విద్యాలయాల్లో నా వింత అనుభవాలు

విద్యాలయాల్లో నా వింత అనుభవాలు ఎక్కువగా విద్యార్థులకి ఫాకల్టీ (faculty) లకి సంబంధించినవి. వీటిల్లో కొన్ని విన్నవి, కొన్ని స్వానుభవం లోనివి. కొన్ని మంచివి కొన్ని చెడువి. రెంటిలోనూ నేర్చుకునే విషయాలు ఉంటాయని నా నమ్మకం. విద్యాలయాల్లో జరిగిన తగాదాల గురించి నేను వ్రాయడం లేదు. ఎందుకంటే, అందులో నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదని నా అభిప్రాయం.

నాతో పోలిస్తే తోటి విద్యార్థులలో చాలా పెద్దవాళ్ళు ఉండడం అనేది నాకు 6వ క్లాసులోనే మొదలయ్యింది. నేను 8 ఏళ్ళ వయస్సులో హైస్కూలులో చేరాను, 6వ క్లాసులో. అప్పుడు, నా తోటి విద్యార్థులలో ఒకతనికి 16 ఏళ్ళు. నేను విన్నది ఏమిటంటే, ఆటల్లో బాగా రాణించే వారిని ఒక పట్టాన పాస్ (pass) చేసే వారు కారని. ఎందుకంటే, ఆటల్లో వాళ్ళు స్కూలును రిప్రజెంట్ (represent) చెయ్యాలిగా మరి. నా కన్నా వయస్సులో పెద్దయిన విద్యార్థులు నేనంటే చాలా అభిమానంగా ఉండేవారు (ఇప్పటికి కూడా). అలా మొదలైన నా విద్యార్థి జీవితం, నేను ఉద్యోగంలో చేరిన 8 సంవత్సరాల తరువాత మళ్ళీ మొదలయ్యింది, నేను ఈవెనింగ్ లా కాలేజీలో (Evening Law College)  చేరడం వల్ల. అప్పుడు నా తోటి విద్యార్థుల కన్నా వయస్సులో పెద్దవాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఆ వయస్సులో క్లాసులో కూర్చుని పాఠాలు వినడానికి ఇబ్బంది అనిపించలేదు కానీ, అప్పటికి వ్రాయడం అలవాటు ఇంచుమించుగా పోయింది కనుక పరీక్షల్లో సమాధానం తెలిసినా కూడా వ్రాయడం కష్ట మనిపించేది. అఫీసు ఫైళ్ళలో (office files) ప్రతిదీ క్లుప్తంగా వ్రాయడం అలవాటు అవడం వల్ల అది పెద్ద ప్రతిబంధకం అయ్యింది, పరీక్షల్లో. పైగా చిన్న వయస్సులో ఉన్న తోటి విద్యార్థులు నా లాంటి వారిని అంకుల్ (uncle) అని పిలిచేవారు. నా లాంటి వారి మీద చిన్న వయస్సు వాళ్ళకు ఎంత నమ్మకం ఉండేది అంటే, పరీక్షల తరువాత కలిసిన ప్రతిసారి, అంకుల్ మీకు ఎన్ని సబ్జెక్ట్లు (subjects) మిగిలినాయి అని అడిగేవారు, జాలిగా. మేము ఏదో ఒక పరీక్షలో తప్పకుండా ఉండమని వాళ్ళ ప్రగాఢ విశ్వాసం. సరే మిగిలిన విషయాల లోకి వద్దాం.

నేను కొత్తగా కాలేజీలో చేరి నప్పుడు ఒక టీచర్ (teacher) మాతో చాలా చనువుగా ఉండేవాడు. మమ్మల్ని బాగా ఉత్సాహ (motivate) పరిచేవాడు. క్లాసులో తెలియనిది అడగడానికి వెనకాడే వాళ్ళని ఉద్దేశించి మీకన్నా మీ అమ్మమ్మ మీ నాయనమ్మ నయం అనేవాడు. దాన్ని కొంచెం వివరిస్తూ ఇలా అనేవాడు. మీ అమ్మమ్మ, నాయనమ్మ వంకాయలు కొనేటప్పుడు బేరమాడి ధర తగ్గేట్టు చేసుకుని, అట్లా అనుకున్న ధరకి ఎక్కువ కాయలు వచ్చేటట్లు కొసరి కొసరి కొనేవారు. మీరు ఫీజులు కట్టి కాలేజీలో చేరి, మీకు విద్య బాగా నేర్చుకునే హక్కు ఉన్నా కూడా తెలియనివి అడగడానికి ముందూ వెనకా చూస్తున్నారు. మీ కన్నా వాళ్ళు నయం కాదా అని అనేవారు. ఈ మాటలు నా మీద చాలా ప్రభావం చూపెట్టాయి. నా కేదన్నా అర్థం కాకపోతే వీలయినంత వరకు టీచర్లను క్లాసులోను, క్లాసు బయటా కూడా వదిలేవాడిని కాను. నన్ను భరించిన నా టీచర్లకి నమస్కారం.

నేను చదువుకునే రోజుల్లో ఇంగ్లీషు (English) మాట్లాడడం, ఇంగ్లీషు మీడియంలో (medium) చదవడం ఒక గొప్ప విషయం. చాలా మంది విద్యార్థులకు ఇంగ్లీషు భయ కారణం కూడా. నేను 6వ క్లాసులో ఉన్నప్పుడు ఒక టీచర్ ఇంగ్లీషు చెప్పేవారు. ఆయన ప్రాపర్ నౌన్ (నామవాచకం) కి ఉచ్చారణ ఒక్క (unique) లాగానే ఉండదు అని నొక్కి వక్కాణించడానికి మనుషుల, ముఖ్యంగా అమ్మాయిల, పేర్లని చిత్ర విచిత్రంగా పలికేవారు. లీల (Lila) పేరు లైలా అని పలికే వారు. ఇబ్బంది అనిపించలేదు, లైలా మజ్ఞూలలో లైలా ఉంది కదా అని. కానీ సీతని (Sita) “సైటా” అని పలికి ఇలా కూడ అనవచ్చు అనేవారు. మహా ప్రభో! మీరు చెప్పిన పాయింట్ మాకు అర్థ మయ్యింది, ఇలా వింతగా పేర్లు పలకద్దు సార్, అని వేడుకున్నాం. బహుశా ఈ దృష్టితోనే నేమో జంధ్యాల గారు తన సినిమాలో ఒక పాత్ర చేత Newton అనగా నూతన్ లేక నూతనుడని, మనవాడే బెంగాలీవాడు అని అనిపించాడు.

మనకి ఇప్పుడు తెలిసిన మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్ ఇంగ్లీషు మా రోజుల్లోనే కాదు, మా నాన్న, వాళ్ళ నాన్న, రోజుల్లో కూడా ఉండేదిట. “Go come bird” (అంటే, పోరా పక్షి అని) అనీ, “Its mother fruit (అంటే, దానమ్మ పండు అని) అనీ, వింత వింతగా మాట్లాడేవారట, మన తాతల కాలంలో. నేను చదువుకునే రోజుల్లోను, అంతకు ముందు కూడా చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదివి పెద్దయిన తరువాత ఇంగ్లీషు మీడియం లోకి మారిన వారు ఉండేవారు. ముఖ్యంగా సైన్సు, గణితం లాంటి సబ్జెక్టులలో ఇంగ్లీషు మీడియంలో చదివితేనే మంచిదని ఒక గట్టి నమ్మకం ఉండేది (ఇప్పుడు కూడా ఉంది). అలాంటి వాళ్ళు, ఏదో విధంగా ఇంగ్లీషు మాట్లాడటం మొదలు పెట్టేవారు. కొంత మంది ఇంగ్లీషులో మాట్లాడాలంటే ముందు తెలుగులో అనుకుని దాన్ని ఇంగ్లీషు లోకి తర్జుమా చేసి (ఇదంతా మనస్సులోనే) అప్పుడు మాట్లాడేవారు. అలా విద్యార్థులే కాదు కొంత మంది టీచర్లు కుడా చేసేవారు.

మా నాన్న గారు వాళ్ళ కెమిస్ట్రీ (Chemistry) ఆచార్యుడి గురించి ఈ విషయంలో ఒకటి రెండు ఉదాహరణలు చెప్పేవారు. కెమిస్ట్రీలో వాల్యూమెట్రిక్ ఎనాలిసిస్ (Volumetric Analysis) అని ఒక ప్రయోగం (experiment) ఉంది. అందులో, బ్యూరెట్టు (burette) లోంచి బొట్లు (drops) బొట్లుగా ఒక కెమికల్ (chemical) ద్రవం రెండవ పాత్రలోని ద్రవం లోకి వదలాలి. ఆ రెండవ పాత్రలోని ద్రవం రంగు మారగానే టక్కున బ్యూరెట్టు బందు (stop) చెయ్యాలి. ఇది ఇంగ్లీషులో వివరించడానికి ఆయన ఏమనే వారుట అంటే, బాగా బిగ్గరగా “డోంట్ పోర్ (Don’t pour)” అని తరువాత కొద్ది కొద్దిగా స్వరం తగ్గిస్తూ “బట్ పోర్ (but pour), … పోర్, … పోర్” అనే వారుట. ఒక సారి క్లాసులో ఒక అమ్మాయి కెమిస్ట్రీ లాబ్ రికార్డు (Laboratory record) ఎన్ని సార్లు చెప్పినా నాలుగయిదు రోజుల నుండి సబ్మిట్ (submit) చేయటల్లేదట. ఆ అమ్మాయిని కోప్పడాలి. దానికి ఆ ఆచార్యుడు మొదట తెలుగులో మనస్సులో అనుకుని తరువాత ఇంగ్లీషులో తర్జుమా చేసుకుని పైకి చెప్పిన దేమిటో చూడండి. “Day before yesterday, you lied with me; yesterday, you lied with me; today, you are lying with me; is it your duty to lie with me?” అని.

ఇలాంటి అనుభవం నేను కూడా కాలేజిలో చదివే రోజుల్లో విన్నాను. ఒకాయన క్లాసురూము (classroom)లో పాఠం చెబుతూ, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుతూ క్లాసును డిస్టర్బ్ (disturb) చేస్తున్న పిల్లలను కోప్పడడానికి ఇలా అన్నాడు. “I talk, you talk. Middle middle why you talk. Meet me underlab when I am empty.” అని. ఆ కాలేజీలో రెండు లాబులు (laboratories) ఉండేవి, ఒకటి గ్రౌండ్ ఫ్లోరు (ground floor) లో రెండోది మొదటి ఫ్లోరులో. ఆయన ఉద్దేశ్యంలో, “underlab” అంటే, గ్రౌండ్ ఫ్లోరులో ఉన్న లాబ్ అని. ఇలాంటివి చెబితే ఒకాయన ఆ రోజుల్లో, మనకి స్వాతంత్ర్యం రావడానికి ఈ ఇంగ్లీషు పాండిత్యానికి లింకు ఉంది అని మాకు చెప్పేవాడు. మనకి ఇంగ్లీషు నేర్పడం పెద్ద తప్పయిందని లార్డ్ మెకాలే (Lord Macaualy) రెండు లెంపలు వేసుకున్నాడని, తీరా నేర్పిన తరువాత మన వాళ్ళు ఇంగ్లీషు మాట్లాడడం మొదలు పెట్టాక, విన లేక హర, హరా! శివ, శివా! అని చెవులు మూసుకొని తెల్లదొరలు దేశం వదిలిపెట్టి పారిపోయారని, చెప్పేవాడు.

విద్యార్థులలో కొంత మంది చూపించే సమయస్ఫూర్తి అసామాన్యం. ఒక భౌతిక శాస్త్రం (Physics) పరీక్షలో పోస్టాఫీసు బాక్సు (post office box) గురించి షార్ట్ నోట్ (short note) వ్రాయమని ఒక ప్రశ్న ఇచ్చారు. ఒక విద్యార్థి దానికి రెండు పేజీలు వ్రాశాడు. అందులో తన ఊహాత్మక ప్రావీణ్యం, సమయస్ఫూర్తి, అంతా చూపించాడు. అది ఎర్రగా గుండ్రటి పెట్టె రూపంలో ఉంటుందనీ, ప్రతి గ్రామంలోను, పట్టణాల్లో రద్దీగా ఉండే చోట్ల రోడ్డు పక్కగా పెట్టబడుతుందనీ, దానికి ఒక తలుపు తాళం వేసే వసతితో పాటు ఉంటుందనీ, ఇంకో చిన్న రంధ్రం ఉత్తరాలు, కవర్లు లోపలికి వెయ్యడానికి వీలుగా ఉంటుందనీ, ఆ తలుపు తాళం తీసి ఆ పెట్టెలో ఉన్నవి రోజుకు రెండు మూడు సార్లు పోస్టాఫీసుకు తీసుకెళతారనీ, ఇట్లా రెండు పేజీల చాట భారతం వ్రాసి, చివర్లో ఒక కొస మెరుపు ఇచ్చాడు. ఏమనంటే, తరచుగా ఇది ఫిజిక్స్ లాబొరేటరీలలో (Physics laboratories) కూడా కనిపిస్తుంది అని. ఇంతకీ, పోస్టాఫీసు బాక్సు అన్నది Wheatstone bridge అన్న ఎలెక్ట్రికల్ (electrical) పరికరం యొక్క వ్యావహారిక నామము. దానికి మనవాడు ఎంత కవిత్వం చెప్పాడో చూడండి. ఇదంతా చూస్తుంటే, ఆన్సర్ పేపర్లు (answer papers) దిద్దేవాళ్ళ మీద నాకు చాలా జాలి కలుగుతూ ఉంటుంది. ఎంత పాపం చేసి ఉంటే, ఇలా వ్రాసిన వన్నీ చదవాల్సొస్తుంది. నేను కూడా ఒక సారి ఒక పరీక్ష పేపర్లు ఇవాల్యుయేట్ (evaluate) చేశాను. ఆ సమయంలో, ప్రతి ఆన్సర్ స్క్రిప్ట్ (answer script) మీద విద్యార్థి పేరు అడ్రసు గనక ఉంటే, కొంత మంది దగ్గరకు స్వంత ఖర్చుల మీద వెళ్ళి వాళ్ళు వ్రాసిన చెత్త చూపించి వాళ్ళని తన్ని వద్దామని అనిపించేది.

ఇక జ్ఞాపక శక్తి (memory power) గురించి మనలో చాలా ప్రతిభ (talent) ఉందని ఎప్పటి నుంచో వినవస్తోంది. కాకపోతే, అది రకరకాలుగా వినియోగింపబడడం ఎలా జరిగిందో చూద్దాం. కొంత మంది ఫాకల్టీ మెంబర్లకి క్లాసు తీసుకోవడం అంటే బాగా నేర్చుకున్న పాట మళ్ళీ మళ్ళీ పాడటం లాగా ఉండేది. వాళ్ళకు జ్ఞాపక శక్తి, వృత్తి మీద శ్రద్ధ, సమయ పాలన, క్లాసు తీసుకోవడానికి ముందు కొత్త కొత్త విషయాలు ఇంకా జోడించడానికి  చేసే కృషి అన్నీ ఎక్కువే. వాళ్ళ బోధనలో విద్యార్థులు నిష్ణాతులు అయ్యారు అనడంలో ఏమీ సందేహం లేదు. వాళ్ళు రచించిన పుస్తకాలు విద్యార్థులకే కాక ఫాకల్టీ మెంబర్లకి కూడ చాలా ఉపయోగించాయి. అది వాళ్ళ ప్రతిభ.

మాకు పాఠాలు చెప్పే ఫాకల్టీ (Faculty) లో నుండి ఒకటి రెండు సార్లు మా కాలేజీకి ప్రిన్సిపాల్ (Principal) అయిన వారున్నారు. అలా అయిన ఇద్దరూ చాలా ప్రతిభావంతులే. ఒకాయన ప్రిన్సిపాల్ గిరీ కన్నా తన ఉపాధ్యాయ వృత్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. కానీ పాపం ఆయనకు రెగ్యులర్ (regular) గా క్లాసు తీసుకోవడానికి సమయం ఉండేది కాదు. అందుకని ఆయన రెండేసి మూడేసి గంటల క్లాసులు సెలవు దినాలలో (అంటే, ఆదివారాలు లాంటివి) తీసుకొని సిలబస్ (syllabus) అవజేసేవారు. ఆయనకు వృత్తి పట్ల ఉన్న నిబద్ధత ఎంత గొప్పది అంటే, గంటలు గంటలు నాన్ స్టాప్ (non-stop) గా క్లాసు తీసుకున్నా విద్యార్థులకు విసుగు కలిగేది కాదు. క్లాసును అంత spell bound గా ఉంచేవారు. ఆయన పాఠం విన్న తరువాత, ఇంకా మళ్ళీ ఆ ఛాప్టర్ (Chapter) చదవవలసిన అవసరం లేకుండా ఉండేది. అంత బాగా చెప్పేవారు. ఒక క్లాసు అయిన తరువాత, తరువాతి క్లాసు ఎప్పుడు ఉంటుందా అని విద్యార్థులు ఎదురు చూసేవారు. అది ఆయన ప్రతిభ.

ఇంకో ఆయన ప్రిన్సిపాల్ అయిన తరువాత తన కేదో కిరీటం వచ్చినట్లు భావించి తన ఉపాధ్యాయ వృత్తిని అలక్ష్యం చేసేవాడు. కానీ, అది పైకి కనపడకుండా టైం టేబుల్ (Time-table) లో కొన్ని క్లాసులు తను తీసుకుంటున్నట్లు చూపించేవాడు. విద్యార్థులు వేచి చూసి చూసి విసిగి పోవాలే గానీ, సమయానికి క్లాసు తీసుకోవడానికి వచ్చేవాడు కాదు. ఒక సారి విద్యార్థు లందరూ ఒక ఐదు నిమిషాలు వైట్ (wait) చేసి ఆయన రాకపోతే వెళ్ళి పోయారు. అప్పుడు ఆయన అందరినీ పిలిచి తను ఎంత బిజీ (busy) గా ఉన్నది, తన కార్యక్రమాలు నోట్ (note) చేసిన డైరీని (diary) చూపించారు. అందులో, ఏ ఏ సమయాల్లో ఏ ఏ మీటింగులు (meetings) ఉన్నాయో వివరాలు ఉన్నాయి. ఒక విద్యార్థి అది చూసి, ఇందులో ఇక్కడ మీరు క్లాసు తీసుకోవాలని ఎందుకు లేదు, మీ ఉద్దేశ్యంలో ఇది కేవలం ఏ పనీ లేకపోతే చేసే పనా అని నిలదీశాడు. బిత్తర పోయిన ఆ ప్రిన్సిపాల్ గారు, ఆ తరువాత ఎప్పుడూ ఆలస్యంగా రాలేదు. కానీ ఏమాట కామాట, వస్తే మాత్రం పాఠం అద్భుతంగా చెప్పేవారు. ఆయన క్లాసుకి మిగతా ఫాకల్టీ మెంబర్లు (faculty members) కూడా వచ్చేవారు. అది ఆయన ప్రతిభ.

నేను కాలేజీలో చదివే రోజుల్లో ఫాకల్టీలో కొంత మంది చాలా పెద్ద వాళ్ళు (వయస్సులో) ఉండేవారు. కొంత మంది మా నాన్నకు టీచర్లు, కొంత మంది అక్కడే పనిచేస్తున్న ఇతర టీచర్లకు టీచర్లు. వాళ్ళంటే నాకు చాలా గౌరవ భావం. ఎందుకంటే, వాళ్ళు తమ పోస్టుగ్రాడ్యుయేషన్లో (Post-graduation) చదువుకున్నవి, ఒక్కోసారి ఆ రోజుల్లో కూడా తాము చదవనివి వాళ్ళు మాకు చెప్పాల్సిన పాఠ్యాంశాలలో ఉండేవి. అయినా వాళ్ళు చాలా కష్టపడి తయారు అయ్యి వచ్చి మాకు పాఠం చెప్పేవారు. ఎక్కడన్నా వాళ్ళకు కొరుకుడు పడక పోతే, క్లాసులో మాయ చెయ్యడమో దాటెయ్యడమో చెయ్యకుండా, ప్రస్తుతానికి ఇది తెలియదు, ప్రయత్నించి, తరువాత తెలిస్తే మీకు చెప్పడం జరుగుతుంది అని చాలా నిజాయితీగా క్లాసులో చెప్పేవారు. వాళ్ళ నిజాయితీకి పాదాభివందనం. ఇది మామూలు ప్రతిభ కాదు.

ఆ రోజుల్లో నేను ఇంకో రకం నిజాయితీ కూడా చూశాను. చాలా మంది టీచర్లు ట్యూషన్లు (Tuitions) చెప్పేవారు. అది అట్లా ఇట్లా కాదు, బిజీగా ఉన్న హోటల్లో వేసే ఇడ్లీ వాయల్లాగా  ఉండేది. పొద్దున లేచింది మొదలు, రాత్రి పడుకునే దాకా గంట గంటకీ బాచ్ మారేది. ఆ టీచర్లు కాలేజీలో క్లాసు ఉన్న టైములో మాత్రం వచ్చి వెళ్ళేవారు. అలాంటి వాతావరణంలో, చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని ట్యూషనుకి పంపక పోతే పక్షపాతంతో టీచర్లు వాళ్ళకి మార్కులు తగ్గించేవారని నమ్మేవారు. అలాంటి టీచర్లు క్లాసుల్లో సరిగా చెప్పరు అని కూడా నమ్మేవారు. కానీ ఆ నమ్మకాలను వమ్ము చేస్తూ, మా టీచర్లు క్లాసులో పాఠాలు చెప్పడంలో గానీ పరీక్షాపత్రాలు దిద్దడంలో గానీ మాకు ఎప్పుడూ అన్యాయం చేయలేదు. పైపెచ్చు కొంత మంది, ఈ క్లాసు రూము వాతావరణం లోనే మాకు బాగా పాఠం చెప్పాలనిపిస్తుంది, మా దగ్గర మీరు ట్యూషనుకి చేరినా ఇంతకన్నా బాగా చెప్పలేము, అని అనేవారు. వాళ్ళ నిజాయితీకి వృత్తి పట్ల వాళ్ళకున్న నిబద్ధతకి నమస్కారం.

ఆచార్యులలో కూడా వింతైన ప్రతిభావంతులు ఉండేవారు. ఒకాయన ఒక పుస్తకం తెరిచిపట్టుకుని దాన్ని చూస్తూ బ్లాక్ బోర్డు (black board) మీద వ్రాసి వివరించేవారు. ఆయన ఆ పుస్తకం అటూ ఇటూ తిప్పినప్పుడల్లా దాని పేరు, రచయిత పేరు చూడాలని నానా తంటాలు పడేవాళ్ళం. ఆయన మాత్రం చెప్పేవాడు కాదు. అడిగే ధైర్యం మాలో ఎవరికీ ఉండేది కాదు. మొత్తానికి ఏదో విధంగా ఆ పుస్తకం వివరాలు తెలుసుకుని దాన్ని లైబ్రరీలో సంపాదించి చూస్తే, ఆయన క్లాసులో చెప్పినది ఆ పుస్తకములో ఉన్నది ఒక్క అక్షరం అంటే ఒక్క అక్షరం కూడా టాలీ (tally) అయ్యేది కాదు. అదీ ఆయన ప్రతిభ. ఇంకొకాయన, చేతిరాత ముత్యాల లాగా ఉండేది. ఆయన బ్లాక్ బోర్డు (black board) మీద ఏదన్నా వ్రాస్తే, మాకే కాదు ఆయన తరువాత క్లాసు తీసుకునే వేరే ఆచార్యులకి కూడా చెరప బుద్ధి అయ్యేది కాదు. ఒక సారి ఆయన వ్రాసినది చెరపాల్సొచ్చి చెరిపేసినా కూడా ఒక మూల ఎక్కడో కొంచెం మిగిలిపోయింది. ఆ తరువాత క్లాసు తీసుకున్న ఆచార్యుడు ఆ మిగిలి పోయినది చూసి ఆ విషయం మీద ప్రశ్నల వర్షం కురిపించాడు. విద్యార్థులు చెప్పలేక పోతే తానే క్షుణ్ణంగా వివరించాడు. అది ఆయన జ్ఞాపక శక్తి, ప్రతిభ.

కొంత మంది ఫాకల్టీ మెంబర్లు (faculty members) తమ వృత్తి పట్ల మహా బద్ధకస్థులు (lazy). ప్రతి సంవత్సరం సిలబస్ (syllabus) మారదు కాబట్టి, మునుపు ఎప్పుడో వాళ్ళు మొదటి సారి క్లాసు తీసుకున్నప్పుడు తయారు చేసిన నోట్సు (notes), తరువాత ఎప్పుడు క్లాసు తీసుకున్నా తెచ్చి దాన్ని శ్రద్ధగా బ్లాక్ బోర్డ్ (black board) మీద ఎక్కించేవారు. వాళ్ళ క్లాసు చెంచాతో ఆహారం (spoon feeding) పెట్టినట్లు ఉండేది. అంటే, బుర్ర ఉపయోగించక్కర లేదు. వాళ్ళు క్లాసులో బోర్డ్ మీద వ్రాసింది అలాగే పరీక్షల్లో వ్రాస్తే మంచి మార్కులు వచ్చేవి. కాకుండా, బుర్ర పెట్టి ఏ మాత్రం మార్చి వ్రాసినా కష్టాలే. అలా సాగుతుండగా, వాళ్ళలో ఒకాయనకి ఒక సారి చిన్న భంగపాటు జరిగింది. అది ఏమిటంటే, ఒక విషయం మీద ఆయన వ్రాసిన నోట్సు 20 సంవత్సరాల క్రితంది. అలనాడు, ఆయన ఒక ఫారెన్ (foreign) రచయిత వ్రాసిన పుస్తకం ఆధారంగా ఆ నోట్సు వ్రాసుకున్నారు. ఆ పుస్తకంలో 20 సంవత్సరాల క్రితం ఒక తప్పు దొర్లింది. పునర్ముద్రణలలో (reprints or subsequent editions) ఆ రచయిత ఆ తప్పును దిద్దుకున్నాడు. ఆ పునర్ముద్రణలు సదరు ఫాకల్టీ మెంబరు చూడ లేదు. పాత వెర్షనే (version) క్లాసులో చెప్పేవాడు. ఇది గమనించిన ఒక విద్యార్థి పరీక్షలో తాను ఒక్కడు మాత్రం పునర్ముద్రణలో ఉన్నది వ్రాశాడు. మిగిలిన వాళ్ళు పాత వెర్షనే వ్రాశారు. పాత వెర్షను వ్రాసిన వారికి పూర్తి మార్కులు పడ్డాయి. కొత్త వెర్షను వ్రాసిన వాడికి సున్నా మార్కులు వేయబడ్డాయి. ఇదేమిటి సార్, అని అతను అడిగితే ఆచార్యుడు తన పాత పుస్తకం చూపెట్టాడు. ఆ కుర్రాడు, సార్, నా దగ్గర ఉన్న పుస్తకంలో నేను వ్రాసినట్లే ఉంది అని అన్నాడు. అది విని, ఇదంతా చూస్తున్న వాళ్ళు ఇదేమిటి ఒక ఆచార్యుడితో ఇంత మొండిగా వాదిస్తున్నాడు అని ఆశ్చర్యపోయారు. మర్నాడు ఆ పునర్ముద్రణ తెచ్చి చూపంగానే ఆ ఆచార్యుడు తన తప్పు తెలుసుకుని సారీ చెప్పాడు. అప్పటి నుండి తన పద్ధతి మార్చుకున్నాడు. ఏదో ఒక సారి అలా జరిగింది కానీ ఆయన కూడా మంచి టీచరే, ఆ బద్ధకం పక్కన పెడితే. అది ఆయన ప్రతిభ.

మేము యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో, క్లాసులో బోధించబడేవి ఎక్కువగా మాథ్స్ (Maths), స్టాటిస్టిక్స్ (Statistics). విద్యార్థులలో ఒకాయన క్లాసులో ఆచార్యుడు చెప్పినది అర్థమయినా కాకపోయినా విన్నది విన్నట్టుగా, ఆ రోజు సాయంకాలం వరకు చెప్పగలిగేవాడు. ఇంకొకాయన, ఆచార్యుడు బ్లాక్ బోర్డ్ మీద ఏది వ్రాస్తే అది తు.చ. తప్పకుండా తన నోట్ బుక్ (note book) లో వ్రాసేవాడు. ఒకాయన, ఏ రోజు చెప్పినది ఆ రోజు సాయంకాలం క్షుణ్ణంగా 5-6 ప్రామాణికమైన (standard) పుస్తకాలు, ఫారెన్ (foreign) రచయితలవి, చదివి వివరంగా నోట్సు (notes) వ్రాసేవాడు. ఇలా, ప్రతి ఒకరి ప్రజ్ఞ ఇతరులకి కూడా పనికొస్తూ ఉండేది.

మాకు ప్రతి సెమెస్టర్లోను (semester) ప్రతి సబ్జెక్ట్లో అసైన్ మెంటు (assignment) ఉండేది, కొన్ని మార్కులకి. అది ఎవరో ఒకళ్ళు వ్రాస్తే మిగిలిన వాళ్ళం కాపీ (copying) కొట్టేవాళ్ళం. అందులో, ఏమిటి ప్రతిభ అనుకుంటున్నారా, ఉందండోయ్. మా ఆచార్యులు కూడా ఒరిజినల్ (original) ఎవరిదీ అని అడిగి అడిగి అలిసిపోయారు. మాములుగా, మొదటి సారి వ్రాసిన వారి దాన్లో అంటే, ఒరిజినల్ లో అక్కడక్కడా కొట్టివేతలు ఉండచ్చు. ఉండచ్చు ఏమిటి ఉండేవి. కాపీ కొట్టేవాళ్ళు తెలివితక్కువ వాళ్ళయితే వాళ్ళు ఆ కొట్టీవేతలు పట్టించుకోకుండా చక్కగా నీట్ (neat) గా తమ ప్రతిలో వ్రాస్తారు. కానీ, మా వాళ్ళు కొట్టివేతలను కూడా కాపీ కొట్టి, దోమ ఏదన్నా చచ్చి దానికి అంటుకుని ఉంటే, వాళ్ళు కూడా ఒక దోమని చంపి అతికించి, అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుని అప్పుడు సబ్మిట్ (submit) చేసేవారు. అది మామూలు ప్రతిభంటారా.

మా ఒకళ్ళిద్దరు క్లాస్ మేట్లది (classmates) ప్రత్యేక ప్రతిభ. పరీక్షలకి ముందు ముఖ్యమైన టాపిక్కుల (topics) మీద ఇతర విద్యార్థులకి చక్కగా కోచింగ్ (coaching) ఇచ్చేవారు. అలా కోచింగు తీసుకున్న వాళ్ళు పరీక్షలో ఆ టాపిక్కుల మీద ఇచ్చిన ప్రశ్నలకి జవాబులు బాగా వ్రాసి వచ్చేవారు. కానీ, వాళ్ళకి కోచింగు ఇచ్చిన గురువులు మాత్రం ఎందు చేతనో సరిగ్గా గుర్తు రాక తప్పులు చేసేవారు. అంగరాజు కర్ణుడు వాళ్ళని ఆ సమయంలో ఆవహించేవాడు.

అదలా ఉంచి, బట్టీరాయుళ్ళు అని ఒక ప్రత్యేక తెగ ఉండేది. అది బుర్ర లేని వాళ్ళు చేసే పని అనీ అందులో ఏ మాత్రం నైపుణ్యం లేదనీ అనుకోకండి. చాలా వైవిధ్యం ఉన్న ప్రావీణ్యం అది. వెనకటికి షాహ్ జహాన్ (Shah Jahan) చక్రవర్తి కాలంలో (17వ శతాబ్దం) మన తూర్పు గోదావరి జిల్లా ముంగండ గ్రామంలో జగన్నాథ పండిత రాయలు అని ఒక కోబ్రా (అంటే, కోనసీమ బ్రాహ్మణుడు) మహా పండితుడు ఉండేవాడట. ఆయన, ఒక సారి కాశీ వెళ్ళాడట. ఈయన బజారులో తిరుగుతుంటే అక్కడ ఎవరో ఇద్దరికి తగాదా జరుగుతోందట. వాళ్ళ భాష జగన్నాథ పండితుడికి రాకపోయినా ఊరికే జరిగేది చూస్తూ నుంచున్నాడట. మొత్తానికి వాళ్ళ గొడవ రాజాస్థానం దాకా వెళ్ళడం, అక్కడ సాక్ష్యం ఉంటే తెమ్మని అడగ్గా ఈ పండితుణ్ణి తీసుకెళ్ళి ప్రవేశ పెట్టడ్డం, ఈయన ఆ భాష తనకు రాకపోయినా చూసినది మరియు విన్నది విన్నట్లుగా రాజాస్థానంలో నివేదించడం జరిగాయి. అంటే, జగన్నాథ పండిత రాయలు ఏకసంథాగ్రాహి అని తెలిసింది. అనగా, ఒకసారి ఏదన్నా చదవితేనో లేదా వింటేనో ఆ విషయాన్ని గుర్తుంచుకో గలిగే వ్యక్తి.

చిన్నప్పుడు విన్న కథలో ఏకసంథాగ్రాహి, ద్విసంథాగ్రాహి, త్రిసంథాగ్రాహి అని పిలవబడే ముగ్గురు ప్రతిభావంతులయిన కవులు / పండితులు ఒక రాజాస్థానంలో ఉండేవారు. ఎవరన్నా క్రొత్త కవి / పండితుడు రాజు దగ్గర తమ ప్రజ్ఞ కనబరచడానికి ఏదైనా వినిపిస్తే, అది వినంగానే ఏకసంథాగ్రాహి ఇది నాకు వచ్చు అని తను చెప్పేసేవాడట. అట్లా రెండు మాట్లు చెప్పబడింది కాబట్టి, ద్విసంథాగ్రాహి అందుకుని ఇది నాకు కూడా వచ్చు అని తను చెప్పేసేవాడట. మరి మూడు మాట్లు అయిందిగా, త్రిసంథాగ్రాహి ఊరుకుంటాడేమిటి. నాకు కూడా వచ్చు అని తను చెప్పేసేవాడట. ఈ విధంగా, ఈ ముగ్గురూ రాజాస్థానంలో క్రొత్త వాళ్ళు చేరకుండా అడ్డుకున్నారట.

ఇద్దరి మధ్య సంభాషణ, శ్లోకాలు, పద్యాల విషయంలో మనం చిన్నప్పుడు విన్న ఈ ప్రతిభ, నేను యూనివర్సిటీలో చేరిన తరువాత ఇతర సబ్జెక్టులలోనూ వివిధ సందర్భాలలోనూ చూశాను. నేను చూసిన వాళ్ళు వేరే వేరే ప్రాతాలకు చెందిన వారు, వేరు వేరు కులాలకు మతాలకు చెందిన వారు. వాళ్ళు ఏ మాత్రం జగన్నాథ పండితుడికి గానీ, పైన చెప్పిన ముగ్గురు పండితులకి (ఏకసంథాగ్రాహి, ద్విసంథాగ్రాహి, త్రిసంథాగ్రాహి) గానీ తీసిపోరు. “Talents differ” అని అంటారు కదా. అదేమిటో ప్రత్యక్షంగా నాకు అనుభవమయ్యింది. వివరాలు మీతో కూడా పంచుకుంటాను.

పరీక్షల్లో విద్యార్థులు చూపించే ప్రతిభ అసామాన్యము. పిడి కొట్టడమని ఏదో సినిమాలో అనుకుంటా ఒక కాన్సెప్ట్ (concept) ప్రవేశపెట్టారు. ఏదైనా పాఠ్యాంశాన్ని బట్టీ పట్టడాన్ని (getting by heart) పిడికొట్టడం అంటారు. ఇక ఇందులో ప్రతిభ, అబ్బో! ఏమని చెప్పమంటారు. పుస్తకాల్లో అధ్యాయాలకి (chapters) అధ్యాయాలే కొందరు బట్టీ పట్టేవారు. ఒకాయనైతే, ఏ పుస్తకం ఇచ్చినా (ఆయనకి పరిచయం లేని సబ్జెక్ట్ ది అయినా కూడా), ఒక వారం పది రోజుల టైము (Time) తీసుకుని అది మొత్తం వ్రాసి ఇచ్చేవాడు. అంటే, కవరు పేజీ (cover page)లో ఉన్నది మొదలు (బొమ్మలు కాకుండా), ఆఖరి పేజీలో ISBN నంబరు దాకా మొత్తం వ్రాసి ఇచ్చేవాడు. పరీక్షలో అడిగే ప్రశ్నలకి ఎంతవరకు సమాధానం వ్రాయాలో అన్న దాని గురించి అటువంటి వాళ్ళ దగ్గర టైము గానీ ఆసక్తి గానీ ఉండేవి కావు. ఆ ప్రశ్నలోని ఏదో ఒక పదం ఏ ఛాప్టర్లో వచ్చిందో మనస్సుల్లో గబగబా మననం చేసుకుని చూసేవారు. ఆ ఛాప్టర్ ఏదో తెలిస్తే, ఆ ఛాప్టర్ మొత్తం జవాబు పత్రంలో దింపేసేవారు. ఆ ఛాప్టర్లో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వ్రాయాలో వాళ్ళకు తెలియదుగా మరి. ఇంతకన్నా గొప్ప ఆంజనేయ భక్తులు ఉంటారంటారా. ఆన్సరు పేపరు (answer paper) ఇవాల్యుయేట్ (evaluate) చేసే ఆయన వాళ్ళు వ్రాసిన దాన్లో ఆన్సరు ఎక్కడుందో వెతుక్కోవాలి. ఇంతకీ, ఎవరు ఎవరికి పరీక్ష పెట్టినట్టు.

అట్లా, ఛాప్టర్లు జవాబు పత్రాల్లో దింపేసే అలవాటున్న ఒకాయనకి ఒకసారి భంగపాటు జరిగింది. అతను అలా దింపింది పుస్తకం లోని మూడవ ఛాప్టరు. ఆ రచయిత ఆ ఛాప్టరు మొదటి పేరాలో (para), “Hitherto, we have discussed ….. In this chapter, we will discuss ….” అని వ్రాశాడు. అంటే, మొదటి రెండు ఛాప్టర్లలో ఏముందో చెప్పి, ఈ మూడవ ఛాప్టర్లో ఏమి చెప్పబోతున్నాడో సూచించాడు, పాపం. మనవాడి బట్టీలో ఎడిటింగ్ (editing) ఉండదు. అలాగే దింపేశాడు. చివాట్లు తిన్నాడు. మరి టైము (time) సరిపోవద్దా అన్న సందేహం వస్తుంది. అందుకోసం, ఒక వింతయైన ట్రిక్ (trick) చేసే వారు. మామూలుగా పరీక్ష హాలుకి అరగంట ముందు రమ్మనే వారు కదా. ముందే జవాబు పత్రం (ఒక చిన్న సైజు పుస్తకంలా ఉంటుంది) ఇస్తారు కదా, పేరు, రోల్ నంబరు (roll number), తారీఖు, లాంటివి వ్రాయడానికి. మన వీరుల విజృంభణ ఎలా ఉండేదంటే, పరీక్ష హాలులో జవాబు పత్రాలు ఇస్తూ ఇన్విజిలేటర్ (Invigilator) అందరికీ ఇవ్వడం పూర్తి చేసి తన టేబుల్ (table) దగ్గరకు వచ్చేసరికి, మొదట జవాబు పత్రం పుచ్చుకున్నవాడు ఎడిషనల్ షీటు (Additional sheet) అడిగేవాడు. అదేమన్నా గొప్ప విషయమా అని తేలిగ్గా తీసిపారేయకండి. అప్పటి కింకా, ప్రశ్నాపత్రం (question paper) ఇవ్వలేదు, మరి. ప్రశ్న నంబరు తరువాత వేసుకోవచ్చని బట్టీ పట్టినది ముక్కు మీద పెట్టుకుని చీదడం, ఎలాగూ వస్తాయనుకున్న ప్రశ్నలను విజయవంతంగా ఊహించ గలగడం, వాటికి గబగబా జవాబులు వ్రాయడం, మామూలు ప్రతిభ అంటారా.

కొంత మంది బట్టీ పట్టే విధానం చిత్రంగా ఉండేది. ఉదాహరణకి, బ్లాక్వెల్ సిద్ధాంతము (Blackwell Theorem) ఏమిటో చెప్పి దాన్ని నిరూపించండి (state and prove) అని ప్రశ్న ఇస్తే వాళ్ళు బట్టీ పట్టారు కాబట్టి సులభంగా వ్రాయగలిగే వారు. అలా కాకుండా ఆ సిద్ధాంత మేదో స్టేట్మెంట్ (statement) ఇచ్చేసి దాన్ని నిరూపించమంటే మాత్రం కష్టమే. పరీక్ష హాలులో ఎవరన్నా అది బ్లాక్వెల్ సిద్ధాంతము అని చెవులో ఊదితే వెంటనే ఆన్సరు వ్రాసేసేవారు. అందులో, మళ్ళీ ఇంకో తెలివి ఉపయోగించేవారు. వీళ్ళు చదివిన బ్లాక్వెల్ సిద్ధాంతము “x” నొటేషన్లో (notation) ఉండి, ప్రశ్నాపత్రంలో “y” నొటేషన్లో ఇస్తే, వీళ్ళు తాము చదువుకున్న “x” నొటేషన్లోనే అంతా వ్రాసి చివర్లో “x” ఉన్నచోటల్లా “y” పెట్టుకోండి, అని వ్రాసేవారు. లేకపోతే, బట్టీ దెబ్బతింటుందిగా మరి.

మాథ్స్ (గణితం) లాంటి సబ్జెక్ట్లో కూడా కొంత మంది బట్టీ పట్టడం విద్యార్థులలోనే కాదు, ఫాకల్టీ (faculty)లో కూడా చూశాను. ఒక లెక్చరర్ (lecturer) మాకు డైనమిక్స్ (dynamics) చెప్పేవాడు. ఇచ్చిన లెక్కలో ఉన్న బొమ్మ అందులో చూపబడిన ట్రిగ్నామెట్రిక్ కోణాలు (trigonometric angles) అంతా బట్టీ పట్టుకొచ్చి చెప్పేవాడు. కానీ, మేము కొంచెం ఆ బొమ్మలో కుడిని ఎడం, ఎడమని కుడి చెయ్యగానే ఆయన పిడి జారిపోయి తరువాత చూద్దాం అని వెళ్ళిపోయేవాడు.

ఇలా చెబుతూ పోతే చాలా ఉన్నాయి. ఏవో నాకు తోచిన ముఖ్యమైన అనుభవాలు మాత్రమే ఇక్కడ షేర్ (share) చేశాను.

3 thoughts on “విద్యాలయాల్లో నా వింత అనుభవాలు

  1. ఏదో నాకు తోచిన అంటూనే .. ఎంత చెప్పారు రంగనాధం గారూ. మీ చమత్కార ధోరణితో భలే నవ్వించారు. నవ్వ లేక చచ్చాను. కాపీలు కొట్టడం, భట్టీయం పట్టడం, ముక్కున పట్టి చీదెయ్యడం, అమోఘమైన విద్యాబోధన, వచ్చీరాని భట్టీయం బోధన – ఇలా ఒకటా రెండా … దేన్నీ వదల లేదుగా … మన ఇంగ్లీషు ఉచ్చారణ ప్రావీణ్యం చూసి బ్రిటీషు వాళ్ళు ఇండియా వదిలిపెట్టి పారిపోయారన్నది చదువుతుంటే భలే నవ్వొచ్చింది. ఎంత ఓపికగా, తెలుగు (బ్రాకెట్స్ లో ఇంగ్లీషు)లో వ్రాశారు. అభినందన లండీ. ఒక డౌట్ అండీ .. మీరు దోమ కాపీ గురించి చెప్పారు కదా. నేను విన్నది ఏమిటంటే అది ఈగ అని. ఈగను హిందీలో మక్కీ అంటారు కదా. దాని బట్టే మక్కీకి మక్కీ కాపీ కొట్టాడు అన్న కహావత్ వచ్చింది అని. ఏదయితే ఏంటి లెండి. అది అలా ఉంచితే .. మీ రచనా శైలి, సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది గానీ, మళ్ళీ నిడివిలో ఇదో వ్యాసమై పోతుందని భయపడుతున్నాను. మొత్తానికి చాలా నేర్చుకున్నాను ఈ రోజు. Thanks and congrats అండీ.

    Like

    1. ధన్యవాదాలు. మీరు అన్నది కరక్టే. మామూలుగా అయితే అది ఈగే. కానీ అది జరిగింది ఆంధ్రా యూనివర్సిటీ, వైజాగులో. వైజాగు దోమలు శ్రీశ్రీ గారి వల్ల బాగా పాపులర్ అయ్యాయి. వారు చెప్పిన పద్యం చూడండి.

      కం. తెగబట్టి కుట్టుచున్నవి,
      అగణిత వైజాగు దోమ లశ్వత్థామల్,
      పొగరెక్కిన రెక్కేన్గులు,
      సెగ లెగసెడి తుమ్మ ముళ్ళు సిరిసిరి మువ్వా!

      Like

  2. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కాలేజీ రోజులు గుర్తొచ్చాయి మీ రచనా శైలి చాలా బాగుంటుంది

    Like

Leave a reply to K.vani chalapati Rao Cancel reply