మా గురువుగారు కీ.శే. శ్రీ చిరువోలు దుర్గాప్రసాదరావు గారు 1956లో రచించిన “శ్రీ కామేశ్వరీ శతకము” 30-08-2025న ఈ-బుక్ (E-Book) గా ఈ క్రింది లింకులో పెట్టబడినది. డౌన్ లోడ్ (download) చేసుకొని చదువగలరు. ఈ శతకం మీద మీరు సూచనలు/ వ్యాఖ్యలు ఇవ్వడానికి ఈ బ్లాగులో సదుపాయం ఉంది. ఉపయోగించుకోగలరు.
https://ia601007.us.archive.org/13/items/kameswari-shatakamu/Kameswari%20Shatakamu.pdf
శ్రీ చిరువోలు విజయ నరసింహారావు గారు, రాజమహ్రంద్రవరం (న్యూఢిల్లీ) 27-09-2025న పంపిన వ్యాఖ్యలు క్రింద ఇవ్వబడ్డాయి.
రచయిత శ్రీ చిరువోలు దుర్గాప్రసాదరావు గారు నాకు తండ్రి గారు. సన్యసించి రామానంద జ్యోతిగా నామమును స్వీకరించి నారు. మాకు సద్గురువు, మార్గదర్శకుడు, సన్మార్గ బోధకుడు, నిత్య ఆరాధ్య దైవము. వారు మొదట హైదరాబాదులో టీచరుగా పనిచేయు కాలమున చండీ ఉపాసనను కావించెడి వారు. అందుకే, వారికి కామేశ్వరీ మాత భక్తి యేర్పడినది. వారి కవిత్వము ప్రౌఢమై శ్రీనాథాది పూర్వకవుల పోకడలను పోలి ఉండును. అంత్యప్రాసలును, సంస్కృత సమాసములును, నీతి బోధకములును, శరణాగతిని, సంఘసంస్కరణమును, ప్రశస్త పదప్రయోగములును, భావ స్పష్టతను, పఠన యందు శ్రావ్యతను – దాదాపు అన్ని పద్యము లందు ప్రస్ఫుటమగుచున్నవి. భక్తి విన్నపములు, ఆర్తి, దూషణ భూషణములను, తనతో పాటు యితర భక్తులనుఁ గావుమని ప్రార్థించిరి.
1. కొన్ని సంస్కృత సమాసములకు ఉదాహరణములు:
2వ పద్యం లోని పద్మ సంభవ పద్మోదర ఫాలనేత్రులు, 13వ పద్యం లోని తావక పాదపద్మ భజనోత్సాహంబు, 26వ పద్యం లోని యుష్మత్పద పంకజాంతర మరందేచ్ఛా సమాయాత షట్పదము, 36వ పద్యం లోని సుర నారీ కరకంజ సంస్థిత లసజ్జోతిప్రభాతిస్ఫుర ద్వర పాదాబ్జయుగంబు, 40వ పద్యం లోని దాసజన చిత్తానంద సంధాత్రి, పద్మాసన పాకశాసన ప్రభృత్యామర్త్య సంసేవ్య, 77వ పద్యం లోని భవత్కారుణ్య సంవర్ధి వాక్కేళీ కల్పితకమ్ర కావ్య ప్రసరద్గీర్వాణ భాషామృతీ లాలిత్యుండు, 101వ పద్యం లోని పద్యరత్న రుచిరన్నీరాజితాంఘ్ర్యబ్జవై, 108వ పద్యం లోని రాజీవోద్భవవాస వాద్యమరవర్గస్తుత్య, 109వ పద్యం లోని పాపారణ్య దవానలే (మొత్తం పద్య మంతా).
2. ఆర్తికి ఉదాహరణములు: 9వ పద్యం లోని ఆలింపన్ సమయంబుఁ గాదొ, 27వ పద్యం లోని కవి వర్ణింపగ లేడు, 39వ పద్యం లోని కల్లోలంబులు చిక్కులుం, 58వ పద్యం లోని అసలే బూటకమైన, 59వ పద్యం లోని అర్జీ వ్రాసిన, 60వ పద్యం లోని ఆర్జింపన్ పెర మార్గముల్, అధికారి దస్కతు, నిర్జీవచ్ఛవ సామ్యము, 72వ పద్యం లోని నిన్నే కర్తగ, 83వ పద్యం లోని భిన్న లింగములలో నిల్లాలివై, 101వ పద్యం లోని శిష్టాచారుడు వేంకటప్పయకు (స్వవిషయములు), 102వ పద్యం లోని పరమార్ధంబని యెంచి, 103వ పద్యం లోని జలగండంబు, 107వ పద్యం లోని బలవంతుల్ బలహీను, సంఘ బలము.
3. శివకేశవ యభేదమునకు ఉదాహరణములు: 62వ పద్యం లోని శివపంచాక్షరి, 63వ పద్యం లోని శివునిం గేశవు.
4. అనుప్రాసకు ఉదాహరణములు: 61వ పద్యం లోని కామంబే, ష్కామంబే, రామంబే, నీమంబు, 66వ పద్యం లోని వరణీయము, కరణీయము, స్మరణీయము, 73వ పద్యం లోని ఆకొన్న, చేకొన్న, ఢీకొన్న, వాకొన్న, 74వ పద్యం లోని చెల్లెం, డొల్లెన్, ధిల్లం, 99వ పద్యం లోని మాపుల్ రేపులు, రేపుల్ మాపులు, పాపుల్, దీపుల్, 101వ పద్యం లోని శిష్టా, తుష్టిన్, నిష్టన్, ద్రష్టం.
5. అన్య భాషాపదములు: 14వ పద్యంలో ఖుసి, 55వ పద్యంలో కమ్యూనిష్టులొ, 59వ పద్యంలో అర్జీ, దర్జా, 60వ పద్యంలో దస్కతు.
మరిన్ని విషయములను ఆయా పద్యము లందు పఠితలే దర్శించి గ్రహించెదరుఁ గాక.
LikeLike