భగవద్గీత

1. ఉ. కౌరవ సైన్యమందు గల గౌరవనీయుల జూచి, పార్థుడు

గ్రారు లహం బడంచు తన గాండివమున్ జెయి జార్చి, నేనికన్

గోరను, భ్రాత్రు రక్తమును గ్రోలి జయించిన యట్టి రాజ్యమున్,

ఈ రణ మేల నిప్పుడన, కృష్ణుడు వానితొ యప్పు డిట్లనెన్.

కౌరవ సైన్యంలో ఉన్న పూజనీయులైన వ్యక్తులను చూసి, అర్జునుడు భయంకరమైన శత్రువుల గర్వాన్ని అణచే తన గాండీవ ధనుస్సును చేతినుండి జార్చి, నేను ఇక అన్నదమ్ముల రక్తము త్రాగి గెలిచే రాజ్యం కోరను, ఈ యుద్ధం ఎందుకు ఇప్పుడు, అని అనగా కృష్ణుడు వానితో అప్పుడు ఈ విధంగా అన్నాడు. (తరువాతి పద్యాలతో అన్వయము)

2. ఉ. కోరిక లన్నిటిన్ విడచి, కోప భయమ్ముల వీడి, నిన్ బలా

త్కారము జేసి, కోరికల దారికి లాగెడి యింద్రియాదులన్,

ధీరత నిగ్రహించుము, విధేయత జూపి స్వధర్మ నిష్ఠకున్,

వీరుడవై మమత్వమును వీడి, రణంబును జేయు మర్జునా.

ఓ! అర్జునా! కోరిక లన్నిటినీ విడిచిపెట్టి, కోపాన్ని భయాన్ని విడిచిపెట్టి, కోరికల మార్గం లోకి లాగే ఇంద్రియాలను అదుపులో పెట్టుము. నీ విధిలో నిష్ఠగా ఉండడానికి విధేయతను చూపి, వీరుని వలె నాది, నా వాళ్ళు అన్న భావనను వదిలిపెట్టి యుద్ధము చేయుము. 

3. ఉ. కర్మలు చేయుటందె యధికారము కల్గిన వాడ వీవు, యా

కర్మ ఫలంబు లేటికిని కారణభూతుడ వీవు కాదు,

త్కర్మల జేయుటందు మమకారము వీడి, సమత్వబుద్ధివై,

కార్ముకమున్ ధరించి, యిక కాగల కార్యము జూడు మర్జునా.

ఓ! అర్జునా! నీ పనులు నీవు చెయ్యడానికే నీకు అధికారం ఉంది. వాటి ఫలితాలు వేటికీ నీవు కారణం కాదు. మంచి పనులు చేయడంలో అభిమానము విసర్జించి సమత్వాన్ని అంగీకరించే మనస్సు కలవాడవై ధనుస్సును ధరించి ఇక కావలసిన కార్యము చూడుము.

4. చం. చినిగిన పాత బట్టలు త్యజించి, వినూత్నము లైన వస్త్రముల్

తనువు ధరించినట్లు, నిరతంబును చచ్చుట పుట్టుటల్ జగం

బున గల దేహమున్, తనదు పుట్టము వోలె ధరించు నాత్మయే,

తను వొకటీల్గి నంతనె యదాటుగ మారును వేరొకంటికిన్,

విను మటువంటి జన్మలను విజ్ఞులు గూడ నెరుంగ రర్జునా,

కనుమిదె యాత్మ నాశనము కానిది, నిత్యమటన్న సత్యమున్,

తనువును బాయుటన్నదిట తథ్యము, పుట్టిన జీవు లెల్లరున్,

మనిషి నిమిత్త మాత్ర మనుమానము వీడుము యాత్మచేతనన్.

(ఈల్గు = చచ్చు, అదాటుగ = అకస్మాత్తుగా, విజ్ఞుడు = జ్ఞాని, తథ్యము = నిజము, నిమిత్తము = కారణము, ఆత్మచేతన = తనను తాను తెలుసుకొన్నవాడు)

చిరిగి పోయిన పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలను శరీరం ఎలా వేసుకుంటుందో, ఎల్లప్పుడూ లోకంలో జనన మరణాలు కలిగిన శరీరాన్ని తన వస్త్రము లాగా ఆత్మ ధరిస్తుంది. ఒక తనువు చాలించగానే, వెంటనే ఆత్మ వేరొక తనువులోకి మారుతుంది. అర్జునా! వినుము. అటువంటి జన్మలను జ్ఞానులు కూడా తెలుసుకోలేరు. పుట్టిన జీవులందరూ తనువును వీడుట అన్నది నిజము. మనిషి కేవలము నిమిత్త మాత్రమే. ఆత్మజ్ఞానిగా తయారై అనుమానము వదిలిపెట్టు.

5. తే. గీ. ఆది మధ్యాంతములు లేక, నాకసమును

దాకి, బహు యంగముల తోడ ధగధగమను

చున్న విశ్వరూపంబును జూపె, చక్రి

యపుడు, దివ్య దృష్టిని యిచ్చి యర్జునునకు.

అప్పుడు కృష్ణుడు ఆది, మధ్య, అంతము లేకుండా, ఆకాశాన్ని తాకుతూ, పెక్కు అవయవాలతో ధగధగ మెరిసిపోతున్న తన విశ్వరూపాన్ని అర్జునునికి దివ్యదృష్టి ఇచ్చి చూపించాడు.

6. తే.గీ. దేవ! నీ దేహమున గంటి దేవతలను

యజుని సూర్య చంద్రాదుల నఖిల జగము

నెవరు గాంచని యద్భుత మెల్ల సృష్టి

నణువు భాతి, రిపులు నీ ముఖాగ్ని లోన

లయమగుట కనుటయె నిబ్బరమ్ము నాకు, 

భయము గొల్పెడి నీ రూపు వడిని మలపు

మనుచు కృష్ణుని ప్రార్ధించె నర్జునుండు,

తనదు కర్తవ్య మేదియో తనకు తెలియ.

(అజుడు = బ్రహ్మ, అఖిల = సమస్త, అద్భుతము = ఆశ్చర్యము, ఎల్ల = సమస్తము, భాతి = విధము, రిపుడు = శత్రువు, లయము = నాశము, కను = చూచు, నిబ్బరము = ధైర్యము, వడి = వేగం, మలపు = మరలించు)

దేవా! నీ శరీరంలో దేవతలను బ్రహ్మను సూర్యచంద్రాదులను సకల జగత్తును ఎవరూ చూడని అద్భుతాన్ని సమస్త సృష్టిని అణువు లాగా చూశాను. శత్రువులు నీ ముఖంలో ఉన్న అగ్నిలో ఆహుతి అవ్వటం చూడటమే నాకు ధైర్యము. తన కర్తవ్యమేదో తనకు తెలియగా, భయం గొలిపే నీ రూపం వేగంగా ఉపసంహరించమని అర్జునుడు కృష్ణుని ప్రార్థించాడు.

Leave a comment