని రక్షించినట్లు కలలు కంటాడు. అంటే, లేని సమస్యల (non-existing problems) గురించి పోరాటం చేస్తూ ఉంటాడు. మనం చేసిన, చూసిన వాటిల్లో, ఇలాంటి పనులు ఏమన్నా గుర్తొస్తున్నాయా?

నేను పనిచేసే రోజుల్లో ఒక పెద్ద విద్యార్థుల గుంపు మా ఆఫీసు (office) ఉన్న బజారులో అన్ని దుకాణాలు, ఆఫీసులు మూయిస్తూ మా ఆఫీసుకు కూడా వచ్చింది. గవర్నమెంటు (government) నియమించిన ఒక కమిటీ (committee) సమర్పించిన రిపోర్టు (పేర్లు, ఇతర వివరాలు అనవసరం అని ఇవ్వలేదు) అమలు చేస్తే చాలా మందికి అన్యాయం జరుగుతుందని, దాన్ని వ్యతిరేకిస్తూ బందు (bandh) చేయిస్తున్నామని చెప్పారు. దాని దేముంది, ఈ ఆఫీసు మూసేస్తున్నామని వాళ్ళ ఎదురుగానే సిబ్బందిని బయటికి పంపేసి, ఆందోళనకారులలో ముఖ్యమైన వాళ్ళని ఒకళ్ళిద్దరిని ఉండమన్నాను, వివరాలు తెలుసుకోవడానికి. అఫీసు అంతా మూసి, ఒక తలుపు మాత్రం తెరిచి ఉంచితే ఆ గుంపులో వాళ్ళు అరడజను మంది ఔత్సాహికులు నా రూములో కొచ్చి కూచున్నారు. అప్పుడడిగాను, మీరు వ్యతిరేకిస్తున్న రిపోర్టులో ఏముందని. వాళ్ళు మేం చదవలేదండి, మా నాయకులలో ఒకళ్ళిద్దరు చదివారట, చదివి అందులో ఏముందో వాళ్ళు కూడా మాకు చెప్పలేదు అని చెప్పారు. మరి ఎందుకయ్యా అంత ఆవేశంగా అరుచుకుంటూ పోతున్నారు అని అడిగితే, అదే మా ఐకమత్యము అని అన్నారు. కారణం తెలియకుండా గవర్నమెంటుకు వ్యతిరేకంగా స్లోగన్లు (slogans) అరుచుకుంటూ వీధుల్లో తిరగడానికి, చింతగింజకు పోటీగా ఎగరడానికి, లేదా అలా ఎగిరిన వాళ్ళని చూసి తాము కూడా ఎగరడానికి, తేడా ఉందంటారా?

అలా మనకు వివరాలు సరిగ్గా తెలియకుండానే మనం పీకల లోతు తగాదాల్లో కూరుకుపోయిన సందర్భాలు చాలా ఉండి ఉంటాయి. ఎక్కువగా, మనకి చాలా కావలసిన వాళ్ళకి వత్తాసు పలకాల్సిన సందర్భాలలో మనం ఉచ్చము నీచము చూడము. అసలు, మనకి విషయం పూర్తిగా తెలియక పోయినా మన వాళ్ళకి సపోర్టు (support) ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి రెచ్చిపోయి వంత పాడడం, అవతలి వాళ్ళని గడ్డిపోచ కింద కట్టడం, మనలో కొంత మందిమి చేసే ఉంటాము, లేదా చూసి ఉంటాము. కోపంతో అటువంటి సమయాల్లో వేసే చిందులు, రాముల వారి విందును తలపించవా?

మన సొసైటీలలోను, చట్టసభలలోను అప్పుడప్పుడు తీర్మానాలు ప్రవేశపెట్టబడతాయి. సభ్యులు తక్కువగా ఉంటే, కోరం బెల్లు (quorum bell) కొట్టడమో ఇంకేదైనా ఉపాయం అలోచించడమో చేస్తారుట, ఓటింగుకి మెంబర్ల కనీస సంఖ్య ఉండడానికి. ఓటింగు హాలులోకి వచ్చేటప్పుడు ముఖ్యంగా అధికార పార్టీ సభ్యులో లేక తీర్మానం ప్రవేశపెట్టిన పార్టీ సభ్యులో అధ్యక్షా! మేము సమ్మతిస్తున్నాము అని అంటూ లోపలికి వస్తారట, లోపల ఏం జరుగుతోందో సరిగ్గా తెలియకపోయినా సరే. ఒకవేళ సభలో ఉన్నా కూడా కొన్ని బిల్లులకు అనుకూలంగా కొన్నిటికి వ్యతిరేకంగా ఓటు వేసే సభ్యులు ఆ బిల్లులు చదివి అర్థం చేసుకుని ఓటు వేశారు అని గట్టిగా చెప్పగలమా?

చిన్నప్పుడు తల్లిదండ్రులకు మిగతా పెద్దలకు ఇష్టులవ్వాలని ఏదో ఒకటి వాళ్ళకి నచ్చే పని చేసి ఆకట్టుకోవాలని పిల్లలు వాళ్ళల్లో వాళ్ళు పోటీ పడటం, విద్యాలయాల్లో ఉపాధ్యాయులకు నచ్చే విధంగా ప్రవర్తించి వాళ్ళ అభిమానాన్ని పొందాలని విద్యార్థులు తంటాలు పడటం, కార్యాలయాల్లో ఉద్యోగులు బాసుకు (boss) అడుగుకు మడుగు లొత్తుతూ ఆయన నంది అంటే నంది అని పంది అంటే పంది అని, తానకు తందాన అనడం, ప్రేమ వ్యవహారాల్లో ప్రేయసినో / ప్రియుడినో ఇతరుల కన్నా తాను బాగా ఆకట్టుకోవాలనుకోవడం – ఇవన్నీ మనకు తెలిసినవేగా. వీటిలో కొన్నన్నా మనం చేయ లేదని లేక చూడ లేదని అంటారా? ఇలాంటి పోటీల్లో, ఒక్కోసారి పిచ్చి చేష్టలు, చాలా సిల్లీగా (silly), మనం చేయలేదని / చూడ లేదని అంటారా? మన తోటి వాడికి ఏదో లక్ష్యం ఉండి చేసే పనులు, మనకి అటువంటి లక్ష్యం లేకపోయినా సరే, సరదాకి చేసిన దాఖలాలు లేవంటారా? మరి మనకి కోతులకి తేడా ఏమిటి? వారసత్వంగా మనకి ఆ లక్షణాలు వచ్చాయంటారా? “కోతి నుండి పుట్టాడు మానవుడు అంటే ఇదా అర్థం. అంతే లెండి, లేకపోతే ఒరిజినాలిటీ (originality) మిస్సు (miss) అవదూ.

One thought on “వన్ అప్ ఎఫిషియన్సీ

  1. వాట్సాప్ ద్వారా వచ్చిన కామెంట్లు క్లుప్తంగా:

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతిరావు గారు (28-1025): వన్ అప్ ఎఫిషియన్సీ అంటే ఇదా. కోతి కుప్పిగంతులకు కారణం ఇప్పుడు తెలిసింది. కానీ, ఆ గోంగూర పచ్చడే, క్వాంటిటీ ఎక్కువ కావాలన్నప్పుడు రోట్లో ఎంతని నూరుతారు లెండి. ఎలా చేసిందీ ఇలా చెప్పకుండా ఉంటే, బాగుందంటూ ఎవరయినా లొట్టలేసుకుంటూ తింటారు గనుక నో ప్రాబ్లెం. రామాయణంలో చింతకాయ పచ్చడి కూడా రుచిగా ఉందండీ, మీరు వడ్డించింది. చమత్కారానికే పెట్టింది పేరు మీ రచనలు. ఇదే పద్ధతిలో మీ own creationతో ఒక సోషల్ కథ రాయండి.

    శ్రీ నిడమర్తి రాంప్రసాద్ గారు (28-10-25): ఐకమత్యం గురించి రచన ఇంత బాగా చెయ్యచ్చని తెలిసింది. జంతూనాం నరజన్మ దుర్లభం అనే డార్విన్ scientific కోణం కూడా అర్థం అయ్యింది.

    డా. వి.వి.ఎస్. మూర్తిగారు (28-10-25): Superb article with lots of latest and historical evidences.

    డా. ఎ. రంగారావు గారు (28-10-25): కథ చాలా బాగుంది. గోంగూర పచ్చడి చేసే విధానం, అన్ని అంశాలు, నన్ను ఆకట్టుకున్నాయి. మీ రచన శైలి బాగుంటుంది.

    Like

Leave a reply to Ranganadham Cancel reply