చాలా కాలం క్రితం శ్రీశ్రీ గారు సినిమాల గురించి ఎక్కడో ఒక ఇంటర్వ్యూ (interview) లో అన్న మాటలు నాకు ముందుగా గుర్తు చేసుకోవాలని ఉంది.
“…. అసలు ఉత్తమ చిత్రాలు నిర్మిస్తే మన ప్రజలు చూడరని చెప్పడం కూడా మన ప్రొడ్యూసర్లకి పరిపాటి అయ్యింది. ఇది ఎంత అసందర్భంగా వున్నదో చెబుతా వినండి. ప్రతివాడూ తిండి కోసం హోటలుకి వెళ్ళాలి. అతడికి ప్రతిసారీ ఆహారం (మంచిది) లభించక పోవచ్చు. అయినా రోజూ హోటలుకి వెళ్ళక తప్పదు. ఆహారం లాగానే ఈనాడు మానవునికి సినిమా కూడా ఒక అవసరం. అందువల్ల ఏ చిత్రం వచ్చినా ప్రేక్షకుడు చూస్తున్నాడు. కంపు కొట్టే వేరుశనగ నూనెతో చేసే వంటకాలను కానీ ప్రజలు ముట్టరని, వాటికి వారు అలవాటు పడ్డారని యజమాని చెబితే ఎంత అసందర్భముగా ఉంటుందో, ఉత్తమ చిత్రాలను నిర్మిస్తే చూడరని చెప్పడం కూడా అలాగే వున్నది. …”
ఒకప్పుడు మానవునికి ఆహారంతో పాటు సినిమాలు ఎంత అవసరమో, ఇప్పుడు సినిమాలకి బదులు టీవీ (TV) ప్రోగ్రాములు (programs) అంత అవసరం అయ్యాయి. ప్రోగ్రాము (కార్యక్రమం) అన్ని రకాల ప్రేక్షకులను అలరించేటట్లుగా ఉండి, నవరసాలు పండిస్తే, దాన్ని ప్రేక్షకులు ఎక్కువ ఆదరిస్తారని ఒక విశ్వాసం ఉంది. ఇది కాక ఇప్పుడు టీవీ కార్యక్రమాల ప్రేక్షకాదరణను అంచనా (estimate) వేయడానికి టెలివిజన్ రేటింగ్ పాయింట్సు (Television Rating Points) లేక టీ.ఆర్.పి అని ఒక విధానం ఉంది.
ఆ అంచనా ఒక సాంపిల్ సర్వే (sample surve) ద్వారా చేస్తారు. కొన్ని యాదృచ్ఛికంగా ఎన్నుకోబడిన (randomly chosen) ఇళ్ళలో టీవీలకి పీపుల్ మీటర్ (people meter) అని ఒక పరికరాన్ని (device) అమరుస్తారుట. అందులో రికార్డు (recorded) అయిన రీడింగులని (readings) బట్టి, కావలసిన కార్యక్రమాలకి [కార్యక్రమం చూసిన లక్షిత ప్రేక్షకులు (targeted audience for a program) x 100 / మొత్తం లక్షిత ప్రేక్షకులు (total targeted audience)] గణిస్తారు. దీన్ని బట్టి టీవీ ఛానెళ్లు (TV channels) తమ కార్యక్రమాల ప్రేక్షకాదరణ గురించి తెలుసుకుంటారు. వాణిజ్య ప్రకటనలు (commercial advertisements) చేసే వ్యాపారస్థులు ఏ కార్యక్రమాలకి తమ ప్రకటనలు ఇవ్వాలో కూడా దీన్ని బట్టి తెలుసుకుంటారు. ఆ మధ్య ఈ టీ.ఆర్.పిలు గణించడంలో కొన్ని టీవీ ఛానెళ్ళు ఏదో మోసం చేశాయని ఆరోపణ వచ్చింది. దాని మీద కొంచెం రభస కూడా అయ్యింది. ఆ విషయం ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాం. ఇదంతా చూస్తుంటే, టీవీ ఛానెళ్ళ మధ్య నున్న పోటీ వాతావరణం (competitive environment) మనం ఊహించవచ్చు. అది తట్టుకోడానికి, కార్యక్రమాలు తయారు చేసే నిర్మాతలు (Producers), దర్శకులు (Directors) ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలిగా.
అది వరకు పాత సాంఘిక సినిమాల్లో, ఒకే మాదిరి కథలు ఎక్కువగా ఉండేవి. హీరో (hero) విలన్ చివరి దాకా శత్రువులుగా వ్యవహరించే సీనులు (scenes), వాళ్ళకి వత్తాసు పలికే వారి సీనులు, ఆ క్రమంలో కొన్ని ప్రేమ గీతాలు, కొన్ని భక్తి పాటలు, కొన్ని ఏడుపు పాటలు, కొన్ని హాస్య గీతాలు, చివర్లో కొట్టుకు చావడం, అది అయిన తరువాత విలన్ వేపు ఉన్న కొంత మందికి బుద్ధి రావడం, విలన్నీ అతనితో పాటు ఒకళ్ళిద్దర్నీ పోలీసులు పట్టుకుపోవడం, విలన్ కూతుర్ని గానీ చెల్లెల్ని గాని హీరోనో హీరో తరఫు వారో పెళ్ళి చేసుకోవడం వల్ల ఆ చేసుకున్న వాళ్ళకి విలన్ సంపాదించిన అడ్డగోలు సంపద అంతా చెందడం, మొత్తానికి ఎంత కొట్టుకు చచ్చినా ఆస్తి ఎక్కడికీ పోకుండా వాళ్ళలోనే ఉండడం – ఇలా ఉండేవి కథలు. ఇదంతా చూసి, ప్రేక్షకులు కొన్ని మంచి డైలాగులు, ఒకటి అరా బాగున్న పాటలు, ఒకళ్ళిద్దరి నటన నచ్చితే అదీ, గుర్తు పెట్టుకుని, వాళ్ళ రోజువారీ ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందేవారు.
సినిమా అంటే, 2-3 గంటలు మాత్రమే. టీవీ కార్యక్రమం అలా కాదు కదా. కొన్ని సీరియళ్ళు (serials) ఏళ్ళ తరబడి వస్తాయి కదా. ప్రతి సీరియల్లోని ప్రతి భాగం (episode) జనరంజకంగా ఉండడమే కాక, ఆ సీరియల్ (serial) లోని తరువాతి భాగం చూడాలని ప్రేరేపించే ఉత్కంఠను (suspense) కూడా మిగుల్చాలి. ప్రేక్షకులు సీరియల్ చూసేటప్పుడు కొన్ని పాత్రలను టార్గెట్ (target) చేస్తారు. ఫలానా ఇద్దరికీ పెళ్ళి అయిందా లేదా, ఫలానా వాడికి న్యాయం జరిగిందా లేదా, ఎలా జరిగింది, ఫలానా వాడికి తగిన శిక్ష పడిందా లేదా – ఇలాంటివి వాళ్ళలో ఉత్కంఠ కలిగించి సీరియల్ని చూసేటట్లుగా చేస్తాయి. వాళ్ళలో ఉన్న ఉత్కంఠ టీ.ఆర్.పి రేటింగును పెంచుతుంది. అటువంటి కార్యక్రమాలకు / సీరియళ్ళకు ప్రేక్షకాదరణయే కాకుండా, వ్యాపార సంస్థల ఆదరణ కూడా ధన రూపంలో ఉంటుంది, వాళ్ళ ఉత్పత్తులు, సేవల గురించి కార్యక్రమం మధ్యలో వెయ్యాల్సిన ప్రకటనల కోసం.
ఇది ఒక విష వలయం (vicious cycle) లాంటిది, ఎందుకంటే ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఆశలు (దురాశలు) పెనవేసుకుని ఉండడం వల్ల. అందరికీ నచ్చేటట్లు ఉండి ఎప్పటికప్పుడు ఉత్కంఠ కలిగిస్తే తప్ప ప్రేక్షకులు రోజూ చూడరు. వాళ్ళు అలా చూస్తే గానీ టీ.ఆర్.పీ రేటింగు పెరగదు. అది పెరిగితే గానీ వాణిజ్య ప్రకటనలకి కంపెనీలు ఎగబడవు. మనం కొన్ని సీరియళ్ళు చూసేటప్పుడు మధ్యలో వచ్చే వాణిజ్య ప్రకటనలకి విసుక్కుంటాము. మన విసుగు నుంచి కూడా డబ్బు సంపాదిద్దామనే ఉపాయాలు ఈ మధ్య కనిపెట్టబడ్డాయి. దానికి ప్రత్యేకంగా ఒక ప్రకటన తయారు చేసి, ఇక ముందు మధ్య మధ్యలో ఈ ప్రకటనలు రాకుండా ఉండాలంటే ఇంత డబ్బు కట్టండి అని. రౌడీ మామూలు వసూలు చేయడం కన్నా ఇదేమన్నా తీసిపోయిందా. కంపెనీలు ప్రకటనల కోసం ఎంత ఎగబడితే టీవీ ఛానళ్ళకు అంత ఎక్కువ డబ్బు వస్తూ ఉంటుంది. ఎంత ఎక్కువ డబ్బు వస్తూ ఉంటే అంత ఎక్కువగా ఆ సీరియల్ని పొడిగించాలని వాళ్ళకి అనిపిస్తుంది. ఇది ఇలా సాగుతూ సాగుతూ, కొన్ని సీరియల్సు అతుకుల బొంత లాగా, మరచిపోయి ముగించకుండా వదిలేసిన ఉపాఖ్యానాలతోను, ఎప్పటి కప్పుడు తరువాతి భాగంలో ఏమి చెప్పబోతున్నారో రచయితకు, దర్శకుడికి, నిర్మాతకు కూడా తెలియని పరిస్థితుల్లో, ఊగిసలాడుతున్నాయి. ఒక సీరియల్ ఇలాగే సాగుతూ, వాళ్ళల్లో వాళ్ళకి ఏవో గొడవ లొచ్చి ఆగిపోయింది. మెల్లగా దాని విషయం అందరూ మర్చిపోయారు.
ఆ విషయం పక్కన పెడితే, ఇంతకీ ప్రతి ఎపిసోడూ (episode) రోజూ ఉత్కంఠ కలిగించే విధంగా సీరియల్ తయారు అవ్వాలంటే ఏముండాలి? ప్రేక్షకుల్లో అన్ని వయస్సుల వాళ్ళు ఉంటారు కాబట్టి సీరియల్ కొత్త పాతల మేలు కలయిక అన్నట్లుగా ఉండాలి, గురజాడ అప్పారావు గారు చెప్పినట్లు. ఎంత కొత్త ఎంత పాత అనే కాకుండా, ఉండాల్సినంత మంచి ఉండాల్సినంత చెడు కూడా ఉండాలి. ఎందుకంటే రెండూ ఒకదాని కొకటి సహాయకారిగా (complimentary) ఉంటాయి. చెడ్డ వాడి చెడ్డతనం చూస్తేనే మంచివాడి మంచితనానికి గుర్తింపు. ఇవన్నీ కాక, కథలో మలుపులు (twists in the story) ఎన్ని ఎక్కువుంటే అంత ఉత్కంఠ.
కథలో ఎక్కువ మసాలాలు, మలుపులు ఉన్నది వ్యాస భారతంలోనే. వాల్మీకి రామాయణంలో కూడా ఉన్నాయి గానీ, అది వ్యాస భారతంలో సుమారుగా ఐదో వంతేగా. చాలా ప్రామాణికంగా, అధికార పూర్వకంగా, ఒక సవాలు విసురుతున్న విధంగా, వ్యాసుడు తాను రచించిన మహాభారతాన్ని గురించి చెప్పింది ఏమిటంటే: “యదిహాస్తి తదన్యత్ర, యన్నేహాస్తి న తత్ క్వచిత్” అని. అంటే, ఇందులో ఉండేదే ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది ఎక్కడా లేదు, అని. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, మంచి విషయాలు, దుర్మార్గాలు – ఎక్కడ ఏమి విన్నా, అది భారతంలో ఉంది, అని. అంటే, భారతం అంత సమగ్రంగా ఉంటుందని. ఈ విషయం మీద వివరంగా పరిశోధన (research) చేసి వ్యాసుడు చెప్పింది ఈ కాలంలో చెల్లదు అని ఎవరన్నా నిరూపిస్తే బాగుండు అని కోరుకునే వాళ్ళలో నేనూ ఒకణ్ణి.
మన సీరియల్సులో ఉన్నది ప్రతిదీ, అంతకు ముందే మహాభారతంలో ఉందా లేదా అన్నది ఎవరూ చూడలేదు కానీ, అలా అన్నీ ఉండేడట్లు కథలు వ్రాయాలి అన్న భావన మాత్రం మన ప్రస్తుత టీవీ కథారచయితల మనస్సులలో బాగా నాటుకు పోయింది అని అనిపిస్తోంది. ఆ మధ్య ఒక దేవదూతది (పేరు అనవసరం లెండి) బయోపిక్ (biopic) లాంటిది సీరియల్ గా తీశారు. దానిలో ఆయన చేయని మంచి పని అంటూ లేదు. మరి అలా వ్రాయాలంటే, ఐడియాలు (ideas), సందర్భాలు (contexts) ఎక్కడి నుండి వస్తాయి. పురాణాల్లో ఉపాఖ్యానాలు, వివిధ తీర్థాలలో ఉన్న స్థల పురాణాలు, మర్యాద రామన్న కథలు, బీర్బల్ కథలు, చందమామ కథలు, ఇత్యాదయః – ఇలా ఏది దొరికితే అది తీసుకుని అవసరమైన చోట్ల పేర్లు మార్చి, వాటిల్లో ఉన్న మంచి పనులు మన దేవదూతకి ఆపాదించి ఒక సంవత్సరం పైగా టీవీ సీరియల్ గా హోరు ఎత్తించారు.
ఇక చెడ్డ పనులు, పిచ్చి వేషాల విషయాని కొస్తే, ఎక్కడెక్కడ లేనివి మన సీరియల్స్ లో ఉండాల్సిందే. అన్నాళ్ళు ఒక సీరియల్ చూపిస్తే, ఒక్కోసారి అది వరకు ఏం చూపించారో మర్చిపోవడం చేతనో, కొత్తగా ఏమీ తట్టక పోవడం చేతనో, చిన్న చిన్న మార్పులతో చూపెట్టినవే మళ్ళీ చూపెడుతుంటారు. దుర్మార్గాలు ఈ విధంగా పుంఖానుపుంఖంగా సీరియళ్ళలో చూపాలంటే, మామూలుగా అయితే చాలా ఖర్చు అవుతుంది. దానికి కావాల్సిన సెట్టింగులు (settings) వెయ్యాలి, ఒకడిని ఎవడ్నో విలను (villain) చేస్తే వాడికి సరియైన డెన్ను (den), చుట్టూ హంగు – ఇవన్నీ ఉండాలి. ఒకళ్ళిద్దరు గుండుతో పహిల్వానులు లాగా, ఒకళ్ళిద్దరు బొద్దు మీసాలతో ముఖాన కత్తి గాట్లతో, ఆ విలన్ పక్కన ఉంటే గానీ వాడు విలన్ అని ప్రేక్షకులు ఒప్పుకోరు. వాళ్ళ డ్రస్సులు ఆహార్యం ప్రతి ఎపిసోడుకి కాస్తన్నా మారుస్తూ ఉండాలి. ఇదంతా చెయ్యాలంటే బోళ్ళు డబ్బు క్షవరం. అందుకని, దీన్లో కూడా మనవాళ్ళు చాలా తెలివి చూపిస్తున్నారు. ఆడవాళ్ళని విలన్ (villain) గా పెడుతున్నారు. బహుశా, వాళ్ళైతే పారితోషికం కూడా తక్కువేమో. వాళ్ళకి కొత్తగా వెయ్యాల్సిన మేకప్ ఏమీ ఉండదు. డెన్ను కూడా అక్కరలేదు. ఎవరింట్లో వాళ్ళు ఉన్న చోటనే విలనిజం (Villainism) చేయవచ్చు. మాట్లాడేటప్పుడు కాస్త గుడ్లు బయటపెట్టి మాట్లాడమంటే చాలు. ఎక్కడన్నా ఒక ఫైటు (fight) పెట్టాలంటే, ఆ ఆడవిలన్ ఒక నలుగు రైదుగురిని డబ్బిచ్చి పెట్టుకున్నట్లు చూపిస్తే చాలు. ఈ విధంగా దుర్మార్గాలు ఎక్కువ ఖర్చు లేకుండా ఎన్నైనా అడ్డూ ఆపూ లేకుండా చూపించచ్చు. సినిమాల్లో విలన్ వేషధారిగా పేరు మోసిన ఒకాయన ఆ మధ్య తన ఇంటర్వ్యూలో, మన టీవీ సీరియళ్ళలో చూపెట్టే ఆడ విలన్లని చూస్తే మాకే భయం వేస్తోందండీ అని అన్నాడు.
ఇక్కడ ఇంకో విష వలయం ఉందండోయ్. పెళైతేగానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే గానీ పెళ్ళి అవదు అని చెబుతూ ఉంటారు కదా. సినిమాల్లోనూ, టీవీ సీరియళ్ళలోను అంత దారుణంగా చూపిస్తున్నారే అని ప్రశ్నిస్తే, సమాజంలో ఉన్నవే మేము చూపిస్తున్నామండీ అంటారు, వాటి నిర్మాతలు. రెండో పక్క, సామాజిక శాస్త్రవేత్తలు, పెద్దలు అనేదేమిటంటే, సినిమాలు, టీవీ సీరియళ్ళు చూసి యువతరం భ్రష్టు పడుతోందనీ, చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారనీ. ఎవరు ముందు వెనక్కి తగ్గుతారో తెలియకుండా ఉంది. ఏది ఏమైనా, సమాజంలో దుర్మార్గాలు ఊహాతీతంగా ఉండడమే కాకుండా, ఊహాతీతంగా పెరుగుతున్నాయి.
పురాణ కథలని ఏమన్నా వదిలిపెట్టామా. వ్యాసుడు చెప్పింది, వాల్మీకి చెప్పింది మనం చదవడం కాదు. వాళ్ళే మళ్ళీ పుట్టి అసలు కథలు ఎలా వ్రాయాలో మన దగ్గర నేర్చుకోవాలి, అన్నట్లుంది మన జోరు. కాశీమజిలీ కథలు కూడా మన టీవీ కథలకి సాటి రావు. రామాయణ, భారతాలలో వివిధ కాలాల్లో చేసిన ప్రక్షిప్తాలు (అంటే, తరువాత చేర్చినవి) చాలా ఉన్నాయి అని పండితులు చెప్పేవారు, అది వరకు. ఇప్పటి టీవీ పురాణాలు చూస్తే, అన్నీ ప్రక్షిప్తాలే కదా, అసలు కథ ఏమిటి అన్నట్లు ఉంటాయి. కలియుగంలో కథలు వ్రాయడంలో ఇలాంటి పరిణామాలు వస్తాయని తెలిస్తే, వ్యాసుడు, నన్ను మించిన వాడు ఎవడు అని అనుకుని “యదిహాస్తి తదన్యత్ర” అని సవాలు చేయడానికి అలనాడు ధైర్యం చేసి ఉండడు. ఒక వేళ తరువాత తెలుసుకున్నా, నేను కేవలం ద్వాపర యుగానికి మాత్రమే ఆ సవాలు చేశాను అని మాట మార్చి ఉండేవాడు, వ్యాసుడు.