ఆయన తిట్టినా మనకి కోపం రాదు

కొంత మంది తిట్టినా ఎవ్వరికీ కోపం రాదు. వాళ్ళ పెద్దరికం అలాంటిది. అటువంటి వాళ్ళలో అగ్రగణ్యులు శ్రీ కాళ్ళకూరి నారాయణరావు (1871 – 1927) గారు. వీరు ఇంచుమించు తమ సమవయస్కులైన టంగుటూరి ప్రకాశం పంతులు గారితో పాటు ఆ రోజుల్లో నాటకాలు వేసే వారట. పంతులు గారు గుండ్రటి ముఖం కలవారు కాబట్టి నాయిక దమయంతి గాను, నారాయణరావు గారు నాయకుడు నలుడు గాను వేషం కట్టేవారట. ఆ విషయం పక్కన పెడితే, నారాయణరావు గారు మహాకవి, శతావధాని, కందుకూరి వీరేశలింగం పంతులు గారికి రఘుపతి వేంకటరత్నం నాయుడు గారికి కొప్పరపు కవులకు ఆదిభట్ల నారాయణ దాసు గారికి ప్రత్యక్ష / పరోక్ష శిష్యుడు, గొప్ప నాటక రచయిత, సంఘ సంస్కర్త అని విన్నాను. వీరు సంఘంలో ఉన్న నాటి మూడు దురాచారాల గురించి మూడు నాటకాలు వ్రాశారు. అవి చింతామణి (1921), వరవిక్రయము (1923), మధుసేవ (1926) అన్నవి. ఈ మూడు నాటకాలు కూడా మనకు స్వతంత్రము రాక ముందు, అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్రాసినవి. “చింతామణి” అన్నది వేశ్యాలోలత్వము గురించి, “వరవిక్రయము” అన్నది వరకట్న సమస్య గురించి (అప్పటికి కన్యాశుల్కం పోయి ఇది వచ్చింది), “మధుసేవ” అన్నది మద్యపానం గురించి, వ్రాసినారు. ఈ మూడు సమస్యలు తీరితే మనకు స్వాతంత్ర్యం వచ్చినట్లే అని కాళ్ళకూరి వారి భావన.

హాస్య రసాన్ని చిందించే ఈ మూడు నాటకాలలో మొదటి రెండు నాటకాలు పొందిన ప్రాచుర్యం, మూడవదైన “మధుసేవ” పొందలేదనిపిస్తోంది.  వేశ్యల (దేవదాసీలు, భోగినీలు, జోగినులు – ఇలా విభిన్న ప్రాంతాలలో వేరు వేరు పేర్లతో పిలవబడేవారు) ఉద్ధరణకు ప్రభుత్వాలు శాసనపరమైన, ఇతరమైన చర్యలు చాలా తీసుకున్నారు. వరకట్న సమస్య గురించి కూడా అటువంటి చర్యలు తీసుకోబడ్డాయి. కానీ మద్యపానం గురించి అయితే కఠిన చర్యలు ఒక మాటు తీసుకుని ఒక మాటు వాటిని వెనక్కి తీసుకుని, ఇట్లా ముందు కొక మాటు వెనక్కి ఒక మాటు మనం అడుగు వేస్తూ వస్తున్నాము. ఇప్పటికీ, ఈ విషయంలో ఊగిసలాడుతూనే ఉన్నాము. బహుశా “మధుసేవ” అన్న నాటకం ప్రాచుర్యం పొందక పోవడానికి కారణం, మద్యపాన నిషేధం యొక్క అవసరం ఆ నాటి నుంచి కూడా మనం గుర్తించక పోవడమో లేక ఒప్పుకోకపోవడమో కావచ్చు.

అప్పట్లో నాటకం అంటే, పౌరాణిక నాటకం, అందులో పద్యాల సుదీర్ఘ ఆలాపన, ప్రేక్షకులు వన్స్ మోర్ (once more) అని చప్పట్లు కొట్టడం ఉండేవి. సాంఘిక నాటకాలు ఉండేవి కాని, వాటిల్లో ఈ హంగు ఉండేది కాదట. పౌరాణిక నాటకాల్లో ఉండే పద్య సంభాషణలు, సాంఘిక నాటకాల్లో కూడా విస్తృతంగా ప్రవేశపెట్టింది కాళ్ళకూరి నారాయణరావు గారే నని నా నమ్మకం. కాళ్ళకూరి నారాయణరావు గారు జన్మించే కాలానికే గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం ప్రాచుర్యంలో ఉంది. “కన్యాశుల్కం” లాంటి నాటకాల్లో ఎక్కడో ఒక చోట ఒక చిన్న పద్యము కనిపించవచ్చు గానీ (ఖగపతి అమృతము తేగా, … లాంటివి), ఎక్కువగా పద్యాలు ఉండవు. ఈ విషయం ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది అంటే, ఈ వ్యాసంలో మనం చూడబోయేవి నారాయణరావు గారు పద్యరూపంలో తిట్టిన తిట్లు. మామూలు మాటలలో తిట్టిన వాటి జోలికి ప్రస్తుతం మనం వెళ్ళడం లేదు, ఎందుకంటే పద్యరూపంలో పెట్టి తిట్టినవి చాలా ముద్దుగా ఉంటాయి కాబట్టి. ఇంతకీ నారాయణరావు గారు, తిట్టినది ఎవరిని? అని ప్రశ్న వేసుకుంటే, తిట్టనిది ఎవరిని? అన్న సమాధానం వస్తుంది. కొంత మంది ఇప్పటికీ ఇంటర్వ్యూలలో (Interviews) చెబుతూ ఉంటారు గొప్పగా, మా నాన్న, మా తాత, మా గురువు గారు ఇలా తిట్టారని. అలా తిట్టించుకోవడం తమ విశేషాధికారం (privilege) అన్నట్లు చెబుతారు. కాళ్ళకూరి నారాయణరావు గారి తిట్లు ఇదే భావనను మనకి కలిగిస్తాయి. అందుకే ఎవరికీ కోపం రాదు.

తిట్ల వివరాల్లోకి వెళ్ళే ముందు, నారాయణరావు గారి కవిత్వం గురించి నాకు అనిపించిన ఒక విషయం చెప్పకుండా ఉండలేక పోతున్నాను. నాకు కవిత్వం మీద ఎక్కువ ప్రావీణ్యం లేదు. కాని, నా లాంటి వాళ్ళకి మహా కవి కాళ్ళకూరి నారాయణరావు గారి సీస పద్యం, కవి పేరు చెప్పకుండా గనక వినిపిస్తే, అది మహా కవి గుఱ్ఱం జాషువా గారు వ్రాసినది అనుకునే అవకాశం ఉంది. జాషువా గారి పద్యాల గురించి అలా ఎందుకు అనడం లేదంటే, అవి ఎక్కువగా విని ఉంటాం గనక. వాళ్ళిద్దరూ సుమారుగా ఒక దశాబ్దము పైగా కవులుగా సమకాలీకులు. ఎవరి ప్రభావం ఎవరి మీద ఉందో ఇదమిత్థంగా చెప్పేంత పద్య నిర్మాణ కౌశలం నాకు లేకపోయినా, ఈ మాట చెప్పాలనిపించింది. ఇక కాళ్ళకూరి నారాయణరావు గారు పద్యాలలో తిట్టిన తిట్లకి, పైన పేర్కొన్న మూడు నాటకాలలో, 46 ఉదాహరణలు కొంచెం ఓపిగ్గా పరిశీలిద్దాం. సినిమాల్లో దర్శకుడు జంధ్యాల గారు ప్రవేశపెట్టిన తిట్లు విని / చూసి ఆనందించారుగా. నారాయణరావు గారి తిట్లను కూడా అలాగే ఆనందించండి.

వరవిక్రయంలో తిట్లు:

(1)      ” …. సంతం బశు వట్లు పెండ్లికొడుకున్ వ్యాపార మార్గంబునం బడయంగా వలె ద్రవ్యముం గురిసి దైవం బైన నేఁ డిమ్మహిన్”. అంటే, ఈ భూమి మీద దైవమైనా సరే పెళ్ళికొడుకుని డబ్బిచ్చి సంతలో పశువును కొన్నట్లు కొనాల్సిందే నని.

(2)      “(సీ.) నీటైన యింగ్లీషు మోటారు సైకిలు కొనిపెట్టవలె నను కూళ యొకడు; రిష్టువాచియు, గోల్డు రింగును, బూట్సును సూట్లుఁ గావలె నను శుంఠ యొకడు; బియ్యేబియెల్ వర కయ్యెడి ఖర్చు భరింప వలె నను దరిద్రు డొకడు; భార్య తోడనుఁ జెన్నపట్టణంబున నుంచి చదివింప వలె నను చవట యొకడు; సీమ చదువు చాల సింపిలు, నన్నట కంప వలయు ననెడి యజ్ఞు డొకడు; ……”. అనగా, motor cycle కావాలని అనే కూళ (నీచుడు) ఒకడు; wristwatch, gold ring, boots, suits కావాలని అనే శుంఠ ఒకడు; B.A, B.L వరకు అయ్యే ఖర్చు భరించమని అడిగే దరిద్రుడు ఒకడు; భార్యతో పాటుగా చెన్నైలో ఉంచి చదివించాలి అనే చవట ఒకడు; విదేశాల్లో విద్య చాలా చిన్న విషయం కనుక నన్ను అక్కడికి పంపాలి అనే అజ్ఞాని ఒకడు. ఇవి మామూలు వరకట్నాలు కాక పైన అడిగేవి.

(3)      విద్యార్థులలో అక్కడక్కడా ఒకళ్ళిద్దరికి తప్ప, మిగిలిన వాళ్ళకి ఈ క్రింద చెప్పిన లక్షణాలు లేక పోతే, వాళ్ళు భూమి మీద లేని వాళ్ళ కింద లెక్కట. ఆ క్వాలిఫికేషన్లు (qualifications)  ఏమిటో చూడండి. “పంచాది క్రాఫింగు, ప్రక్క పాపిడి, జూలు లేనివాడు ధరిత్రి లేనివాడు; కాఫిహోటళ్ళను కాతాలు, బిల్లులు, లేనివాడు ధరిత్రి లేనివాడు; సిగరెట్లు, బీడీలు, చెక్కిట ఖిల్లీలు, లేనివాడు ధరిత్రి లేనివాడు; తనదు తల మించినట్టి వృధా వ్యయంబు లేనివాడు ధరిత్రి లేనివాడు; …… “. ఐదు రకాల క్రాఫింగు, పాపిడి పక్కకు తీసుకోవడం, జుట్టు ఎక్కువగా జూలు లాగా ఉంచుకోవడం, కాఫీ హోటళ్ళలో అప్పుల ఖాతాలు, సిగరెట్లు, బీడీలు, బుగ్గన కిళ్ళీలు, తలకి మించిన వృధా ఖర్చు లేకపోతే ఈ భూమి మీద లేని వాడన్నట్లు లెక్క. అంటే, అలాంటి బతుకు కూడా బతుకేనా? , “ఏ భీ కోయీ జీనా హై”, అని చెప్పినట్లు.

(4)      మాకు కట్నము తీసుకోవడం ఇష్టం లేదు గానీ మా వాళ్ళు పడనివ్వు రండి అని ఆడువారి మీదకు బాధ్యత / నింద నెట్టేసే వారి గురించి ఏమన్నారో చూడండి.  “ ……… కొంద ఱీరీతి పందలై, గోడుమాలి, మగతనము చంపుకొని, తమ మగువల కెదురాడ నేరక, వార లేమనిన శిరము లూఁచుచుం, గుక్కలై పడియుంద్రుఁ గాని!”. పందులు, కుక్కలు, మగతనం చచ్చిన వారు, తమ ఆడవాళ్ళకు ఎదురు చెప్పలేక తలాడిస్తూ పడి ఉండే వాళ్ళు – ఇంత కన్నా పెద్ద తిట్లు ఉంటాయా?

(5)      ఆడవాళ్ళకు తాళికట్టిన మొగుడు ఉంటే, మగవాళ్ళకు తాళికట్టని మొగుడు ఉంటాడట. ఎలా అంటే –  “అప్పొసంగిన వాడును, యల్లుఁ, డద్దె యింటి యజమానుఁడును, జీత మిచ్చువాఁడు, కుల వినోదియు, పన్నులు కూర్చువాఁడుఁ, బుస్తె కట్టని మగలె పో పూరుషులకు!”.  అప్పు ఇచ్చిన వాడు, అల్లుడు, ఇల్లు అద్దెకు ఇచ్చిన యజమాని, జీత మిచ్చే బాసు, మంత్రాలు చెప్పి మనతో ఆడుకునే విప్ర వినోది, పన్నులు వేసే వాడు – పుస్తె కట్టకుండా మగాళ్ళకు మొగుళ్ళు.

(6)      కొందరిని తృప్తిపరచడం చాలా కష్టమట. ఎవరు వాళ్ళు అన్నది మనకి చెప్పాలని, సీస పద్యంలో పెట్టి వాళ్ళకి అక్షింతలు వేస్తున్నారు చూడండి. “(సీ.) ముడుపులు పూర్తిగా ముట్టుదాఁకనుఁ బుస్తె ముట్టక చేతులు ముడుచుకొనును, తరువాతఁ బాన్పెక్కి దాఁచ బెట్టిన యట్లు జిలుగు కోరికలకు సిద్ధపడును, అవల గర్భాధాన మని నంతనే బిఱ్ఱ బిగిసి లంచం బటఁ బెట్టు మనును, అవిఁగాక పండుగు లరుదెంచి నపుడెల్ల తండ్రి తద్దినము చందాన దిగును, (తే.గీ.) ఇన్నియుం బుచ్చుకొని, యెన్నఁ డేని పిల్ల నంపుమని ప్రార్థన మొనర్ప నదిరి పడును; ఆఁడుపడుచుల, నల్లుర, నాటకత్తి యల నెవండేని తనియింపఁ గలడె వసుధ.” కట్నం పూర్తిగా ముట్టే దాకా తాళిని తాకడు. తరువాత, అలక పానుపు ఎక్కి ఏదో ఇక్కడ దాఁచఁ బెట్టినట్లు కోరికలు వెదజల్లుతాడు. గర్భాధానము అంటే బిగుసుకు పోయి లంచం అడుగుతాడు. అవి కాక, పండగలు పబ్బాలు అంటే, వాళ్ళ నాయిన తద్దినం అన్నట్లుగా ఠంఛనుగా దిగపడతాడు. ఇన్నీ పుచ్చుకొని / పొంది, ఎప్పుడన్నా పిల్లని పంపమని వేడుకుంటే, అదిరిపడతాడు. ఈ లోకంలో, ఆఁడుపడుచులకి, అల్లుళ్ళకి, బోగం వాళ్ళకి ఎవరైనా తృప్తి కలిగించ గలరా? చివరికి ఆఁడుపడుచులని అల్లుళ్ళని ఎవరితో పోల్చారో చూశారా.

(7)      అల్లుడి మాట వచ్చేసరికి హరిహరులు కూడా అశక్తులే (helpless) అని తీర్మానించారు, ఒక పద్యభాగంలో. “…. అల్లు రొందించు బాధల నెల్లఁ గాంచి, అడలి, నిజముగ హరిహరు లంతవారు కూఁతులం గంటయే మాను కొన్నవారు.”. అంటే, అల్లుళ్ళు పెట్టే ఆరడులు చూసి భయపడి నిజంగా శివకేశవు లంతటివారు కూతుళ్ళని కనడమే మానుకున్నారు.

(8)      “…… వేశ్య వెలయా లనంబడె వెల గ్రహించి, కట్నముల చేత వెలమగల్ కారె వీరు?”.  వెల పుచ్చుకోవడం వల్ల “వెలయాలు” అయ్యింది. మరి కట్నం పుచ్చుకోవడం చేత “వెలమగలు” అవ్వద్దా? అని ఎత్తిపొడిచారు.

(9)      “విద్యయు, వయస్సు, పరువును, విడిచి పెట్టి భాగ్య మొక్కటియే చూచి, బడుగు పిసిని గొట్టు పీన్గునకుం దన కూతు నిచ్చు తల్లి కుత్తుక తఱిగినఁ దప్పుఁ గలదె!”.  ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయో లేవో చూడకుండా, డబ్బొక్కటే చూసి, అలాంటి అల్పుడైన పిసినిగొట్టు పీనుగకి కూతుర్ని ఇచ్చే తల్లి గొంతుక కోసినా తప్పు లేదు” అని గట్టిగా చెప్పారు.

(10)    “(సీ.) ప్రాయికంబుగఁ జెట్టు పాతు వాఁడొక్కఁడు వరుసఁ బండ్లను మెక్కు వాఁడొకండు, కష్టపడి గృహంబు కట్టు వాఁడొక్కఁడు వసతిగ నివసించు వాఁడొకండు, ఆస్తికై వ్యాజ్యెంబు లాడు వాఁడొక్కఁడు వచ్చిన నది మ్రింగు వాఁడొక్కఁడు, కోరి ముండనుఁ బెట్టుకొనెడి వాఁడొక్కఁడు వలపుకాఁడై పొందు వాఁడొకండు, (తే.గీ.) అట్లె ధనము కూర్చునట్టి వాఁడొక్కఁడు వడిగ తగులఁ బెట్టు వాఁడొకండు, ఇది ప్రపంచ ధర్మ మీ నాడు పుట్టిన లీలఁ గాదు, దీని కేల గోల?”. సొమ్ము ఒకడిది సోకు (సౌండు) ఒకడిది అంటారు కదా. ఆ విషయం కొంచెం వివరంగా చెప్పే పద్యం ఇది. చెట్టు ఒకడు నాటితే, పళ్ళు ఇంకోడు తింటాడు; ఇల్లు ఒకడు కడితే అనుభవించేవాడు ఇంకోడు; ఆస్తి కోసం ఒకడు కోర్టులలో పోరాటం చేస్తే చివరికి దక్కిన తరువాత అది మ్రింగేవాడు ఇంకోడు; ముండను ఒకడు పెట్టుకుని పోషించితే ప్రేమికుడై పొందేవాడు ఇంకోడు; అలాగే డబ్బు ఒకడు పోగేస్తే దాన్ని పాడించేవాడు ఇంకోడు. ఇది లోకనీతి. ఇవాళ కొత్తగా పుట్టిన విధానము కాదు. దీనికి గోల ఎందుకు?

(11)    “సంపద మహత్వ మెఱుగని చవట బ్రహ్మ చావు లేకుండగా నేని సలుపఁ డయ్యె, చచ్చు నప్పుడు వెనువెంట సకల ధనము తీసుకొని పోవు విధమేని తెలుపఁ డయ్యె.”. అదేదో సినిమాలో, మాటి మాటికి “అసలు మా తాత ననాలి” అంటూ ఉంటాడు ఒకతను. ఆ భావనే ఈ పద్యంలో ఉంది. ఏకంగా విధాతను చవటను చేసింది. డబ్బు విలువ తెలియని చవట బ్రహ్మ చావు అనేది లేకుండా అన్నా చెయ్యడు, పోనీ చచ్చేటప్పుడు డబ్బు అంతా వెంట తీసుకెళ్ళేది ఎట్లాగో అదన్నా చెప్పడు.

(12)    “అడుగు వారికిఁ బాప భయంబు లేక యిచ్చు వారికి సిగ్గును నెగ్గు లేక నడచు చున్నట్టి వరకట్న నాటకమున, నకట! మనమునుఁ బాత్రల మగుట తగునె?”. అయ్యో! అడిగే వారికి పాపభయం లేకుండా ఇచ్చే వారికి సిగ్గూ ఎగ్గూ లేకుండా నడిచే వరకట్న మనే నాటకంలో మనం కూడా పాత్రలం అవడం సరియైనదేనా?

(13)    “కట్నమే కోరి వచ్చిన ఖరము తోడ తగుదు నని కాఁపురము సేయు దాని కంటెఁ బెండ్లియే మానుకొని మగబిడ్డ వలెనె తల్లిదండ్రుల కడ నుంట తప్పిదంబె?”. కట్నం కావాలని వచ్చిన గాడిదతో తగుదునమ్మా అని కాపురం చేసే దాని కంటే, పెళ్ళే మానుకుని మగాడి లాగా తల్లిదండ్రుల దగ్గర ఉండడం తప్పా?

(14)    “లోటు లేని యెడనె లోపంబు కల్పన చేసి, దానఁ దుష్టిఁ జెందు జగము, ఇఁక రవంత లోపమే నిక్కముగఁ గాన వచ్చె నేని బ్రతుక నిచ్చు నమ్మ!”. ఏ లోపం లేకుండా ఉన్న చోటనే లోపాన్ని కల్పించి దానితో తృప్తి చెందే లోకం, నిజంగా కొంచెం లోపం కనిపిస్తే బ్రతక నిస్తుందా?

(15)    “ఆస్తి కలిగి తీఱుప లేని యప్పె యప్పు, నూఱుఁ గొని వేయికై వ్రాయు నోటె నోటు, పసిడి తాకట్టుపై నిచ్చు బదులె బదులు, రోజు వడ్డీలు వచ్చిన రోజె రోజు.”. దీన్నే పరోక్షంగా తిట్టడం అంటారు. “కమలాక్షు నర్చించు కరములు కరములు” అన్న పద్యం బాణీలో ఇది వ్రాయబడింది. ఇలాంటి పద్యాలే పేరడీ రచనలని ప్రోత్సహించాయేమో. ఆస్తి ఉన్నా కూడా తీర్చ లేని అప్పే అప్పట, వంద తీసుకుని వెయ్యికి వ్రాసే ప్రామిసరీ నోటే నోటట, బంగారం తాకట్టు మీద ఇచ్చే చేబదులే బదులట, నెల వడ్డీలు సంవత్సరం వడ్డీలు కాకుండా రోజువారీ వడ్డీలు వచ్చిన రోజే రోజట. కొంత మంది చేసే అరాచకాలను ఈ విధంగా దుయ్యబట్టారు.

(16)    “(సీ.) ప్రాయ ముడిగి యేండ్లు పైఁ బడ్డ తరి, భ్రాంతిఁ జెంది రెండవ పెండ్లి చేసికొనుట; ఆస్తి దాయాదుల కగు నను చింతచేఁ బెరవారి బిడ్డనుఁ బెంచుకొనుట; క్రొత్తలోఁ జూపు మక్కువ లెల్ల మది నమ్మి అత్త వారింటను హత్తు కొనుట; అప్పుల వారినిఁ దప్పించుకొన సొత్తు లితరుల పేర వ్రాయించి యిడుట; (తే.గీ.) పుడమి నీ నాలుగునుఁ జాల బుద్ధి మాలి నట్టి పనులని పల్కుదు ……..”. లోకంలో బుద్ధిమాలిన పనులని నాల్గిటిని చెప్పారు. అవి, వయసు మీరిన తరువాత భ్రమతో రెండో పెళ్ళి చేసుకోవడం, ఆస్తి జ్ఞాతులకి పోతుందన్న బెంగతో వేరే వాళ్ళ బిడ్డను దత్తత తీసుకోవడం, కొత్తల్లో చూపించే ప్రేమ నిజ మనుకుని అత్తారింట్లో స్థిరపడడం, అప్పుల వాళ్ళని తప్పించుకోవడానికి సంపద ఇతరుల పేరు మీద వ్రాత పూర్వకంగా పెట్టడం.

(17)    “కనికరమా కనంబడదు, కన్పడఁ బోవదు ప్రేమ పొట్ట చీల్చినఁ, గనుపట్ట దెయ్యెడను సిగ్గను నట్టిది, పాపభీతి మచ్చునకునుఁ గానిపింప, దిక సూనృత మన్నది లేనె లేదు, లోభిని భువి నే పదార్థములు పెట్టి విధాత సృజించఁ గల్గెనో.”. దయ అన్నది లేదు, పొట్టకోసినా ప్రేమ అన్నది కనపడదు, సిగ్గు అనేది ఏ కోశానా లేదు, పాపభయం మచ్చుకు కూడా కనిపించదు, మంచిమాట అన్నది లేనే లేదు, లోకంలో ఇలాంటి లక్షణాలు ఉన్న పిసినారిని బ్రహ్మ ఏం పెట్టి సృష్టించాడో?

(18)    “ప్రాయికంబుగ రాజు దుర్మతినె పెంచు, మగువ తుంటరినే తన మది వరించు, అంబుదంబులు కొండల యందె కురియు, లచ్చి పెనులోభి యింటికే వచ్చి తనియు.”. సాధారణంగా రాజు దుర్బుద్ధినే పెంచుతాడు, ఆడది దుష్టుడినే మనస్సులో వరిస్తుంది. మేఘాలు కొండల లోనే వర్షిస్తాయి. లక్ష్మీదేవి (సంపద) లోభి ఇంటికే వచ్చి తృప్తి చెందుతుంది.

(19)    “(సీ.) పిలిచినఁ బలుకక బిగఁదన్నుకొని లోన ముసుఁగుఁ బెట్టెడు శుద్ధ మూర్ఖుఁ డొకఁడు; ఇదె వత్తు మీ వెన్కనే మీరు పొండని చుట్ట ముట్టించెడు శుంఠ యొకఁడు; ఒగిఁ దనకై వేచి యుంద్రొ లేదో చూత మని జాగు సల్పెడి యల్పుఁ డొకఁడు; ముందు వచ్చినఁ బర్వు ముక్కలౌ ననుకొని కడను రాఁజూచు ముష్కరుఁ డొకండు; (తే.గీ.) కుడిచి యింటను హాయిగాఁ గూరుచుండి వత్తు రానని చెప్పని వాజె యొకఁడు; వచ్చి కోపించి పోవు నిర్భాగ్యుఁ డొకఁడు; ఆఱు వేల్వారి విందుల తీరు లివ్వి.”. బ్రాహ్మణులలో నియోగులని ఒక తెగ, వాళ్ళలో ఆఱువేల నియోగులని ఒక ఉపతెగ ఉంది. నియోగులకు నిక్కు ఎక్కువ అని అంటారు. వాళ్ళ విందుల్లో వాళ్ళు చూపించే నిక్కు గురించి ఎంత వివరంగా తిట్టారో చూడండి. పిలిస్తే పలక కుండా బిగదీసుకు పోయి ముసుగు పెట్టే పరమ మూర్ఖుడు ఒకడు. మీరు పదండి ఇదుగో మీ వెనకనే వస్తున్నానని అప్పుడు చుట్ట ముట్టించే శుంఠ ఒకడు. శ్రద్ధగా తన కోసం వేచి చూస్తున్నారో లేదో చూద్దామని ఆలస్యం చేసే అల్పుడు ఒకడు. ముందుగా వస్తే పరువు పోతుందని చివరలో రావడానికి చూసే కుటిలుఁడు ఒకడు. తిని కొంపలో హాయిగా కూచుని వస్తాను రాను అని ఏదీ తేల్చి చెప్పని పనికిమాలిన వాడు ఒకడు. వచ్చి కోపంతో వెళ్ళి పోయే దురదృష్టవంతుడు ఒకడు. ఆఱువేల వారి విందుల తీరులు ఈ విధంగా ఉంటాయి.

(20)    “రోగి చావనీ, బ్రతుకనీ, రొక్క మెటులొ లాఁగఁ జూచును వైద్యుడు లాఘవముగ, వ్యాజ్యె మోడనీ, గెల్వనీ, వాట మెఱిఁగి పిండుకొనఁ జూచు ప్లీడరు ఫీజు ముందె.”. రోగి చచ్చినా బతికినా నేర్పుగా వైద్యుడు డబ్బు లాగడానికి చూస్తాడు. వ్యాజ్యం గెలిచినా ఓడినా వీలు చూసుకుని న్యాయవాది ఫీజు ముందుగానే పిండుకోడానికి చూస్తాడు.

(21)    “(సీ.) కొసరి కట్నము లందుకొంటయే గౌరవ మని తలపోసెడి యజ్ఞులార; వచ్చి ముద్దుగఁ బిల్ల నిచ్చెద మనఁ గట్నములకు బేరము లాడు మూర్ఖులార; అబ్బాయి పెండ్లితో నప్పు సప్పులు తీర్చి నిలువ సేయఁగఁ జూచు నీచులార; ముడుపులుఁ గొనితెచ్చి ముంగల నిడుదాఁక పల్లకి యెత్తని పశువులార; (తే.గీ.) ఏమి యన్యాయ మిది, పూర్వ మెన్నఁడేని వరుల నిటు విక్రయించిన వారుఁ గలరె? పూజ్యతరమైన మన పుణ్యభూమి యందుఁ గటకటా! నరమాంస విక్రయము తగునె?”.  కట్నాల కోసం ఎగపడే వారిని అజ్ఞానులని మూర్ఖులని; కొడుకు పెళ్ళితో అప్పులు తీర్చి కొంత నిలవ చేసుకోవచ్చు అని అనుకునే వాళ్ళని నీచులని, డబ్బు ఎదురుగా పెడితే తప్ప పల్లకి ఎత్తము అని వేధించే వారిని పశువులని, తిట్టి, వీళ్ళంతా నరమాంసము అమ్మే వాళ్ళని ఈసడించారు.

(22)    “(సీ.) కట్నాలకై పుస్తకములు చేఁగొని, పాఠశాలల కేగెడు చవటలార; పిలిచి కాళ్ళు కడిగి పిల్ల నిచ్చిన వారి కొంప లమ్మించెడి కుమతులార; అల్క పాన్పుల నెక్కి యవి యివి కావలె నని శివ మాడెడి యధములార; ఎంతఁ బెట్టినఁ దిని యెప్పటి కప్పుడు నిష్ఠురోక్తులె పల్కు నీచులార; (తే.గీ.) కట్న మను పేర నొక చిల్లి గవ్వఁ గొనిన భార్య కమ్ముడువోయిన బంటు లగుచు జన్మదాస్యంబు సలుపుఁడు సలుపకున్న నత్త వారింటఁ గుక్కలై యవతరింత్రు.”. కట్నం కోసం చదువుకునే చవటలారా, మామగారితో ఆస్తులు అమ్మించిన చెడ్డ బుద్ధి కలవారా, అలక పానుపు మీద గొంతెమ్మ కోరికలతో శివ మెత్తిన అధములారా, తిన్నంతా తిని ఎప్పటికప్పుడు పరుషోక్తులు పలికే నీచులారా, కట్నం పేరుతో చిల్లి గవ్వ తీసుకున్నా సరే, భార్యకి అమ్ముడుపోయిన బానిసలై ఆజన్మ దాస్యం చెయ్యకపోతే అత్తవారింట్లో కుక్కలై పుడతారు.

(23)    “(సీ.) మగబిడ్డ పుట్టిన మఱునాఁడె మొదలు శుల్కములె లెక్కించు రాకాసులార; మర్యాదకై చూచు మగలఁ కట్నాలకై రేపవల్ వేధించు ఱేచులార; అయిదు ప్రొద్దుల రాణులై చీటికిని మాటి కలిగి కూర్చుండు గయ్యాళులార; లాంచనంబుల పేర లక్ష చెప్పుచు నిల్లు గుల్ల సేయు దరిద్రగొట్టులార; (తే.గీ.) ఆఁడు పుట్టువు పుట్టరే? ఆఁడు వారి నిట్టు లవమాన పఱచుట కించుకేని సిగ్గు పడకుండఁ దగునె? ఛీ, ఛీ, ధనంబె పావనంబుగఁ జూచుట పరువె మురువె.”. మగ పిల్లాడు పుట్టిన మర్నాటి నుంచి కట్నం ఏంతొస్తుందా అని చూసే రాక్షసులారా, మర్యాద కోసం చూసే వాళ్ళని కట్నాల కోసం రాత్రి పగలు వేధించే కుక్కల్లారా, ఐదు పొద్దులా మహారాణుల్లాగా చీటికి మాటికి అలిగి కూర్చునే గయ్యాళులారా, లక్ష రకాల లాంచనాల పేర ఇల్లు గుల్ల చేసే దరిద్రగొట్టులారా; ఆడపుటక పుట్టి ఆడవాళ్ళని ఇట్లా అవమానించడానికి సిగ్గు లేదా? ధనమే పవిత్రంగా చూడడం పరువా, మర్యాదా? ఇవి వరకట్నం కోసం వేధించే ఆఁడువారిని గురించి నారాయణరావు గారు వేసిన అక్షింతలు.

(24)    ” ….. పదిపుట్ల బూఁవితో పండంటి బిడ్డ నో యెదవ కుక్కల కొడుక్కిచ్చినాను, …… “. కొంచెం పామరభాషలో ఒకావిడ తన గోడు చెప్పుకున్న పద్యంలో పదిపుట్లు పండే భూమితో పాటు పండంటి నా కూతుర్ని ఒక వెధవ, ఒక కుక్కల కొడుకుకి, ఇచ్చాను అని వాపోయింది.

చింతామణిలో తిట్లు:

మహా కవి, మహా భక్తుడు, అయిన లీలాశుకుని చరిత్రాన్ని రసవత్తరంగా వేశ్యావృత్తిని నిర్మూలించే హాస్యరస ప్రధానమైన నాటకంగా తీర్చిదిద్దారు, నారాయణరావు గారు. కొన్ని వేల (లక్షలు కూడా కావచ్చు) ప్రదర్శనలతో తెలుగు నాట మారుమ్రోగింది ఈ నాటకం. తరువాత, ప్రక్క దోవలు పట్టి ఈ మధ్య బూతు (నీచమైన తిట్టు) పురాణంగా అయిందని విన్నాను. ఏది ఏమైనా, నారాయణరావు గారు ప్రయోగించిన తిట్లు (బూతులు కాదు) ఏమిటో చూద్దాము.

(1)      “విత్త మున్నంత వఱకును విటుని మనము కోరి నెత్తిపై నెక్కించు కొనఁగ వలయు, విత్త ముడిగిన తోడనె బిడియ ముడికి కుక్కనుం బోలె బయటకిఁ గొట్టవలయు.”. విటుల దగ్గర విత్తముంటే ఓకే (OK) గానీ లేకపోతే కుక్కను కొట్టినట్లు బయటికి వెళ్ళగొట్టాలి.

(2)      ” …. ముస్తాబు మఱుగున ముది లంజెయును లేఁత పింది వోలెనుఁ గానిపింప వచ్చు, …… …. కాసింతపాటి తెలివితేటలు కలవేని దేవు నైన వెంటఁ గుక్కను వోలె రప్పింప వచ్చు, వేశ్యలకు మేళమే పదివేలు సుమ్ము.”.  … మేకప్ చాటున ముసలి వేశ్య కూడా లేతపింది లాగా కనిపించవచ్చు. …. కొంచెం తెలివి ఉంటే, దేవుణ్ణైనా వెంట కుక్క లాగా తిప్పుకో వచ్చు, ….

(3)      “మెరిక వీధినిఁ బెద్ద మేడ కట్టిన చిట్టి సంతలోఁ గొన్నట్టి చాకిముండ, మీ సందు చివరను మిద్దెలో నివసించు వనజాక్షి కూఁతురు వాడముండ, బండి మీఁదను గాని బయటికి రాని యా నగరాజతనయ యానాదిముండ, నాల్గు దివాణముల్ నట్టేటఁ గలిపిన యిందీవరిక యొక యీండ్రముండ, …….”. బడుగు వర్గాలకు చెందిన వారు పరిస్థితుల ప్రభావం వల్ల వేశ్యలుగా మారడం ఈ పద్యంలో తెలుస్తుంది.

(4)      “….. గణిక మంచి, గ్రామ కరణంబు మంచియు మెచ్చు వారు లేరు మచ్చునకును.”.  వేశ్య మంచితనం గ్రామ కరణం మంచితనం మచ్చుకు కూడా ఎవరూ మెచ్చుకోరట. గణిక మాట ఎట్లా ఉన్నా గ్రామకరణం కూడా ఆ బాపతే అనడం ఆ కాలంలో ఉన్న రెవెన్యూ (revenue) వ్యవస్థ అధోగతిని సూచిస్తోంది.

(5)      “….. కొత్త సరసులు చెలరేఁగి చిత్తకార్తి కుక్కలం బలె నిలుచుట్టుఁ గ్రుమ్మరిలుట ….”. కొత్త సరసుల్ని చిత్తకార్తె కుక్కలతో పోల్చడం జరిగింది.

(6)      బ్రహ్మదేవుడి బుద్ధి ఎలా బుగ్గి అయిందో చెబుతూ ఆయన్ని తిట్టడం చూడండి ఈ పద్యంలో.  “(సీ.) దివ్యస్థలంబగు తిరుపతి కొండను కోఁతిమూకనుఁ బాదు కొలిపినావు; తత హంసతూలికా తల్పంబు లందునుఁ జెడు నల్లులను సృష్టి చేసినావు; ప్రీతి నించెడు గులాబీ చెట్టులను వాఁడి మించెడు ముండ్లు సృజించినావు; ప్రభువుల మందిర ప్రాంగణంబుల మూర్ఖ వేత్ర హస్తులనుఁ గల్పించినావు; (తే.గీ.) సౌఖ్యముల కాకరము లైన సాని యిండ్ల విటుల నెత్తురు పీల్చెడి వేశ్యమాతలను మహా పిశాచములఁ గాపు నిచ్చినావుఁ గదర! వృధగాను, నీ తెల్వి కాలిపోను.”. తిరుపతిలో కోతులని, పరుపులలో నల్లులను, గులాబీలకి ముళ్ళను, రాజాంతఃపురాల్లో ద్వారపాలకులను, సుఖాలకి పుట్టిళ్ళు అయిన సాని కొంపల్లో విటుల నెత్తురు తాగే వేశ్యమాతలనే పిశాచాల కాపలాను, ఇచ్చావు కదయ్యా! అనవసరంగా, నీ తెలివి కాలిపోవ!

(7)      “చిత్ర నంటించి వెడఁగునుఁ జేసి మునుపె దొళ్ళదోఁపుగ ముండలు దోఁచి రితని, ……”. చిత్ర అనే అమ్మాయిని తగిలించి అదివరకే వెఱ్ఱివాఁడిని చేసి వేశ్యలు ఇతన్ని దోచుకున్నారు.

(8)      “ఇంట రంభల వంటి యింతు లుండఁగ సాని సంపర్కముం గోరు చవటలార; కొని పెంచినట్టి తక్కువ జాతి ముండల నెత్తిపై నిడుకొను నీచులార; యెంత పెట్టినఁ దృప్తి యెఱుగని తొత్తుల మెప్పుఁ గోరెడు వెంగళప్పలార; యిచ్చకంబులు నమ్మి యిండ్లు వాకిళు లమ్మి కొంపోయి యర్పించు కూళలార; ……”. ఇంట్లో రంభల లాంటి భార్యలు ఉండగా సానుల సంపర్కము కోరే చవటల్లారా, వేశ్యలను నెత్తి నెక్కించుకొనే నీచులారా, ఎంత పెట్టినా తృప్తి లేని వేశ్యల మెప్పు కోరే వెఱ్ఱిబాగులవాఁరా, ముఖప్రీతి కోసం పలికే మాటలు నమ్మి ఇళ్ళు వాకిళ్ళు అమ్మి తీసుకుపోయి అర్పించే మూఢులారా, ….  – ఇలా సాగాయి వేశ్యాలోలురను తిట్టిన తిట్లు.

(9)      “జేనెడు పొట్టకై మానంబు నిండు బజారున నమ్ము పింజారులార; పరుల పిల్లలఁ గొని పడపు వృత్తికిఁ దార్చి జీవనం బొనరించు చెడిపెలార; పురుషుల మధ్యను బుగ్గను వ్రేలిడి తెయితక్క లాడెడు దెష్టలార; యేలికలై యెల్ల రోలి యోసీ యనఁ జిత్త మనుచు మ్రొక్కు తొత్తులార; ……. లజ్జకుం గారణంబైన లంజవృత్తి మానుడీ! ….”. పొట్టకూటి కోసం బజారులో మానం అమ్ముకునే పింజారులారా, ఇతరుల పిల్లలని పడుపువృత్తి లోకి దించి పొట్టపోసుకునే వేశ్యలారా, మగాళ్ళ మధ్యలో బుగ్గను వ్రేలు పెట్టుకుని తైతక్కలాడే దరిద్రపు మొహాల్లారా, ప్రతివాడు మొగుడిలాగా ఉసేయ్ అని అనగా చిత్తం అనే వేశ్యలారా, …. సిగ్గుకు కారణమైన వేశ్యావృత్తి మానుకోండి….. – అని వేశ్యలకు తిట్లతో చేసిన ప్రబోధం ఇది.

మధుసేవ గురించి:

మద్యపానం వల్ల సంవత్సరానికి 365 కోట్ల రూపాయల ధనం వ్యర్థ మవుతోందని, అది మన దేశం మీద బ్రిటీషు వారికి ఆ రోజుల్లో వచ్చే ఆదాయం కన్నా రెండు రెట్లెక్కువని, ఆ సొమ్ముతో నాడు దేశంలో ఉన్న దరిద్రులకు కనీసం ముతక బట్టలు, ముతక కూడు లభిస్తాయి కదా అని నారాయణరావు గారు వాపోయారు.

(1)      లోకం రీతి గురించి చెప్పిన పద్యం ఇది. “(సీ.) కొంపలు తెగనమ్మి కోర్టుల, రైళ్ళఁ గాఫీ హొటేళ్ళ, వకీళ్ళఁ బెంచు వారు; పండిన సర కెల్లఁ బరదేశముల కంపి కఱవున కిర వేఱుపఱుచు వారు; మూడు ప్రొద్దుల ముష్టి మున్సిపల్ మెంబరు పదవిలోఁ గనులు కన్పడని వారు; ఆస్తి భార్యల పేర అప్పులు తమ పేరఁ బెంచి, యైపీలనుఁ బెట్టువారు; (తే.గీ.) బట్ట కొఱకుఁ, జుట్ట కొఱకు, బ్రాంది కొఱకు సిరులు పరదేశముల పాలు సేయు వారుఁ బూర్తిగా నెల్లెడల వట్టి పోవు దనుక దేశమున కీ యరిష్టము తీఱఁ బోదు”.  కొంపలు అమ్మి కోర్టులను, రైళ్ళను, కాఫీ హోటళ్ళను, వకీళ్ళను పోషించే వారు; పండిన దినుసులు విదేశాలకు పంపి ఇక్కడ కరువును ఏర్పాటు చేసిన వారు; ముప్పొద్దుల మునిసిపల్ మెంబరుగా కళ్ళు కనపడ నట్టుగా వ్యవహరించే వారు; ఆస్తి భార్యల పేర పెట్టి అప్పులు తమ పేర పెంచుకుంటూ పోయి ఐపీలు (IP) పెట్టేవారు; వస్త్రాల కోసం, పొగచుట్టల కోసం, బ్రాందీ కోసం, సంపదని విదేశీయుల పాలు చేసే వారు; పూర్తిగా అన్ని చోట్ల అడుగంటే వరకు దేశానికి ఈ ఉపద్రవము ముగిసిపోదు.

(2)      ఒక మేనేజర్ (Manager) దినచర్యను గురించి ఇంగ్లీషు మాటలలో చెప్పిన పద్యం చూడండి. “(సీ.) మార్నింగు (morning) కాఁగానె మంచము లీవింగు, మొగము వాషింగు (washing), చక్కఁగ సిటింగు (sitting); కార్కు (cork) రిమూవింగు (removing), గ్లాసు (glass) ఫిల్లింగును (filling), గడగడ డ్రింకింగు (drinking), గ్రంబులింగు (grumbling); భార్యతో ఫైటింగు (fighting), బయటికి మార్చింగు (marching), క్లబ్బును (club) రీచింగు (reaching), గాంబులింగు (gambling); విత్తము లూసింగు (loosing), చిత్తము రేవింగు (raving), వెంటనే డ్రింకింగు (drinking), వేవరింగు (wavering); (తే.గీ.) మరల మరల రిపీటింగు (repeating), మట్టరింగు (muttering), బసకు స్టార్టింగు (starting), జేబులు ప్లండరింగు (plundering), దారి పొడగున డాన్సింగు (dancing), థండరింగు (thundering), సారెసారెకు రోలింగు (rolling), స్లంబరింగు (slumbering)”.  తెల్లవారం గానే మంచం దిగడం, మొహం కడుక్కోవడం, చక్కగా కూచోవడం, సీసా మూత తీసి గ్లాసు నింపుకోవడం, గడ గడా త్రాగడం, గొణగడం, భార్యతో పోట్లాడడం, బయటికి పోవడం, క్లబ్బుకు చేరుకోవడం, జూదమాడడం, డబ్బు పోగొట్టుకోవడం, మనస్సు విలవిలలాడడం, వెంటనే త్రాగడం, తడబడడం, మళ్ళీ మళ్ళీ ఇదే పునరావృతం చేయడం, గొణగడం, తన నివాసానికి బయలుదేరడం, జేబులు దోపిడీ అవడం, దారి పొడుగునా నాట్యం చెయ్యడం, బిగ్గరగా అరవడం, మాటి మాటికి దొర్లడం, మత్తుగా పడుకోవడం – ఇదీ దినచర్య.

(3)      ” ….. కొండ మీద నున్నఁ గోతి కావలె నన్నఁ జచ్చియైనఁ దెచ్చి యిచ్చు వారె పాడుపనుల కిట్లు పాల్పడు చుండంగ సాని ముండ లేమి సలుపకుంద్రు?”. పెద్దపెద్ద వాళ్ళే సానులను చేరదీసి కొండ మీది కోతి కావాలన్నా తెచ్చి ఇస్తూ పాడు పనులకి పాల్పడితే, ఆ వేశ్యలు చేయ లేనిది ఏముంది?

(4)      ” ….. వర్తకుడు, వైద్యుడు, వకీలు, వారకాంత – యనెడు నీ వకార చతుష్టయముదె లక్ష్మి, ఆదినో, మధ్యనో, లేక యంతముననొ వెలిగి తీఱుదు రిల నొక వెలుగు వీరు”. మహా భారతంలో దుష్టచతుష్టయం (దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని) లాగా, నర్తనశాల సినిమాలో కీచక పాత్రధారి చెప్పే మకార చతుష్టయం (మాంసం, మత్స్యం, మదిర, మగువ) లాగా, మన భారతంలో వకార చతుష్టయం ఉందని కాళ్ళకూరి వారు చెప్పారు. అవే, వర్తకుడు, వైద్యుడు, వకీలు, వారకాంత అన్నవి. మొదట్లోనా, మధ్యలోనా, చివర్లోనా అన్నది కశ్చితంగా తెలియదు కానీ ఎప్పుడో అప్పుడు వీళ్ళు లోకంలో ఒక వెలుగు వెలుగుతారట.

(5)      “తలపగ వారకాంతలకు త్రాగుడు, పాములకున్ సుషుప్తి, లోభుల కమిత వ్యయేచ్ఛఁ గల పుత్రులు, చోరులకుం బణంబు, కాపుల కెడ లేని కోర్టు తగవుల్, పనివాండ్రకు బద్ధకంబు, బాపల కసమష్టి దోషమును, ప్రాప్తిల కుండినఁ బట్ట శక్యమే.”. మా గురువుగారు చెబుతూ ఉండేవారు. భగవంతుడి చేతిలో పంక్యుయేషన్ పవర్ (punctuation power) ఉంది, ఎవరికి ఎక్కడ ఫుల్స్టాప్ (full stop) పెట్టాలో, కామా (comma) పెట్టాలో, .. ఆయనకి తెలుసు, లేకపోతే భూమ్మీద వాళ్ళకి పట్టపగ్గాలు ఉంటాయా అని. ఆ నెగిటివ్ లిస్టు (negative list) కాళ్ళకూరివారు ఇచ్చారు ఈ పద్యంలో. వేశ్యలకు మద్యపానం, పాములకి ఒళ్లెరుగని నిద్ర, పిసినిగొట్టులకి అధికంగా ఖర్చు చేసే కోరిక గల సంతానం, దొంగలకు జూదము, కాపులకి లెక్క లేనన్ని కోర్టు తగాదాలు, పనివాళ్ళకు బద్ధకము, బ్రాహ్మణులకి అమిత భోజనము అన్న దోషము, లేకుండా ఉంటే పట్ట శక్యమా! ఇందులో పాములను పక్కకు పెడితే, మిగిలిన వాళ్ళు మనుషులేగా. వాళ్ళని ఎంత మెత్తగా తిట్టారో చూశారుగా.

(6)      “ప్రభువు దుర్వ్యసనంబుల పాలఁ బడిన, వర్తకుఁడు కాఫి హోటలు వంకఁ గనిన, తరుణవిద్యార్థి నాటకస్థలినిఁ బడినఁ, జల్ల చల్లఁగ ముప్పు వాటిల్లి తీఱు.”. సంస్థానాలకి సంస్థానాలే తుడిచి పెట్టుకు పోయాయని చెబుతూ, రాజు చెడ్డ అలవాట్లకి బానిస అయితే, వ్యాపారి సంపాదించినది హోటళ్ళకి పోస్తే, యువకుడైన విద్యార్థి నాటకాల పిచ్చలో పడితే (ఆ రోజుల్లో అలా ఉండేదేమో, వాళ్ళకి ఒక చురక వేస్తున్నారు) మెల్ల మెల్లగా కీడు జరిగి తీరుతుంది.

(7)      “వ్యభిచారంబు, దురోదరంబును, సురాపానంబు సాగించి; జాత్యభిమానంబు త్యజించి, యన్య మత వేషాచారముల్పూని, పాప భయమ్మూడ, సిరుల్తొలంగ, ఋణముల్ పై యాడఁగా బ్రాహ్మణ ప్రభువుల్ పుచ్చిన చెట్టులం బలె నశింపం జొచ్చి రత్యంతమున్.”. వ్యభిచారము, జూదము, మద్యపానము చేస్తూ, జాత్యభిమానము వదిలి, వేరే మతాల ఆచార వ్యవహారాలు చేపట్టి, పాపభయం లేక, సంపదలు అంతరించగా, అప్పులు పైబడగా, ఒకప్పుడు చెట్ల లాగా అందరికీ నీడని ఫలాలని ఇంకా అనేక ప్రయోజనాలని కలుగచేస్తూ ఉండే బ్రాహ్మణులు పుచ్చిపోయిన చెట్ల లాగా ఎవరికీ పనికి రాకుండా సాంతం నాశనం అవడం మొదలు పెట్టారు. ఈ అభిశంసన అన్ని విధాల భ్రష్టు పట్టిన బ్రాహ్మణుల గురించి.

(8)      “…. నేర్చి సకల కళలు నేర్పి లోకుల కవి, బ్రహ్మదేవుఁ డనఁగఁ బరగి నట్టి, బ్రాహ్మణుండు నేఁడు బాపనోఁడయ్యెను, కాల మహిమ కాక కత మిఁకేమి!”. అన్ని విద్యలు తాము నేర్చుకొని, ఇతరులకు అవి నేర్పి బ్రహ్మదేవుడిగా చలామణియైన బ్రాహ్మణుడు, నేడు బాపనోడయ్యాడు. కాల మహిమ కాకపోతే వేరే కారణ ముందా?

(9)      “(సీ.) ముద్దినుసులు పండి ముంగిళ్ళు నిండించు మళ్ళు మాన్యములు కవుళ్ళ కిచ్చి, తోటలుం దొడ్లు మస్తుగ తాకటులు పెట్టి పెళ్ళున నిండ్లఁ బెండ్లిళ్ళొనర్చి, కొంపలుం గోడులుఁ దెంపుమై తెగనమ్మి యేండ్ల కొలంది వ్యాజ్యెములఁ జొచ్చి, పుస్తెలుం బూసలుఁ బుణికి కర్చుల కిచ్చి పుత్రులం బెర చదువులకుఁ బుచ్చి, (తే.గీ.) సౌఖ్యముల కాకరములైన స్వస్థలములు వీడి, పొరుగూళ్ళ బానిసవృత్తి నమరి, తమదు వ్రేల్పెట్టి తమ కన్ను తామె పొడుచు కొనుచునున్నారు బ్రాహ్మణ కులమువారు.”. మూడు రకాల దినుసులతో ముంగిళ్ళు నింపే మడిమాన్యాలు కవులు కిచ్చి (అంటే, పని చేయకుండా కూచుని తినడం అలవాటు చేసుకుని), తోటలు దొడ్లు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి ఘనంగా పెళ్ళిళ్ళు చేసి, కొంపాగోడూ అమ్మి ఏళ్ళకి ఏళ్ళు కోర్టు వ్యాజ్యాలలో తగలేసి, పుస్తెలు పూసలు మార్చి పిల్లల్ని పరాయి చదువులకి పంపి, అంటే ఉన్న వన్నీ పాడించి, సుఖాలకి పుట్టిళ్ళైన స్వంత ఊళ్ళని వదిలి పొరుగు ఊళ్ళలో బానిస ఉద్యోగాలకి కుదురుకొని, తమ వేలుతో తమ కన్నే పొడుచుకుంటున్నారు బ్రాహ్మణ కులం వారు.

(10)    “బ్రాంది సారాలకును, పాస పాత్రములకు, బిత్తరుల మోవులకును, కాఫి హొటేళ్ళ చిప్పలకుఁ, బూటకూళ్ళిండ్ల చెంబులకును – నెంగిలియు, నెగ్గునను న వెందేనిఁ గలవె?”. మద్యపానానికి, పాయస పాత్రలకి, వేశ్యల పెదవులకి, హోటళ్ళలో ప్లేట్లకి, పూటకూళ్ళ ఇళ్ళలో చెంబులకు, – ఎంగిలి, దోషము అన్నవి ఎక్కడన్నా ఉన్నాయా? శుచి శుభ్రం లేకుండా జనాలు ఎలా పడి ఉండేవారో చెప్పే పద్యం ఇది.

(11)    విదేశీమద్యాన్ని ఎలా తిట్టారో క్రింది పద్యంలో చూడండి.  “(సీ.) పలు సముద్రములు దీవులు దాఁటి యఱువది వందల మైళ్ళిట్టె వచ్చినావు, పరమ పవిత్రమై పరఁగు నార్యావర్త పుణ్యభూమినిఁ గాలు మోపినావు, క్రమముగా స్థిరపడి కడు శిష్టులగు విశుద్ధుల యిండ్లలోఁ గూడ దూరినావు, అయినవారిం బట్టి యవలీల నీదు దాసుల క్రిందఁ జేసుకోఁ గలిగినావు, (తే.గీ.) పెక్కు కొంపలకుం జిచ్చు పెట్టినావు, మంచి సంసారముల రూపు మాపినావు, సంఖ్యలకు మీఱు హత్యలు సలిపినావు, మాయ వినమ! విదేశంపు మద్యరసమ!”. ఓ విదేశీ మద్యమా! సముద్రాలు దీవులు దాటి అరవై వందల మైళ్ళు తేలికగా వచ్చావు, ఈ పుణ్యభూమిలో కాలు మోపావు, మెల్లిగా ఇక్కడ స్థిరపడి సజ్జనుల ఇళ్ళలో దూరావు, అవలీలగా నీకు దాసులుగా చేసుకున్నావు, చాలా కొంపలకి నిప్పు పెట్టావు, మంచి కుటుంబాలను మాపి వేశావు, లెక్క లేనంత మందిని చంపావు, నీ మాయ తెలియదా!

(12)    “పుణ్యజనుఁ డన్న తెరఁగునఁ బుడమి, నేతి బీరకా యన్న విధమునఁ బెరుఁ తోఁటకూర యన్నట్లుఁ జక్కగాఁ గూర్పఁబడిన దౌర, విశ్వాస రావను పేరు నీకు.”. లోకంలో పుణ్యవంతుడు అనే విధంగా, నేతి బీరకాయ అన్న రీతి, పెరుగు తోటకూర అన్నట్లు, విశ్వాసరావు అనే పేరు నీకు చక్కగా కుదిరింది. అంటే, నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉంటుందో, పెరుగు తోటకూరలో ఎంత పెరుగు ఉంటుందో, విశ్వాస రావులో అంత విశ్వాస ముంటుంది అని.

(13)    సర్వభక్షకు (అగ్ని) నైనను తృప్తిపరచవచ్చు కాని, వేశ్యను తృప్తి పరచలేము అని ఎలా చెప్పారో క్రింది పద్యంలో చూడండి. “….. ఆశ పది పాళ్ళసంతృప్తి యఱువదాఱు పాళ్ళవిశ్వాస మిన్నూరు పాళ్ళు, కల్ల వేయి పాళ్ళు, మోసముఁ బదివేలపాళ్ళుఁ జేరిచి విధాత వేశ్యనుఁ జేసి యుండు.”.  ఆశ 10 పాళ్ళు, అసంతృప్తి 66 పాళ్ళు, అవిశ్వాసము 200 పాళ్ళు, అబద్ధం 1000 పాళ్ళు, మోసం 10,000 పాళ్ళు చేర్చి బ్రహ్మ వేశ్యను చేసుంటాడు. ఎన్ని మంచి లక్షణాలతో చేశాడో.

2 thoughts on “ఆయన తిట్టినా మనకి కోపం రాదు

  1. శ్రీ చిరువోలు విజయనరసింహారావు గారు వాట్సాప్ ద్వారా 22-10-2025న పంపిన పద్యాలు క్రింద ఇవ్వబడ్డాయి:

    ఆ.వె. కాళ్ళకూరి వారు కలి మానవుల కెల్ల

    నీతి బోధ లెన్నొ నేర్పఁ బూనె

    సంఘ సంస్కరణను సలుపగా సమకట్టె

    వివిధ దుష్ట కృత్య వేష మాప.                                      … 1

    ఆ.వె. ఎంత తెలుపుచున్న నిసుమంత చేతనఁ

    గలుగ దీ మనుజుల తలపు లందు

    వినియు, విన నటుల, చెవినిఁబెట్ట నేరరు

    కత్తి చూప ఫలముఁ గలుగు నేమొ.                                … 2

    తే.గీ. విద్యఁ గల్గియు సద్బుద్ధి వెలయ కునికి

    వారి మూర్ఖ చిత్తము వీడ పాటు పడరు

    సంఘ మిటుల దురాచార క్షతముఁ గాగ

    విజ్ఞు లిడు హెచ్చరికలకు విలువ లేదు

    పాత గొంగళి మార దావంత కూడ.                                … 3

    తే.గీ. రంగనాధ మీ దురితముల్ రంగరించి

    జనుల కనువిప్పుఁ గల్గగా చర్చ జరిపి

    కాళ్ళకూరి యావేశంబు కనులఁ గట్ట

    భవ్య వివరణ మిచ్చిరి సవ్య గతిని

    ప్రజలు పాటింప మేలగు భవిత యెపుడు

    వారి బాధ్యత యదిఁ గాగ, ప్రగతిఁ గలుగు.                       … 4

    తే.గీ. చెవుల వినక యుండు బ్రతుకు చెల్ల దింక

    సత్య ధర్మ మార్గ మెరిగి, సభ్యతఁ గని

    సత్ప్రవర్తనాచారముల్ జరుపు కొనుడు

    యెల్ల రానంద మందగా నుల్ల మలరు.                            … 5

    Like

  2. డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతిరావు గారు వాట్సాప్ ద్వారా పంపిన సందేశం (24-10-2025):

    బాగున్నాయండీ కాళ్ళకూరి నారాయణరావు గారి తిట్లు. అవును, కొంత మంది తిడుతుంటే కోపం రాదు. నవ్వొస్తుంది. ఆ style అలా ఉంటుంది మరి. డిగ్రీ వాళ్ళ కనుకుంటా, వరవిక్రయం నాటకం ఉపవాచకంగా ఉండేది. పాఠం చెప్పీ చెప్పీ ఆ పుస్తకం నా మనసులో బాగా నలిగిపోయింది. మీ అర్టికల్ చదువుతుంటే అవన్నీ గుర్తుకొచ్చాయి. వెనకటి కాలం వాళ్ళ తిట్లు భలేగుండేవి. ఒక సినిమాలో సుత్తి వీరభద్రరావు గారు వేలును తిట్టే తిట్లు పగలబడి నవ్వేలా ఉంటాయి. పెద్దవాళ్ళ తిట్లు ఆశీర్వచనాలతో సమానం అంటారు, అందుకే. అందులో మంచి ఉంటుంది గనుక. అభినందనలు.

    Like

Leave a comment