ఆఫీసుల్లోని ముచ్చట్లు, అగచాట్లు

ఆఫీసు (office) అంటే, చిన్నో పెద్దో ఒక కార్యాలయము (office), ఆ ఆఫీసుకి నిత్యకృత్యంగా కేటాయించబడిన కొన్ని విధులు (duties), కొన్ని అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి చేయవలసి వచ్చే విధులు, ఇవన్నీ నిర్వర్తించడానికి వేరు వేరు స్థాయిలలో (levels) నియమించబడిన సిబ్బంది (staff), వాళ్ళ జీతాలకి ఇతర ఖర్చులకి ఒక బడ్జెట్టు (budget), ఆ ఆఫీసు వారు అందించే ప్రజా సేవలు, వాటిల్లో అసంతృప్తి తాలూకు ఫిర్యాదులు (complaints), వాటిని దూరం చేసే మార్గాలు, ఇవన్నీ నిర్వహించడానికి ఉండే పెత్తందారు (manager) లేక ఆఫీసరు (officer), ఆ ఆఫీసుకి ఇతర ఆఫీసులతోను హెడ్డాఫీసుతో (Head Office) ఉండే సంబంధాలు, వ్రాతపోతలు (communications), అన్న మాట. మనలో చాలా మంది ఆఫీసుల్లో పనిఁ జేసి ఉంటారు. రకరకాల పరిస్థితులను మనం చూసి ఉంటాము. లేకపోతే వాటి గురించి ఆనోట ఆనోట విని ఉంటాము. వాటిని సింహావలోకనం చేస్తే చాలా విషయాలు మనకి తెలుస్తాయని, అందులో కొద్దో గొప్పో హాస్యం (humour) కూడా ఉంటుందని నా అభిప్రాయం.

మొదట అధికారులతోనే మొదలు పెడదాం. ఒక అధికారికి అవలక్షణాలు (vices) ఉంటే జరిగేదేమంటే వచ్చే జీతం (salary) చాలదు కనుక వేరే మార్గాలు వెతుక్కోవడం. ఒకాయన పేకాటలోనో, గుర్రపు పందేలలోనో, వచ్చిన జీతం మొదటి వారంలోనే పాడించేసేవాడు. తరువాత ఏం చెయ్యాలి. ఆయన, ఊళ్ళోనే ఉన్న పిల్ల నిచ్చిన మామ గారి మీద వాలి పోయేవాడు. ప్రతి నెలా ఇదే చేసేవాడు. అల్లుడు రోజూ ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడని అమ్మాయి చెప్పడం వల్ల, ఆ మామగారు ఆ అల్లుడిని నిలదీస్తే అతను చెప్పిన సమాధానం ఏమిటంటే, మా పైఆఫీసరు ఒక శాడిస్ట్ (sadist) అండీ, రోజూ ఏదో ఒక పని చెప్పి ఆఫీసు పని గంటలు (working hours) అయిపోయిన తరువాత కూచోబెట్టేస్తాడు అని. సరే, ప్రతి నెల అల్లుడి సంసారానికి కూడా పెట్టడానికి డబ్బు క్షవరం ఎలాగూ అవుతోంది, కనీసం అల్లుడు ఇంటికి ఆలస్యంగా రావలసి రావడమన్నా తగ్గించడానికి కుదురుతుందేమో చూద్దామని, ఆ మామగారు తిన్నగా అల్లుడి ఆఫీసుకి వెళ్ళి అక్కడి ఆ పైఆఫీసరుని నిలదీశాడు. అప్పుడు ఆ ఆఫీసరు అన్నదేమిటంటే, ఏమండీ, పని గంటల తరువాత నేనే ఆఫీసులో కూచోను, మా సిబ్బందిని ఎందుకు ఉండమంటానండీ అని. అప్పుడు వాకబు చేస్తే, ఆ మామగారికి అల్లుడి ఇతర కార్యకలాపాలు, లీలలు అర్థమయ్యాయి.  ఇంకో ఆయన, ఇలాగే మామగారి మీద ఆధారపడ్డాడు. కాకపోతే, ఆ మామగారు వేరే ఉళ్ళో ఉండేవాడు. అయినా, మనవాడు వదిలేవాడేమిటి. ప్రతినెలా, ఆ ఊరికి టాక్సీ (taxi) బుక్ (book) చేసుకొని వెళ్ళి మామగారి దగ్గర నెలసరి ఖర్చులకే కాకుండా రాను పోను టాక్సీ ఛార్జీలు (charges) కూడా వసూలు చేసేవాడు.

మరో పెద్ద మనిషేమో, మామగారి జోలికి బంధువుల జోలికి వెళ్ళడ మెందుకు, ఎంచక్కా మన చేతిలో సిబ్బందిని (staff) బదిలీ (transfer) చేసే అధికారం (power) ఉండగా, అని అనుకునేవాడు. ప్రతి నెలా మొదటి వారంలో వచ్చిన జీతం అయిపోయేది కాబట్టి, రెండవ వారం మొదట్లోనే ఒక పెద్ద బదిలీ ఉత్తర్వు (transfer order) జారీ చేసేవాడు. అందులో, సుమారుగా రెండు వందల మంది సిబ్బంది  పేర్లు ఉండేవి. అది ఎంత తెలివిగా చేసే వాడంటే, ఒక మారుమూల ప్రదేశం నుండి మరో మారుమూల ప్రదేశానికీ, అక్కడి వాళ్ళ నిక్కడికీ, ఇక్కడి వాళ్ళ నక్కడికీ, అలా బదిలీ చేసేవాడు. ఉదాహరణకి హైదరాబాదు వాళ్ళని ఇచ్ఛాపురం, ఇచ్ఛాపురం వాళ్ళని హైదరాబాదు బదిలీ చేసేవాడు. ఇంకేముంది, సిబ్బంది ఆందోళనతో ఆఫీసరు గారి ఇంటి దగ్గర ఆ వారాంతంలో (week end) ఆదివారం నాడు క్యూ (queue) కట్టేవారు. సరే, అప్పుడు అక్కడ జరగాల్సినవి (పత్రం, పుష్పం, ఫలం, తోయం వగైరా) జరిగిన తరువాత మర్నాడు సోమవారం ఆఫీసుకు వచ్చి ఆయన ఆ బదిలీలు అన్నీ రద్దు (cancel) చేస్తూ ఒక ఏకవాక్య ఆర్డరు (single line order) జారీ చేసేవాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆఖరికి ఒక్క బదిలీ కూడా అయ్యేది కాదు. డబ్బులు కావలసి నప్పుడల్లా ఇదే మంత్రం వేసేవాడు.

ఇంకో ఆయన, ఎంతసేపూ అవసర మున్నా లేకపోయినా ఆఫీసుకి ఏం కొనుగోలు (procurement) చెయ్యాలా లేక ఆఫీసుకి సంబంధించిన పని ఏది కాంట్రాక్టుకి (contract) ఇవ్వాలా అని అలోచించేవాడు. కొనుగోళ్ళు, కాంట్రాక్టులు ఉంటే కమీషన్లు (commissions) ఉంటాయి కదా. ఆయన మీద ఫిర్యాదు (complaints) లొచ్చి, ఆయన్ని బదిలీ చేసినా కూడా వెళ్ళిన చోటల్లా అదే పని చేసేవాడు, వెనుకటి గుణ మేల మాను కదరా సుమతీ అన్నట్లుగా. ఒక్కోసారి అన్ని రకాల కొనుగోళ్లు, కాంట్రాక్టులు చేసేసిన తరువాత, ఇంకా ఏమీ ఐడియాలు (ideas) మిగలక పోతే, సిబ్బంది రోజూ కూర్చునే కుర్చీలు టేబుళ్ళ మీద ఆయన దృష్టి పడేది. సిబ్బందితో చాలా జాలిగా మాట్లాడి, మొసలి కన్నీళ్ళు కార్చి, అయ్యో ఇంత చెత్త కుర్చీలలో మీరు రోజూ కూచుంటున్నారా, నేను మొత్తం మార్చేస్తానని, అదేదో ఎడ్వర్టైస్మెంట్ (advertisement) లో చెప్పినట్లు ‘రాం లక్ష్మణ్ ఫార్ములా (formula)’, అంటే ‘సారా బదల్ డాలూంగా’,  అని శపథం చేసేవాడు. ఆహా! ఆఫీసరు గారికి మన మీద ఎంత శ్రద్ధో అని సిబ్బంది కూడా చాలా సంతోషించేవారు.

మామూలుగా ఆఫీసుల్లో ప్రమోషన్లు (promotions) అంటే గుళ్ళో క్యూ (queue) లాంటిది. మెరిట్ (merit), పెర్ఫార్మెన్స్ (performance) అంటారు గానీ, పని చేసినా చెయ్యకపోయినా ఇంచుమించుగా అందరికీ ప్రమోషన్ వస్తుంది. సీనియారిటీ కం మెరిట్ (seniority cum merit) ప్రకారం ప్రమోషన్లు వస్తాయి కాబట్టి క్యూలో క్రింద ఉన్న వాళ్ళు పైన ఉన్న వాళ్ళని ఇంకా పైకి నెడతారు. అన్ని కేసుల్లో అలా జరుగుతుందని అనను కానీ, కొన్ని కేసుల్లో అనుమానాస్పదమైన అర్హత ఉన్న వాళ్ళు పై పొజిషన్ల (positions) లోకి వస్తారు. అలా ఆఫీసర్లు అయిన వాళ్ళ అవస్థలు ఎలా ఉంటాయో చూద్దాము.

తమ ఆఫీసుల్లో ఎక్కువగా పై నుండి వచ్చే కాగితము / ఫైలు (file) క్రిందికి, క్రింది నుండి వచ్చే కాగితము / ఫైలు పైకి ఒక చిన్న దస్కతు (signature) చేసి తోసెయ్యడం వీళ్ళ పని. దీనినే “gate keeping function” అంటారు. అంటే, వీళ్ళ contribution ఏమీ ఉండదన్న మాట. దీనికి పెద్ద తెలివి అక్కర లేదు. అధికారం ఉంది కాబట్టి అడిగే వాడు కూడా ఉండడు. ఏవయినా, మీటింగులు (meetings), కాన్ఫరెన్సులలో (conferences) పాల్గొనాల్సి వస్తే మాత్రం శిష్య కాళిదాసు ఫార్ములా (formula) ఉపయోగిస్తారు. అదేమిటో చూద్దాం.

ఆ రోజుల్లో దయామయుడైన భోజ మహారాజు దగ్గర సాయం కోరే వారి తాకిడి ఎక్కువయ్యి కోశాగారము (treasury) ఖాళీ అయిపోతోందిట. అప్పుడు, ఈ సమస్యని పరిష్కరించడానికి రాజదర్శనం మీద ఆంక్షలు (restrictions) పెట్టారు, ఎందుకంటే తీరా ఎవరన్నా వస్తే రాజుగారు వట్టి చేతులతో పంపేవాడు కాదని తెలుసు కాబట్టి. అట్టి గడ్డు (critical) పరిస్థితుల్లో ఒక పేద బ్రాహ్మణుడు రాజదర్శనం కోసం వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని పని జరగక నిరాశ చెంది, ఎవరో సలహా ఇస్తే చివరకు మహా కవి కాళిదాసును కలుస్తాడు. కాళిదాసు కూడా దయామయుడు కాబట్టి, ఆ పేదవాడికి ఏదో విధంగా రాజదర్శనం ఇప్పిద్దామని అనుకొని, పండితుడి గెటప్ (getup) లో రాజుగారి దగ్గరకు తీసుకెళ్తాడు. అయితే, కాళిదాసు ఒక నిబంధన (condition) పెడతాడు, ఆ పేద బ్రాహ్మణుడికి. ఏమని అంటే, రాజు గారు ఏమి అడిగినా, ఇదేముంది, చాలా చిన్న విషయం, దీనికి సమాధానం నా శిష్యుడు కాళిదాసు చెబుతాడు, అని చెప్పాలి, ఎట్టి పరిస్థితుల్లోను ఇంకో విధంగా మాట్లాడ కూడదు, అని. మొత్తానికి, రాజాస్థానానికి కాళిదాసు ఆ పేద బ్రాహ్మణుణ్ణి పండితుడి తలపాగాలో దర్జా తగ్గకుండా తీసుకెళతాడు. ఈయన, మా గురువు గారండీ అని రాజు గారికి పరిచయం చేస్తాడు. సరే, రాజుగారికి కాళిదాసు అంటేనే ఆరాధ్య భావం. అలాంటిది, ఆయన గురువు గారు వచ్చారు అంటే, మర్యాదలు మామూలుగా ఉంటాయా. అన్ని విధాల ఆ పేద బ్రాహ్మణుణ్ణి గౌరవించి, ఇక సాహిత్యాభిలాష ఉన్నవాడు కాబట్టి కుతూహలము ఆపుకోలేక కొన్ని సమస్యా పూరణాలు, సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు సంధిస్తాడు, భోజ మహారాజు. ఆ బ్రాహ్మణుడు ముందు అనుకున్నట్లుగా ప్రతిసారి, ఇదా! మా శిష్యుడు కాళిదాసు చెబుతాడు, అని అనడం, వెంటనే కాళిదాసు అందుకుని సమాధానం చెప్పడం జరిగింది. మొత్తానికి, నాటకం బాగా రక్తి కట్టడం వల్ల, బ్రాహ్మణునికి సంభావన బాగానే ముట్టింది.

ఈ కాళిదాసు ట్రిక్కు (trick) మీటింగుల లోను, కాన్ఫరెన్సుల లోను చాలా మంది ఉపయోగించడం మనం చూసే ఉంటాము. అక్కడ చైర్పర్సన్ (chairperson) కి దగ్గరగానో ఎదురుగానో కూచుని ఆ డిస్కస్ (discuss) చెయ్యబోయే సబ్జెక్ట్ మీద ఎక్కువ అవగాహన ఉన్నవాణ్ణి తమతో తీసుకెళ్ళి తమ వెనకాల కూచో పెట్టుకుంటారు, కొంత మంది ఆఫీసర్లు. ఏదైనా ప్రశ్నకి సమాధానం చెప్పవలసి వస్తే, మెల్లగా శరీరాన్ని కొంచెం, మెడని సాంతం, వెనక్కి తిప్పి ఆ వెనకాల కూచున్న వాడి వంక చూస్తారు, అతన్ని మాట్లాడమన్నట్లుగా. ఈ విషయం మీద మేము చాలా లోతుగా పరిశీలించామండి, వివరాలు మా అసిస్టెంట్ (Assistant) చెబుతాడు, అని ఒక ఎనౌన్స్మెంట్ (announcement) ఇస్తారు. ఆ తరువాత, ఆ శిష్య కాళిదాసు సమాధానం చెబుతాడు.

కొంత మంది ఆఫీసర్లు డ్రాఫ్టింగ్ నైపుణ్యం (drafting skill) లేకపోతేనో, తప్పు చేసిన వారిని శిక్షించే పద్ధతులు (disciplinary procedures) తెలియక పోతేనో, వారు తమ క్రింద పనిచేసే వారి మీద ఎక్కువ ఆధారపడతారు. వాళ్ళతో గొడవ ఎందుకని చాలా చాకచక్యంగా మాట్లాడతారు. దానికి మేనేజిమెంటు (management) అని పేరు పెడతారు. ఏదో విధంగా పబ్బం గడుపుకోడానికి ఏమేం చెయ్యాలో అన్నీ చేస్తారు. ఇందులో కొంచెం అతి తెలివి కలవాళ్ళున్నారు. వాళ్ళేమి చేసేవాళ్ళో కొంచెం వివరంగా చూద్దాం.

ఒక ఆఫీసులో దాని హెడ్ (Head) తన సిబ్బందిలో కొన్ని సౌండ్ పార్టీలని (sound parties), కాస్త మెతకగా ఉండే వాళ్ళని పట్టుకొని ఏదో వంకతో వాళ్లకు ఛార్జిషీటు (chargesheet) ఇచ్చేవాడు. ఆ ఛార్జిషీటు తయారు చెయ్యడం ఆయనకి రాదు కాబట్టి ఊళ్ళో ఒక లాయరును (lawyer) దీని కోసం పట్టుకున్నాడు. ఇక, అక్కడ నుంచి ప్రతి స్టేజ్ (stage) లోనూ కథ (story), స్క్రీన్ ప్లే (screen play), దర్శకత్వం (direction), మాటలు అన్నీ ఆ లాయరువే. ఎట్లా అంటే, ఆ ఛార్జిలు (charges) ఒప్పుకోబడక పోవడం, ఇంక్వైరీ (inquiry) జరిపించబడడం, మన హెడ్ గారికి కావలసిన వాడు ఇంక్వైరీ ఆఫీసరుగా (Inquiry Officer) నియుక్తుడవడం, నిందితుడి తరఫున వాదించడానికి డిఫెన్స్ అసిస్టెంట్ (Defence Assistant) కుడా హెడ్ గారి మనిషి కావడం, ఆ తరువాత రెండు వేపుల వాదోపవాదాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, రిపోర్టులు లాయరు గారు తయారు చేయగా, హెడ్ గారి ఆమోదంతో ఆ సంబంధిత పార్టీలు సమర్పించడం, అంతా ఆ లాయరే జరిపించేవాడు. ఆఖరిలో, డిసిప్లినరీ అధారిటీ (Disciplinary Authority) ఇవ్వాల్సిన ఆర్డరు (order) కూడా ఆ లాయరే తయారు చెయ్యడం జరిగేది. వెనకటికి ఎవరో తోచక, పేక ముక్కలు ఇద్దరికి పంచి రెండు వేపులా తనే ఆడేవాడట. అలాగే, ఆ లాయరున్నూ హెడ్ గారు రెండు వేపులా తామే ఆడేవారు. ఈ ఆటలో అడుగడుగునా మూల్యం ముట్టేది ఇద్దరికీ.

ఇక సిబ్బంది విషయానికి వస్తే, పేరెటో సూత్రం (Pareto law) మన ఆఫీసులలో కూడా వర్తిస్తుంది. అసలిది వర్తించనిది ఎక్కడ అని నాకు అప్పుడప్పుడు సందేహం వస్తూ ఉంటుంది. అదివరకు ఎప్పుడో విన్నాను, భౌతిక శాస్త్రంలో ఇన్వర్స్ స్క్వేర్ లా (Inverse Square Law) అని ప్రతి శాఖ (branch) లోనూ చెల్లేది (valid) ఒకటి ఉంది అని. అంటే, మెకానిక్స్ (Mechanics), మేగ్నటిజం (Magnetism), ఎలెక్ట్రిసిటీ (Electricity), సౌండు (Sound), లైటు (Light), హీటు (Heat) – ఇలా అన్ని శాఖలలోనూ ఇది చెల్లుతుంది, అని. అలా ఎందుకుందో పరిశోధించి కనుక్కోవాలని ఐన్ స్టీన్ (Einstein) గారు అనుకున్నారట. కానీ, ఆ కోరిక తీరకుండానే వారు పరమపదించారు. ఈ పేరెటో సూత్రం కూడా బహుశా ఆ కోవకి చెందినదే.  సరే, అసలు విషయాని కొస్తే, పేరెటో సూత్రంలో చెప్పినట్లుగా, ఆఫీసు తాలూకు 90 శాతం పనులు 10 శాతం సిబ్బంది చేస్తారు. మిగిలిన 10 శాతం పనులు 90 శాతం సిబ్బంది చేస్తారు. అంకెలు కొంచెం అటూ యిటూ ఉన్నా మొత్తానికి సమతూకం లేనట్లుగానే (lopsided) ఉండడమనేదే పేరెటో సూత్రంలోని కీలకమైన అంశం. అలా ఎందుకని అంటే, పని చెయ్యడం వచ్చిన వాళ్ళకే ఎక్కువ పని ఇస్తూ ఉండడం వల్ల. దక్షత, సమర్థత (efficiency) అన్నవి చెల్లించుకోవాల్సిన మూల్యం ఇదే.

తక్కువ పని చేసే ఎక్కువ శాతం సిబ్బందికి కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. ఏమంటే, వాళ్ళ టేబుల్స్ ఎప్పుడూ శుభ్రంగా ఉంటాయి. పరిసరాలు చాలా శుభ్రంగా ఉంచుకుంటారు. అఫీసు టైములో కూడా ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు, వాకింగ్ చెయ్యడాలు, ఎండలో నిలబడడాలు, వేళకి మంచి ఆహారం తీసుకోవడాలు, లాంటివి. యాన్యువల్ రిపోర్ట్ (Annual Report) వ్రాసేటప్పుడు తమని గురించి తాము వ్రాసుకునేది కూడా ఉంటుంది కదా. అప్పుడు, నిజంగా పని చేసే వాళ్ళకి సమయం ఉండదు కాబట్టి వాళ్ళది సరిగ్గా వ్రాయరు. పైగా వాళ్ళకి ఎంతసేపు ఇంకా చెయ్యాల్సిన పనుల మీద ఆరాటమే కాని చేసేసిన పనుల వివరాల గురించి డప్పు వాయించుకోవాలని ఉండదు. కానీ, మన పని తక్కువ ఉన్న మేధావులు మాత్రం ఆఫీసు భారమే కాదు, భూభారమే తాము మోస్తున్నట్లు ఆ సెల్ఫ్ ఎప్రైసల్ (self appraisal) లో వ్రాస్తారు. ఆఫీసు వారు ఇచ్చే వసతులు ఏ ఏ సమయాల్లో క్లైము (claim) చెయ్యాలో ఆయా సమయాల్లో క్రమం తప్పకుండా చేసే వాళ్ళు కూడా వీళ్ళే. ఎక్కువ మంది ఆఫీసర్లకి వీళ్ళంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది, ఎందుకంటే, అవునంటే అవును కాదంటే కాదు అనే సైకోఫాంట్లు (sychofants), భట్రాజులు వీళ్ళలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి.

పేరెటో సూత్రం ఇంకెన్ని విధాలుగా పనిచేస్తుందో చూద్దాం. సిబ్బంది తాలూకు అసోషియేషన్లతో సంప్రదింపులు అప్పుడప్పుడు జరిపి వాళ్ళకున్న ఇబ్బందులు తీర్చడమనేది ప్రతి ఆఫీసుకి ప్రతి మూడు నెలలకో ఆరు నెలలకో చెయ్యాల్సిన ఒక విధాయకము. సిబ్బంది వేపు నుండి వాళ్ళ నాయకులు ఒక డిమాండ్ల లిస్టు (list of demands) పంపేవారు. అందులో, అసలైనవి ఒక 10 శాతం కన్నా ఎక్కువ ఉండేవి కావు. మిగిలినవి అన్నీ చిన్న చిన్నవి, ఆఫీసు మేనేజిమెంట్ (office management) ఒప్పుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది లేనివి. అందులో కొన్ని ఎలాగూ చేస్తారని ముందే తెలుసుకుని ఆ నాయకులు తమ లిస్టులో చేర్చేవారు. ఎందుకంటే, తీరా చేసిన తరువాత, తమ నాయకత్వ ప్రతిభ వల్లే అవి చేకూరినాయి అని చెప్పుకోవడానికి. సరే, అసలు విషయాని కొస్తే, మిగిలిన 10 శాతం అసలైన డిమాండ్లు ఏళ్ళ తరబడి పెండింగ్ లో ఉండేవి. తీర్చబడిన 90 శాతం డిమాండ్ల స్థానంలో వేరే డిమాండ్లు ఎప్పటికప్పుడు చేరుతూ ఉండేవి కానీ ఆ మిగిలిన 10 శాతం అలాగే స్థిరంగా ఉండేవి. మరి, పేరెటో సూత్రమా మజాకానా.

ఆఫీసుల్లో ఎప్పుడన్నా కాన్ఫరెన్సులు (conferences) గానీ పెద్ద పెద్ద మీటింగులు (meetings) గానీ పెడితే చాలా మంది ఆఫీసర్లకి సిబ్బందికి పండగే. ఎందుకంటే, 10 శాతం మంది జరగాల్సింది అంతా చూసుకుంటారు, మిగిలిన వాళ్ళు పని చెయ్యక్కర లేదు, ఊరికే సత్యనారాయణ వ్రతం కథ లాగా విని మధ్యలో అప్పుడప్పుడు చప్పట్లు కొట్టడమే. వాటిల్లో, ప్రత్యేక ఆకర్షణ మధ్యాహ్న భోజనం, రెండు మాట్లు హైటీ (High Tea). ఎంత సుఖమో. ఒక సారి హెడ్ ఆఫీసు నుండి ఫీల్డ్ ఆఫీసులకు కొన్ని పనులు చేయడానికి నిథులు ఇస్తూ ఒక కార్యాచరణ పథకం (action plan) కూడా ఇచ్చారు. మొదటి రెండు నెలల తరువాత వాళ్ళు చేసిందేమిటో కనుక్కుంటే తెలిసినదేమిటంటే, అందరూ కాన్ఫరెన్స్ జరిపి అందుకు బుక్ చేసిన హాలు (Hall) కోసం ఆతిథ్యం కోసం (hospitality) చేసిన ఖర్చులు progress గా చూపెట్టారు. వరల్డ్ బ్యాంకు (World Bank) ప్రాజెక్టులలో జరిగేది కూడా కొన్ని సార్లు ఇలాగే ఉంటుంది. ఎందుకంటే, ఇవ్వబడిన కార్యాచరణ పథకంలో అందరికీ బాగా మరియు తేలికగా అర్థమయ్యే పని ఇదే కాబట్టి. కార్యాచరణ పథకాలో ఇట్లాంటివి చిన్నాచితకా 90 శాతం ఉంటాయి. అవి గబగబా చేసేస్తారు. మిగతా వాటి సంగతి మామూలే.

ఆఫీసర్లకి ట్రైనింగ్ (training) లో కొన్ని టిప్సు (tips) చెబుతారు. వాటిల్లో ముఖ్యమైనది ఏమిటంటే, సిబ్బందిని ఎప్పుడూ ఉత్సాహపరుస్తూ (motivate) ఉండాలని. అది తు.చ. తప్పకుండా పాటించే ఒక ఆఫీసరు సిబ్బందిలో ఒకడి పని చూసి చాలా సంతోషించి దేవుడి లాగా వర మివ్వదలచి నీకు ఏదన్నా మేలు చేకూర్చేది నా చేతుల్లో ఉంటే చేద్దామనుకుంటున్నాను, అదేదో నువ్వే చెప్పు అన్నాడట. దానికి సమాధానంగా అతను, సార్, నన్ను పదిహేనేళ్ళ పాటు సస్పెండ్ (suspend) చేయండి, అదే మీరు నాకు చేసే మేలు అన్నాడట. రామాయణంలో కుక్క తనను అకారణంగా కొట్టిన ఒక వ్యక్తికి వేయవలసిన శిక్ష గురించి చెప్పిన మీదట రాముడు ఆశ్చర్య పోయినట్లుగా ఆశ్చర్యపోయిన ఆ ఆఫీసరు దేమి వింత కోరిక, కాస్త విడమరచి చెప్పు, అన్నాడట. ఆ కోరికకు ఆధారమైన ఉదంతం ఆ ఉద్యోగి ఇలా చెప్పాడు.

మీకు జ్ఞాపకం ఉందా, మన ఆఫీసులో పనిచేసే ఒకతన్ని దుష్ప్రవర్తనకి (misbehaviour) అంటూ 15 సంవత్సరాల క్రితం సస్పెండ్ (suspend) చేశారు. రూల్స్ (rules) ప్రకారం మొదటి ఆరు నెలలు సగం జీతం, ఆ తరువాత పూర్తి జీతం ఇస్తూ వస్తున్నాము. అతనికి ఛార్జిషీటు (chargesheet) ఇచ్చాము, అందులో ఇవ్వబడిన నిందారోపణలు (charges) అన్నీ అతను తిరస్కరించాడు. రూల్స్ ప్రకారం ఒక ఇంక్వయిరీ ఆఫీసరును (Inquiry Officer), ఒక ప్రెజెంటింగ్ ఆఫీసరును (Presenting Officer) వేశాము. ఆ తరువాత ఇంక్వయిరీ జరిగితే కద. ఇంక్వయిరీ ఆఫీసరు ముందే నోటీసు (advance notice) ఇచ్చి ఇంక్వయిరీ తేదీ నిర్ణయించిన ప్రతిసారీ ఆ ఉద్యోగికో, అతని డిఫెన్స్ అసిస్టెంట్ (Defence Assistant) కో ఏదో ఒక జబ్బు వచ్చిందని ఆధారాలతో (డాక్టర్ సర్టిఫికెట్ తో) వాయిదా (postponement) అడిగేవారు. ఆ విధంగా, 15 ఏళ్ళు గడిచాయి. ఆ 15 ఏళ్ళలో చాలా మంది ఇంక్వయిరీ ఆఫీసర్లు, చాలా మంది ప్రెజెంటింగ్ ఆఫీసర్లు మారారు. వాళ్ళలో ఒక ప్రెజెంటింగ్ ఆఫీసరు అప్పుడున్న ఇంక్వయిరీ ఆఫీసరు దగ్గరకు వెళ్ళి, ఏమండీ వాడికన్నా సిగ్గుండాలి, మనకన్నా సిగ్గుండాలి, ఈ విధంగా ఇంక్వయిరీ జరగకుండా చేస్తుంటే మీరు ఎన్నాళ్ళని ఊరుకుంటారు, అని అడిగాడట. ఏం చెయ్య మంటారో మీరే చెప్పండి అని ఆ ఇంక్వయిరీ ఆఫీసరు అంటే, ఆ ప్రెజెంటింగ్ ఆఫీసరు ఒక సలహా ఇచ్చాడట. ఏమనంటే, ఒకే నోటీసు ఇవ్వండి, రోజూ సాయంత్రం 3 గం. లకు ఈ కేసులో ఇంక్వయిరీ ఉంటుందని. ఎన్నాళ్లకని డాక్టర్ ధృవపత్రం (certificate) తెచ్చి వాయిదాలు అడుగుతాడో చూద్దాం అని. అడిగి చెబుతానన్న ఇంక్వయిరీ ఆఫీసరు మళ్ళీ ఆ విషయం జోలికి పోలేదు. ఆ నేరం ఆరోపించబడ్డ ఉద్యోగి 15 ఏళ్ళుగా సస్పెన్షన్లో ఉంటూ, పూర్తి జీతం, గవర్నమెంట్ క్వార్టరు, ఇతర సదుపాయాలు అనుభవిస్తూ, హాయిగా మరో ఉద్యోగం చేస్తున్నాడని అందరికీ తెలుసు. అడిగేవాడు లేడు. చక్కగా రెండావుల పాడి అనుభవిస్తున్న ఆ ఉద్యోగికి దక్కిన ఆ దివ్య జీవితం నాకు కూడా ప్రసాదించండి అని ఈ ఉదంతం చెప్పిన ఉద్యోగి తన ఆఫీసరును అడిగాడు. జరిగిన దానికి తాను బాధ్యుడు కాకపోయినా ఆ ఆఫీసరు సిగ్గుతో తలవంచుకున్నాడు.

ఆఫీసర్లకి సిబ్బందికి కూడా వినోదం కలిగించేవి, ఇబ్బంది కలిగించే పరిస్థితులు అప్పుడప్పుడూ వస్తాయి. ఒక ఆఫీసులో వివిధ శాఖలు లేక సెక్షన్లు (Sections) ఉంటాయి. వేరే ఆఫీసులతో ఉత్తర ప్రత్యుత్తరాలు (communications) ఉంటాయి. ఒక ఆఫీసు ఒక గవర్నమెంటుకు సంబంధించినది, ఇంకో ఆఫీసు ఇంకో గవర్నమెంటుకు సంబంధించినది అయితే ఆ గవర్నమంట్లు వేరేవేరే రాజకీయ పార్టీలకి చెందినవయితే, చెప్పుకోవడానికి వింతలు బోళ్ళు జరుగుతాయి. ఒక సారి ఏమయిందంటే, ఒక హిందీ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి హిందీలో ఉత్తరం వ్రాశాడట, మరొక దక్షిణాది ముఖ్యమంత్రికి. ఆ ఆఫీసులో అందరూ అనుకున్నదేమంటే ఆ ఉత్తరంలో విషయం చాలా ముఖ్యమైనదైనా దానికి ఎప్పటికీ జవాబు రాదని. కానీ, జవాబు వచ్చింది, ఆ దక్షిణాది రాష్ట్రభాషలో.

మాకు ఒక ఆఫీసరు మాటిమాటికి చెప్పేవారు. మనం వ్రాసిన ఉత్తరం (letter) గానీ ఫైల్ నోట్ (file note) గానీ మన ఎదురుగా లేని వాళ్ళ చేత, ముఖ్యంగా మనకి దూరంగా వేరే చోట ఉన్నవాళ్ళతో చదివించ గలగడం ఒక కళ (art) అని. అది నేను పనిచేసి నన్నాళ్ళు నాకు జ్ఞాపకం ఉంది. ఇప్పుడు ఈ వ్యాసం వ్రాస్తున్నప్పుడు కూడా మీ చేత దాన్ని చదివించడం ఎలా అన్న టెన్షన్ (tension) నా మనస్సులో ఉంది, మాటి మాటికి ఆయన మాటలు గుర్తు కొచ్చి. అలాంటి ఆఫీసర్ని ఒక సారి అందరం కలిసి, ఆయనతో ఒక ఆవేదన పంచుకున్నాము. ఏమిటంటే, ఫైనాన్స్ సెక్షను (Finance Section) వాళ్ళు వేసే క్వెర్రీలు (querries) చాలా ఇబ్బందిగా ఉన్నాయని. ఆయన అందరు చెప్పింది చాలా ఓపికగా విన్నాడు. ఒక గొప్ప సలహా ఇచ్చాడు. ఏమిటంటే, ఫైనాన్స్ సెక్షనుకు ఏదన్నా ఫైల్ పంపేటప్పుడు, మీరు వ్రాసే నోటులో ఒకటి రెండు తప్పులు కావాలని (deliberately) చెయ్యండి. వాళ్ళు అవి వెంటనే ఎత్తి చూపిస్తారు. మీకు తెలిసినవే కాబట్టి మీరు వెంటనే సమాధానాలు ఇస్తారు. అప్పుడు వాళ్ళ ఇగో (ego) సంతృప్తి చెంది మీ ఫైళ్ళు క్లియర్ (clear) అవుతాయి అని. అదేమిటండీ, ఇదంతా టైం వేస్ట్ (time waste) కదా అని అంటే, ఆయన చెప్పినదేమంటే, మరి గెలవాలంటే లౌక్యం ఉండాలని. ఇంకొంచెం విడమరచి ఇలా చెప్పారు. చూడండి, మరి మీరు ప్రస్తావనల (proposals) నోటు (note) అంతా సరిగ్గా వ్రాసి పంపినంత మాత్రాన, అది వెంటనే వాళ్ళు ఎలా అప్రువ్ (approve) చేస్తారు. వాళ్ళు మాత్రం ఉద్యోగం చెయ్యడం లేదా. ఉత్త సంతకం పెట్టి అప్రువ్ చేసి పంపితే వాళ్ళ ఉనికిని (existence) వాళ్ళు ఎట్లా సమర్థించుకోవడం (establish). మీరు నోటు అంతా సరిగ్గా వ్రాస్తే, వాళ్ళకి ఏమి క్వెర్రీ వెయ్యాలో చాలా రీసెర్చ్ (research) చెయ్యాల్సి వస్తుంది. ఒక్కోసారి ఆ విసుగులో వాళ్ళు వింత వింత ప్రశ్నలు క్వెర్రీల రూపంలో వేస్తారు. ఉదాహరణకి, ఈ సబ్జెక్టు మీరే ఎందుకు హాండిల్ (handle) చేస్తున్నారు. ఎవరు చెప్పారు మీకు చెయ్యమని. ఈ పని గవర్నమెంటు (government) లోనే ఎందుకు జరగాలి. ప్రైవేట్ (private) గా ఎందుకు జరగకూడదు. ఇలాంటివి. ఇవి యక్ష ప్రశ్నల కన్నా కఠిన మైనవి. ఈ ప్రశ్నలకి రిటైరు (retire) అయ్యే లోపు మీరు సమాధానాలు చెప్పలేరు. ఇదేమిటి, రామాయణం అంతా విని సీత రాముడికి ఏమవుతుంది అన్నట్లుగా క్వెర్రీలు వేస్తారేమిటి అని మీరు పోట్లాడినా లాభం లేదు, అని ఆయన తేల్చి చెప్పాడు. ఆ ఆఫీసరు గారు చెప్పినట్లే, తర్వాత నుండి చేయడం మొదలు పెట్టాము. అంతా, ఏ అడ్డంకు లేకుండా సవ్యంగా సాగింది. అలా ఆయన చెప్పిన విజయ రహస్యం బాగా పనిచేసింది.

కొన్ని ఆఫీసుల్లో వ్యాజ్యగాళ్ళు (litigants) ఉంటారు. వాళ్ళు ఏదో విధంగా ఆఫీసర్లతో పేచీ (dispute) పెట్టుకుని ఇతర సిబ్బందిని కూడా ఆ త్రోవలో నడవమని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఒక సారి ఏం జరిగిందంటే, ఒకాయన ఏ పని చెయ్యకుండా ఊరికే కూచుని ఉన్నాడట. బాసు (Boss) చూసి ఇదేమిటి, పని చెప్పాను కదా, చెయ్యట్లేదేమిటి అని అడిగాడట. అప్పుడు అతను నాకు ఆఫీసు వారు స్టేషనరీ (stationery) ఇవ్వలేదు అన్నాట్ట, చేపల కథలో లాగా. దాందేముంది, ఇండెంట్ (indent) పెడితే ఇస్తారుగా అని బాసు అడిగితే, ఎలా పెట్టను, దానికి కూడా స్టేషనరీ కావాలిగా అని జవాబు చెప్పాడట. అలాంటి వాడి చేత పనిచేయించడం ఎలాగో చెప్పండి.

ఒక అఫీసులో ఒక వ్యాజ్యగాడు (litigant) ఉండేవాడు. అతనొక లా గ్రాడ్యుయేట్ (Law Graduate). అంటే, అసలే కోతి, పైగా కల్లు తాగింది అని అర్థం. అతని వల్ల జరిగిన ఆఫీసు వాతావరణ కాలుష్యం అంతా ఇంతా కాదు. అతను పనిచేసే ఆఫీసులోనే కాక చుట్టుపక్కల ఆఫీసుల్లో కూడా అతని కీర్తి పాకింది. ఉద్యోగుల్లో పని దొంగలు, మోసగాళ్ళు, నిందలు మోపబడ్డ వాళ్ళు ఆ వ్యాజ్యగాడిని ఆశ్రయించే వారు. ఎవరైనా తన దగ్గరకి రావడానికి మొహమాటపడితేనో వద్దనుకుంటేనో తానే వాళ్ళ దగ్గరకి వెళ్ళి లాక్కొచ్చే వాడు. తన వద్ద కేసులు తగ్గి పోయినప్పుడు, ఎక్కడన్నా నలుగురు చేరి మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మధ్యలో దూరి ఉత్సాహ (motivate) పరచేవాడు. ఏమనేవాడంటే, ఏమిటి ఇంత డల్ (dull) అయిపోయారు, మీరు కూడా గవర్నమెంట్ మీద ఒక కేసు వెయ్యాలండి. ఆ విన్నాయన, అది సరే నయ్యా, కేసు దేముంది నువ్వు చెప్పావుగా వేద్దాం, ఇంతకీ నా గ్రీవెన్స్ (grievance) ఏమిటో నువ్వు చెప్పాలిగా అనే వాడు. అంటే, కేసు వేసే వాడికి ఏ గ్రీవెన్స్ లేకపోయినా ఏదో ఒకటి సృష్టించి మన వ్యాజ్యగాడు కేసు వేయించేవాడన్న మాట.

సిబ్బందికి ట్రైనింగ్ (training) ఇవ్వడానికి కొన్ని సంస్థలు (institutions) ప్రైవేట్ సెక్టర్లో (private sector) వెలిసాయి. వాళ్ళతో ఆఫీసులకి కాంట్రాక్ట్ (contract) ఉండేది. అందుకని, వాళ్ళు నడిపించే ట్రైనింగ్ కోర్సులకి కొంత మంది సిబ్బందిని పంపాల్సొచ్చేది. మరి, ఆఫీసులో పని ఎక్కువగా చేసే 10 శాతం నుండి ఎవర్నీ పంపడం కుదరదు. అందుకని, మిగిలిన 90 శాతం తక్కువ పని ఉన్న సిబ్బంది నుండే ట్రైనింగ్ సంస్థకి పంపేవారు. లేకపోతే, కొంత మందిని ప్రత్యేకంగా ట్రైనింగ్ రిజర్వ్ (training reserve) అని కేటాయించేవారు. వాళ్ళనే అన్ని రకాల ట్రైనింగులకి పంపేవారు. ఒక్కోసారి అది వరకు పంపిన ట్రైనింగుకే కొంత మందిని పొరపాటున మళ్ళీ పంపేవారు. వాళ్ళు కూడా ఆ మాట చెప్పకుండా గమ్మున ఉండి ట్రైనింగుకి వెళ్ళేవారు, ఎంజాయ్ (enjoy) చెయ్యచ్చు కదా అని.

చిన్న పిల్లలు స్కూలు కెళ్ళగానే ఖచ్చితంగా నేర్చుకునేది ఏమిటంటే, వాష్ రూముకి వెళ్ళవలసి వచ్చినప్పుడు టీచర్ కి (teacher) ఒంటి వేలు చూపించడం. అలాగే, సిబ్బందికి కూడా ఉద్యోగంలో చేరిన తరువాత కొన్ని కళలు ఆటోమేటిక్ (automatic) గా అబ్బుతాయి, వాళ్ళు జాగ్రత్తగా తప్పించుకొని మసలితే తప్ప. అవేమిటి అంటే, సెలవు పెట్టడానికి అబద్ధాలు చెప్పడం, దొంగ బిల్లులు (bills) పెట్టడం, ఒక ప్రయోజనానికి ఎడ్వాన్సూ (advance) లేక అప్పూ (loan) తీసుకొని వేరే ప్రయోజనానికి ఉపయోగించడం, లాంటివి.

ఒక ఆఫీసరు సిబ్బందిని మంచి మూడ్ (keeping in good humour) లో ఉంచడానికి చిన్న చిన్న వరాలు (favours) కురిపిస్తూ చెప్పాట్ట, ఎప్పుడన్నా సెలవు (leave) మీద వెళ్ళాలంటే నాకు ముందే చెప్పండి, నేను ఇంతవరకు ఎవరికీ సెలవు తిరస్కరించ లేదు అని. సిబ్బందిలో ఎక్కువగా మెడికల్ లీవు (medical leave) మీద వెళ్ళడానికి అలవాటు పడ్డ ఒకాయన ఆఫీసరు గారు చూపించిన కరుణకి ఉబ్బితబ్బిబ్బయి ముందుగానే సెలవుకు ఒక అప్లికేషన్ (application) పెట్టాడు. ఏమనంటే, అయ్యా, నాకు వచ్చే నెలలో ఒకటో తేదీ నుండి 30వ తేదీ వరకు జబ్బు చేయబోతోంది, అందుచేత నాకు మెడికల్ లీవు మంజూరు (sanction) చేయవలసింది, ఎప్పట్లాగా, మెడికల్ సర్టిఫికెట్ (medical certificate) జాయినింగ్ రిపోర్ట్ (joining report) తో జతపరచగలను, అని. ఇప్పుడు కాస్త రూల్స్ కఠినం (stringent) చేశారు కానీ, వెనకటి రోజుల్లో హకీములు (Hakim) ఇచ్చే సర్టిఫికెట్లు కూడా చెల్లుబాటు (valid) అయ్యేవట. మామూలుగా వాళ్ళు బస్టాండుల (Bus stands) లాంటి చోట్ల పేవుమెంట్ల (pavements) మీద ఒక చిన్న స్టూలు వేసికుని కూచుని ఉండేవారట. వాళ్ళ దగ్గర ఒక కట్ట సైక్లోస్టైల్డ్ (cyclostyled) కాగితాలు ఉండేవట. ఒక్కొక్క కాగితం మీద, ఒక ఫార్మాట్ (format) ఉండేదిట. అందులో, ఉద్యోగి పేరు, డెసిగ్నేషన్ (designation), ఆఫీసు పేరు వ్రాయడానికి కొంత జాగా, ఆ తర్వాత, నేను ఇతన్ని మెడికల్గా పరీక్షించాను, ఇతను ఈ క్రింది జబ్బుతో బాధపడుతున్నాడు అన్న లైను దాని క్రింద పెద్ద లిస్టు జబ్బుల (list of diseases) పేర్లతో, ఆ తరువాత ఇతనికి ఇన్ని రోజుల సెలవు రికమండ్ (recommend) చేస్తున్నాను అన్న వాక్యం, ఆ క్రింద అతను స్టాంప్ (stamp) వేసి సంతకం చెయ్యడానికి జాగా, ఉండేవి. ఎవరన్నా సెలవు కోసం మెడికల్ సర్టిఫికెట్ కావాలని వస్తే, ఎన్ని రోజులకి అని అడిగి, ఆ తరువాత పైనుంచి క్రిందికి ఆ జబ్బుల లిస్టు చూస్తూ వాటిల్లో ఒక దానికి టిక్కు కొట్టి హిందీలో “ఏ లో” అనే వాడు, అంటే ఈ జబ్బు తీసుకో అని. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, చాలా మంది హకీములకి ఉద్యోగి పేరు, వివరాలు వ్రాయడం రాక అవేవో మీరే నింపుకోమని సంతకం చేసి సర్టిఫికెట్ ఇచ్చేసేవారట.

లీవ్ ట్రావెల్ కన్సెషన్ (Leave Travel Concession) అనగా ఎల్.టి.సి అని ఒక వసతి ఉంది. దాన్ని అదివరకు కొంత మంది దుర్వినియోగం చేస్తూ ఉండేవారు, అని విన్నాను. ఆ కాలంలో ఎల్.టి.సికి ప్రైవేట్ బస్సులలో కూడా ప్రయాణం అనుమతించేవారు. ఇక చూసుకోండి, సెలవు పెట్టి ఇంట్లో కూర్చుని, ప్రైవేట్ బస్సుల వాళ్ళ దగ్గర కొంచెం కమీషను ఇచ్చి జాలీ టిక్కెట్లు తీసుకుని వీలయినంత దూర ప్రాంతానికి వెళ్ళి వచ్చినట్లుగా బిల్లులు పెట్టేవారట. ఆ రోజుల్లో ఇచ్ఛాపురం చాలా మారుమూల వెనకబడిన ప్రాంతం. రాష్ట్ర సర్వీసుల సిబ్బంది కొంత మంది ఎల్.టి.సి మీద అక్కడికి వెళ్ళి వచ్చేవారని విన్నాను. అది ఏమన్నా పుణ్యక్షేత్రమా, అక్కడ ఏముంది అని ఆరా తీస్తే తెలిసినదేమంటే, అక్కడ ఆ రోజుల్లో ఒక హోటలు గానీ, ఆఖరికి ఒక బడ్డీ కొట్టు గానీ లేదు అని. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇలాంటివి వినవచ్చేవి. ఒకాయన ఒకసారి ఢిల్లీ నుండి కన్యాకుమారికి (వాళ్ళ కదే ఇచ్ఛాపురం) ప్రైవేట్ బస్సు టిక్కెట్లు కొంచెం కమీషను ఇచ్చి కొని సెలవు పెట్టి కొంపలో కూచున్నాట్ట. సెలవు అవ్వగానే ఆఫీసులో చేరి బిల్లు క్లైము చేశాడట. మన వాడికి న్యూస్ పేపర్ చదివే అలవాటు లేదు లాగుంది. అతను సెలవులో ఉన్న కాలంలో మధ్యప్రదేశ్ లో ఒక పెద్ద బస్సు యాక్సిడెంట్ అయ్యి ఎవరూ బతకలేదట. ఖర్మ కాలి ఆ బస్సు నంబరు మనవాడు ఎల్.టి.సి బిల్లులో టిక్కెట్ల మీద ప్రయాణం చేసినట్లుగా చూపించిన బస్సు నంబరు ఒకటే అయ్యాయి. ఆ తరువాత ఏమి జరిగిందీ చెప్పక్కర్లేదు.

ఆ రోజుల్లో ప్రైవేట్ బస్సుల్లోనే కాదు ప్రైవేట్ టాక్సీలలో కూడా ఎల్.టి.సి తాలూకు ప్రయాణం అమోదించేవారు. ఎందుకంటే, అన్ని చోట్లకి రైళ్ళు, బస్సులు ఉండేవి కావు. మరి అలాంటి వసతి ఉంటే వృథాగా పోనిస్తారా. ఒకాయన షిల్లాంగ్ (Shillong) నుండి కన్యాకుమారికి (Kanyakumari) టాక్సీ (taxi) మీద వెళ్ళినట్లుగా చూపించి ఎల్.టి.సి బిల్లు క్లైము చేశాడు. ఆ ప్రయాణ కాలంలో సిబ్బందిలోని ఇంకొకాయన ఇతన్ని వేరే రాష్ట్రంలో ఒక చోట చూశానని అతను ఎల్.టి.సి మీద వెళ్ళినట్లుగా చెప్పిన రాష్ట్రం మరొకటి కాబట్టి అది అబద్ధమని చెప్పాడు. సరే, ఛార్జిషీటు ఇచ్చారు. తరువాత, ఇంక్వయిరీ జరిగింది. ఎప్పుడూ కనని వినని వింత అప్పుడు జరిగింది. ఇంక్వయిరీలో అతను చెప్పినది ఏమంటే, వేరే రాష్ట్రంలో చూసినది నన్ను కాదు, నా లాగా కనపడే ఇంకొకణ్ణి (హిందీలో ‘హం షకల్’ అంటారు), సినిమాల్లో ఇలాంటివి వినలేదా, మా నాన్నకు ఎక్కెడెక్కడ ఏమి ఖాతా లున్నాయో నా కేమి తెలుసు, అని. తప్పించుకోవడానికి తండ్రి గుణహీనుడు అని చెప్పిన ఆ సుగుణాభిరాముడి గురించి ఇంక చెప్పాల్సిన దేముంది. మరి చూడండి, అబద్ధాన్ని నిజం చెయ్యడానికి ఎంత దూరం వెళతారో.

ఇప్పుడు ప్రైవేట్ సర్వీసులలో ప్రయాణం ఎల్.టి.సికి అనుమతించడం లేదు. అయితేనేం, అలవాటయిన పనులు చెయ్యకుండా వదులుతారా కొంత మంది. ఇప్పటి రూల్స్ ప్రకారం, ఎల్.టి.సి మీద వెళ్ళాల్సిన చోటుకి రైలు / బస్సు టిక్కెట్లు (tickets) కొని ప్రయాణానికి ముందే ఆఫీసులో వాటి ఫోటోకాపీలు (photocopies) ఇవ్వాలి. ఒకాయన ఏం చేశాడంటే, అలా టిక్కెట్ల కాపీలు ఆఫీసులో ఇచ్చి, తరువాత టిక్కెట్లు కాన్సిల్ (cancel) చేయించి కాన్సిలేషన్ ఛార్జీలు (cancellation charges) పోను మిగతా రావలసిన డబ్బు రైల్వే వారి దగ్గర నుండి పుచ్చుకొని, అది వరకటి లాగా ఇంట్లో కూర్చుని సెలవ అయిన తరువాత ఆఫీసుకి వచ్చి ఏమీ ఎరగని వాడి లాగా బిల్లు పెట్టాడు. అతని ఖర్మ కాలి, ఆ ఊళ్ళోనే ఆ సెలవుల్లో ఒకటి రెండు సార్లు అతను కూరగాయల మార్కెట్లో సిబ్బందిలో ఒకతనికి తారస పడ్డాడు. ఆ వ్యక్తి ఆఫీసులో ఆ మాట చెప్పిన మీదట రైల్వే వారి దగ్గర ఆరా తీయగా ఆ టిక్కెట్టు ప్రయాణానికి ముందే ఫలానా రోజు కాన్సిల్ అయ్యిందనీ, ఇంత డబ్బు వాపసు ఇచ్చామని చెప్పారు. ఇక మన వాడికి  ఛార్జిషీటు ఇస్తే ఇంక్వయిరీలో అతను చెప్పిన దేమిటంటే, నాకు మతి మరపండీ, నేనొక గజనీ నండి, అని. చూడండి, మన పిచ్చి వేషాలకి మన సినిమా నాలెడ్జి (knowledge) ఎంత బాగా పనిచేస్తోందో.

ఆ మధ్య గవర్నమెంట్లో సిబ్బంది సంఖ్య అవసరానికి మించి ఉందని, పెన్షన్ భారం ఎక్కువైందని, అందుకని ఉన్న పోస్టులు ఖాళీ అవగానే రద్దు చేయమని, కొత్త పోస్టులు సృష్టించ వద్దని చెప్పారు. జీరో ఆధారిత బడ్జెట్ (zero based budget) అని అన్ని ఆఫీసులకు అనుసరణ సూత్రాలు (guidelines) పంపారు. మొదట్లో చాలా మందికి అవి అర్థం కాలేదు గానీ, కొన్ని చోట్ల మంచి జరిగిందని అంటారు. ఉదాహరణకి, బహుశా ఒరిస్సాలో అనుకుంటా, రాత్రి పూట కప్పలు బెకబెక మని గోల చేస్తుంటే బ్రిటీషు దొరలకి నిద్ర పట్టక ఒక కాడర్ వ్యక్తులను నియమించారట, కప్పలను చంపడానికి. బ్రిటీషు వాళ్ళు వెళ్ళిపోయి చాలా కాలం అయ్యింది, కప్పలూ అది వరకంత లేవు, వాటిని చంపడం ఎప్పుడో ఆగిపోయింది, అయినా ఆ కాడర్ మాత్రం కొనసాగుతోందిట. ఇలాంటివి, జీరో ఆధారిత బడ్జెట్ చేయడం వల్ల బయటపడ్డాయట.

ఆ విషయం పక్కన పెడితే, పోస్టుల మీద ఆంక్షలు పెడితే మరి పని ఎలా అవుతుందయ్యా అంటే దానికి రెండు మంత్రాలు చెప్పారు. మొదటిది ఔట్సోర్సింగ్ (outsourcing), అంటే, సేవలను బయటి వాళ్ళకు అప్పచెప్పడం. కొంత కాలం చాలా పనులకి ఈ పద్ధతి నడిచింది, బాగానే. కొంత వేలం వెర్రి కూడా అయ్యింది. తుమ్మితే ఔట్సోర్సింగ్, దగ్గితే ఔట్సోర్సింగ్, ఎక్కడ చూసిన ఇదే గోల. ఔట్సోర్సింగ్ చెయ్యడం అన్నది సామర్థ్య సూచిక (efficiency index) లాగా అనుకోవడం మొదలు పెట్టారు. మధ్యాహ్నం లంచ్ అవర్లో (lunch hour) పిచ్చాపాటీ మాట్లాడుకునేటప్పుడు కూడా ఇదే గోల. అలాంటి సమయంలో నన్నెవరో అడిగారు, మీరు ఈ మధ్య ఏది ఔట్సోర్సింగ్ చేశారని. నాకు విసుగొచ్చి చెప్పాను, నా మార్నింగ్ వాక్ (morning walk) ఔట్సోర్సింగ్ చేశానని.

ఇంకో మంత్రం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (Public Private Partnership). ప్రజా సేవలు, ప్రాజెక్టులు కొంత ప్రభుత్వ సొమ్ముతోను కొంత ప్రైవేట్ భాగస్వామి సొమ్ముతోను పూర్తి చేసి, ఆ ప్రైవేట్ భాగస్వామికి ఆ సేవల మీద రుసుం (fees or toll) ప్రజల వద్ద నుండి వసూలు చేసే హక్కు లేదా లైసెన్స్ ఇవ్వడం, గుప్తుల కాలంలో అగ్రహారాలు ఇచ్చినట్లుగా. ప్రైవేట్ భాగస్వామి సొమ్ము వడ్డీతో సహా వసూలు చేసే వరకు ఆ హక్కు ఇస్తే బాగానే ఉంటుంది కానీ ఒకో సారి అది శృతి మించి రాగాన పడుతోంది, అవసరానికి మించిన దోపిడి అవుతోంది అని కోర్టులే అన్నట్లుగా విన్నాను.

కమిటీలు వెయ్యడ మంటే కొంత మందికి చాలా హుషారు. ప్రమోషన్లు ఒకదాని మీద ఒకటి వచ్చి ఉన్నత స్థాయికి చేరుకున్న ఒకాయనకి తను చెయ్యాల్సిన పని మీద సరియైన అవగాహన లేదు. కాని బండి సాగాలి కదా మరి. దాని కొక ఉపాయం కనిపెట్టాడు. ఏంటంటే, ఆ పని చెయ్యడానికి ఒక కమిటీ వేసేవాడు. కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళు, తనకి ఎదురు మాట్లాడే వాళ్ళు అని ఎవరి మీదన్నా సందేహం ఉంటే వాళ్ళని కమిటీలో సభ్యులుగా చేర్చేవాడు. ఇక, అక్కడి నుంచి కమిటీ పని తీరు పర్యవేక్షిస్తూ (monitor) ఉండే వాడు. అంతా సరిగ్గా జరిగితే తన ప్రతిభ, లేకపోతే కమిటీ నెత్తి మీదుగా పోయేది.

కొన్ని ఆఫీసులకి అత్యవసర పరిస్థితుల్లో (emergency) ప్రజోపయోగ కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికను (war footing) చెయ్యాల్సిన అవసరం కలుగుతూ ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో రూల్స్ బుక్ (rules book) లో ఉన్న పద్ధతు లన్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లోనూ, యుద్ధప్రాతిపదికను చెయ్యాల్సిన పనులకి వీటి నుండి మినహాయింపు (exemption) ఉంటుంది. ఉదాహరణకి, ఏ తుపానో వచ్చి జనజీవనానికి సమస్యలు వచ్చాయనుకోండి. అప్పుడు, ప్రజలకి సహాయ కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికను చెయ్యాల్సి ఉంటుంది. ఏవైనా ఆహార పదార్థాలు, ఇతర సామాన్లు వెంటనే కొనుగోలు చేసి వితరణ (distribute) చెయ్యాల్సి ఉంటుంది. కొనుగోళ్ళకు టెండర్లు (tenders) పిలవడం లాంటి మామూలు పద్ధతులు పాటించడానికి సమయం ఉండదు. ఇలాంటి కొనుగోళ్లు (procurements) అన్నీ ఓచర్ పేమెంట్స్ ద్వారా జరుగుతాయి. అంటే, సిబ్బంది ఇంత సరుకు ఇంత పైకంతో కొన్నామని ధృవీకరిస్తారు. దాన్నే ఓచర్ అంటారు. వీటికి ఆడిట్ (audit) నుండి కూడా మినహాయింపు (exemption) ఉంటుంది. అంటే, అడిగేవాడు ఉండడని అర్థం. ఇది అత్యవసర పరిస్థితుల్లో బాధితులని ఆదుకోవడం లాంటి సత్కార్యాలకై రూపొందించబడిన పద్ధతే అయినా కొంత మంది సిబ్బంది దీన్ని దుర్వినియోగం (misuse) చేస్తారని విన్నాను. నకిలీ ఓచర్లు సృష్టించి ఖజానా (treasury) నుండి డబ్బు పీల్చేయడానికి తేలిక పద్ధతి ఇది అని వాళ్ళు అనుకుంటారు. అందుకని అలాంటి వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక ప్రకృతి బీభత్సం రావాలని ఆశగా ఎదురు చూస్తారని విన్నాను.

ఇదంతా చూస్తుంటే, వెనకటికి పందిని ఎలా కాల్చాలి అన్నది ఎలా కనిపెట్టారు అన్న విషయం మీద ఒక హాస్యభరితమైన వ్యాసం ఉంది. అది ఛార్లెస్ లాంబ్ (Charles Lamb) రచించిన “The Essays of Elia” అన్న గ్రంథంలో “A Dissertation Upon Roast Pig” అన్న వ్యాసం. మాంసం వండే ప్రక్రియ చాలా యాదృచ్ఛికంగా (accidental) మొదలైందని చెప్పే చైనా (China) గ్రామానికి సంబంధించిన ఒక వినోదభరితమైన హాస్యం కురిపించే వృత్తాంతము (anecdote) ఇది. పురాతన కాలంలో, అంటే జంతువుల మాంసం వండడం తెలియని కాలంలో, పచ్చి మాంసమే (raw meat) తినేవారట. బోబో అనే పిల్లవాడు నిప్పుతో ఏవో ఆటలు ఆడుకుంటూ ఉండగా పొరపాటున వాళ్ళ ఇంటి పక్కన ఉన్న సావిడికి (cottage) నిప్పంటుకుంది. ఆ సమయంలో అందులో 9 పందులు కట్టివేయబడి ఉన్నాయట. అవి కాలిన వాసనకి ఆకర్షింపబడి రుచి చూడకుండా ఉండలేక పోతాడు, బోబో. ఆ తరువాత, ఇదంతా తెలిసి అతని తండ్రియైన హోతీకి ఈ పిచ్చ ఎక్కుతుంది. ఇక అక్కడి నుంచి, తరచుగా వాళ్ళ సావిడి తగల బడటం అందరూ చూస్తారు. ఈ విషయం ఎన్నాళ్ళని దాగుతుంది. ఆ నోటా ఆ నోటా అంతటా పాకింది. అక్కడి నుంచి ఎన్ని సావిళ్ళు తగలబడ్డాయో లెక్కే లేదు. పందుల రేట్లు అమాంతం పెరిగిపోయాయిట. ఇలా సావిళ్ళో ఇళ్ళో తగల పెడితేనే పందులని కాల్చి రుచికరమైన ఆహారం తినవచ్చని అందరూ ఆ పని మీదే ఉన్నారు. ఇంకేముంది, వీళ్ళు కొంపలు తగల బెట్టుకుని బీమా (insurance) క్లైము (claim) చేస్తూ ఉండడం వల్ల బీమా కంపెనీలు (companies) దివాళా (bankrupt) తీశాయిట. చాలా కాలం వరకు పందులను రోస్ట్ (roast) చెయ్యడానికి ఇదొక్కటే మార్గమని అనుకున్నారట.

పూర్వపు ఉదాహరణ లేక ప్రెసిడెంట్ (precedent) అన్నది ఆఫీసులలోను, కోర్టులలోను, మన నిత్య జీవితంలోను, చాలా ఎక్కువగా వాడుకలో ఉండే పదం. అప్పుడప్పుడు మయసభలో దుర్యోధనుడి లాగా “ఇదియును అట్టిదియే” అనుకుని భంగపడుతూ ఉన్నా పందిని కాల్చడానికి ఇళ్ళు, పందిళ్ళు తగలబెట్టాలేమో ననుకునే గొర్రెల లాగా మనం కూడా పూర్వపద్ధతులని అనుసరించడానికి అలవాటు పడ్డాము. కాదా చెప్పండి. బీటెన్ ట్రాక్ (beaten track) అని టైం టెస్టెడ్ మెథడ్ (time tested method) అని మనకి మనమే సద్ది చెప్పుకుని చరిత్రను పునరావృతం (repeat) చేయడానికి ప్రయత్నిస్తాము కానీ మనకున్న సందర్భానికి ఆ ప్రిసిడెంట్ సరియైనదా కాదా అని ఆలోచించము.

ఇదంతా చెబుతుంటే, నాకు ఒక ఆఫీసులో జరిగినది గుర్తుకొస్తోంది. మనలో కొంత మందికి పని గండం ఉంటుంది. అలాంటి వాడొకడు, ఇంట్లోనూ బయట (మిత్రుల) పోరు పడ లేక ఒక ఉద్యోగానికి సెలెక్ట్ (select) కాబడి అందులో చేరతాడు. వాడికి కుదురు ఎక్కడుంది. చేరి పట్టుమని సంవత్సరం కూడా కాకుండా ఆఫీసుకి వెళ్ళడం మానేశాడు. తరువాత ఏముంది, గాలి తిరుగుడు. కానీ వాడి ఖర్మ కాలి ఇంట్లో పరిస్థితులు మారి జ్ఞానోదయం అయ్యింది. మళ్ళీ ఉద్యోగం చెయ్యాలని అనిపించింది. కానీ, అప్పటికి వయస్సు దాటి పోయి దేనికీ అప్లై (apply) చేయడానికి వీలు కాకుండా పోయింది. కాకపోతే, కాస్త రాజకీయంగా పలుకుబడి ఉన్న ఘటం కాబట్టి, ఎవర్నో పట్టుకుంటే అదివరకు మానేసిన ఉద్యోగంలో చేరడానికి అన్ని దారులు మూసుకు పోలేదు అని ఒక ఉపాయం చెప్పారు. అదేమిటంటే, అదివరకు మానేసినప్పటి నుండి క్రిందటి వారం వరకు అతగాడి మానసిక పరిస్థితి (mental condition) సరిగ్గా లేదు, ఇప్పుడే సరి అయ్యాడు, అని డాక్టరు ధృవపరిస్తే దాని ఆధారంగా ఆ ఆఫీసులో అతనికి పునః ప్రవేశం (re-entry) కలిగించడం. చివరకు అలాగే జరిగింది. కాకపోతే, ఈ కేసులో ఆఫీసు ఫైలులో ఏమి వ్రాశారంటే: “ఇది చాలా అరుదైన సంఘటన (rare event). డాక్టర్ ఇచ్చిన ధృవపత్రం ఆధారంగా ఉద్యోగి మానసిక స్థితిని, అతని కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, అతని అభ్యర్థనను సానుభూతితో (sympathetically) పరిగణిస్తూ, ఒక ప్రత్యేక మినహాయింపుగా (special exception) ఉద్యోగిగా అదివరకే అంతమయిన అతని స్టేటస్ (status) ను పునరుద్ధరించాలని (revive) నిర్ణయించాము. సర్వీసు రూల్సును (Service rules) సడలిస్తూ (relaxing) తీసుకోబడ్డ ఈ నిర్ణయం ఈ ఒక్క సారికి (one-time measure) మాత్రమే. దీన్ని ప్రిసిడెంట్ గా తీసుకోవడానికి వీలు లేదు.” అని.

ఇక చూసుకోండి. పండోరా బాక్స్ (Pandora box) తెరిచి నట్లయింది. ఆ నోట ఆ నోట పాకి, ఆఫీసుల్లో ఏడాదికి ఐదారు కేసులు ఇలాంటివి వస్తూనే ఉన్నాయి. ప్రతి కేసులోను, సదరు బాధితుడిని ఏదో విధంగా డాక్టర్ ధృవపత్రం సంపాదించమనడం, అది ఫైలులో పెట్టి తరువాతి కథ పైన చెప్పినట్లుగా నడిపించడం జరిగేది. అతి జాగ్రత్త కోసం, కొత్త కేసు తాలూకు ఫైలులో ఇలా వ్రాసేవారు: “ఇది చాలా అరుదైన సంఘటన. డాక్టర్ ఇచ్చిన ధృవపత్రం ఆధారంగా ఉద్యోగి మానసిక స్థితిని, అతని కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, అతని అభ్యర్థనను సానుభూతితో పరిగణిస్తూ, ఒక ప్రత్యేక మినహాయింపుగా ఉద్యోగిగా అదివరకే అంతమయిన అతని స్టేటస్ ను పురుద్ధరించాలని నిర్ణయించాము. సర్వీసు రూల్సును సడలిస్తూ తీసుకోబడ్డ ఈ నిర్ణయం ఈ ఒక్క సారికి మాత్రమే. ఇట్లాంటి ఒక్కసారికి మాత్రమే ఇచ్చే మినహాయింపులు అది వరకు కూడా ఇచ్చి ఉన్నాము. ఆ ఫైలు ప్రిసిడెంట్ గా జత చేయబడింది. అందులో చెప్పినట్లుగా, ఈ కేసును కూడా ప్రిసిడెంట్ గా తీసుకోవడానికి వీలు లేదు.” అని. ఆహా, ఎంత పగడ్బందీగా ఉందో ఫైలులో నోటింగ్. మరి, వీటన్నిటికీ ఆద్యుడు ఛార్లెస్ లాంబే (పంది కథ ద్వారా) నంటారా?

పందిని రోస్ట్ చెయ్యడం అనుకోకుండా తెలుసుకున్నదే. కాని, ఇలాంటి విచిత్రాలు వేరే చోట్ల కూడా మనం చూస్తాము. పైన చెప్పిన తుపాను – ఓచర్ పేమెంట్లు అటువంటిదే. అసలు, నేను విన్న దేమిటంటే, మనకి ఇటువంటిది యూనివర్సిటీలలో బాగా అనుభవానికొస్తుందని. ఆ విషయం ఇంకో వ్యాసంలో చెప్పుకుందాము.

ఆఫీసు సిబ్బందిలో ఆంజనేయ భక్తులు, అంగరాజ కర్ణులు ఉండడం చాలా చోట్ల చూశాను. ఎట్లా అంటే, ఏదైనా ఒక విషయం గురించి అది వరకు జరిగిన వివరాలు ఎప్పుడన్నా అడిగితే ఒక గుట్ట ఫైళ్ళు తీసుకొచ్చి మీరడిగినది వీటిల్లో దొరకచ్చు అని చెప్పేవారు కొందరు. వాళ్ళు ఆంజనేయ భక్తులేగా. ఇక చాలా సంవత్సరాలుగా ఒకే ఆఫీసులో పనిచేస్తూ, అక్కడి అన్ని విషయాలు అవసరం లేనప్పుడు పూస గుచ్చినట్లు చెప్పే కొందరు, అవసరమైనప్పుడు అదేదో ఉండాలండీ సరిగ్గా గుర్తు రావడం లేదు అని చెప్పడం నేను చూశాను. వాళ్ళు కర్ణుడు లాంటి వాళ్ళు కాదా. అసలు ఈ ఆంజనేయ భక్తులని అంగరాజ కర్ణులని నేను చదువుకునే రోజుల్లోనే చూశాను. ఆ వివరాలు ఇంకో వ్యాసంలో చెప్పుకుందాము.

ఇక ఫారెన్ ట్రిప్పుల (Foreign trips) గురించి చెప్పక పోతే ఈ వ్యాసానికి పెద్ద లోపం. వాటి కోసం అందరూ ఎగపడతారని వినే ఉంటాము. ఎందుకంటే, కాస్త టీయే (TA or Travelling Allowance), డీయేల (DA or Dearness Allowance) డాలర్ల రూపంలో ఘనంగా మిగులుతుందని. కాకపోతే, వెళ్లిన చోట ఏమన్నా చెయ్యాల్సిన పని ఉంటే చాలా మంది వెనక్కి తగ్గే వారు. ఏమన్నా వివాదం (controversy) హాండిల్ (handle) చెయ్యాలంటే కూడా వెనక్కి తగ్గేవారు. ముఖ్యంగా ట్రైనింగు (training) అంటే అందరూ తయారే. నేర్చు కొచ్చినది ఇక్కడ అమలు (implement) చెయ్యమంటే, ఏదో ఒక వంక చెప్పి తప్పించుకునే వారు. మన గొంగళి వేసిన చోటి నుండి జరపాలంటే, వాళ్ళు ఒప్పుకోవాలి వీళ్ళు ఒప్పు కోవాలి అని వేరే వాళ్ళ మీద తోసేసేవారు.

ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి కానీ, ఇప్పటికే చాలా చెప్పుకున్నాము కాబట్టి ఇంతటితో చాలిస్తాను. ఆఫీసర్ల గురించి సిబ్బందిని గురించి చాలా తక్కువ చేసి చెబుతున్నా ననుకుంటున్నారా. అదేం కాదు. ఇవన్నీ తెలిస్తే, చాలా బాగా పనిచెయ్య గలుగుతారు, జాగ్రత్తగా ఉంటారు అని చెబుతున్నాను.

2 thoughts on “ఆఫీసుల్లోని ముచ్చట్లు, అగచాట్లు

  1. ఆఫీస్ లలో జరిగే విషయాలను, చాలా బాగా ఉదాహరించారు /గుర్తు చేశారు. చాలా సార్లు గత అనుభవాలు గుర్తుకు వచ్చి నవ్వుకున్నాను. పనిమంతులకు జరిగే ఇబ్బందులు, పని దొంగల విన్యాసాలు చాలా బాగా వ్రాసారు. అందరికి అనుభవమే అయినా, సోదాహరణంగా వివరించటం, సరదాగా ఉంది. చాలా చాలా బాగుంది. సూపర్. 👏👏💐💐

    Like

  2. ఆఫీసులలో వివిధ దశల్లో స్థాయిల్లో జరుగుతున్నసంఘటనలు కళ్ళకు కట్టినట్లు అనుభవాన్ని జోడించి వివరించ్చినారు . పేరొటో సిద్ధాంతము తో అన్వయించడము బాగుంది. ఒక చిన్న సర్దుబాటు -ఆ నోటా ఈ నోటా కి బదులుగా ఆ నోటా ఆ నోటా గా వ్రాయబడినది ,గమనించి ఉంటారు అనుకుంటాను.

    Like

Leave a reply to bali3656 Cancel reply