మన యూనియన్లు, అసోషియేషన్లు

యూనివర్సిటీ (University) లో సీటు వచ్చిందని తెలియగానే చేరడానికి వెళ్ళి ప్రవేశ రుసుం (Admission fee) కట్టడానికి క్యూ (Queue) లో నిలబడతాము. డబ్బు కట్టిన తర్వాత, ఒక రసీదు (receipt) ఇస్తారు కదా. దానిలో ట్యూషన్ ఫీజు (Tution fees), లైబ్రరీ ఫీజు (Library fees), ఇంకా ఇతర ఫీజులు కాక స్టూడెంట్స్ యూనియన్ ఫీజు (Students Union Fees) అని పది రూపాయలో ఇరవై రూపాయలో (ఎంతైతే అంత) వసూలు చేసినట్లుగా ఉంటుంది. ఏదో ఒకటిలే అని ఆ సమయంలో దాన్ని పట్టించుకోము. నాకు కూడా ఆ సమయంలో దాని మీద ధ్యాస లేదు. తరువాత అంటే యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో కొంత, మళ్ళీ చాలా సంవత్సరాల తరువాత ఇంకొంత దాన్ని గురించి నేను విన్నది చెబుతాను. ఆ వివరాల్లోకి వెళదాం.

అసలు యూనియన్లు (Unions) కానీ అసోషియేషన్లు (Associations) కానీ ఏర్పాటు చేసుకునే హక్కు (right) మనకు మన రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కుగా (Fundamental right) సంక్రమించింది. రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తూ సుప్రీం కోర్టు (Supreme Court), ఇతర కోర్టులు చాలా సార్లు చెప్పినదేమంటే, ఒక పని చెయ్యడానికి హక్కు ఉంటే, స్వాభావికంగా (by implication or inherently) ఆ పని చెయ్యకుండా ఉండడానికి కూడా హక్కు ఉన్నట్లే, అని. ఉదాహరణకి, రాజ్యాంగం లోని ఆర్టికిల్ 19 (1) (c)లో యూనియన్లు కానీ అసోషియేషన్లు కానీ ఏర్పాటు చేసుకునే హక్కు ప్రతి పౌరుడికి (Citizen) ఉంది. అంటే, ఏదైనా యూనియన్ కానీ అసోషియేషన్ కానీ ఏర్పాటు చేయకుండా ఉండే హక్కు, లేక వాటిల్లో చేరకుండా ఉండే హక్కు కూడా, ప్రతి పౌరుడికి ఉంది. అలాంటిది మన ప్రమేయం లేకుండా (by default), యూనివర్సిటీ యాజమాన్యం (management) మన దగ్గర ఫీజు వసూలు చేసి మనకి తెలియకుండా మనని ఒక యూనియన్లో ఎట్లా చేరుస్తారు? ఫీజు కట్టేసిన తర్వాత, ఫేట్ యకాంప్లి (Fait Accompli) అని ఆంగ్లంలో మనకి అర్థం కాకుండా అంటే సరిపోతుందా? దాని వల్ల మన ప్రాథమిక హక్కు ఉల్లంఘించబడడం (infringement) లేదా? చదువుకునే రోజుల్లో ఈ విషయం మనకి తెలుసా? నాకయితే తెలియదు.

న్యాయంగా అయితే, ప్రతి విద్యార్థి సమ్మతి (consent) లిఖితపూర్వకంగా (in writing) తీసుకుని, ఒప్పుకుంటేనే యూనియన్లో చేరడానికి ఫీజు వసూలు చెయ్యాలి. అంతే కానీ, మనకి తెలియకుండా, మిగతా ఫీజులతో కలిపేసి కలగూరగంపగా అన్నిటికీ కలిపి ఫీజు వసూలు చేసి, అందులో నిగూఢంగా (hidden) యూనియన్ ఫీజు కూడా ఉందని, మిగతా వాటితో పాటు అది కూడా కట్టారు కాబట్టి మీరు యూనియన్ సభ్యత్వం (membership) పుచ్చుకున్నట్లే అని అనడం న్యాయమేనా, కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధానులు “తాంబూలాలు పుచ్చుకున్నాం, తన్నుకు చావండి.” అన్నట్లు. తెలిసి చేశారని అనను కానీ, లోతుగా అలోచిస్తే అది మోసం అనిపించడం లేదా? ఎవరూ ధ్యాస పెట్టకపోవడం వల్లనేమో ఆ పద్ధతి అలా సాగుతోంది.

సరే, జరిగిందేదో జరిగింది. యూనివర్సిటీలో చదివే కాలంలో ఎప్పుడైనా స్టూడెంట్స్ యూనియన్ చేసే పనులు నచ్చక ఎవరన్నా సభ్యత్వానికి రాజీనామా చెయ్యాలంటే, అలాంటి నిబంధన (provision) ఉన్నట్లు కనపడదు. ఉన్నా ఎవరికీ తెలిసినట్లు లేదు. ఎక్కడా అలాంటి మిడిల్ డ్రాపులు (middle drop) జరిగినట్లు నేనైతే వినలేదు. అనుమానాస్పద ప్రవేశం (doubtful entry), నిష్క్రమణ  (exit) ఉందో లేదో, ఒక వేళ ఉంటే ఉన్నట్లు ప్రవేశించిన వారికి తెలియకపోవడం, అన్నవి పద్మవ్యూహం తరువాత ఉన్నది ఈ వ్యవస్థ లోనేనేమో.

సరే, చెల్లియో చెల్లకో అన్నట్లుగా తెలిసో తెలియకో స్టూడెంట్స్ యూనియన్లో ప్రతి విద్యార్థి ప్రవేశ రుసుం కట్టిన నాటి నుండి చేరినట్లే. అందరు విద్యార్థుల దగ్గర వసూలు చేసిన ఆ సొమ్ము, అంతకు ముందు సంవత్సరాలలో అలా వసూలు చేసిన సొమ్ములో ఖర్చు కాకుండా మిగిలిన సొమ్ముతో కలిపి, స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు జరిగిన తరువాత గెలిచిన వాళ్ళకు (office bearers) అప్పజెబుతారు. అసలు కథ అప్పుడు మొదలవుతుందట. ఆ సొమ్ము ఖర్చు చెయ్యడానికి కొన్ని నిబంధనలు (rules and regulations), వాటి మీద ఆడిట్ (audit) ఉంటాయట. ఆ నిబంధనల నుండి, ఆడిట్ నుండి మినహాయింపు (exemption) ఏదైనా, హర్తాల్ (hartal), స్ట్రైక్ (strike) లాంటివి చేసినప్పుడు అనుమతింపబడతాయట. అంటే, అప్పుడు ఓచర్ పేమెంట్స్ (voucher payments) జరుగుతాయి, అన్నమాట. ఏదైనా కొన్నప్పుడు గానీ ఏదైనా పనిచేయించినప్పుడు గానీ మామూలుగా అయితే డబ్బిచ్చి రసీదు తీసుకుంటాము. అంతకు ముందు, ఎవరి దగ్గర కొనాలి, ఎవరితో పని చేయించాలి అన్నది నిర్ణయించడానికి టెండర్లో క్వొటేషన్లో పిలిచి తేల్చుకుంటాము. ఇదంతా చెయ్యడానికి సమయం లేదు అన్న పరిస్థితి ఉన్నప్పుడు, ఓచర్ పేమెంట్స్ పద్ధతి అనుసరించడం జరుగుతుంది. అంటే, కొన్న వాళ్ళే ఇంతకు కొన్నామని ధృవీకరించి డబ్బు డ్రా చెయ్యడం. స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు రాజకీయ పార్టీలకి అనుబంధంగా (affiliation) రకరాకాల ఖర్చులతో జరుగుతున్నాయి కాబట్టి, ఆ ఖర్చే కాక దాని పైన ఇంకా అంత వెనక్కి రాబట్టాలంటే, ఈ ఓచర్ పేమెంట్లే రాజమార్గమట. అందుకని, గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే, హర్తాల్, స్ట్రైక్ లాంటివి చేసి తీరాల్సిందేనట. ఏ కారణం దొరకక పోతే ఇతర రాష్ట్రాలలో, ఇతర యూనివర్సిటీలలో ఉన్న సమస్యలకి సానుభూతితో స్పందించి హర్తాల్, స్ట్రైక్ (sympathy hartal, sympathy strike) లాంటివి చేస్తారట, వేరే దోవ లేక.

ఇదంతా చూస్తుంటే, పందులను కాల్చడానికి ఇళ్ళు తగలపెట్టి తీరాలని అనుకున్న ఆది కాలం నాటి నమ్మకం గురించి A Dissertation Upon Roast Pig” అన్న వ్యాసంలో చెప్పిన ఛార్లెస్ లాంబ్ (Charles Lamb) గుర్తుకొస్తున్నాడు. నిజంగా ఖర్చు చేయకుండా, ఖాతాలలో ఖర్చు అయినట్లు చూపించాలంటే, ఓచరు పేమెంట్సే మార్గమని, అలా చెయ్యాలంటే అత్యవసర పరిస్థితి, యుద్ధప్రాతిపదిక లాంటివి అన్వయించ గలిగే పనులు చేపట్టాలి అని యూనియన్లు నమ్ముతాయి అని విన్నాను. ఇలాంటి నమ్మకం, విద్యార్థి సంఘాల లోనే కాదు, వేరే అసోషియేషన్లు, యూనియన్లు, రాజకీయ పార్టీలు (అవి కూడా అసోషియేషన్లేగా), లాంటి చోట్ల కూడా ఉన్నాయి అని విన్నాను. ఏదైనా అసోషియేషన్లో గానీ యూనియన్లో గానీ అలా జరగట్లేదంటే, అది చాలా గొప్పగా చెప్పుకోవలసిన విషయం.

One thought on “మన యూనియన్లు, అసోషియేషన్లు

  1. Excellent. Many of us just ignore the Union Fee may be it is substantially small amount. But, the membership must be by choice and the same for withdrawal or even recalling the elected union members. Well presented and hope some one should bell the cat. 👍

    Like

Leave a comment